Home » Sri N T Rama Rao » 40 Years of TDP



                             ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం

    దేశంలో నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో తెలుగు దేశం పార్టీ గణనీయ పాత్ర పోషించింది.1984 లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల దోసినప్పుడు సమాజంలోని అన్ని వర్గాలను కూడగట్టి ఎన్టీఆర్ జరిపిన పోరాటం నభూతో నభవిష్యతిగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది. అధికారంలో నుంచి అక్రమంగా దింపిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని పునఃప్రతిష్టించాల్సి రావడం ఒక్క తెలుగుదేశం విషయంలోనే జరిగింది.
    ఆంధ్రప్రదేశ్ లో మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ పెత్తనానికి 1983 ;ప తెలుగు దేశం పార్టీ మంగళం పాడింది. అయితే ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి ప్రణాళిక రచించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు ను ఇందుకు పావుగా వాడుకుంది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా గవర్నర్అధికారాలను దుర్వినియోగం చేసి, దొడ్డి దోవన 1984 ఆగస్టు 16 న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఎన్టీఆర్ కు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నా, ప్రజాస్వామ్య  సూత్రాలను తుంగలో తొక్కింది.
    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేసి, అప్పటివరకు 26 రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో కూల్చినపుడు దీన్ని ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొనలేక పోయింది. కేరళ లో ఎన్నికల అధికారాన్ని చేపట్టిన తొలి కమ్యునిస్టు ప్రభుత్వాన్ని కేంద్రం 1959 లో 356 వ అధికరణాన్ని ప్రయోగించి రద్దు చేసినపుడు కూడా ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కేంద్రం తొలగించినపుడు కూడా ఇదే విధంగా తమకు ఎదురుండదని ఇందిర ప్రభుత్వం ధీమా ప్రదర్శించింది. అందులోనూ అమెరికాలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చిన ఎన్టీఆర్ ఈ నిర్ణయాన్ని ఎండుర్కొగల పరిస్థితుల్లో ఉండరని భావించింది. ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ సమయంలో మాట్లాడటం కూడా తగ్గించాలని డాక్టర్లు ఆయనకు చెప్పారు.
    బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన 24 గంటల్లోనే కుట్రకు తెరతీశారు. అప్పటికప్పుడు అయన ప్రభుత్వాన్ని దించి, నాదెండ్ల భాస్కరరావు ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంతటితో ఎన్టీఆర్ కధ ముగిసిందనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సగటు రాజాకీయ నాయకుడు కాదు, పదవిని లాక్కోవడం కంటే ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడాన్ని అయన సహించలేకపోయారు. ప్రజాతీర్పు కాలదన్నిన కేంద్రాన్ని ప్రజల ముందే దోషిగా నిలబెట్టాలని అయన నిశ్చయించుకున్నాడు. డాక్టర్లు వారిస్తున్నా శ్రేయోభిలాషులు అయన ఆరోగ్యం పట్ల ఆందోళన పడుతున్నా మొక్కవోని దీక్షతో ప్రజల్లోకి వెళ్ళాడు.

    (అధికారంలో నుంచి అక్రమంగా దింపిన తిరిగి మళ్ళీ అదే
    ప్రభుత్వాన్ని పునఃప్రతిష్టించాల్సి రావడం ఒక్క తెలుగుదేశం
    విషయంలోనే జరిగింది )
    నెలరోజుల పాటు జరిగిన ఆ ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య స్పూర్తిని రగిలించింది. న్యూడిల్లీ;లో రాష్ట్రపతి భవన్ ఎదుట ఎన్టీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ 160 మంది ఎమ్మెల్యే లు జరిపిన ప్రదర్శన ఒక చారిత్రక ఘటనగా నిలిచింది. ఎన్టీఆర్ పోరాటం దేశంలోని అన్ని ప్రాంతాలను కదిలించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం జరిపిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల దృష్టిని ఆకర్షించింది.
    తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కేంద్రం అక్రమంగా అధికారంలో నుంచి దింపడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమానికి దేశవ్యాప్తంగా రగిలిన ప్రజాస్వామ్య స్పూర్తికి ఇందిరాగాంధీ ప్రభుత్వం తలవొగ్గాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ను అప్రజాస్వామికంగా తొలగించిన నెలరోజులకు - 1984 సెప్టెంబర్ 16న - ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందని తెలుగుదేశం అధినేతను అప్పటి గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ మళ్ళీ ఆహ్వానించడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఉజ్వల ఘట్టం.
    కేంద్ర ప్రభుత్వం చేతుల్లో 356 వ అధికరణం దుర్వినియోగం విజయవంతంగా నిలువరించిన రాజకీయ పార్టీ అప్పటికి, ఇప్పటికీ మరొకటి లేదు. ఒక పార్టీగా తెలుగుదేశానికి ఇది గర్వకారణం. ప్రజల్లో ప్రజాస్వామ్య భావనలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వాన్ని తామే నిర్ణయించుకోగల స్పూర్తిని రగిలించేందుకు 1984 లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది.

                                  నిరుపేదలకు నిలువ నీడ

    రెండు రూపాయలకు కిలో బియ్యం పధకంతో పేదలకు కూడు కల్పించిన ఎన్టీఆర్ , నిలువ నీడ లేని నిరుపేదలకు గూడు ఏర్పరచడానికి చేసిన కృషి అమోఘం. పేదలకు ఇల్లు కట్టించే పధకం 1971 నుంచే ప్రారంభమైంది . కాని అది దశాబ్దం పాటు నత్తనడక నడిచింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పధకం స్వరూపస్వభావాలే మారిపోయాయి. ఎన్టీఆర్ ప్రత్యేక ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా అమలు చేశారు. 1971 నుంచి 1981 వరకు పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 46,630 ఇళ్ళు మాత్రమే కట్టించాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1989 వరకు భారీఎత్తున 6.45 లక్షల శాశ్వత గృహాల నిర్మాణం జరిగింది. ఇందుకోసం దేశంలోనే మొదటిసారిగా గృహనిర్మాణం పై ఏటా 50 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ ప్రభుత్వం ఆనాడు ఖర్చు చేసింది.
    పేదల కోసం ప్రతి ఏటా లక్షా 45 వేల ఇళ్ళు నిర్మించాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 50 శాతం గృహాలు షెడ్యూల్డ్ కులాలకు, 10 శాతం గృహాలు గిరిజనులకు, 30 శాతం గృహాలు వెనుకబడిన తరగతులకు, మిగతా 10 శాతం ఇతర వర్గాలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సెమి పర్మినెంటు ఇళ్ళను ఉచితంగాను, శాశ్వత గృహాలను యాభై శాతం సబ్సిడీతోని లబ్దిదారులకు అందించారు. ఈ కాలనీలలో రోడ్లు, తాగునీటి సౌకర్యం, మురుగు కాల్వలు , అట మైదానాలు మొదలైన సౌకర్యాలను కల్పించారు. ఏడో ప్రణాళీకా కాలం పూర్తయ్యేసరికి దేశం మొత్తం మీద పది లక్షల గృహాలు నిర్మించాలని లక్ష్యం కాగా, తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పరిదులోనే పది లక్షల ఇళ్ళు నిర్మించేందుకు నిశ్చయించింది. తెలుగుదేశం అధికారం చేపట్టాక రికార్డు స్థాయిలో 1983-84 నుంచి 1989 వరకు ఆరున్నర లక్షల గృహాల నిర్మాణం జరిగింది. అందుకే ఆరో పంచవర్ష ప్రణాళికా కాలంలో గృహ నిర్మాణంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలో అప్పటివరకు మరే రాష్ట్రం చేయని విధంగా , పేదలకు గూడు కల్పించేందుకు 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. బడుగువర్గాల గృహనిర్మాణ పధకానికి తోడుగా గిరిజనులకు నీడ

    (పేదల కోసం ప్రతి ఏటా లక్షా 45 వేల ఇళ్ళు నిర్మించాలని ఎన్టీఆర్ లక్ష్యంగా
    పెట్టుకున్నారు. తెలుగు మాగాణ సమారాధనం పేరుతొ భూమి లేని
    నిరుపేదలకు భూపంపిణీ చేపట్టారు.)
    
                       
కల్పించడానికి ఆనాడే ఐదు వేల పక్కా ఇళ్ళ నిర్మించింది. అలాగే తెలుగు మాగాణ సమారాధనం పేరుతొ రెండు లక్షల ఎకరాలకు పైగా భూమిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసింది.
                                

    (రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జిల్లా పరిషత్తుల్లో, మండల ప్రజాపరిషత్తులల్లో తొమ్మిది శాతం అధ్యక్ష పదవులను మహిళలకు రిజర్వు చేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం చట్టం చేసింది. దీనివల్ల స్థానిక సంస్థల్లో తెలుగు మహిళలు కీలక పదవీ భాద్యతలను చేపట్టగలిగారు.)
    
    (ఆస్తి హక్కు కల్పించడం నుంచి ఉన్నత విద్యావకశాల కల్పన వరకు
    ఆడవారి అభ్యుదయం కోసం ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువ కాలంలో
    ఇన్ని రకాల కార్యక్రమాలను చేపట్టలేదు.)
    
    తెలుగు మహిళలను వంటింటి చాకిరి నుంచి పితృస్వామ్య పరిమితుల నుంచి విముక్తి చేసి, సామాజికంగా , ఆర్ధికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి తెలుగుదేశం అవిరళ కృషి చేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అండగా ఉన్న ఆడపడుచుల జీవితాలను మెరుగుపరచడానికి ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు.
    వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు భాగస్వామ్యం కలిపిస్తూ 1986 అక్టోబరు నాటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా చేసిన చట్టం తెలుగుదేశం పార్టీ అభ్యుదయ సిద్దాంతాలకు ప్రతీకగా నిలిచింది. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రగతి కీలక చట్టాన్ని చేయడానికి పార్లమెంటుకే మరో రెండు దశాబ్దాలు పట్టింది. ఎన్టీఆర్ చట్టం నుంచి స్పూర్తిని పొందిన కేంద్రం 2006 లో కుమార్తెలకు ఆస్తి హక్కు కల్పిస్తూ శాసనం చేసింది.
    స్త్రీలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువస్తే వారి జీవితాల్లో గణనీయంగా మార్పు వస్తుందని నమ్మిన ఎన్టీఆర్ అధికారంలోకి రాకమునుపే రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 1983 ఏప్రిల్ లో ఉగాది  పర్వదినాన తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అంకురార్పణ చేశారు. దక్షిణాదిలో మహిళల కోసమే ఏర్పడిన తొలి విశ్వవిద్యాలయం ఇదే. తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలకు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండేది. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయితీ వరకు వేళ్ళ మీద లెక్క పెట్టదగినంత మంది మాత్రమే స్త్రీలు రాజకీయ పదవులను నిర్వహించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జిల్లా పరిషత్తులలో మండల ప్రజా పరిషత్తుల్లో తొమ్మిది శాతం అధ్యక్ష పదవులను మహిళలకు రిజర్వు చేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం చట్టం చేసింది. దీనివల్ల సర్పంచులుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా తెలుగు మహిళలు పదవీ భాధ్యతలను చేపట్టగలిగారు. మహిళలు రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రవేశించడానికి అవకాశం లభించింది. అన్ని ప్రభుత్వ రంగాల్లో 30 శాతం ఉద్యోగాలను స్త్రీలకూ కేటాయిస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల ఉద్యోగాలను స్త్రీలకూ మాత్రమే ప్రత్యెకమైనవిగా గుర్తించి, వాటిని రిజర్వు చేసింది. మహిళల కోసం 19 వసతి గృహాలను స్థాపించింది. మేజర్ పంచాయితీ గ్రామాల్లో స్త్రీలకూ ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించింది. గ్రామీణ వ్యవసాయ శ్రామిక మహిళల కోసం గర్బవతులకు ఆర్ధిక సహాయం చేసే పధకాన్ని ప్రవేశపెట్టింది. మహిళలను బ్యాంకు లోన్ల లో 20 శాతం మార్జిన్ మనీని అందించింది. తెలుగు బాల మహిళా ప్రాంగణం పేరుతొ వితంతువులకు , దిక్కులేని వారికి రకరకాల వృత్తుల్లో శిక్షణ ఇచ్చింది. స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రభుత్వంలో ప్రత్యెక శాఖను ఏర్పాటు చేసింది. స్త్రీల పై నేరాలను విచారించడానికి తొలిసారిగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నెలకొల్పింది. ఆడవారి అభ్యుదయం కోసం ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువ కాలంలో ఇన్ని రకాల కార్యక్రమాలను చేపట్టలేదు.




Related Novels


40 Years of TDP

Sri N T Rama Rao Prasangalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.