Home » vaddera chandidas » Anukshanikam 2



    "నాకసలు చచ్చిపోవాలనిపిస్తుంది."
    "ఛస్తే__యిక్కడ ఎవరి కొంపలూ మునిగిపోవు. మీవాళ్ళు సలక్షణంగా వుంటారు. నాకంటావా__మరింత మంచి సంబంధాలొస్తయ్. ఈ నళిని నీకు భార్యగా వుండగా నీకు చావాల్సినంత ఖర్మ రాదులే_కాశ్మీర్ ఓ ట్రిప్పు వెళ్దామా?" అంది.
    అంకినీడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి__అవమానంగా అనిపించి.
    మంచం దగ్గిరికెళ్ళి, "ఛఛ కళ్ళనీళ్ళెందుకు? తమాషా చెయ్యటంలేదు. మొగుడివి అంతిదిగా వుంటే పాపం కదూ! ఓ పథకం ఆలోచించాన్లే. త్వరలో మనిద్దరం కలిసి కాశ్మీర్ వెళ్ళి కొన్నాళ్ళు వుండి వద్దాం. నువ్వూ సినిమా టైఫాయిడ్ నుంచి కోలుకుంటావు. ఐతే నువ్వు బుద్ధిగా వుండాలి మరి_" అంది.
    "నాకు బుద్దొచ్చింది నళినీ. జన్మలో చస్తే దేనివంకా కన్నెత్తి చూడను. నీకు చెప్పకుండా ఏదీ చెయ్యను. నాకు_డబ్బూ వద్దు, ఏదీ వద్దు. నన్ను నీవాణ్నిగా భావించుకుంటే చాలు."  
    "యింకోటి వదిలేశావు. సినిమా పుణ్యమా అని అలవాటైన కొత్త వ్యసనం__"
    "చస్తే తాగను. సరదాకి కంపెనీ కోసం కూడా తాగను. ఒట్టు నీమీద ఒట్టు__"
    "పతిదేవా ఒట్టు నామీద వెయ్యకు__నాలుగు కాలాలపాటు యీ ఆస్తీ అదీ అనుభవించాల్సినదాన్ని. తాగుడు గురించి ఒట్టు అని మర్చిపోకు" అంది మంచం అంచుమీద కూర్చుంటూ.
    "నీమీద కాదు మా అమ్మానాన్నలమీద ఒట్టు"
    "వాళ్ళేం పాపం చేశారు బాబూ!"
    "నామీద ఒట్టు"
    "అట్లా అన్నావు బాగుంది. నీ ఒట్టు నీకు పరిమితం అవటం భావ్యం. ఐతే భూమ్మీద ఇదీ అదీ ఏమీ ముట్టవన్నమాటేగా. నన్ను తప్ప?
    "దైవసాక్షిగా నువ్వు తప్ప నాకింకేం వద్దు."
    "చిన్న ఇబ్బంది వుంది. నేను కొంచెం సరదాగా తిరుగుతాను యెప్పటిలాగా__ఇంటికీ ఒంటికీ దేనికీ హాని లేని రీతిలో. ఇట్లా యెన్నాళ్ళు ముసుగెట్టుకుని పడుకుంటావు? సాయంత్రాలు అట్లా వెళ్ళొస్తూ వుండు. కారుంది మనకి" అంది.
    "ఇప్పటికే నీ తిండి తింటున్నాను__"
    "భర్త తిండి భార్యో, భార్య తిండి భర్తో తినాలిగా. తన వ్యాపారాల్లో సిన్సియర్ గా కాస్త తోడ్పడితే మా డాడీ నిన్ను సొంత కొడుకులాగా చూసుకుంటాడనుకో" అంది నళిని.

                              104

    క్రితం వారం ఓ రోజున టాంక్ బండ్ మీద రమాదేవి రత్నాకరరావు శ్రీపతికి కనిపించి _ యెన్నాళైంది ఇంటికొచ్చి అని దెబ్బలాడితే, "వచ్చేవారంలో వస్తాను__" అని చెప్పాడు శ్రీపతి.
    డిసంబర్ ఆఖరి వారంలో__ఆదివారం అనుకుని వెళితే, ఆదివారం కాదని తెలిసింది శ్రీపతికి_ రత్నాకరరావు కాలేజీకి వెళ్ళాడు. రమాదేవి పనిలో వుంది. వంటగదిలోకే ఒక కుర్చీ లాగి అక్కడే కూచోబెట్టి చకచకా వంట ముగించింది.
    రత్నాకరరావుకి ఇంకా యూనివర్సిటీ క్వార్టర్సు ఇవ్వలేదు. వాటిపక్కనే తార్ నాకాలో ఇల్లు తీసుకుని వుంటున్నాడు.
    "వారమూ తేదీ కూడా గుర్తులేనంత దీక్షగా నిమగ్నమైపోయినట్లున్నారు. ఇంతకీ దేన్లో?" అంది రమాదేవి.
    "ఎమర్జన్సీలో."
    "యేఁవిఁ ఎమర్జన్సీ?"   
    "ఇందిరాగాంధీ ఎమర్జన్సీ."
    "అదా_" అని నవ్వి, "యెన్నాళైంది వూరెళ్ళి?" అంది.
    "ఏ వూరు?"
    "ఏవూరేంటి!"
    "దేశంలో యెన్ని వూళ్ళు లేవు!"
    "దేశంలో వూళ్ళమాట కాదు.సొంత వూరు. మీ అమ్మగారు యెంతగా ఇదైపోతున్నారో తెలుసా! ఆ మధ్య మా అక్క వచ్చింది. చెప్పింది అక్కడి కబుర్లు" అంది.
    యీ టాపిక్ యెలా తప్పించాలా అనుకుంటుంటే యెత్తుగా పొట్ట కనిపించి, వుత్సాహంగా_ "యెన్నో నెల?" అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ.
    అర్ధంకానట్లుగా చూస్తుంటే; చూపు ముఖం మీంచి కిందికి వాల్చాడు పొట్లమీదకి.
    రవ్వంత సిగ్గుపడి, "ఐదు" అంది ముసిముసిగా.
    "మొన్నొకసారి హాస్టల్ వార్డెన్ ఝాన్సీరాణి కనిపించి మమ్మల్ని అడిగింది" అంది.
    "యింకా ఆమే నా వార్డెను? నేను గుర్తున్నానన్నమాట!" అని చిన్నగా నవ్వాడు.
    ఒక గంటసేపు కబుర్లు అవీ యివీ.
    "స్నానం చేసి వస్తాను" అని వెళ్ళింది.
    పత్రిక తీసి చూస్తున్నాడు__పావుగంటకి వచ్చింది. జరీ అంచు వెంకటగిరి చీర.
    అంతలో వాకిట్లో స్కూటర్ చప్పుడు_
    రత్నాకరరావు లోనకొచ్చి, శ్రీపతిని చూసి ఆశ్చర్యపోతూ "ఆదివారం వస్తామన్నారు?" అన్నాడు.
    "అన్నంత మాత్రాన వేరే వారం రాకూడదా? మేరు లేనివేళ వచ్చి అమ్మాయిని మీరేమి యిబ్బందులు పెడుతున్నారో తెలుసుకోవద్దూ?" అన్నాడు శ్రీపతి.
    అహాహా అని పెద్దగా నవ్వుతూ, "ఈవిడగారు నామీద యెన్ని చాడీలైనా చెప్పగలదు మీరు వినాలేగానీ!" అన్నాడు రత్నాకరరావు.
    "యివాళ ఆదివారం అనుకుని వచ్చారట మన ఫిలాసఫరుగారు!" అంది.
    "యింకా నయం, మనిల్లు అనుకుని యింకెవరింట్లోకో వెళ్ళలేదు!" అన్నాడు రత్నాకరరావు.
    కబుర్లు__భోజనాలు__కబుర్లు.
    "మీకు టైం ఐనట్లుంది. పదండి వెడదాం." అన్నాడు శ్రీపతి.
    "యీ అవర్ క్లాసు లేదు లాస్టవర్ వుంది__" అని జర్నలిజంలో ఒక లెక్చరర్ ని గురించి అడిగితే అతని జాతకం చెబుతున్నాడు శ్రీపతి.
    "మీ పంతుళ్ళు గొడవేంటండీ కబుర్లూ పాడూ లేకుండా." అని శ్రీపతితో, "మీ తాతగారు పెద్దపులితో హోరాహోరీ పోరాడి పిసికి చంపేస్తారటగా!" అంది.
    "అదేమో నాకు తెలియదుగానీ నేను మాత్రం పిల్లి పిల్లను కూడా చంపలేను?" అన్నాడు శ్రీపతి.
    "పిల్లిని చంపితే పాపం చుట్టుకుంటుందంటారు" అన్నాడు రత్నాకరరావు.
    "యెందుకు అని వుంటారంటే__పిల్లిని చంపటం కష్టం. మీదపడి పీకుతుంది" అని నవ్వాడు శ్రీపతి.
    సంభాషణ వేట మీదకి మళ్ళింది.
    "యిప్పుడు వేటంతా యువకుల మీదకి మళ్ళింది. ఆడపిల్లల తండ్రులు వేటగాళ్ళు_" అన్నాడు శ్రీపతి, వేట మీదినుంచి సంభాషణ తప్పించుతూ. అతనికి వేట అంటే చిరాకు.
    "మా నాన్నగారెవర్నీ వేటాడలేదు." అంది రమాదేవి.
    "కొందరమ్మాయిలు కన్నతండ్రులకి శ్రమ కలిగించరు!" అన్నాడు శ్రీపతి హాస్యంగా.
    "కలిగించక, శ్రీపతిగారిలా అన్నలుంటే వాళ్ళకి కలిగిస్తారు" అని నవ్వాడు రత్నాకరరావు.
    "అక్కడికి మీరు శుద్ధమైనట్లు. అందులో సగభాగం మీకూ వుందిగా స్వామీ" అంది భర్తని.
    రత్నాకరరావుకి క్లాసు టైం ఐంది.
    "మీరుండండి__కాసేపు నిద్ర తియ్యండి. లేదూ రమతో పేకాట వెయ్యండి. గంటన్నరకి నేనొచ్చేస్తాను__" అన్నాడు రత్నాకరరావు.
    "నాకూ పనుంది యూనివర్శిటీలో. పదండి" అని శ్రీపతి లేచాడు.
    "యేం పని? ఫ్రెండ్స్ తో కబుర్లేగా?" అంది.
    "లేదమ్మా ఆఫీసులో పనుంది__యెట్లాగూ ఆదివారం కాదని తెలిసిందిగా?" అని నవ్వి, "ఆ పని చూసుకుని వెళతాను" అన్నాడు శ్రీపతి.
    స్కూటర్ మీద వెళుతూంటే సి__హాస్టల్ దగ్గిర "హలో శ్రీపతీ అని యెవరో పిలవటం వినిపిస్తే రత్నాకరరావు వేగం తగ్గించాడు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.