Home » vaddera chandidas » Anukshanikam 2



    'దీంట్లో వో లప్ప పట్టగలడీ బావురుకప్పగాడు.' అని అనుకుంటూ, "మీకెందుకండీ మీ పోర్టుఫోలియో ఐనా కాదు!" అన్నాడు రవి.
    "బాధ్యతలు సొంత పోర్టు పోలియోలకి పరిమితమైతే ప్రాణం హాయిగానే వుండును. యెన్ని అబ్లిగేషన్లు!"
    "సరే మంచిదండీ. ప్రయత్నిస్తాను"
    "ప్రయత్నిస్తానంటే కాదు. సాధించాలి. ఆ ఆఫీసర్ ప్రమోషన్ గొడవ నేను చెప్తాను. వీలైతే సెంటరుకి పంపుదాం. మీరొకసారి మావాణ్ని కలవండి. అన్నట్లు యెట్లా వచ్చారు. కార్లోనా?"
    "లేదండీ__టాక్సీలో."
    "ఒక్కటే కారు అయితే యెట్లా? హోం డిపార్టుమెంటు తరవాతేగా మనం! ఇంకొకటి తీసుకోండి. మా మూడోవాడిపేర ఒక ఫియట్ యెలాటవుతాంది వచ్చే నెలలో. అది తీసుకుని వాడుకోండి. మనం తర్వాత చూసుకుందాం" అని సెక్రటరీని పిలిచి. "మన ఎంబాసిడరులో పంపించు రవిగారిని" అని చెప్పాడు.
    కార్లో కూచుని, తిన్నగా హిమయత్ నగర్ పాత ఎమ్మెల్యే క్వార్టర్సు దగ్గిర దిగాడు రవి. నాలుగడుగులు నడిచి బచ్చు గంగారాం క్వార్టర్సులోకి వెళ్ళాడు. వున్నాడు.
    "రానీ రవీ సాబ్." అని లేచి మర్యాద ఒలకబోస్తూ పిలిచాడు గంగారాం.
    "నా పీకలమీదకి తెచ్చి హాయిగా కూర్చున్నావు నాయనా నువ్వు అన్నాడు రవి.
    "ఏమాయె? యేమి ముచ్చట."
    "ముచ్చటా__ నీ బంధువెవడో వాడి ప్రమోషను ముచ్చట. ఆ రెండోవాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు తాలూకూ మనిషట. వాడి సంగతి నీకు తెలుసుగా? నలుగురు ఆంధ్రా మినిస్టర్లకి తెరవెనక మనిషి."
    "యెట్లనో చెయ్యి. వాండ్లుకూడ నీకు యెరికనే కదా?"
    "నీ మూలంగా యిదంతా వచ్చింది!"
    "సమయమొస్తే తప్పుతాది! మీ సాయిలు గాని కోసం యెన్ని చేస్తలేవు? అవన్నీ సుదరాయించుకొస్తనె వున్నవు గద! యేదన్న జులూస్ తియ్యి. అందరం నీ వెనక వుంటాం. దాన్లపడి యిసుమంటివి చక్కగైపోతవి.
    "యిది ఎమర్జన్సీ సమయం నాయనా గంగారాం!
    "గింతకే ఇట్లవుతారు! అన్ని ఖానూన్ కెల్లి చేస్తే మనమాట యెవరింటరు? మందికి పన్లు చేసిపెట్టాల న్యాయం జరిగేటట్లు. కొందరి బస్తీ లీడర్లకి ఉల్టా సీదా పన్లు కొన్ని చేసిపెట్టకుంటే మరలా మన మొఖం చూడరు. వాండ్లు లఫంగగాండ్లు!"
    "ఇప్పుడేదో చెయ్యాలి ఆలోచించి" అన్నాడు రవి తనలో అనుకున్నట్లుగా.
    "ఆ రావు రిలేటివ్ ని వేరే డిపార్ట్ మెంటుకి పంపి ఆడ యిప్పించు"
    "చెయిన్ రియాక్షన్. మళ్ళీ అక్కడింకో సమస్య రాదూ? ఆ శాల్తీకే నచ్చజెప్పి చూడాలి" అన్నాడు రవి.
    ఇంతకుముందు, ఆ విషయం ఆ మినిష్టరు చూడదలిచినట్లు తనకి బాబీ ఇండస్ట్రీయల కాంప్లెక్స్ గురించి అడిగిన విషయం గుర్తొచ్చింది రవికి. కానీ అది అందరికీ చెప్పకూడదని రవికి తెలుసు.
    ఓ గంటసేపు, రవి తరపున వుండే మరికొందరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకున్నారు.
    రవి బయటికొచ్చి టాక్సీ యెక్కి తిన్నగా సుబ్రహ్మణ్యేశ్వరరావు యింటికి వెళ్ళాడు. సిటీలో అతనికి పెద్ద బంగళా వుంది. రవి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర ఐంది.
    ఆ వేళకి పోర్టికోలో దీపాల కాంతిలో నిలుచుని వున్నారు ముగ్గురు నలుగురు వ్యక్తులు.
    రవిని చూసి, "రండి రండి. దారితప్పి వచ్చినట్లున్నారు" అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
    అతని కూడా నిలుచుని వున్న కడపజిల్లా ఎమ్మెల్యే నాగిరెడ్డి చిత్తూరుజిల్లా ఎమ్మెల్యే మునిసుందరం, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే అప్పలనర్సయ్య పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే పిలకా క్రిష్ణమూర్తి వున్నారు. అందరూ ముందు ఊపులో వున్నారు. డిన్నర్ ముగిసినట్లుంది.
    "అసెంబ్లీ హీరోగారికి స్వాగతం." అన్నారు నలుగురూ ఒకేసారి.
    అంతలో కారు వచ్చి ఆగింది పోర్టికోలో.
    "సరే మీరు పదండి. ఇక్కడికే ఆలస్యం అంది మీకు" అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
    నలుగురూ కూర్చున్నారు. కారు కదిలింది.
    "రండి" అని లోనకి నడిచాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
    పక్కనే డైనింగ్ హాలు. బల్లమీద గ్లాసులు సీసాలు మిగిలివున్న పదార్ఘాల మసాలా ఘాటు.
    "మీరు మందు ముట్టని బుద్ధిమంతులు. మిమ్మల్ని యెట్లా మర్యాద చెయ్యాలో తేలవటం లేదు. ఐ స్క్రీమూ కూల్ డ్రింకూ త్రాగమనటానికి మీరు చిన్నపిల్లలు కాదయ్యే!" అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.  "యీ నా కుర్రనాకొడుకు అసెంబ్లీ కమిటీల్లో__ యెన్నిట్లోనో మెంబరుగా అధ్యక్షుడుగా అయ్యి కూచున్నాడు. పోన్లే మనాడేగా...." అని మనసులో అనుకున్నాడు.
      "ఓ కప్పు టీ నీళ్ళు చాలు" అని చిన్నగా నవ్వి, "మీతో చిన్న పని వుండి వచ్చాను" అన్నాడు రవి.
    "చెప్పండి"
    "ఆ మధ్య నేను చేయించిన ఒక ప్రమోషను వల్ల మీ రిలేటివ్ ఒకరు ఎఫెక్ట్ అయ్యారట__"
    "రిలేటివ్ అయితే పర్లేదు. వేలు విడిచిన మేనమామ నా పీక మీద కూర్చున్నాడు."
    "సెంట్రల్ సర్వీసెస్ లోకి పై పోస్టులో పంపుదాం"
    "పంపటానికి వాళ్ళు తీసుకోవద్దూ?"
    "ఆ విషయం నాకొదలండి."
    అంతలో ట్రే__బిస్కట్లు. కాఫీ.
    "నాకిప్పుడు కాఫీ పనివ్వదు. మీరొక్కరే తీసుకోవాలి. మన్నించండి" అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
    "ఆయన పిల్లల చదువులు కూడా అయిపోయి ఫారిన్ లో వున్నారుగా. ఢిల్లీ అయినా పర్లేదుగా__ కాగా మంచి పోస్టులోకి."
    "మనలో మనకి అదేం పర్లేదు. యెట్లాగో అట్లా సర్దుకోవచ్చు గానీ వచ్చొచ్చి మీరు చేయించిన ప్రమోషను వేరే వెధవకి పోయిందే అని__"
    "పోనీండి. యేదో ఆబ్లిగేషన్ వల్ల చెయ్యాల్సొచ్చింది."
    మరికాసేపు అసెంబ్లీ రాజకీయాలు మాట్లాడి__బయటికి వచ్చాడు రవి. నడుస్తున్నాడు. బుర్రంతా చికాగ్గా వుంది. పని అయితే జరిగిందిగానీ, అతని ఆధిక్యతా భావానికి ఇబ్బందిగా అనిపిస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వరరావు సిటీ లీడర్లని లక్ష్యపెట్టడు.
    చాలాసార్లు అసెంబ్లీలో రవితో తలపడ్డాడు. మినిష్టర్ అయ్యే ఆలోచన కంటే మినిష్టర్లని చెయ్యటమూ, మినిస్ట్రీల నుంచి తప్పించటం వంటి పనులంటే ఆసక్తి యెక్కువ. అలాంటి తెరవెనక గ్రంధం నడుపుతూ కీలకమైన వ్యక్తిగా స్థిరపడ్డాడు. ఆ పైన బాగా ఆస్తిపరుడు, మొదటినుంచీ యిప్పుడు మరింత. అలాంటి వ్యక్తిని తానుగా వెళ్ళి అడగటం బాధగా అనిపిస్తోంది.
    నడుస్తున్నాడు అబిడ్స్ లో.
    తిలక్ రోడ్డువైపుకి తిరిగిన కారు __ నడుపుతూ గంగి. ప్రక్కన యెర్రగా బుర్రగా ఓ యువకుడు.
    రవి గమనించాడు. అప్పుడప్పుడూ అలా సందర్భపడటం జరుగుతూంటుంది.
    ముందుకి అడుగులు వేస్తున్నాడు.
    దుకాణాలు మూసేశారు, జనం రద్దీలేదు. దారిలో పడుకుని వున్న కుక్కని కాలితో తన్నాడు. అది కుయ్ కుయ్ మనుకుంటూ పక్కకి పోయింది. నడుస్తున్నాడు.
    "హలో రవీ."
    రవి తల పక్కకి తిప్పి చూశాడు....వలియుద్దీన్.
    "పెద్ద లీడర్ వి ఐపోయావు మేం కనిపిస్తామా నీ కంటికి" అన్నాడు వలియుద్దీన్.
    "నా కంటికి సామాన్య ప్రజలు కనిపిస్తారు. నా కంటికి కనిపించటం లేదంటే నువ్వు చాలా పెద్దవాడివన్నమాట. మంచి బూర్జువావి ఐపోయి వుండాలి" అన్నాడు రవి.
    "నీ తెలివి అసామాన్యం అని తెలుసుగానీ_రా. టీ తాగుదాం_ చాలాకాలం అయింది కలిసి"




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.