Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                   శ్రీ వేంకటావధాని, దివాకర్ల

    చైనా దురాక్రమణము

    బహు విధ త్యాగ ఫలముగా ప్రాప్తమైన
    దేశము స్వతంత్రతకు పెద్ద దెబ్బ తీయ
    దాపురించెను చైనీయ దండయాత్ర
    మొగిలు లేకుండ పడు పిట్టపిడుగువోలె.

    ఎన్నో కష్టములన్ భరించి జనయి
        త్రీ దాస్యబంధమ్ములన్
    ఛిన్నంబుల్ పొనరించి భారతజనా
        నీకంబు స్వాతంత్ర్య సం
    పన్నంబై క్రమరీతి నభ్యుదయ శో
        భం బొందుటం గన్గొనన్
    గన్నుల్ కుట్టిన వక్కటా! కుటిల చై    
        నా నాయక శ్రేణికిన్

    ప్రాణంబుల్ వెలపెట్టి కొన్న విలస    
        త్స్వాతంత్ర్య భండార మీ
    చైనా సైన్య భుజావ లేప దహన
        జ్వాలేంధన ప్రాయమై
    పోనుండంగ నిఁకేల నశ్వర ధనం
        బుల్ భర్మముల్ ప్రాణముల్
    పూనుండాహవ దీక్ష శత్రు నివహం
        బుం జీల్చి చెండాడఁగన్

    సత్య మహింస యన్ ప్రథిత
        సత్త్వ గుణంబులు నిక్క మార్య సం
    స్తుత్యము లౌను కాని గుణ
        శూన్యు లెడాటమునన్ ఫలింప వౌ
    చిత్యము వీడి ద్రోహ మతి
        చెట్ట దలంచెడి ధూర్తపాళి యౌ
    ద్ధత్యము సాహసంబున హ
        తం బొనరించుట నీతి యయ్యెడున్

    క్రూర విధుంతుద గ్రసన
        కుంఠిత మౌ విధుబింబ మట్లు దృ
    ప్తారుల బారి కగ్గమయి
        హావళి చెందెడి దేశమంతయున్
    భూరి భుజా పరాక్రమ స
        ముద్ధతిఁ జూపినఁ గాని నిల్పుకో
    నేరము దీర్ఘకాల మహ
        నీయ తపఃఫలమౌ స్వరాజ్యమున్
    
    ఇది మన జాతికంతకు ప
        రీక్ష యగుం బరిపంథి వాహినీ
    మద మడఁగించి వైజయ ర
        మా శుభ సంగతి పెంపు గాంచుటో
    పొదిగొను దుర్యశః పటల
        మున్ భరియింపక మున్న ప్రాణముల్
    కదనమునందు వీడి దివి
        గాంచుటొ యొక్కటి తేలిపోవలెన్

    కలయం బాఱుచునుండె శీతగిరి గం
        గా బ్రహ్మపుత్రానదీ
    సలిలోర్మి ప్రచయంబుతోడ జననీ
        స్వాతంత్ర్య సంరక్షణో
    జ్జ్వల దీక్షా ప్రచల త్సహోదర కవో
        ష్ణ స్ఫార రక్తాపగల్
    ప్రళయం బింతకు మించి కల్గునె రణ
        ప్రారంభులై లెండికన్

    కులభేదంబులు వర్ణభేదములు దు
        ష్కోపంబులున్ నాశకృత్
    స్థలభేదంబులు పక్ష భేదములు సం
        త్యక్తంబులం జేయుచున్
    బలగర్వోద్ధత వైరి వర్గముల మా
        పంగూడి యేకమ్ముగా
    వెలయింపుండు సమైక్య భారత లస
        ద్వీరస్ఫురదూపమున్

    ఆగినట్లె యుండి యదరి పైకొనవత్తు
    రాగకున్న నింద లాడుచుందు
    రరులనెప్డు హృదయమార నమ్ముట కూడ
    దుఱక మోసపుచ్చు చంద్రు కాన.

    పడమటి దేశముల్ మనకు
        బాసట యై నిలిచెన్, స్వధర్మ ని
    ష్ఠుఁడు జవహర్ ప్రధాని యరి
        సూదన మార్గ గవేషణంబునం
    గడు నిపుణుండు, ధర్మమె స
        కం బెసఁగున్ మన పక్ష మంద, చే
    పడు భరతోర్వికే జయ శు
        భం బనుమానము పొంద నేటికిన్?

                                               *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.