Home » vaddera chandidas » Anukshanikam 2



    "ఐ హ్యాడ్ లీస్ట్ ఐడియా అంటిల్ ఐ బికేమ్ ప్రెగ్నెంట్" అంది గాయత్రి.
    "నాకు ఆ అవకాశం కూడా లేదు. మగవాణ్నై పుట్టిన శాపానికి!" అని నవ్వాడు శ్రీపతి.
    "యీ సమాజంలో మగగా పుట్టటం శాపం కాదు." అంది.
    "సమాజం మాట కాదు. మాతృ సహజాతం గురించి. మగకి అదిలుప్తం కదా! ఐతే పితృసహజాతం పర్యాయంగా వుందనుకో" అని మోహన్ రెడ్డివంక చూసి, "సెంటిమెంట్లనైతే నరికేసెయ్యగలుగుతున్నారు కొందరు. కానీ సహజాతాలను పెకిలించేసెయ్యలేకపొతున్నారు. ఫ్యామిలీ కూడా ఆస్తి లాంటిదే. ఆస్తి సవాలక్ష రూపాల్లో వుంటుంది. ఆఖరికి తాను అల్లుకున్న భావనో సిద్ధాంతమో కూడా ఆస్తిలాంటిదే. మార్క్సు రుషి దర్శించిన మహా ఆదర్శ అవ్యవస్థ యిప్పటివరకు జరగలేదు. జరిగే సూచనలూ కానరావటం లేదు. సాధ్యం అంటారూ__శుభం" అన్నాడు శ్రీపతి.
    "అది చారిత్రక అనివార్యత. గతితార్కిక ప్రగతి గమ్యం" అన్నాడు మోహన్ రెడ్డి.
    "బ్రిటీష్ మ్యూజియం లైబ్రరీలోని పుస్తకాల పురుగు మార్క్సు ఒక తీగపట్టుకుని పాక్కుంటూ వెళ్ళాడు కొసకంటా. శ్రమ, దోపిడీ, అన్యాయాలు, అక్రమాలు, అసమానతలు వంటి వాటి ఆధారంగా అక్కడికే చేరక్కరలేదు. యింకా చాలా తీగలున్నాయి. ఒక్కో తీగ పట్టుకుంటే ఒక్కోచోటుకి వెళతాం. మళ్ళీ ఆ చోటులన్నీ యెక్కడి కెడతాయి? చరిత్ర గతి తార్కికమూ కాదు మతి తార్కికమూ కాదు వర్తులమూ కాదు పురోగమనమూ కాదు తిరోగమనమూ కాదు. చూడగా, అడ్డదిడ్డంగా అన్నిపక్కలకీ గమనిస్తున్నట్లనిపిస్తుంది.
    అలా అని పూర్తిగా అడ్డదిడ్డంగా అనిపించదు. ఆ అన్నివైపుల ఆ అడ్డదిడ్డపు చిక్కురొక్కురు గమింపులో యేదో లయబద్ధ రతింపు వున్నట్లనిపిస్తుంది. ఆ సంకీర్ణ సంక్లిష్ట సూత్ర రహస్యం గానీ చిక్కితే యేదిగానీ యిట్టే మీట నొక్కి అనుకున్న క్రమంలో నడిపించవచ్చు. కానీ అప్పుడు చారిత్రకత యెంత చులకనైపోయి వుండునో! అలా అని చారిత్రకతలోకి తాను లొంగిపోవాలనేమీ లేదు. తనకి తాను లొంగిపోతేగా, చారిత్రకతకో దేనికో లొంగిపోవటానికి! కానీ మన గాయత్రి మాతృ సహజాతానికి లొంగిపోతుంది. వైప్లవ్య గాయత్రి దాన్ని అధిగమించాలి. యిలా ఐతే యెలా గాయత్రీ! మోహన్ రెడ్డి నీ వేదనని చూసి నీకంటే యెక్కువ వేదన చెందుతున్నాడు. అతనిది గాయత్రి వేదన. నీది అరుణ వేదన. అతని వేదన నీ వేదన మీద ఆధారపడి వుంది. నువ్వు నీ వేదననని అధిగమించితే యిద్దరి వేదనలూ ఎగిరిపోతాయి. వస్తా భోజనాల వేళ." అని లేచాడు శ్రీపతి.
    "భోజనాల వేళ కాబట్టే వస్తా అనకండి, వుండండి." అంది గాయత్రి.
    మోహన్ రెడ్డి, శ్రీపతి చెయ్యి పట్టుకుని లేచి కూచుంటూ, "యీ పొద్దు చికెన్ ఫ్రై" అని కూచోబెట్టాడు.
    "బాగోకపోతే నన్ను అనొద్దు యివాళ వంటంతా మీ మోహనుడే చేశాడు" అంది.
    "భోజనం ఇద్దరకే వుంటుందని తెలుసు. నే వెళ్ళకపోతే హోటలువాడు పాపం__"
    "ఆ భోజనం యింకొకడికి పెట్టి మరికాస్త సంపాదిస్తాడు__ పోనీ, వాళ్ళ పని అదేగా_" అన్నాడు మోహన్ రెడ్డి.
    "సరే. బ్రెడ్డు వుందా మరి? అది జతచేస్తే సరిపోతుంది" అన్నాడు శ్రీపతి.
    "అన్నీ వున్నాయి. మీరు తప్పించుకోటానికి లేదు. చాలారోజులైంది మీరు మా యింట్లో భోంచేసి. ముగ్గురం కలిసి చేద్దాం." అంది గాయత్రి లోనకి వెళుతూ.
    "నువ్వు ఏం చేస్తున్నావు పత్రిక పని వదిలేశావట కదా?" అన్నాడు మోహన్ రెడ్డి.
    "ఎమర్జెన్సీలో పత్రిక పనేమిటి! ఎమర్జన్సీలో ఏ పనీ చెయ్యకూడదు. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా అంతే. అది ఎమర్జెన్సీ లక్షణం. ఎమర్జన్సీ రాణి యేం చెబితే అది చెయ్యాలి. నాకింకా ఏమీ చెప్పనందున ఏమీ చెయ్యటం లేదు" అని. "గాయత్రీ భోజనం యేర్పాటుకి తోడుగా వస్తున్నాను." అంటూ లేచాడు శ్రీపతి.
    "రండి. ఆ బద్ధకం రెడ్డిగారు యీ గదంతా నానా చిక్కురొక్కురు చేశారు. మీరింతకు ముందు చెప్పిన చరిత్ర పాఠంకంటే కూడా చిక్కురొక్కురుగా వుందంటే నమ్మండి, కానీ వారి చికెన్ పకాయింపు ఘాటు బావుంది. నాకే నోరూరుతోంది." అంది గాయత్రి లోపల్నుంచి.
    అప్పటికే__శ్రీపతీ, అతనికూడా మోహన్ రెడ్డీ లోనకి వెళ్ళారు.  

                                                  89

    రవి అసెంబ్లీకి ఎన్నికై యేడాది దాటింది. మొదట్లో అతనిని యెవరూ పట్టించుకోలేదు.
    ఎమ్మెల్యేలలో యెక్కువమంది శుంఠలుగా అనిపించారు. వాళ్ళకేం తెలియదనిపించింది. వీళ్ళు చేతులెత్తటానికి తప్ప మరెందుకూ పనికి రారనిపించింది. మంత్రులలోనూ చాలామంది అలాగే అనిపించారు.
    యీ శుంఠల మధ్య యీ మూర్ఖుల మధ్య తను అంత అనామకంగా వుండటం సహించలేనితనంగా అనిపించింది. యెన్నో నిర్దేశిస్తూ ప్రత్యేకంగా కనిపించే మినిస్టర్ల కుర్చీలు అతని కళ్ళలో నిలిచిపోయాయి.
    అతను యేదైనా అడగాలన్నా వీలుండదు. అడిగినా పట్టించుకోరు. మండుకొచ్చి ఎడాపెడా అరవటం మొదలెట్టాడు. ముందు అరవటం అవసరం. ఆ తరవాత తెలివి అవసరం అని గమనించాడు.
    తను అడిగే ప్రశ్నలకి మంత్రులు చెప్పే సమాధానాలతో తృప్తిపడక వివరాలు అడిగితే, తమ దగ్గిరున్న సమాధానం మేరకే చెప్పగలం అని మంత్రులు అంటే, "సెక్రటరీలు అందించింది తప్ప తమ సొంతంగా యేమీ తెలియదన్నమాట! అట్లాంటప్పుడు మంత్రులెందుకు సెక్రటరీలే కుర్చీలో కూర్చుంటే పోతుందిగా" అని గొడవలోకి దిగి కొందరు మంత్రులతో తమ శాఖలకి సంబంధించిన విషయ పరిజ్ఞానం తమకి లేదనిచెప్పింది_ ఏ శాఖ నిర్వహించే మంత్రికి ఆ విషయం గురించిన కనీస జ్ఞానం వుండాలి. అట్లా లేకపోవటం వేలిముద్ర మంత్రిత్వం. అది మహా నేరం అంటూనే స్పీకర్ మందలింపులు స్వీకరిస్తూ అరుస్తూ గొడవ గొడవ చేస్తూ అసెంబ్లీ లోపలా__




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.