Home » Sumathi Sarangapurkar » Vasudeva Sathakamu
తెలియనట్టివెన్నొ దెలుపుచు మనలకు
గెలుపుబాట నడుపు "గీత" గదర
ఇచ్చి పుచ్చుటకును నిదియె నెంతయొమిన్న
వందనాలు తండ్రి వాసుదేవ. 69
బతుకులోనవచ్చె బాధలకును నీవు
భయము నొందినెపుడు బాధపడకు
బాధ బరువుకాదు బతుకు కర్థమునిచ్చు
వందనాలు తండ్రి వాసుదేవ. 70
నీటిబుడగలాగ నేటిబతుకులయ్యె
వీటికొరకు మీకు వేదనేల ?
ఉన్ననాళ్ళు పరుల కుపయోగపడిసాగు
వందనాలు తండ్రి వాసుదేవ. 71
సుమతి గలిగివున్న సుఖము పొందగలవు
కోటిపాట్లువచ్చు కుమతివలన
మంచి మతియె గదర మరులగొల్పు నిలలొ
వందనాలు తండ్రి వాసుదేవ. 72
పట్టుదలనె నీవు పెట్టుబడిగబెట్టి
చేయు పనులనెపుడు చిన్నవనక
నమ్మకమ్ముతోడ నడచిన గెలిపించు
వందనాలు తండ్రి వాసుదేవ. 73
మనిషి కాభరణము మంచిమనసెగద
అఖిలజనుల కదియు నందదెపుడు
అందినపుడునాడి యలుసుచేయకుదాని
వందనాలు తండ్రి వాసుదేవ. 74
స్వర్గమొచ్చి నిలుచు శాంతమున్నటిచోట
క్రోధమున్నచోట వేదనొచ్చు
సహనమెంతొ కలిగి సాధించు విజయాలు
వందనాలు తండ్రి వాసుదేవ. 75
ఆటలాడునీకు నారోగ్యము గలుగు
పుస్తకమ్ము జదివి పొందు తెలివి
మితముగాను పలుకు మేదిని గెలిచేవు
వందనాలు తండ్రి వాసుదేవ. 76
పెళ్ళిపిలుపులందు పేర్మిలేదూ నేడు
ధనము దర్పమునకు దాసులైరి
తారతమ్యమెపుడు తలచిన తప్పుర
వందనాలు తండ్రి వాసుదేవ. 77
కన్యనిచ్చి నీకు కన్యాదానముజేసి
సంతసమున నీతో సాగనంపు
తండ్రివోలెదలచి తనకు పేర్మినిపంచు
వందనాలు తండ్రి వాసుదేవ. 78
చెంతనున్నవన్ని చేదుగా తలచుచు
అందరానివాటి కాశపడుతు
బాధపడుతు నీవు బతుకరాదు నెపుడు
వందనాలు తండ్రి వాసుదేవ. 79
నిజమదెపుడుకూడ నిప్పులా నుండును
వెరచివేయకెపుడు వెనుకకడుగు
పలికినెపుడు దాన్ని బలపర్చి గెలిపించు
వందనాలు తండ్రి వాసుదేవ. 80
దేశమాతకొరకు దేహమోహమువీడి
చేయు సైనికుడిగ సేవనెంతొ
నిన్నుచూసి మురియు కన్నతల్లియపుడె
వందనాలు తండ్రి వాసుదేవ. 81
అక్షరముల నధిక యందంగ గూర్చిన
కవనమయ్యి నిలుచు కలముచేత
అర్థభావఝరిని యమృతమై పంచదే
వందనాలు తండ్రి వాసుదేవ. 82
తరిగిపోనిదొకటె ధరణిపై జ్ఞానము
అదియె నన్నివేళ నాదుకొనుచు
విలువ తెలుసుకున్న విజయమిచ్చునదియె
వందనాలు తండ్రి వాసుదేవ. 83
హలముపట్టి తాను పొలముపనులు జేసి
కష్టపడుతు మనల కడుపునింపు
అట్టి రైతెరాజు అవనిలో నిజమిది
వందనాలు తండ్రి వాసుదేవ. 84
కాలము చేతబట్టి కవివరుల్ జేసిరి
కవనసేద్యమెంతొ కదలితాము
నీతిబోధజోసె రీతినిలిచెజూడు
వందనాలు తండ్రి వాసుదేవ. 85
కంటిచూపువుండి కాంచడు సత్యాన్ని
పలకవచ్చి మంచి పలుకడెపుడు
అట్టివానికన్న యవిటివాడేమిన్న
వందనాలు తండ్రి వాసుదేవ. 86
కళ్ళు రెండు కలిగి కానడు నిజమును
నాల్గుజగములేలు నాలుకొకటె
కోటిరూకలున్న కొనలేవు మనసును
వందనాలు తండ్రి వాసుదేవ. 87
పకృతియెంతొ మనకు పాఠములనునేర్పు
మనసుపెట్టివిన్న మంచిజరుగు
దానికన్నమిన్న ధరణిలో గురువేది ?
వందనాలు తండ్రి వాసుదేవ. 88