Home » vaddera chandidas » Anukshanikam 2



    అతీత వ్యవస్థా ఆదర్శ మహా అవ్యవస్థా డిజ్ఞ్మండలం వైపు కత్తి పదును దొంతర్ల మరీచికా ప్రవాహాన్ని వెంబడిస్తూ__తనలో వుదయించినట్లే వుద్భవించి యెక్కడో వుదయిస్తున్నట్లుగా తన అణువణువులో స్పందిస్తున్న అరుణోదయానికి సమతారుణోదయానికి తరుణారుణోదయానికి మహత్ శక్తిలా మహోద్వేగంగా యెగిసిపోతోంది.
    వర్గ వైషమ్యానికీ రక్షకీ కసికీ యెంతో యెత్తుగా యెగిసిపడుతున్న ఆమె, మహాజ్ఞాత వాస సాయుధ అరణిలా రగులుతోంది. జ్వలిస్తోంది__ యీ సమస్త వ్యవస్థనీ మసిలా తగలబెట్టేవే కార్చిచ్చులా.
    చలిలో, చర్మం చీరుకుపోయిన నెత్తుటి చారికల్తో, బెణికిన మోచేతితో బురదతో, ముళ్ళతో, ఆకుల్తో, చిరిగిన బట్టల్తో పరిగెత్తుతోంది__ మండుతున్న నెత్తురు జ్వాల యెగిసినట్లు, తగలబడుతున్న అడవి పరుగిడుతున్నట్లు గాయత్రి పరుగిడుతోంది. రోడ్లకీ వాహనాలకీ వూళ్ళకీ వాడలకీ దూరంగా పరుగెడుతోంది.
    సూర్యోదయం వేళకి యీ వ్యవస్థ రక్షకులకి అందని తీరాలకి చేరి, అడవి గిరుల వెనక వుదయిస్తున్న సూర్యబింబంలోకి గెంతింది__ కోటిరెట్ల శక్తితో, వుత్తేజంతో, జ్వలనంతో.

                              106

    అనంత్ రెడ్డి, స్వప్నరాగలీనల పెళ్ళికి బయల్దేరాడు శ్రీపతి. మార్చి నెల. పగటి వేళలు బాగా వేడిగా వున్నా, రాత్రులు వేడిగానూ చల్లగానూ కాకుండా హాయిగా వుంది. బస్సు ప్రయాణం__రాత్రి యెనిమిదింటికి బస్సు బయల్దేరింది.
    అప్పుడు అనంత్ రెడ్డి అమెరికా నుంచి తిరిగివచ్చి సిటీకొచ్చిన మరుసటిరోజునే స్వప్నరాగలీన వాళ్ళ వూరు __ ఏలూరు దగ్గిర శ్రీపురం వెళ్ళింది.
    ఆ రెండో రోజున అనంత్ రెడ్డి వాళ్ళ వూరు ఉరవకొండ వెళుతూ, పెళ్ళిలోగా ఇద్దరమూ ఇక్కడకు రాకపోవచ్చు, నువ్వు తప్పకుండా పెండ్లికి వస్తావు కదూ! స్వప్న యెవరినీ పిలవటం లేదు. నీకు మాత్రం చెప్పమంది" అని అన్నాడు రైలు కదలబోతుండగా.
    అనంత్ రెడ్డి తిరిగివచ్చాక స్వప్నరాగలీనని కలుసుకున్న రెండుసార్లలో రెండోసారి "పెండ్లికి మీవాళ్ళు ఒప్పుకోకపోతే?" అన్నాడు.
    "నేనూ మిమ్మల్ని అదే అడిగితే?" అంది.
    "ముందు నేను అడిగా. ముందు నువ్వే చెప్పు" అన్నాడు.
    "ఓపని చేద్దాం. యెవరం ఏం చెయ్యదలచిందీ రాసిపెట్టుకు చూద్దాం" అంది స్వప్నరాగలీన.
    అనంత్ రెడ్డి జైబులో __ పెన్ను వుంది. ఏవో బిల్స్ కాగితాలు వున్నాయి. ఓ బిల్లు కాగితం రెండుగా చించాడు.
    ఆమె రాసిన కాగితం అతను తీసుకుని చూశాడు: కాదనటం జరగదు. పొరపాట్న జరిగితే, మౌనంగా వుండి రీసెర్చి పేరున మా బాబాయి యింటికి వచ్చేస్తాను. ఆ తరవాత మనింట్లో మనం వుంటాం.
    అతను రాసిన కాగితం ఆమె తీసుకుని చూసింది: ఒకవేళ అంత మూర్ఖంగా కాదని అంటే, తనని తప్ప మరొకరిని చేసుకోవటం అసంభవం. సాధ్యపడకపోతే బ్రహ్మచారిగా వుండిపోతాను__ అని చెప్పి వెంటనే బయల్దేరి వచ్చేస్తాను. ఆపైన జరగాల్సింది మనమే జరుపుకుందాం.
    చదివి, "అన్నీ ఉట్టి మాటలు" అంది అతని ముఖంలోకి తృప్తిగా చూస్తూ.  
    "అవును నీ మాటలంతా వుట్టిమాటలు" అన్నాడు.
    "కాదనాల్సిన అవసరమూ, పరిస్థితీ వుండదు. కాగా మా నాన్న నేను గట్టిగా పట్టుబడితే యేదీ కాదనడు. నా కసలు పెళ్ళితంతు _ ఆఖరికి రిజిస్ట్రారాఫీసులో కూడా_ యెక్కడా యిష్టం వుండదు. కలిసివుంటే అదే పెళ్ళి. పెళ్ళి మనసుల్లో జరుగుతుంది. అది జరిగిపోయిందిగా. కానీ అకారణంగా పెద్దలకి సంతృప్తి లేకుండా చెయ్యటం దేనికి! వాళ్ళ ముచ్చటా తీర్చుదాం. వాళ్ళకి మనం ప్రాణ సమానం కదా" అంది.
    స్వప్నరాగలీన వాళ్ళ వూరు వెళ్ళి యింకో పినతండ్రి హరనాధరెడ్డికి రెండు ముక్కల్లో చెప్పింది. రెండేళ్ళక్రితం పెండ్లిసంబంధాల ప్రసక్తి తెస్తే "మీకు ఆ శ్రమ కలిగించదేమో. మీ అమ్మాయి తొందరపడి అవివేకంగా ప్రవర్తిస్తుందను కోకండి. రెండేళ్ళు ఆగి చూడండి. ఇంకా రీసెర్చ్ పూర్తికాలేదుగా అంది. ఆ పినతండ్రి హరనాధరెడ్డి దగ్గిర చనువెక్కువ.అతనికి వ్యవసాయం, లలితకళలు, సాహిత్యం అంటే ఆసక్తి.
    హరనాధరెడ్డి తన అన్న శంకరరెడ్డితో ముచ్చటించాడు. విషయం కూతురితోకూడా అనకుండా ఒక్కడే బయల్దేరి ఉరవకొండ వెళ్ళి అనంత్ తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వీరారెడ్డిని కలుసుకున్నాడు. తన వూరూ పేరూ వచ్చినపనీ చెప్పి, "ఇంతో అంతో వున్నవాళ్ళమే. ఒక్కతే కూతురు. మగ సంతానం లేదు. కాలేజీలో మీ అబ్బాయి తెలుసట. మధ్యవర్తులు నాకిష్టంలేదు. నిన్న యిక్కడికి వచ్చాను. మీ స్థితిగతులు తెలుసుకున్నాను. యిందాక అబ్బాయిని చూశాను, మీరూ మా వూరొచ్చి అన్నీ కనుక్కున్నమీదటే నిర్ణయించుకోవటం బాగుంటుంది" అన్నాడు శంకరరెడ్డి.
    ఆ వేళకి అనంత్ రెడ్డి యింట్లోనే వున్నాడు. పిలిచి, వీరు ఫలానా అని చెప్పి, "నీకు వాళ్ళమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నారట. మరి నన్ను పోయి విచారించి రమ్మంటావా?" అన్నాడు వీరారెడ్డి.
    నిలుచునే వాళ్ళమ్మాయి మీ యిద్దరి ఆస్తికంటే విలువైంది" అని చిన్నగా అనేసి చటుక్కున లోనకి వెళ్ళిపోయాడు అనంత్ రెడ్డి.
    యిద్దరూ క్షణకాలం విస్తుపోయి చూశారు. శంకరరెడ్డి సంతోషంతో పొంగిపోయాడు.
    "ఆయన అట్లంటుంటే యింక నేను రావటం దేనికి? పెండ్లి మా వాని యిష్టానికి వ్యతిరకంగా చెయ్యను" అన్నాడు వీరారెడ్డి.
    "వయసులో వున్నవాళ్ళు వాళ్ళ సంగతి తప్ప యితర విషయాలు సరిగా గ్రహించలేకపోవచ్చు. ఒక పర్యాయం మా వూరు వచ్చి స్థితిగతులను తెలుసుకుని మీరు స్వయంగా అమ్మాయిని చూసి నిశ్చయించుకోవటం బాగుంటుందేమో_" అన్నాడు శంకర్ రెడ్డి.
    "అవసరమైతే లేదు. ఐనా మీరు సూచించినారు. రెండు రోజుల పైన వస్తానులెండి" అన్నాడు వీరారెడ్డి. వీరారెడ్డి భార్య చనిపోయి పది సంవత్సరాలు దాటింది. రిటైరయ్యాక వూళ్ళో వున్న భూములు స్వయంగా చూసుకుంటున్నాడు.
    నాలుగురోజుల తరవాత వీరారెడ్డి వాళ్ళ వూరు వెళ్ళాడు. పద్ధతి ప్రకారం వాళ్ళ స్థితిగతుల గురించి వూళ్ళో తెలుసుకున్నాడు. శంకరరెడ్డి ఇల్లు__ అలాంటి బంగళా పల్లెటూళ్ళో వుండటం ఆశ్చర్యం వేసింది వీరారెడ్డికి.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.