Home » vaddera chandidas » Anukshanikam 2



    ఇరానీ హోటల్లోకి చొరబడ్డాడు.
    తందూరీ రోటీ, మటన్ కుర్మా.
    _వీళ్ళకి భారతదేశ పౌరసత్వం వుందా? వీళ్ళ పెళ్ళాలెక్కడ? ఇరాన్ లోనా? మరి వీళ్ళ అవసరం యెలా తీరుతున్నట్టు? యే.... దగ్గిరానూ కనపడరు. తమలోతాము హోమో సర్డుబాటేమో......
    టీ తాగి బయటికొచ్చి నడుస్తున్నాడు.
    మలుపులో సినిమా బోర్డులు. షోలే, కార్పెట్ బెగ్గర్స్, ఎంటర్ ది డ్రాగన్, మౌసమ్, రంగిల్లారాత్, కాగజ్ కి నావ్, ఒకదీపం వెలిగింది, ప్రేమలీలలు, సంసారంలో సరిగమలు.
    _నేకెడ్ బెగ్గర్ల వింటర్ డ్రాగింగ్ రంగుల రాత్రుల మౌనంలోంచి యెర్రగా కాలిన శూలం కొసన ఒకదీపం వెలిగి ప్రేమలీలలు సాగి సంసారంలో సరిగమలు, గరిగమలే గరగర గరంగరిగనులే కాదంటే బతుకు కాగితప్పడవే.....
    యిషారా సినిమా కాగజ్ కినావ్ ఆడుతున్న థియేటర్ దాటిపోయి_ గమనించి ఆగకుండా వెళ్ళబోతూ_ ఆగి_ వెనక్కి తిరిగి_
    _ఈసారికి సారిక సరిక గిరిక గరిక గిరిక రామరాజభూషణుడి రోమరాగ భోషాణుడి భట్టుమూర్తి బెట్టుమూర్తి గుట్టుమూర్తి_ కెలికినవాళ్ళు సాహిత్య డాక్టర్లు, కులికినవాళ్ళు సాహిత్య యాక్టర్లు, అలికినవాళ్ళు _ సాహిత్య ప్రోక్టర్లు, అలిగినవాళ్ళు.....
    టిక్కెట్టు తీసుకుని లోనకి వెళ్ళబోతూంటే_ వరండాలో నుంచుని వున్న రంగారెడ్డి. "హలో శ్రీపతిగారూ వాటె ప్లజంట్ సర్ ప్రైజ్" అంటూ కూడా నడిచాడు.

                             103

    అంకినీడు తీసిన సినిమా మూడు వారాలకే డబ్బాలు తిరిగివచ్చాయి అన్ని థియేటర్లనుంచీ.
    కవ్వించే సెక్సీ స్టిల్స్, సందేశాత్మకమైన కాప్షన్స్ ఇచ్చిన పబ్లిసిటీల వల్ల మొదటిరోజు అన్నిచోట్లా హౌస్ ఫుల్ అయింది. రెండో రోజున కాస్త మూడోరోజుకి మరికాస్త అలా రోజురోజుకీ ప్రేక్షకులు తగ్గిపోయారు. కరెంటుబిల్లు ఖర్చులకి కూడా చాలనంతగా.
    కథలో సెక్సూ సస్పెన్సూ సందేశమూ లాంటివన్నీ నింపినా_ సందేశం కదిలించేదిగానూ, సస్పెన్సు వూపిరి బిగబట్టించేదిగానూ, సెక్సు కిక్కిచ్చేదిగానూ, క్రైమ్ కంపింపజేసేదిగానూ తయారవక అతుకుల బొంతలా అనిపించింది ప్రేక్షకులకి. సస్పెన్సు కంటికి కనిపించటం తప్ప ఫీలింగులో పట్టేసెయ్యలేకపోయింది.
    డిస్ట్రిబ్యూటర్ల ఐదారు లక్షలూ బొటాబొటీగా వసూలయ్యాయి. అంకినీడు పార్ట్నరువి నాలుగు లక్షలు, అంకినీడువి రెండులక్షలు తిరుక్షవరమయ్యాయి. అంకినీడు పార్ట్నరు పదోరోజున అంకినీడుని అడ్డమయిన తిట్లూ తిట్టి వూరికెళ్ళిపోయాడు.
    యింట్లోంచి బయటికి కదలకుండా ముసుగెట్టుకుని పడుకుని వుండిపోయాడు అంకినీడు.
    ఓరోజున విజయ్ కుమార్ వచ్చి నళినితో, "అమ్మాయ్ నళిని మీ ఆయన నాకు పదివేల రూపాయలివ్వాలి" అన్నాడు.
    "భర్త అప్పులు భార్య తీర్చేపద్ధతి లేదు కదా! అయినా ఆ సినిమాకీ నాకూ కొన్ని వేల మైళ్ళ దూరం అని అందరికీ తెలుసు." అంది.
    "సినిమాకి కాదు. సినిమా రిలీజైన రోజున నా దగ్గిర పదివేలు చేబదులు తీసుకున్నాడు."
    "దానికేం విజయ్ అడిగి తీసుకో." అంది నళిని.
    "తన దగ్గిరేముందని ఇస్తాడు?"
    "వాళ్ళ అమ్మానాన్నలకి ఆస్తి లేకపోలేదు" అంది.
    "వాళ్ళ దగ్గిరికెళ్ళాను నిన్న. వాటా పంచి ఇచ్చాం. మాకేం సంబంధం లేదు అన్నారు. కాగా వాళ్ళమ్మ తనని బతిమిలాడి యాభయ్ వేలు పట్టుకుపోయాడని ఒకటే గోల" అన్నాడు విజయ్ కుమార్.
    "ఐతే యింకేం చేస్తావ్ విజయ్ ; ఆశ వదులుకోవాల్సిందేగా__ ఆయన దగ్గిర నాలుగు జతల బట్టలకి మించి యేమీ లేవనుకుంటాను!" అంది హాస్యంగా.
    "పదివేలేగా నువ్విచ్చేస్తే__"
    "పదివేలేగా వదులుకునేస్తే__"
    "అదేంమాట? మీ ఆయన కదా?"
    "అదేంమాట? నేనేం ఆయన మెళ్ళో తాళికట్టలేదు. కాగా నన్నడిగి ఇచ్చావా?" అంది.
    "నిన్ను సంప్రదించేటంత వ్యవధి లేకపోయింది. అర్జంటుగా కావాలని బార్ లో అడిగితే__"
    "భార్యగా ఆయనకి పూచీ పడలేను. యేదో చుట్టానివికదా, పర్సనల్ గా ఇస్తాను తీసుకో అంత డబ్బు యిబ్బందిలో వుంటే __" అంది వ్యంగ్యంగా.
    "అట్లా అని కాదు. అది ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకుని ఇచ్చాను."
    "నువ్వంత యిబ్బంది పడతుంటే పర్సనల్ గా ఇస్తాను మరి. తీసుకో.'
    విజయ్ కుమార్ మౌనంగా వూరుకున్నాడు__యిస్తే తీసుకోవటానికి సిద్ధపడినట్లు చూస్తూ.
    "ఓరి అల్పుడా__అంత ఆస్తి యేం చేసుకు చస్తావురా__' అని అనుకుని లేచి గది బయటికి వెళ్ళింది నళిని.
    అంతా వింటూ ముసుగు తియ్యకుండా పడుకునే వున్నాడు అంకినీడు.
    అంకినీడుని లేపాలనుకుంటుండగా నళిని వచ్చి పదివేల రూపాయల నోట్లకట్ట విజయ్ కుమార్ ఒళ్ళోకి అలా పడేసింది.
    "నాకు పనుంది__" అంది__'యిక నువ్వు వెళ్తే _ అన్నట్లుగా.
    "థాంక్స్ నళినీ. ఒకసారి మా యింటికి రండి? చాలాకాలం ఐంది వచ్చి" అని లేచి వెళ్ళిపోయాడు విజయ్ కుమార్.
    అతను వెళ్ళాక__నళిని, "ఇట్లాంటి అప్పులు యింకెన్ని వున్నాయ్?" అంది.
    "__ __"
    "పతిదేవా నిన్నే__" అంది.
    ముసుగు తీసి "ఏంటి?" అన్నాడు కళ్ళు నులుముకుంటూ.
    "ఇంట్లో నిద్ర నటిస్తే ఏం లాభం? పోయి యెవరి సినిమాలో నన్నా యెగస్ట్రా వేషాలు నటించు_" అంది.
    చూపులు పక్కకి తిప్పాడు.
    "ఇంకా ఇట్లాంటి బాపతు అప్పులేమన్నా వున్నాయా అని అడుగుతున్నా" అంది.
    "లేవు" అన్నాడు పొడిగా.
    "అక్కడికి కొంత మేలే" అంది.
    దుప్పటి ముసుగెట్టబోతున్నాడు.
    "ఆ వెధవముండ ముసుగింకా యెన్నాళ్ళు? మొగుడు చచ్చి నెల దాటింది. తెల్ల దుప్పటి బాగా మ్యాచ్ అయిందనుకో." అని నవ్వింది.
    ముసుగు పెట్టటం విరమించాడు.
    "చిప్ప చేతికి రాగా పాత వ్యసనాలకి తోడు కొత్త వ్యసనం __ తాగుడు అబ్బింది ఈ సినిమా పుణ్యమా అని. యిది నీ సినిమా సంపాదన" అని నవ్వింది.
    "నేనేం డబ్బు పాడుచెయ్యాలని సినిమా తీశానా?"
    "దురదకొద్దీనూ వివేకం లేకానూ."
    "ఛాన్సు తగిలుంటే__"
    "రేసుల్లో అయితే మాంచి ఛాన్సులు తగులుతుంటవి" అని నవ్వింది.
    బిక్కమొహం వేశాడు అంకినీడు.
    "ఎంతైనా మొగుడివి కదా__నేనొక్ మాట చెప్తాను వింటావూ?"
    "నువ్వేం చెప్తే అదలా వింటాను నళినీ. బుద్దొచ్చింది. నువ్వు వొద్దన్నా వినకుండా దీన్లో దిగాను."
    రొచ్చు తిరుగుడు, చొంగ తిరుగుడు, నాటుతనం, కక్కుర్తితనం మానుకుంటే అవసరం నా దగ్గిర తీరకపోదు.... ఎంతైనా మొగుడివి కదా...."




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.