Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః
ఇష్ణో సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ 64
నీకు నాకు ఎంతో ఇష్టమైనవాడవు. అందువల్ల నీ హితము కోరి చెప్పుచున్నాను. ఎంతో రహస్యమైన దానిని మరల మంచి మాటలను చెప్పుచున్నాను. వినుము.
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో సిమే 65
నాయందే మనస్సు నిలుపుము. అట్లు చేయుటవలన నీవు నన్ను చేరుకొనగలవు. నీవు నాకు అత్యంత ప్రియుడవు. కావున ప్రతిజ్ఞ చేసి యీ మాట చెప్పుచున్నాను.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః 66
అన్ని ధర్మములను వదలుము. నన్ను మాత్రమే శరణు వేడుము. నేను నీ సర్వ పాపముల నుండి విముక్తి కలిగింతును. ఏడవకుము.
ఇదం తే నాతపస్కాయ నా భక్తాయ కదాచన
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో శ్యసూయతి 67
దీనిని తపస్సు చేయునివానికి, భక్తుడు కానివానికి, సేవించని వానికి, అభ్యంతరము చెప్పువానికి తెలియజేయరాదు.
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః 68
ఇది పరమ రహస్యము. దీనిని నా భక్తులకు ఉపదేశించినవాడు నాకు పరమ భక్తుడగుచున్నాడు. అతడు నన్నే చేరుచున్నాడు. ఇందు సందేహము లేదు.
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి 69
మానవులందు అతడే నాకు ప్రియకృత్యములు చేసినవాడు. అతనిని మించిన ప్రియతరుడు లోకమున ఉండబోడు.
అథ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాద మావయోః
జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టఃస్యామితి మే మతిః 70
ఇది మన సంవాదము. ధర్మమైనది. దీనిని చదివినవాడు జ్ఞాన యజ్ఞము చేసినవాడగుచున్నాడు. అతడు నాకు ప్రియుడు అగుచున్నాడు. ఇది నా అభిప్రాయము.
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః
సోపిముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్పుయాత్ పుణ్యకర్మణామ్ 71
శ్రద్ధావంతుడు, అసూయ లేనివాడు, దీనిని విన్నవాడు విముక్తుడు అగుచున్నాడు. శుభలోకములకు, పుణ్యలోకములకు చేరుచున్నాడు.
కచ్చిదేవచ్చ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసా
కచ్చిదజ్ఞానసంమోహః ప్రణష్టస్తే ధనంజయ! 72
ధనంజయా! నీవు ఏకాగ్రమానసుడవై, దీనిని విన్నావా! అజ్ఞానము వలన కలిగిన మోహము పూర్తిగా నశించినదా!
అర్జునా ఉవాచః
నష్టోమోమః స్మృతిర్లబ్దా త్వత్ప్రసాదాన్ మయా చ్యుత!
స్థితో స్మి గత సందేహః కరిష్యే వచనం తవ 73
అచ్యుతా! నీవు అనుగ్రహించినావు. నా మోహము నశించినది. జ్ఞానము లభించినది. స్థితుడను గత సందేహుడను అయి వున్నాను. నీవు చెప్పినట్లు చేయుదును.
సంజయ ఉవాచః
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః
సంవాదమిమ మశ్రౌషం అద్భుతం రోమహర్షణమ్ 74
వాసుదేవుడు, మహాత్ములగు పార్థుని మధుజరిగిన సంవాదమును విన్నాను. అది అద్భుతము! రోమాంచము!
వ్యాసప్రసాదాచ్చ్రుతవాన్ ఏతద్గుహ్య మహం పరమ్
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయతః స్వయమ్ 75
ఇది పరమ రహస్యము. వ్యాసుని అనుగ్రహము వల్ల విన్నాను. కృష్ణు సాక్షాత్తూ యోగీశ్వరుడు. అతడు స్వయముగా చెప్పిన యోగమును విన్నాను.
రాజన్! సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమ మద్భుతమ్
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు 76
ఇది అద్భుతము, పుణ్యప్రదము. కేశవార్జునుల మధ్య జరిగిన సంవాదమును మరల మరల గుర్తుచేసుకొనుచున్నాను. మరల మరలా సంతోషముతో పొంగిపోవుచున్నాను.
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూప మత్యద్భుతం హరేః
విస్మయో మే మహాన్ రాజన్! హృష్యామి చ పునః పునః 77
రాజా! హరియొక్క అత్యద్భుతమైన రూపమును తలచి తలచి మహా విస్మయము నందుచున్నాను. మరల మరల పొంగి పొరలుచున్నాను.
యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ 78
ఎచట యోగీవ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడగు పార్థుడు ఉందురో అచట విజయశ్రీ నిలుచునని నాధ్రువమైన నీతిమతి.
మోక్షసన్యాస యోగమును పదునెనిమిదవ అధ్యాయమును, ఉపదేశ గీతయు సర్వము సంపూర్ణము.
ఓం శాంతిః శాంతిః శాంతిః
* (స్వస్తి) *




