Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

6.    మహాగ్ని రోటిని దాటి "వనస్పతీ! నిన్ను నీవే దంచుకొనునట్లున్నావు' అన్నాడు.
   
7.    మహాగ్ని వనస్పతితో అన్నాడు.
   
    నీవు ఎట్లు పూర్ణమగుచున్నావో, అట్లే తెగియు మరల వర్ధిల్లుచున్నావు.
   
8.    మహాగ్ని వనస్పతితో అన్నాడు :-
   
    యవలు ఇచట భస్మమై స్వర్గమున హవిగ మొలిచినట్లు నీవు తెగియు వర్ధిల్లుచున్నావు.
   
9.    మహాగ్ని వనస్పతితో అన్నాడు:-
       
    ఫలములను రాల్చు చెట్టు మరల కాసినట్లు నీవు మరల మరల ఆవేశపడుచున్నావు.
   
10.    మహాగ్ని శబ్దము చేయు కృకవాకము మీదకు దూకుచున్నది. అగ్ని, మృగము వలె, తల సహితముగ సకలమును సేవించుచున్నాడు.
   
11.    మహాగ్ని మహానగ్నుని వెంట ఉరుకుచున్నది. అతని అవయవములను రక్షింపుము. నాతో రమింపుము. భుజింపుము.
   
12.    మహాగ్ని మహా పురుషులను సహితము గునపముతో త్రవ్వినట్లు బాధించుచున్నాడు. మహాకుశలను హతమార్చుచున్నాడు.
   
13.    వశ కాలిన అంగుళిని కలిగించినది. మరొకరు ఉగ్రత కలిగించినారు. శుభంకరుడవై నాతో రమింపుము. భుజింపుము.
   
14.    మహాగ్ని మహా పురుషులను సహితము త్రవ్వినట్లు బాధించుచున్నాడు. కుమారి పింగళక పని తీర్చుకొని పారిపోవుచున్నది.
   
15.    మహా బిల్వము భద్రము - మహా ఉదుంబరము భద్రము. మహానులు, మహా మహానులను సహితము తొలుచు బాధకు గురిచేయుచున్నారు.
   
16.    పింగళిక పీవరీ కుమారికి వసంతము లభించినపుడు తైల పాత్రయందలి ఉంగరము వలె బాధితులకు ఉపశమనము కలిగించుచున్నది.
   
                               నలుబది ఒకటవ సూక్తము - 133
   
1.    'మండూర ధారిణి' ఉరమ ప్రాచీనులకు లభించక ఇంద్రుని సమస్త 'బుద్' బదయాశు, శత్రువులు హతులైనారు.
   
2.    నరుడు 'కపృత్' మీద కపృధమును ధరించండి. అన్న ప్రాప్తికి ప్రేరణ కలిగించండి. రక్షణ కొరకు పుత్రుని కనండి. ఇంద్రుని సోమపానమునకు ఆహ్వానించండి.
   
3.    ఇంద్రుడు విజయశీలుడు. అతడు స్వారి చేయునపుడు సకిలించు వేగవంతమగు అతని అశ్వమును పూజించినాను. ఇంద్రుడు మమ్ము పరిమళవంతులను, ప్రముఖులను, ఆయుష్మంతులను చేయునుగాక.
   
4.    మధుర, హర్షద సోమము ఇంద్రుని కొరకు అభిషుతము అయినది. పాత్ర నుండి సొమ్ము రాలుచున్నది. హర్షప్రద సోమము దేవతలకు చేరునుగాక.
   
5.    సోమము ఇంద్రుని కొరకే పవిత్రము చేయబడుచున్నదని దేవతలు అనుచున్నారు. విశ్వేశుడగు వాచస్పతి బలము ప్రశంసించబడుచున్నది.
   
6.    సోమము సహస్రధారయై పవిత్రము నుండి ప్రవహించుచున్నది. సోమము ధనముల స్వామి ఇంద్రుని మిత్రము అగుచున్నది.
   
7.    సహస్ర కిరణములచే పీల్చునట్టి సూర్యుడు పృథ్వి మీద నిలిచినాడు. ఇంద్రుడు తన బలమున భూమిని రక్షించి ప్రతిష్టించినాడు.
   
8.    విషమ సంచారి శుక్రుని అంశుమతీ నదీ తీరమున సంచరించుచుండగా చూచినాను. సూర్యుని వలె ఆకసమునందుండు అతనిని శరణు వేడినాను. అతడు స్వబలములచే నీ యుద్దము చేయునుగాక.
   
9.    తదనంతరము తన శరీరమును సూక్మము చేసి అంశుమతి క్రోడమున స్థాపించినాడు.
   
    దేవతలను నమ్మని జనులకు ఇంద్రుడు బృహస్పతిని సాయముగా గొని సంహరించినాడు.
   
10.    ఇంద్రా! నీవు సప్త అశత్రువులచే వ్యక్తము చేయబడినవాడవై వైర్కి శత్రుడవు అగుచున్నావు. నీవు ద్యావాపృథ్వులను ఆలింగనము చేసికొని వానిని పొందినావు. విభుత్వ భువనములతో యుద్దమునకు దిగినావు.
   
11.    వజ్రధారి ఇంద్రా! నీవు ధృషితుడవై అపరిమిత బలశాలిని వజ్రముచే అంతమొందించినావు. ఆయుధములతో బలాసురుని దూరము చేసినావు. గోవులను సాధించినావు.
   
12.    మేము వృత్రహంత ఇంద్రుని ప్రశంసించుచున్నాము. ఇంద్రుడు వరదుడు అగునుగాక.
   
13.    ఇంద్రుడు పాపులపాలిట పాశమగుచున్నాడు. అతడు యజ్ఞములందున్నాడు. అతడు ప్రకాశకుడు, ప్రసిద్దుడు సౌమ్యుడు అగుచున్నాడు.
   
14.    అచ్యుతుడు, బలశాలియగు ఇంద్రుడు పర్వత భేదన వజ్రమంతటి బలశాలి. అతడు సత్పురుషులకు ధనము అందించుచున్నాడు.
   
                                 నలుబది రెండవ సూక్తము - 134
   
1.    మహానుడగు ఇంద్రుడు నీరు నిండిన మబ్బు వలె వత్సుని స్తుతులచే వర్ధిల్లుచున్నాడు.
   
2.    అశ్వినులారా! ఎవనిని అగ్నులు పోషించుచున్నవో, ఎవనిని విప్రుల అగ్నులు రక్షించుచున్నవో అట్టి సత్య ప్రజకు పుష్టి కలిగించండి.
   
3.    కణ్వుడు ఇంద్రుని స్తోమములచే యజ్ఞ సాధకుని చేసినాడు. అతనికే ఆయుధము దర్శనమిచ్చుచున్నది.
   
                                 నలుబది మూడవ సూక్తము - 135
   
1.    అశ్వనీ ద్వయమా! వత్సుడు నిర్భయముగ ఉండుటకు క్రూర మృగములుండని విశాల గృహము ప్రసాదించండి. అతని శత్రువులను తొలగించండి.
   
2.    అశ్వినులారా! అంతరిక్షమున, స్వర్గమున, పంచజనులందున్న ధనమును మాకు అందించండి.
   
3.    అశ్వినులారా! నీ కార్యమును పరిమర్సన చేయు విప్రుల చర్యను కణ్వుని కృత్యముగ భావించుము.
   
4.    అశ్వినులారా! మీ స్తోమములు ఘర్మపరిషించితములు. సోమము మధుసంపన్నము. హవి ధన సంపన్నము. ఈ సోమము వలన మీరు ఆవరక శత్రువును ఎరుంగుచున్నారు.
   
5.    జలమున, వనస్పతులందు, ఔషధులందున్న గుణములను మాయందు నింపండి.
   
                                నలుబది నాలుగవ సూక్తము - 136
   
1.    అశ్వినులారా! మీరు శీఘ్ర గాములు దేవా చికిత్సకులు మీ వత్సుడు మతిబంధకుడు కాకున్నాడు. మీరు హవిష్మంతుల వద్దకు చేరుచున్నారు.
   
2.    అశ్వినులారా! మిమ్ము భజించు ఋషులు మీ కీర్తనలను ఎరుగుచున్నారు. పరమ మధుర మత్త సోమ ఘర్మమును అథర్వుని కొరతకు సించితము చేయండి.
   
3.    అశ్వినులారా! మీరు శీఘ్రంగా మీ రథమును అధిరోహించుచున్నారు. మేము మీ కొరకు రచించిన స్తోత్రములు ఆకాశము వంటి అచ్యుతములు.
   
4.    అశ్వినులారా! నేడు మేము ఉక్దములచే మీ శరణు జొచ్చుచున్నాము. మా వాణి కణ్వుని కృపగా భావించండి.
   
5.    అశ్వినులారా! కక్షీవంతుడు, వ్యశ్యుడు, దీర్ఘతముడు మీకు ఆహుతులు ఇచ్చి ఉన్నారు. వేనపుత్ర పృథి మీ సదనముననే ఉన్నాడు. కావున ప్రబుద్దులు కండి.
   
                                    నలుబది ఐదవ సూక్తము - 137

   
1.    అశ్వినులారా! మా భవనములను రక్షించండి. శ్రేష్ఠ రక్షకులు కండి. జగద్రక్షకులు కండి. మా తనువులను రక్షించండి. మీ పుత్ర, పౌత్రులను రక్షించండి.
   
2.    అశ్వినులారా! మీరు ఇంద్రునితో రథమున ఆసీనులు అగుచున్నారు. మీరు వాయువుతో ఒకచోట ఉంటున్నారు. మీరు ఆదిత్య, ఋభువులు ప్రీతి యందు ఉంటున్నారు. విష్ణువు విక్రమములందు ఉంటున్నారు.
   
3.    అశ్వినులారా! మీరు యజమానులను త్వరగ అనుగ్రహించుచున్నారు. మీరు శత్రుదమనులు. అదే మాకు రక్షణ యగుచున్నది. మిమ్ము మాకు అన్నము కలిగించుమని ఆహ్వానించుచున్నాము.
   
4.    అశ్వినులారా! మీరు తప్పక విచ్చేయండి. ఈ హవ్యము మీకు హితకారి ఈ సోమము తుర్వశ, యదు, కణ్వ సంబంధి. ఇక మీరు ఉభయులు విచ్చేయండి.
   
5.    అశ్వినులారా! ఓషధులు దూరమందున్నను దగ్గరలో ఉన్నను జ్ఞాన సంపన్నులై మనస్ఫూర్తిగా ఇతనికి బలము ప్రసాదించండి. వత్సునాకు గృహము కలిగించండి.
   
                                   నలుబది ఆరవ సూక్తము - 138
   
1.    నేను జ్ఞానమయ బుద్దిచే అశ్వినుల వెంట ఉంటున్నట్లు భావించుచున్నాను. బుద్దిదేవీ! మా బుద్దులను ప్రకాశవంతము చేయండి. మానవులకు ధనము ప్రసాదించండి.
   
2.    స్తోతా! ఉషః కాలమున అశ్వినులను మేల్కొల్పండి. సూనృతాదేవీ! నీవు వారిని ప్రశించుము. యజ్ఞహోతా! మీరు కీర్తిని నలుదిశల వ్యాపింపచేయండి.
   
3.    అశ్వినుల రథమా! నీవు నీ కాంతి యందు ఉషస్సువు అగుచున్నావు. సూర్య సమముగ ప్రకాశించుచున్నావు. నీవు అశ్వ సహితముగ 'నృపాథ్య' మార్గమున వచ్చుచున్నావు.
   
4.    కిరణములు మత్తుగా ఉన్నప్పుడు గోవుల పొడుగులు పాలిచ్చుచున్నవి. అప్పుడు ఋత్విజులు అశ్వినులను స్తుతించుచున్నారు. వాణి వారిని ప్రశంసించుచున్నవి.
   
5.    నాకు ధనము కలుగుటకు శత్రుంజయ బలమునకు, శుభములకు, దక్షత, జ్ఞానములు కలుగుటకు మనస్ఫూర్తిగా ప్రార్ధించుచున్నాను.
   
6.    అశ్వినులారా! మీరు మీ బుద్ది సహితముగ పాలకుల వద్ద ఆసీనులు అగుచున్నారు. మీరు సుఖప్రదులై నందున ప్రశంసనీయులు అగుచున్నారు.
   
                                   నలుబది ఏడవ సూక్తము - 139
   
1.    అశ్వినులారా! మీ రథము విశాలము. వేగవంతము, గోసహితము. ఎత్తు పల్లములందు సాగునది. సూర్యుని, వాణిని వహించునది. మహాధనము కలిగించునది. అట్టి రథమును ఆహ్వానించుచున్నాను.
   
2.    అశ్వినులారా! "యువంశ్రియమశ్వినాదేవతా" మీరు శ్రీ కి దేవతలు అగుచున్నారు. ఆమెను ద్యులోకమునుండి పడనీయకున్నారు. మీరు శక్తులను సేవించుచున్నారు. అన్నము మీ తనువున ఉన్నది. మీ రథపు అశ్వములు మీతో ఉన్నవి.
   
3.    అశ్వినులారా! నేడు మిమ్ము ఎవరు హవితో సేవించుచున్నారు? ఎవరు రక్షణల కొరకు సోమము అర్పించుచున్నారు? ఎవరు సమంత్రకముగ ఆహ్వానించుచున్నారు? యజ్ఞ దేవతకు ప్రణామము. అశ్వినులను తెచ్చు అశ్వములకు ప్రణామము.
   
4.    అశ్వినులారా! మీరు హితకర, రమణీయ రథమున యజ్ఞమునకు విచ్చేయండి. మధుర సోమాంశమును పానము చేయండి. మిమ్ము సేవించువారలకు రత్నములు ప్రసాదించండి.
   
5.    అశ్వినులారా! మీ హితకర రమణీయ, సువృత్త రథము మీద ద్యులోకము నుండి భూలోకమునకు అవతరించండి. అన్యులు మిమ్ము వశపరచుకొనకుందురుగాక. నేను మిమ్ము బంధించు నవీన స్తవములను ఉచ్చరించుచున్నాను.
   
6.    అశ్వినులారా! ఇతనికి ఉభయ లోకములందు ధనమును, వీరపుత్రులను ప్రసాదించండి. మిమ్ము స్తుతించువారు సంపన్నులు అగుదురుగాక.
   
7.    అశ్వినులారా! మీరు ఉభయులు ఏక మనస్కులు అగు రీతి ఇతనికి అన్న రత్నములు సుమతితో ప్రసాదించండి. ఈ స్తోతను రక్షించండి. అతడు మిమ్మే నమ్ముకున్నాడు.
   
8.    మధుమతీరోషధీర్ధ్యావ ఆసో మధుమాన్నో భవత్వన్తరిక్షమ్ |
    క్షేత్రస్యపతిర్మధుమాన్నో అస్త్వరిష్వన్తో అన్వేనంచరేమ ||

   
    మా కొరకు ఓషధులు మధుమంతములు అగునుగాక. ద్యులోకము మధుమంతము అగునుగాక. అంతరిక్షము మధుమంతము అగునుగాక. క్షేత్రపతి మధుమంతుడగునుగాక. మాకు హాని కలుగకుండ సంచరింతుముగాక.
   
9.    పనాయ్యం తదశ్వినా కృతం వాం వృషభో దివో రజసః పృథిన్యాః |
    సహస్రం శంసా ఉతయే గోవిష్టౌ సర్వాం ఇత్తాం ఉపయాతా పిబధ్యై ||

   
    అశ్వినులారా! మిమ్ము స్తుతించుట ద్యావాపృథ్వులమీద వర్షించుట యగుచున్నది. గోపూజ యందున్న వందల స్తుతులు మిమ్మే చేరుచున్నవి. పానము చేయండి.
   
     

      విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త,   బాలసాహిత్య కారుడు, అనువాదకుడు, విమర్శకుడు, వ్యాసకర్త, చలనచిత్ర రచయిత, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీమదాంద్రవచన ఋగ్వేద, శుక్లయజుర్వేద, కృష్ణయజుర్వేద, సామవేద సంహితల రచయితయగు డాక్టర్ దాశరథి రంగాచార్య రచించిన  శ్రీమదాంధ్రవచన అథర్వవేద సంహిత సమాప్తము.
   

   

          సర్వేసి సుఖినస్సంతు - సర్వము సుఖముగ ఉండును గాక.
   
          సర్వే సంతు నిరామయాః -
సర్వులు వ్యాధిరహితులు అగుదురు గాక.
   
           సర్వే భద్రాణి పశ్యన్తు - సర్వులు శుభములనే చూచెదరు గాక.
   
          నాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్ - ఏ ఒక్కరు దుఃఖ భాజనులు కాకుందురు గాక.
   
   

                             ఓం శాంతిః  శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.