Home » vaddera chandidas » Anukshanikam 2



    "తెల్సు. మీరు గాయత్రిగారు. మా అక్క యెప్పుడు మీ ముచ్చటే చెప్తుంటది" అన్నాడు.
    గాయత్రి వెంటనే బయల్దేరింది.
    గాయత్రి రిక్షా యెక్కింది. అతను అలాగే నిలుచుంటే, "నువ్వు రావటం లేదా" అంటే_ "ఎందుకు రాను? వెంటరమ్మన్నది." అని రిక్షాలో కూర్చున్నాడు.
    రిక్షా స్విమ్మింగ్ ఫూల్ దగ్గిరికి చేరేసరికి యెనిమిదిన్నర దాటింది.
    స్విమ్మింగ్ ఫూల్ కి కుడిపక్కగా నడిచి, "ఈడనే వుంటనన్నది" అన్నాడు. సుదతి లేదు.
    రెండు నిమిషాలు అటూ యిటూ చూసి, "ఆ పక్కనున్నదేమో" అని అటువైపుకి నడిచాడు. గాయత్రి కూడా అడుగులు వేసింది.
    మసక చీకటి.
    అమాంతం గాయత్రి తలమీద నల్లని కంబళి పడింది. భుజాల చుట్టూ చేతులు. నోటిమీద బలంగా అరిచెయ్యి. మరో రెండు చేతులు మోకాళ్ళ చుట్టూ.
    మరు నిమిషంలో గాయత్రి, ఆ పక్కనే వున్న పోలీస్ కంట్రోల్ రూంలో, వెనక భాగం చీకటి గదిలో వుంది.
    నలుగురు పోలీసులు.
    నోట్లో గుడ్డ కూర్పి మూతికి బట్ట బిగించారు. చేతులు వెనక్కి విరగదీసి, కాళ్ళు రెండూ కలిపి, తాళ్ళతో కట్టారు. కళ్ళకి నల్లటి బట్ట గంత కట్టారు.
    అరగంటకి పోలీసు దుస్తుల్లో వున్న ఒక వ్యక్తి ఓ ఇంజక్షన్ చేశాడు గాయత్రికి.
    మోహన్ రెడ్డి తండ్రి అభిమతంతో పినతండ్రి పూనుకుని వాళ్ళ బంధువు మినిస్టరుతో చెప్పించి మీసా కింద అరెస్టు చేయించి, రికార్డు లేకుండా మినిస్టరుతో చెప్పించి మీసా కింద అరెస్టు చేయించి, రికార్డు లేకుండా వుంచి__మోహన్ రెడ్డికి ఆమె ఆచూకీ తెలియకూడదనీ, చచ్చిపోయినట్లు అతను అనుకోవాలని విశదపరిచాడు. పైనుంచి వచ్చిన ఆదేశాల ననుసరించి పోలీసు ఉన్నతాధికారి ఆర్డర్స్ ప్రకారం ఒక యస్సైకి యీ పని అప్పగించారు.
    ఆ తరవాత ఆమెని అక్కడినుంచి ఎక్కడికి తరలించిందీ కంట్రోల్ రూంలో వాళ్ళకే తెలియకుండా ఆమెని బయటికి తీసుకెళ్ళి జీపులో ఎస్సై ఒక్కడే ఆమెని నిజామాబాద్ జైలుకి తీసుకెళ్ళాడు.
    ఆమెను జీపులో తాళ్ళతో కట్టేశాడు _ అంతకుముందు కాళ్ళూ చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టాడు.
    గాయత్రికి స్పృహ వచ్చేసరికి__ యేదో వాహనంలో వున్నట్లు కదలిక గ్రహించింది.
    వాసన, చప్పుడు తప్ప మరేమీ సాధ్యం కావటం లేదు.
    తెల్లవారుజామున గాయత్రి నిజామాబాద్ జైల్లో వుంది. ఆ యస్సై జీపు మరల్చుకుని మధ్యాహ్నానికి సిటీకి వచ్చేశాడు.
    గాయత్రి నిజామాబాద్ జైల్లో వున్నట్లు ఒక పోలీసు ఉన్నతాధికారికీ ఆ యస్సైకీ మాత్రమే తెలుసు. నిజామాబాద్ జైల్లో ఆ యస్సై ఆమె పేరు గాయత్రి అని కాక భారతి__అని చెప్పాడు. పదిరోజులక్రితం ఆ భారతిని చేర్చినట్లు రికార్డులో రాయమన్నాడు పై అధికారుల ఆదేశాలు చెప్పి. ఆ జైలు అధికారి అసలేదీ రాయకుండా అనామతుగా వుంచాడు, ఎందుకైనా మంచిదని.
    తరవాత జైలు అధికారిని అడిగింది గాయత్రి__ తనని యే కారణాలవల్ల జైల్లో వుంచిందీ. "అవన్నీ మాకెట్లా తెలుస్తాయమ్మా. హోం డిపార్ట్ మెంటుకి పోలీసు అధికారులకీ తెలియాలి" అన్నాడు ఆ జైలు అధికారి ఇంగ్లీషులో.
    ఐతే ఆమెకి జైల్లో ఒక నంబరిచ్చారు. అంటే సామాన్య ఖైదీ లెక్కన కాబోలు__అనుకుంది.
    వాళ్ళందర్నీ స్టెన్ గన్ తో టపటపా పేల్చేసి బయటికి రావాలని గాయత్రిలో రక్తం మరుగుతోంది.
    రెండు రోజులు లోపలి పరిసరాలన్నీ గమనించింది.
    దీన్లోపల నేను నిస్సహాయంగా వుండిపోతే పిచ్చెక్కి చచ్చిపోవటం ఖాయం అనుకుంది.
    ఆవరణలో ఒకచోట వొక రాట నేలలోకి దింపి వుంది. వూపి చూస్తే కదిలినట్లుగా అనిపించింది.
    పదో రోజున సన్నటి తీగముక్క ఒకటి దొరికింది ఆవరణలో. దాన్ని చాటుగా తీసి చంకలో నొక్కిపెట్టి వుంచి తనని మూసివుంచే కూపంలోకి తెచ్చింది.
    రాత్రుళ్ళు కాపలాదారు కూర్చుని కునుకు తీస్తున్న వేళ చూసి, కటకటాలలోంచి చేతులు బయటికి పెట్టి, ఆ తీగతో తాళం తియ్యటానికి ప్రయత్నించింది. వూడి రాలేదు.
    మూడు రాత్రులు వీలున్నప్పుడల్లా ప్రయత్నించగా మూడోనాడు తీగతో తిప్పుతూంటే చటుక్కున తాళం వూడింది.
    చప్పుడవకుండా గడియతీసి బయటికొచ్చి మళ్ళీ గడియవేసి తాళం తగిలించింది.
    ఒక మూలగా నక్కి చుట్టూ గమనించుకుంది.
    ఎలాగైతేనేం పావుగంటకి జైలు ఆవరణలో వుంది.
    తెల్లవారుజాము మూడున్నర వేళ. రాట కదిల్చింది. ఐదు నిమిషాలు ప్రయత్నించి పెకిలించింది. అంతగా బరువు లేదు. మోసుకుని జైలు వెనకవైపు గోడ దగ్గిరికి చేరింది.
    స్కూల్లో కాలేజీలో స్పోర్ట్సు బాగా ఆడేది. లాంగ్ జంప్, హైజంప్ పోల్ జంప్ లలో నేర్పరి.
    గోడకి ప్రక్కగా ఒకచోట ఎత్తుగా వున్న స్థలంలోకి వెళ్ళి_ 'జంప్ చెయ్యగలిగితే _ అవతలేముందో కందకమో అగాధమో చావో బతుకో యేదో వుంటుంది. ఏదైనా సరే__' అనుకుని రాట పట్టుకుని పైకి గాలిలోకి లేచింది. ఆ ఊపుకి గోడ అంచు దగ్గిర కాక అవతలికి వెళ్ళింది__కిందకి దూకింది.
    బురద, పొదలు. కందకం లాంటి మురుగుడు. దాన్లోంచి బయటపడి నడవటం మొదలెట్టింది.
    పరిగెత్తాలనిపించిందిగానీ__యెవరన్నా చూస్తే యే దొంగో పారిపోతున్నట్లు అనుకుంటే కష్టం_ అనుకుని వడివడిగా నడుస్తోంది.
    జైలుకి అటువైపున వూరు లేదు. నిర్జన ప్రదేశం లాంటిది.
    ఒంటినిండా__బురద, చిన్న చిన్న పుల్లలు, ముళ్ళు, ఆకులు.
    పరిసరాలు దాటింది. నిర్జన ప్రదేశం. పరుగు ప్రారంభించింది. ఆ పరుగు, జైలుశిక్ష నుంచి తప్పించుకోవటానికి పారిపోయే పరుగు కాదు. పిరికితనం పరుగుకాదు. ఒంట్లో రక్తం మరుగుతోంది. అంత చలిలోనూ యింకా వుదయించని సూర్యుడు ఆమె బుర్రలో వెలుగుతున్నాడు యెర్రగా.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.