Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam


   
    10. రమ్జాన్ సందర్భంగా తిను బండారాలు కనిపించనీయరాదు. హోటళ్ళకు, మిఠాయి దుకాణాలకు నల్లని తెరలు విధిగా వేయాలి.

 

    మసీదులకు వంద గజాలు అటు, వంద గజాలు ఇటు బాజాలు మ్రోగించరాదు. అది దేవుని సేవగాని, పెళ్లి ఊరేగింపుగాని, శవయాత్రగాని - ఈ నియమం పాటించవలసిందే. శిక్షాస్మృతి ప్రకారం అది నేరం అవుతుంది. శిక్షపడుతుంది.

 

    11. దీన్యాత్ అనే మత విషయకమయిన పీరియడును విద్యాలయాల్లో ప్రవేశ పెట్టారు. ఈ పీరియడ్ లో ఖురాన్ బోధించబడుతుంది. ముస్లిమేతరులకు ఇది తప్పనిసరి కాదు. కాని వారి మత గ్రంథాలు బోధించరు. "అఖ్లాబియాత్" అంటే సుమారు నీతిశాస్త్రం బోధిస్తారు.

 

    12. విగ్రహాలు ఇస్లాంకు విరుద్ధం కాబట్టి రాజ్యంలో ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పరచడం జరగలేదు.

 

    నిజాం రాజ్యం కరకు తురకరాజ్యం అనడానికి ఈ నిదర్శనాలు చాలు. ఇంతటి మూర్ఖపు మతరాజ్యపు ప్రజలు మత విద్వేషం పెంచుకోకపోవడం వారి ఉన్నత సంస్కారానికి చిహ్నం. నిజామును వ్యతిరేకించిన ఏ ఉద్యమమూ - ఆర్యసమాజం సహితంగా - మతప్రాతిపదిక మీద జరుపలేదనే చారిత్రిక సత్యం. నిజాం ప్రజల ఉదారతకు - విశాల హృదయానికి సజీవ నిదర్శనాలు.

 

    నైజాము సర్కరోడు నాజీల మించినోడు. నిజాం నిరంకుశుడు. అతడు హద్దులు ఎరుగడు. అతనికి నియమ నిబంధనలు లేవు. అతనిది వెర్రివాని చేతిరాయి.

 

    కమాల్ ఖాన్ అనే నవాబు ఇల్లు కట్టుకున్నాడు. నిజామును గృహప్రవేశానికి ఆహ్వానించాడు. "కోట బావుంది. నాకు నజ్రానా ఇవ్వు" అన్నాడు. కమాల్ ఖాన్ కు తప్పలేదు. నజ్రానా సమర్పించుకున్నాడు. ఇనుపగేట్లకు     k.k.అంటే కమాల్ ఖాన్ అని చెక్కించుకున్నాడు. అది మార్చకుండానే ఉస్మాన్ దానిలో దిగిపోయాడు. k.k.ను కింగ్ కోఠీ చేశాడు.

 

    నిజాముకు గ్వాలియర్ మహారాజు ఒక టన్ను వెన్న పంపాడు. అది వాడలేదు. వాసన పట్టింది. దానిని అమ్మి డబ్బు చేయవలసిందిగా కొత్వాల్ వెంకటరామారెడ్డి గారిని ఆదేశించాడు. రెడ్డిగారు అదంతా మూసీలో వేసి నిజాంకు డబ్బు సమర్పించుకున్నాడు.

 

    జోహ్ అని ఒక కవి ఉత్తర భారత నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డాడు. జోష్ వాస్తవంగా గొప్పకవి. వారు అపుడప్పుడు నిజామును దర్శిస్తుండేవాడు. ఒకసారి దర్శించినపుడు నిజాం అడిగాడు - "మీ బేగంకు జబ్బుగా ఉండెకదా! ఎలా ఉంది?" అని. ఎన్ని మందులు ఇచ్చినా గుణం కనిపించడం లేదు అన్నారు. ఈ వైద్యులు బెవఖూపులు నేను మందిస్తాను వాడండి. వెంటనే తగ్గుతుంది అని ఏదో ఇచ్చాడు. జోష్ ఆ మందు అవతల పారేశాడు. కాని, భార్యకు ఆరోగ్యం చేకూరిందని నిజాముకు విన్నవించారు.

 

    ఇది నిజాం స్థితి. అతను కాక జాగీర్దారులు, దొరలు, దళారులు వారి తాబేదారులు పటేల్ పట్వారీలు మున్నగువారంతా ఛోటానిజాములే.

 

    తెలంగాణ రాజ ఇందరి పిశాచాల మధ్య బతికి బట్ట కట్టడమే మహత్కార్యం. అంతేకాదు, ఆ ప్రజ ఉద్యమించింది! తెలంగాణా ప్రజ అనేక ఆటంకాలు - అవరోధాలు - ఆడ్డంకులు - అసౌకర్యాలు - విరోధాలను తట్టుకోవలసి వచ్చింది.

 

    1. భారత జాతీయ కాంగ్రెస్ దేశీయ సంస్థానాల పాలనలో జోక్యం కలిగించుకోలేదు. వారి పోరాటం బ్రిటిషిండియాకు మాత్రమే పరిమితం అయింది. మహాత్ముడు దేశీయ రాజ్యాల విషయంలో కల్పించుకోబోమని ప్రకటించారు. అలా చేసి వారి విశృంఖలత్వానికి లైసెన్సు ఇచ్చారు. నవాబులు, రాజులు, మహారాజులు ప్రజల రక్తాన్ని వారి ఇచ్చవచ్చినంత పీల్చారు.

 

    భారత జాతీయ కాంగ్రెస్, మహాత్ముని - ఆ పాలసీ వలస మూడోవంతు భారతదేశం కట్టుబానిస అయింది. అయినా, వారు పట్టించుకోలేదు. మహారాజుల దుశ్చర్యలను గురించి దీవాన్ జర్మనీదాస్ "మహారాజా" అనే ఇంగ్లీషు పుస్తకంలో వివరించారు.

 

    కాంగ్రెస్ వారు నాలుగవ దశకంలో తమ తప్పు గ్రహించారు. అందుకు కారణం హైదరాబాదు, తిరువాన్కూరు వంటి సంస్థానాల్లో కమ్యూనిస్టుల బలపడడం. అప్పుడు వారు ఇండియన్ స్టేట్స్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభించారు. దానికి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడు. నెహ్రూ కాశ్మీర్ వెళ్తే, కాశ్మీర్ ప్రభుత్వం బాయ్ నెట్లతో అతన్ని నిరోధించింది.

 

    కాంగ్రెస్ వారు దేశీయ సంస్థానాలలో కూడా జాతీయోద్యమం నిర్వహించి ఉంటే కాశ్మీర్ సమస్య ఇంత జటిలం అయ్యేదికాదు.

 

    కాశ్మీర్ మహారాజు నిజాం కన్న తక్కువ నిరంకుశుడేమీకాదు. కాశ్మీరం వాడయిన కిషన్ చందర్ అనే గొప్ప ఉర్దూ రచయిత "మేలేయాదోఁ కె చీనార్" అనే తమ ఆత్మకథలో కాశ్మీర్ స్థితిగతులను గురించి వివరించారు.

 

    2. మహాత్ముడు హైదరాబాదు వచ్చారు. వచ్చినపుడల్లా తాను రాజకీయాలు మాట్లాడనని మాట ఇచ్చారు. నిర్మాణ కార్యక్రమాల గురించి తప్ప మాట్లాడలేదు. మహాత్ముడు మాట తప్పడు. అది నిజాంకు తెలుసు.

 

    జాతీయ నాయకురాలు - భారత కోకిల సరోజినీనాయుడుగారి నివాసం హైదరాబాదు. వారి నివాసం గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ఉంది. సరోజినీ నాయుడు రాజకీయ ప్రభుత్వం హైదరాబాదు రాజ్యానికి ఆవలనే! హైదరాబాదు వచ్చినపుడు రాజకీయానికి సంబంధించి పల్లెత్తు మాట మాట్లాడేవారు కారు!

 

    నిజాం రాజ్యానికి ఆవల సరోజినీ నాయిక. నిజాం రాజ్యంలో కవయిత్రి మాత్రమే!!

 

    నిజాం రాజు అభీష్టానికి అనుకూలంగా - జాతీయ నాయకులు ఎవరూ నిజాం రాజ్యాన్ని భారతదేశంలో భాగంగా గుర్తించలేదు.

 

    3. నిజాం రాష్ట్రంలో తెలుగు జిల్లాల కాక మహారాష్ట్ర కన్నడ జిల్లాలు కూడా ఉండేవి. మహారాష్ట్రులు తమను శివాజీ వారసులం అనుకునేవారు. సమస్త రాజ్యానికి తామే రక్షకులం. అని భావించేవారు. ఆ రాజ్యంలో తెలుగువారిని తమకున్న తక్కువవారిగా చూచేవారు. తురకలవలెనే తెలుగువారిని హేళన చేసేవారు.

 

    కాలక్రమంలో ఉద్యమాలలో తెలుగువారు మహారాష్ట్రులను అధిగమించారు.

 

    4. బ్రిటిషాంధ్రం నుంచి వచ్చి నిజాం కొలువులో చేరి నిజాం నవాబుకు వంది మాగధులయిన వారు తెలంగాణం తెలుగువారిని మనుషులుగా గుర్తించేవారు కారు. 'రాకాసి'ముఠా రాయప్రోలు - కాసింఖాను - సీతారామయ్య ఆంధ్రుల ఉద్యమాన్ని గురించి నిజాం ప్రభుత్వాన్ని హెచ్చరించేవారు.

 

    తెలంగాణం ఆంధ్రుల ఉద్యమం భాషా ఉద్యమం మాత్రమే కాదనీ - రాజకీయాగ్ని అందులో రాజుకుటూందనీ పాలకోడేటివారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

    5. బ్రిటిషాంధ్రులు నిజామాంధ్రులను తమ సోదరులని కాని, తమతో సములనిగాని గుర్తించలేదు. బ్రిటిషాంధ్ర జాతీయ నాయకు లెవరూ తెలంగాణా ప్రజను పట్టించుకోలేదు.

 

    'తెలంగాణంలో కూడా కవులు ఉన్నారా?' అని ప్రశ్నించినాడొక కవిశేఖరుడు. సురవరం ప్రతాపరెడ్డి గారు దానిని చాలెంజిగా తీసుకున్నారు. మూడువందల యాభైనాలుగుమంది తెలంగాణ కవుల కవితలు కూర్చి, "గోలకొండ కవుల" సంచిక ప్రచురించారు.

 

    పురాణం పుల్లయ్యగారు తమ కవితలో అన్నారు -

 

    ఇట్టి పండిత సత్తము లెందరో ని
    జాము రాష్ట్రంబునందు నెసగుచుండ
    కవులు లేరన్నయతని వాగ్గరిమ నెంచ
    అంధుడు జగంబులేదని యనుట గాదే!

 

    ఈ విధంగా తెలంగాణం తెలుగుమీద కారంచల్లి బాధించారు.

 

    ఇది బ్రిటిషాంధ్రులందరికీ వర్తించదు. స్వప్రయోజనపరులు కొందరు మాత్రమే ఇలా అవమానించారు. ఇందుకు మొత్తం ప్రాంతాన్ని, ఆంద్రజాతిని తప్పు పట్టడం భావ్యంకాదు.

 

    6. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు తమిళుల పోరు పడలేకపోయారు. తమిళుల పెత్తనం వదిలించుకోవడానికి ఆంధ్రులు తమకు భాషా రాష్ట్రం కావాలన్నారు. అది సాధించడానికి ఆంద్రమహాసభ ఏర్పడింది. ఆ విధంగా భారతదేశంలో భాషారాష్ట్రప్రతిపాదన తెచ్చిన తొలివారు ఆంధ్రులు అయినారు. బ్రిటిషాంధ్రులు కోరిన భాషారాష్ట్రం బ్రిటిషిండియాలోని ఆంధ్రులకే పరిమితం అయింది. తెలంగాణాంధ్రుల గురించి అందులో ప్రస్తావన లేదు.

 

    పొట్టి శ్రీరాములుగారి ఆత్మాహుతి, శ్రీభాగ్ ఒడంబడికలో కూడా తెలంగాణం ప్రస్తావన లేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.