Home » D Kameshwari » Vivahabandalu


   
    అక్క ధైర్యం తెచ్చుకుని "పెళ్ళికే చాలా ఖర్చయింది. ఇంకేం సారె పెడ్తారు. మా నాన్నగారు చాలా యిబ్బందిపడి యీ మాత్రం చేయగలిగారు" అంది.
    ఆవిడ చాలా వింత విషయం విన్నట్టు కనుబొమలు ముడిచి ఆశ్చర్యంగా "ఏమిటి, పిల్లకి సారె సామాను ఇచ్చుకోడం ఊరివాళ్ళకి ఉపకారమా ఏమిటి! అవ్వ. ఆఖరికి మంచాలు పరుపులు, గిన్నెలన్నా ఇవ్వకుండా పిల్లని పంపడం ఎక్కడన్నా వుందా!" అంది ఆవిడ నిష్టూరంగా.
    "అందరికీ ఇవ్వాలనే ఉంటుందండి. శక్తి ఉండద్దూ. ఉంటే కూతురికిచ్చుకోరా-"అంది భయపడుతూనే.
    "ఆవిడ మూతి ముడిచి ధుమధుమలాడుతూ "బాగానే ఉంది సంబరం. అయ్యోరాత. అన్నీవాడే కొనాలన్నమాట. మంచి సంబంధమే చేసుకొన్నాం. చేసుకుని చేసుకుని ..." అంటూ గొణిగింది.
    అందరి ముందు నాకు తల కొట్టేసిన ట్టయింది. గొంతులో దుఃఖం అడ్డుపడింది. కనీసం ఆయనయినా తల్లిని వారిస్తాడేమోనని ఆశించాను. ఈ సంభాషణ వింటూ మొహం అప్రసన్నంగా పెట్టి ఓసారి నా వంక చూసి తరువాత పేపరులో మొహం దూర్చుకున్నారు - నా ఊహా సౌధపు పునాది మరింత కదిలింది.
    ఉదయం గృహ ప్రవేశం జరిగింది. అమ్మలక్కలు వచ్చారు. కొత్త కోడల్ని చూశారు. కట్న కానుకలు ఆరాతీశారు. నగలు యేం పెట్టేరు. సారె యేం పెట్టారంటూ ఆరాతీశారు.
    మా అత్తగారు నా వంక అక్కవంక వంకర చూపు చూస్తూ "సామానుఇయ్యలేదు. రెండువేలిచ్చారు కొనుక్కోమని" అంది. మేం ఇద్దరం అపరాధుల్లా తల దించుకొన్నాం.
    అంతా వెళ్ళాక కూతుర్లతో, పెద్దకోడలితో "మధ్య చావు నాకు వచ్చిపడింది. వెధవ అబద్దాలు ఆడలేక చస్తున్నాను అందరితో. మధ్య తలవంపులు నాకు. బొత్తిగా ఇలా దిష్టి బొమ్మలా పిల్లని ఓ పెట్టె ఇచ్చి అత్తవారింటికీ పంపడం ఎక్కడా చూడలేదు. ఎంతకని ఒప్పుకుంటాం ఇలాంటివి" అంటూ సాగదీసింది.
    నేనింక వింటూ సహించలేకపోయాను. కోపం ముంచుకు వచ్చినా నిగ్రహించుకొని సౌమ్యంగానే "అబద్దాలు చెప్పడం దేనికి? మావియ్యాలవారికి లేదు, ఇవ్వలేదు అని నిజం చెప్పండి" అనేశాను.
    కొత్త పెళ్ళికూతుర్ని నేనిలా అనగానే ఆవిడ జరగరాని ఘోరం జరిగినట్లు తెల్లబోయింది.
    ఆడపడుచులు చురుక్కున చూశారు.
    తోడి కోడలు కనీ కనిపించ కుండా హేళనగా నవ్వింది.
    అత్తగారు కటువుగా చూస్తూ "ఏమిటమ్మాయీ! మీ అమ్మా నాన్న పిల్లని బాగానే పెంచాలే. అత్తగారికి ఎదురు తిరిగి మొదటి రోజే జవాబిచ్చిన పిల్ల రేపొద్దున్న కాపురం సరిగ్గా చేస్తుందా? పెద్దవాళ్ళంటే భయం, భక్తి లేకుండా జవాబు ఇస్తుందా? అయినా ఉన్న మాటంటే వులుకెందుకు?" అంటూ దులిపింది.
    మళ్ళీ నేను ఏదో అనే లోపల అక్క, "శారదా!" అంటూ హెచ్చరించింది.
    ఆవిడ ధుమధుమలాడుతూ లేచి వెళ్ళిపోయింది.
    గదిలోకి వెళ్లాం. నేను కళ్ళు తుడుచుకోడం చూసి "ఊరుకోవే, తప్పు, కంట తడి పెట్టకు. అలాంటివి వింటూ ఊరుకోవడమే. నాలుగు రోజులు అనివాళ్ళే ఊరుకొంటారు. వీళ్ళతో నీకేంలే. నీవూ ఆయన అన్యోన్యంగా ఉంటే ఇదంతా లెక్కచెయ్యక్కరలేదు. నాలుగు రోజులుండి పోయేదానికి వీళ్ళతో అనవసరంగా గొడవెందుకు? ఏమన్నా మాట్లాడకు" అక్క అంది.
    
                                          *    *    *
    
    అక్క అన్నట్లు భర్త ప్రేమ, ఆదరణ లభిస్తే ఆ స్త్రీ తక్కినలోకాన్ని లెక్క చెయ్యక్కరలేదు. ఎవరేమన్నా భర్త ప్రేమ ఆసరాతో అవన్నీ భరించగలదు. కాని ఆ భర్త ప్రేమానురాగాలు కరువయితే ఆ స్త్రీకి ఇంకేం మిగిలినట్టు?
    డాక్టరుగారూ! మొదటి రాత్రి- గురించి చాలా సినిమాల్లో చూశాను. ఏవో నవలలు చదివాను. ఏవో రాత్రులు వస్తాయి. కాని ఇది యే తొలిరేయి లాంటి పాటలు విన్నాను. సహజంగా ప్రతీ కన్నె పిల్లలాగే నేనూ చాలా ఊహించాను. సిగ్గుల పెళ్ళి కూతురిలా గుమ్మం దగ్గిర నిలబడటం ఆరాటంతో, అనురాగంతో గుండెలకి హత్తుకొనే భర్త - అతని అనురాగ డోలికలలో మైమరచి అతని గుండెల్లో ఒదిగిపోవడం- డాక్టరుగారూ! ఇవన్నీ కేవలం సినిమాలలోనే చూపిస్తారో లేక తొలిరేయిలో జరుగుతాయో నాకు తెలియదు. కాని నాకు మాత్రం ఊహలో మిగిలిపోయిన అనుభూతులుగానే మిగిలి పోయాయి. ఊహలకి యదార్ధానికి పొంతన ఎక్కడా దొరకలేదు.
    ఆయన నాతో మాట్లాడినవి ప్రేమ మాటలు కావు. స్వీట్ నథింగ్స్ కావు. ఆయన నన్ను గుండెలకు హత్తుకొన్నారు. ప్రేమతో కాదు వాంఛతో. ఆయన ఆవేశం తప్ప అనురాగం నన్ను ముంచెత్తలేదు. ఆయన పని పూర్తయ్యాక ఎన్ని ఏళ్ళగానో కాపురం చేస్తున్న భర్తలా ఆదమరిచి నిద్రపోయారు.
    నిద్రపోయె ముందు అనవలసినవి, అడగవలసినవి అడిగి మరీ పడుకున్నారు. "మధ్యాహ్నం మా అమ్మనేదో అన్నావుట-" అన్నారు "చూడు అలా ఇంకెప్పుడూ అనకు. మాట అనే ముందు వెనకా ఆలోచించాలి. పెద్దవాళ్ళతో మాట్లాడే తీరు అదేనా, ఆవిడ కష్టపెట్టుకుంటుందన్న ఆలోచనన్నా లేదా?" సన్నగా మొదలైన గొంతు పెరిగింది.




Related Novels


Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

D Kameswari Kathalu

Teeram Cherina Naava

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.