Home » Sumathi Sarangapurkar » Vasudeva Sathakamu
గొప్ప చదువు చదివి మెప్పుపొందినగాని
పరులకెపుడు తెలివి బంచకున్న
ఉంచుకున్ననేమి నుపయోగముండును ?
వందనాలు తండ్రి వాసుదేవ. 53
పరుగుదీయసాగె పాపిధనముగోరి
మంచిపనులుజేయ మరచిపోయె
గుణమెగదర నిలలొ గొప్పవారినిజేయు
వందనాలు తండ్రి వాసుదేవ. 54
తలచుకొనుచు గతము దబ్బిబ్బు జెందకు
రేగు చింతలేల రేపుగూర్చి
వాటినొదిలి నీవు వర్తమానమునుండు
వందనాలు తండ్రి వాసుదేవ. 55
పరుల మేలుకోరి పాటుపడుము నాన్న
మెచ్చుకొనకపోతె నొచ్చుకోకు
తప్పుగదర పనులు మెప్పుకోరీజేయ
వందనాలు తండ్రి వాసుదేవ. 56
పెద్దబాలశిక్ష బేర్మితోడ జదువు
బతుకునేర్పి తాను భవితనిచ్చు
చిందులేస్తు చదువు శిక్షగా దలచకు
వందనాలు తండ్రి వాసుదేవ. 57
విత్తమందె మనిషి చిత్తము నిలుపుచు
మంచి తలపులన్ని మదిలొ చెరచి
ఏడ్చుచుండె నేడు యేకాకిగానిల్చి
వందనాలు తండ్రి వాసుదేవ. 58
చెదలుపురుగు గోడ జీల్చినట్టుగానె
చెడ్డవారి చెలిమి జేటుదెచ్చు
మంచివారి మధ్య మసలి జయమునొందు
వందనాలు తండ్రి వాసుదేవ. 59
తరతరములనుండి తరుణి వెతలుజూడు
మగువ నుదుటిరాత మారబోద !
వెతలుదీర్చి నీవు వేల్పువై నిలువరా !
వందనాలు తండ్రి వాసుదేవ. 60
మార్పువచ్చిచేరె మనిషి బతుకులోన
మనసు మూగబోయె మాటలేక
కఠినమైరి జనులు కాలమహిమెగాద !
వందనాలు తండ్రి వాసుదేవ. 61
మట్టివిలువకూడ మనిషితో మారును
వ్యర్థమంటులేదు వసుధయందు
విలువ తెలుసుకోని విశ్వంబునేలరా...
వందనాలు తండ్రి వాసుదేవ. 62
తలుపుతట్టి వచ్చు గెలుపునెపుడుకూడ
ఇష్టపడుతు చదువు కష్టమనక
నిజము చేయు కలలు నేస్తమా ! శ్రమియించి
వందనాలు తండ్రి వాసుదేవ. 63
తీపి తలపులైన దీరని బాధైన
మనసు పొరలొనిల్చు మనిషికెపుడు
కాగితమ్ముపైన గానరానివెన్నొ
వందనాలు తండ్రి వాసుదేవ. 64
బతుకుదెరవుజూపి పాత సామానెంతొ
పనికిరానిదయిన పసిడియయ్యి
పేదవారికెంత పెట్టసాగెను తిండి
వందనాలు తండ్రి వాసుదేవ. 65
మధురమైన రుచులు మానవుండు మరచి
హానిగలిగెవాటి నతను గోరి
తెచ్చుకొనుచునుండె దెలియని జబ్బులు
వందనాలు తండ్రి వాసుదేవ. 66
సంపదెపుడుకూడ శాశ్వతమనుకోకు
తెలివి గలిగివుంటె గలిమివచ్చు
నమ్ముకొనుచు నడువు వమ్ము జేయదు నిన్ను
వందనాలు తండ్రి వాసుదేవ. 67
పంచదారవోలె బలుకులు పలికినా
మనుసునిండ నెంతొ మలినముండు
మనసు మలినమెరిగి మసలుకోవలెనీవు
వందనాలు తండ్రి వాసుదేవ. 68