Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    తెలంగాణా సహితమైన విశాలాంధ్రను కోరినవారు కమ్యూనిస్టులు. పుచ్చలపల్లి సుందరయ్యగారు "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అనే ఒక గొప్ప గ్రంథం రచించి, ఆనాటి బ్రిటిష్ తెలంగాణా ఆంధ్రయువకులను ఉత్తేజపరచారు.

 

    ఆనాటికి అటు మద్రాసు ఆంధ్రంలోనూ - ఇటు నిజామాంధ్రంలోను కమ్యూనిస్టు ఉద్యమం మాత్రమే బలమైన ఉద్యమంగా ఉండింది. భారతదేశంలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం - విశాలాంధ్రలోనే ఏర్పడుతుందని ఆశించాం. కాని, ఆ గౌరవం కేరళ రాష్ట్రానికి దక్కింది.

 

    కమ్యూనిస్టులు తమ స్వయంకృత అపరాధాలతోనే విశాలాంధ్రలో ప్రభుత్వం ఏర్పరచే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.

 

    కాంగ్రెస్ వారు తెలంగాణాంధ్రులను కలుపుకొనిపోయే ప్రయత్నం చేయలేదు.

 

    తెలంగాణ ప్రజలు తమ యాతననుంచి విముక్తులు కావడానికి ఏ దిక్కునుండీ సహాయ సహకారాలు అందలేదు. ఉత్సాహవంతులయిన రావి నారాయణరెడ్డివంటి యువకులు బ్రిటిషిండియాలో సత్యాగ్రహం చేయవలసిన నిస్సహాయదశ కలిగించాడు నిజాము ముసలి నక్క.

 

    అంతటి నిరంకుశత్వం - దౌర్జన్యం - మతపైశాచిక విధానం సహితం ప్రజా ఉద్యమాలను నిలువరించలేకపోయినాయి.

 

    1. తెలంగాణంలో ఆంధ్రోద్యమం 1901లో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపనతో ప్రారంభం అయిందని చెప్పవచ్చు. అయితే, అది నిజామాంధ్రు రాజ్యంలో నిజంలో స్థాపించిన గ్రంథాలయం కాదు.

 

    నిజాం రాజ్యంలో బ్రిటిషు దీని మునగాల పరగాణా - ఆ పరగణా రాజావారికి హైదరాబాదుతోనే ఎక్కువ సంబంధాలుండేవి. ఆ గ్రంథాలయము స్థాపించిన గౌరవము రాజా నాయిని వేంకట రంగారావుగారికి దక్కుతుంది.

 

    ఈ గ్రంథాలయము స్థాపించిన సుల్తాన్ బజార్ ఆ రోజులలో నిజాం పాలనలోనిది కాదు. అది రెసిడెంటు పాలన, అనగా బ్రిటిషు పాలనలోనిది.

 

    2. 1920లో బ్రిటిషువారు టర్కీ సుల్తాను మతాధికారాలను తొలగించారు. దానిని వ్యతిరేకించడానికి హిందువులు - ముస్లిములు కలిసి "ఖిలాఫత్" ఉద్యమం నిర్వహించారు. దానికి గాంధీ మహాత్ముడు నాయకత్వం వహించారు.

 

    ఖిలాఫత్ నిజాం రాజ్యానికి పాకింది. హైదరాబాదులో హిందువులు - ముస్లిములు ఇరవై వేలు, పాతికవేలు పాల్గొని, నిరసనలు, ఊరేగింపులు నిర్వహించారు. కనీ వినీ ఎరుగని మత సామరస్యం - ప్రజాచైతన్యం వెల్లివిరిశాయి.

 

    ఆ ఐక్యత - చైతన్యం చూచి నిజాం నవాబు బెదిరిపోయాడు. ఆ జనమంతా తన మీద పడుతున్నట్లే భయపడ్డాడు. నిజాముకు జనమంటే బుగులు! చదువంటే బెదురు! వెలుగంటే అదురు!

 

    ప్రభుత్వ అనుమతి లేకుండా సభలు జరుపరాదని ఆజ్ఞాపించాడు. అదే అతి క్రూరం అయిన గస్తీనిషాన్ తిర్యన్- అంటే సర్క్యులర్ నెం 53. అది నిజాం ప్రజల సమస్త హక్కులను హరించింది. వారిని కట్టేసింది. నోరు కుట్టేసింది.

 

    3. కాశీనాథరావు వైద్య వంటివారు 1932లో హిందూ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. నిజాం మతాంతరీకరణ గురించి, హిందువులు జనాభా తగ్గడాన్ని గురించి, హిందువులను అణచివేసే విధానాన్ని గురించి కరపత్రాలు వేశారు. ఈ కరపత్రాల ప్రభావంతో "టైమ్స్ ఆఫ్ ఇండియా" వంటి పత్రకలు సంపాదకీయాలు, వ్యాసాలు ప్రచురించాయి.

 

    4. 11-11-1922న కార్వే పండితుని అధ్యక్షతన నిజాం రాష్ట్ర సంఘసంస్కరణ మహాసభ సమావేశమైంది. అధ్యక్షులు కొంత మహారాష్ట్రంలోనూ, కొంత ఇంగ్లీషులోను ప్రసంగించారు. ఆ సభలో ఉండిన మాడపాటి హనుమంతరావు గారి వంటి తెలుగువారికి ఆంధ్రులనుగురించి ప్రస్తావించకపోవడం మనస్తాపం కలిగించింది.

 

    అలంపల్లి వెంకట్రామారావు గారు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. సమావేశంలో ఉన్న మహారాష్ట్రులు సహించలేదు. చప్పట్లు కొట్టారు. గేలిచేశారు. ఉపన్యాసం సాగనివ్వలేదు. తెలుగువారు అది తమకు అవమానంగా భావించారు. అసమ్మతి సూచకంగా సభనుంచి బయటికివచ్చారు.

 

    కొన్ని అవమానములు మహత్తర ఉద్యమములను నిర్మిస్తాయి. ఈసంఘటనయే ఆంధ్రోద్యమానికి అంకురార్పణ అయింది.

 

    దక్షిణాఫ్రికాలో మహాత్మునికి జరిగిన అవమానమే భారతదేశంలో మహోద్యమం అయింది.

 

    తెల్లవారి, అనగా దుర్మతి కార్తీక శుద్ధ ద్వాదశి, 1-18  దై 1331 ఫసలీ- 12-11-22న ట్రూపు బజారులోని టేకుమాల రంగారావు గారి ఇంట్లో 11 మంది ఆంధ్రులు సమావేశమయినారు. వారు 1. మాడపాటి హనుమంతరావుగారు, 2. టేకుమాల రంగారావుగారు, 3. మిట్టా లక్ష్మీనరసయ్యగారు, 4. ఆదిరాజు వీరభద్రరావుగారు, 5. నడింపల్లి జానకిరామయ్యగారు, 6. మందుముల నర్సింగరావుగారు,  7. బూర్గుల నరసింగరావుగారు, 8. కొమ్మవరపు సుబ్బారావుగారు, 9. బూర్గుల నరసింగరావుగారు, 10. పందిటి రామస్వామినాయుడుగారు, 11. బోయినేపల్లి వెంకటరామారావుగారు. ఆ రోజు - ఆ సమావేశంలో "ఆంధ్రజన సంఘం" స్థాపించబడింది.

 

    'విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత' అన్నట్లు ఆనాటి ఆంద్ర జన సంఘం చారిత్రాత్మకమైన సాయుధ పోరాటం జరిపి గోలకొండ ఖిల్లా కింద నైజాం సర్కరోని గోరీ కట్టింది. చీలి ఉండిన తెలుగువారిని ఏకంచేసి "విశాలాంధ్ర" ఏర్పరచింది. కాని, సుందరయ్యగారి స్వప్నం - "ప్రజారాజ్యం" - కలగానే ఉండిపోయింది.

 

    త్వరలోనే ఆంద్ర జన సంఘంలో నూరుగురు సభ్యులు చేరారు. 22 ఫర్వద్ది 1331-24-2-1922న, 13అర్దిబెహస్త్  1331 - 17-3-1922న, 31 ఫర్వద్ది  1331-4-1922న కొండా  వేంకటరంగారెడ్డిగారి అధ్యక్షతన సమావేశం జరిపిన ఆంధ్ర జన సంఘం స్థూలంగా నాలుగు సూత్రాల నియమావళిని ఆమోదించింది:

 

    1. ఈ సంఘానికి "నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం" అని పేరు.

 

    2. నిజాం రాష్ట్రాంధ్రులలో పరస్పర సహకారం కలిగించి, వారి అభివృద్ధికి తోడ్పడడం.

 

    3. నిజామాంధ్రులకు సంఘాలు స్థాపించడం, ఉన్నవాటికి సాయం చేయడం, సభలు ఏర్పరచడం.

 

    4. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆంధ్రుడు సభ్యుడు కావచ్చును. అతడు నిజాంరాష్ట్ర నివాసి కావాలి.

 

    కొద్దిరోజుల్లోనే ఆంధ్ర జన సంఘాలు నగరంలోనూ - ఇతర ప్రాంతాలలోనూ ఏర్పడ్డాయి. సమావేశాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు వారిలో జాగృతి - ఉత్సాహం వెల్లివిరిశాయి. ఆంధ్ర జన సంఘాలకు ఒక కేంద్ర సంఘం కావలసి వచ్చింది.

 

    1923లో హనుమకొండలో జరిగిన ప్రతినిధుల సభలో ఆంధ్ర జన కేంద్ర సంఘం స్థాపించబడింది. పాఠశాలలు, గ్రంథాలయాలు, వర్తక సంఘాలు స్థాపించడం, లఘుపుస్తకాలు ప్రచురించడం లక్ష్యాలుగా నిర్ణయించారు.

 

    ఆంధ్ర జన సంఘం రాజకీయాల జోలికి పోకుండా జాగ్రత్తపడింది. సంస్కరణలు మాత్రమే లక్ష్యంగా నిర్ణయించుకున్నది. అయినా, నిజాం ప్రభుత్వం సహించలేదు.

 

    సూర్యపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయం ఏర్పడింది. అది పురప్రజలలో ఆసక్తి కలిగించింది. విజ్ఞానం ప్రసాదించింది.

 

    తలూక్దారు - కలెక్టరు - సహించలేకపోయారు. ప్రభుత్వ అనుమతి లేనిదే గ్రంథాలయం నడుపరాదన్నారు. మూయించివేశారు.

 

    సిరిసిల్లలో ఉన్న గ్రంథాలయాన్ని చూచిన తహసిల్దారు 'సర్కారువారి దఫ్తరాములలో - ఆఫీసుల్లో - వ్యవహారమంతయు ఉర్దూలో ఉండగా చచ్చిపోయిన తెలుగును బైటికి గుంజవలసిన పనిలేదు అని మూసివేయించాడు.

 

    వరంగల్లు జిల్లా మండికొండలో ఆంధ్ర గ్రంథాలయం స్థాపించబడింది. ఇందుకు ప్రభుత్వ అనుమతి అవసరం అని పోలీసు పటేలు పట్టుపట్టాడు. కార్యదర్శి అది అవసరం లేదన్నాడు. గ్రంథాలయం నిర్వహించడం కష్టం అయింది. ఇలా ఉండగా అదాలత్ - కోర్టునుంచి కార్యదర్శి పేర ఒక లేఖ వచ్చింది.      

 

    "ప్రతిరోజు సదరు లైబ్రరీకి పుస్తకములు, పత్రికలు చదువుకొనగలందులకు జనులు వచ్చుచున్నారు. మరిన్నీ ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ముషీర్ దక్కన్ వగైరా పత్రికలు వస్తూ ఉన్నవి. హాలు - ప్రస్తుతం - సదరు లైబ్రరీ ఖాయం చేయుటకు యే మహాద్మ - డిపార్ట్ మెంటునుండి అయినా హుకుం  - అనుమతి పొంది వున్నారా? అగరు - ఒకవేళ - పొందకున్నట్లయితే ఫేరన్ - వెంటనే - పొందవలసింది. కెంకె - ఎందుకనగా - అక్సరు - తరచు - మజహబీ - మతపు - వార్తలతో జగడాలు అవుతూ ప్రాణహాని కూడా కలుగుతూ ఉన్నది. కాబట్టి మరియొక హుకుం వరకు గ్రంథాలయము మూసి ఉండవలెను."

 

    తెలంగాణంలో ఆంధ్రోద్యమం ప్రారంభం అయిం తరువాత ప్రజలలో ధైర్యము, ఉత్సాహము కలిగాయి. గ్రంథాలయాలు స్థాపించారు. తెలంగాణంలో గ్రంథాలయం పుస్తకాలు ఉండే స్థలంమాత్రం కాదు. అది చైతన్య నిలయం. ప్రజలు ఒకచోట చేరడానికీ వివిధ విషయాలు చర్చించడానికీ, కార్యక్రమాలు రూపొందించడానికీ ఉపకరించే స్థలం! ప్రతి గ్రంథాలయం ఒక రాజకీయ శిబిరం. అందుకే గ్రంథాలయం అంటే నిజాముకు బెదురు. ఏదో ఒక కారణం చూపి వాటిని మూయించాడు.   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.