Home » vaddera chandidas » Anukshanikam 2



    ఆ ప్రక్కన వున్న హోటల్లోకి వెళ్ళారు.
    కబుర్లు. ఇందిరాగాంధీ గురించి నాలుగు రోజులనాడు ఇండియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ ని లాహోర్ కి హైజాకింగ్ చేసిన విషయం గురించి మాట్లాడుతున్నాడు వలియుద్దీన్.
    రవి మనస్సు చికాగ్గా వుంది. అన్యమనస్కంగా మాట్లాడుతున్నాడు. అరగంట.
    "యిక వెళ్దామా?" అన్నాడు రవి.
    బయటికొచ్చారు.
    రవి, టాక్సీ యెక్కి క్వార్టరుకి చేరుకున్నాడు.
    తిన్నగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. బీరువా తెరిచి బ్రాందీ సీసా తీశాడు. గ్లాసు నింపుకుని సీసాలోన దాచేశాడు. రవికి తాగాలని యెప్పుడూ అనిపించదుగానీ_ కొంతకాలంగా రకరకాల చికాకుల మూడ్ లో ఒంటరిగా చాటుగా తాగుతాడు.
    గట గటా తాగేసి పడుకున్నాడు రవి.

                                98

    చారుమతి పెళ్ళి.
    చిక్కడపల్లి ప్రాంతంలో కాస్త ఖాళీ ఆవరణ వున్న మందిరంలో యేర్పాటు చేశారు.
    "పెళ్ళిపందిరంటే, తాటాకుల పందిరి వెయ్యాల్సిందే అన్నాడు భానుమూర్తి. అవి ఇక్కడెక్కడ దొరుకుతాయి. షామియానా వేయించక తప్పదని వరహాశాస్త్రి నచ్చచెప్పాడు. నేలమీద చాపలు జంబుఖానాలు దుప్పట్లూ పరిచారు. పెళ్ళి మండపం అలంకరించారు. హోమగుండం యేర్పాటు చేశారు. పెళ్ళి బ్రాహ్మలకి చెప్పాడు. "నిప్పుల్ల గీస్తే కుదరదు. అరణి చెయ్యవలసిందే. మీరెలాగన్నా తిప్పలు పడండి" అని ఖరాఖండిగా చెప్పేశాడు.
    బాజా భజంత్రీలు
    "మాటి మాటికి దెల్పవలెనా మునిమానసార్చిత చరణ రామయ్య నీతో" అని గొంతులో శృతించుకుంటూ హడావుడిగా తిరుగుతున్న వరహశాస్త్రి.
    పందిట్లో పెళ్ళవుతున్నాది కనువిందవు తున్నాది_అనే పాట హిందీ మాతృక ట్యూనులోంచి, ప్రేమనగర్ లో "లేపమంటావా లేవనంటావా నన్నే లేపమంటావా_" పాట ట్యూనులోకి రావటం.... గమనించి వాళ్ళదగ్గిరికి డొల్లుకుంటూ వెళ్ళి, "మీకు పుణ్యం వుంటుంది. అలాంటి జ్యోతిలక్ష్మి యల్లారీశ్వరీ ట్విస్టు అరుపు విరుపు లొద్దు. మీకు ఆసక్తి వుంటే అందుకోసం వేరే కచేరీ పెట్టిస్తాను. సందర్భోచితమైన రాగాలు వాయించండి. కాదంటే వాయిద్యాల మోత పెట్టండి కాదనను" అని వెనక్కి తిరిగి "సీతమ్మ పెళ్ళికూతురాయెనే మా సీతమ్మ పెళ్ళికూతురాయెనె" అని గొంతులో పాడుకుంటూ నడిచాడు వరహాశాస్త్రి. పట్టుపంచె, వుత్తరీయం. కొత్తజందెం మెరుస్తోంది, వాటితోపాటు.
    యేడాదిన్నర క్రితమే ప్రారంభించాడు చారుమతి తండ్రి ఆమెకి పెళ్ళి సంబంధాలు చూడటం యేడాదిక్రితం ఒక సంబంధం వస్తే_ "నాన్నగారూ పెళ్ళిళ్ళ పేరయ్యలని నమ్మకండి. ఆ ఆధారంగా మీరు స్వయంగా వాకబు చెయ్యండి. లోకంలో అందరూ మీలాంటివాళ్ళు కారు. అతను బియ్యస్సీ పాసయ్యాడనీ, చక్కగా వుంటాడనీ మెడికల్ రిప్రజెంటేటివ్ అనీ చెబుతున్నారు. ఆ విషయం కనుక్కోండి నాన్నగారూ నా గురించి నాకెలాంటి భ్రమలూ లేవు. అలాంటి వ్యక్తి యేం చూసి నన్ను చేసుకుంటాడు. మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే జీతం ఎక్కువే వుంటుంది. నన్నెక్కడో చూశాడనీ చెబుతున్నారు. నాకు అతని వివరాల మీద నమ్మకం కలగడం లేదు. మీరు స్వయంగా కనుక్కోండి. ఆ విషయాలు_పెళ్ళంటే యేడు తరాలు అటూ యేడు తరాలు యిటూ చూడాలంటారుగా_అది వదిలేసినా"__అంది చారుమతి.
    ఆ విషయం చివరికి వరాహశాస్త్రికి అప్పగించగా వాకబుచేసి తెలుసుకుంటే అతను బియస్సీ తప్పాడనీ, ఆస్తి పాస్తులేమీ లేవనీ యేదో చిన్న మెడికల్ కంపెనీలో కమీషను బేసిస్ మీద కొన్ని నెలలు రిప్రజెంటేటివ్ గా పనిచేశాడనీ. కమీషన్ బేసిస్ వుద్యోగానికి కూడా పనికిరానివాడని తీసేశారనీ, జులాయి తిరుగుతాడనీ తెలుసుకున్నాడు.
    "చారూ, వాడెవడో ఆవారా హీరో, నీ మెళ్లో తాడు బిగించి నీ జీతం డబ్బులతో జల్సా చేద్దామని ఆలోచించినట్లున్నాడే! నాన్నకి మరీ ఇంత అమాయకమేం! ఆయనెందుకు? పెళ్ళి పూచీ నాది. నేను చూస్తానుగా' అన్నాడు వరాహశాస్త్రి.
    విషయాలు తెలుసుకున్న భానుమూర్తి కూతురితో, "అమ్మా చిన్నదానివైనా నీ వివేకానికి_ యెంతో సంతోషంగా అనిపిస్తున్నదమ్మా! నీ గొంతుకోసి వుండునుకదా నువ్వు హెచ్చరించకపోయివుంటే?" అని మెచ్చుకున్నాడు.
    యెనిమిది నెలలక్రితం తను పనిచేసే స్కూల్లో పనిచేస్తున్న టీచరు కామేశ్వరరావుతో ఆమెకి పరిచయం పెరిగింది. అతనూ ఆమెలాగా బియ్యస్సీ ట్రెయిన్డ్ టీచర్. బస్సులో కూచుని వెళుతుండగా_చెయ్యి బయటికి పెట్టుకుని వుంటే పక్కగా దూసుకొచ్చిన బస్సుకి తగిలి ఎడమ చెయ్యి విరిగింది. భుజం దగ్గిరికి తీసేశారు. రూపం, చారుమతి ప్రక్కన వుంటే అందంగా వుంటాడు. వరాహశాస్త్రి పక్కన వుంటే యెలాగూ అనిపించడు. అనంత్ రెడ్డి ప్రక్కనో శ్రీపతి ప్రక్కనో నుంచుంటే అనాకారిగా అనిపిస్తాడు.
    స్వభావాలు అభిరుచులు కలిశాయి. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.
    ఒకసారి వరాహశాస్త్రితో అంది. అతను తల్లికీ తండ్రికీ చెప్పి మాట్లాడితే, "అవిటి మనిషికెట్లా యివ్వడం?" అన్నాడు భానుమూర్తి.
    "నాన్నగారూ కూతురిమీద మమకారం మంచిదేగానీ దురాశ పనికి రాదు. యాక్సిడెంటులో ఎడమ చెయ్యి పోయింది. అంతేగా" అంది.
    "అతనినే చేసుకోవాలని నువ్వు పట్టుబడితే అభ్యంతరపెట్టను" అని తండ్రి అంటే, "మనసులు కలిశాయి. అంతమాత్రాన అతనితో పెళ్ళిజరగకపోయినా నా బ్రతుకు నా బ్రతుకుగానే వుంటుంది. మీరు తగిన వరుణ్ణి చూసి చెయ్యండి కాదనను" అంది.
    వరాహశాస్త్రి ప్రోత్సహించిన మీదట భానుమూర్తి అతని వివరాలన్నీ తెలుసుకున్నాడు. తండ్రి పేరు శ్రీరంగం విఘ్నేశ్వరశాస్త్రి. రాజమండ్రి ప్రాంతంలో పౌరోహిత్యం చేస్తుండేవాడు. మూడేళ్ళక్రితం చనిపోయాడు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి, యెప్పుడో తల్లి వుంది. కూతుళ్ళ దగ్గిరా పెళ్ళయిన యింకో కొడుకు దగ్గిరా వుంటూ వుంటుంది. ఆస్తిపాస్తులేం లేవు.
    జాతకచక్రాలు కలిశాయి. అతని తల్లి "లాంఛనాలు కాస్త ఘనంగా జరిపించండి చాలు" అని అడిగింది. వరాహశాస్త్రి తన ఫెలోషిప్పు డబ్బులోంచి నెలనెలా చెప్పకుండా దాచిన డబ్బు సంగతి చెప్పి పెళ్ళి ఖర్చులకి అప్పు చెయ్యక్కరలేదని చెప్పాడు. తండ్రి ప్రావిడెంటు ఫండు ఇచ్చేమేరకి తీసేసుకోదలిచినట్లు చెబితే, రిజిష్ట్రాఫీసులో జరిపించమని చారుమతి సూచించింది గానీ అందుకు యెవరూ ఒప్పుకోలేదు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.