Home » vaddera chandidas » Anukshanikam 2



    ఆఖరి సంవత్సరం పరిక్షలు దగ్గిరపడుతున్నా గాయత్రి మనసులా పుస్తకాలలో లగ్నమవటం లేదు. పుస్తకం తెరిచి ఓ పేజీ చదివేసరికి మనసు చెదిరి అరుణ మీదికి పోతుంది. పుస్తకం తెరవకపోతే మనసు అరుణ మీదే వుంటుంది.
    ఒక్కోసారి వాళ్ళమ్మ దగ్గిరికి వెళ్ళి కూచొని వస్తుంది. ఆ రోజు వెళ్ళినప్పుడు తల్లి కళ్ళు సంతోషం పట్టలేక నీళ్ళతో నిండిపోయాయి. మరి కాసేపటికి వచ్చి చూసిన తండ్రికి సంతృప్తిగా అనిపించింది. తమ్ముడూ_ చెల్లెలూ సంబరపడిపోయారు. వాళ్ళిద్దరూ ఇంతకుముందు అప్పుడప్పుడు వచ్చి గాయత్రిని చూసి వెళుతూండేవాళ్ళు.
    ఆమె మనసుని అరుణమీంచి పూర్తిగా మళ్ళించటం యెలాగో తెలియటంలేదు మోహన్ రెడ్డికి. అతనికి తెలిసిందల్లా విరసం గురించి, అందులో కొందరిని గురించి, మార్క్సిజం, కేపటలిజం వివిధ జాతీయ అంతర్జాతీయ సమస్యల గురించి. రాష్ట్రంలోని సంగతుల గురించి మాట్లాడుతూ మరపించటం. ఆ కాసేపూ మర్చిపోతుంది. యెంతసేపు! మేలుకున్నంతసేపూ. యివేమీ లేనప్పుడు అరుణ ధ్యాసే. నిద్దట్లోనూ అదే ధ్యాస.
    అరుణ అనేకాదు. పోయిన అరుణ, ఒక అదృశ్య శక్తిలా తనని తనలోకి గుంజుతుంది. గర్భంలో హృదయంలో స్తనాలలో యేదో సంచలనం, నరాలలో ప్రవహించే నెత్తుట్లో జలజలమని జాల్వారే మెత్తని సవ్వడి.... కళ్ళలో చెమ్మగా పెల్లుబుకుతుంది ఆవేదన. మాతృ వేదన. గాయత్రి ఉడికిన రాగి తమలపాకులా అయిపోతుంది.
    ఆర్నెలాగే అని మోహన్ రెడ్డి అంటే.... ఆర్నెల్లేవట, ప్రసవించి యేడాది _ అంటుంది. డాక్టర్లకి చూపెట్టుకున్నారు. అండోత్పత్తి, అతని వీర్యంలో బీజకణాలు చాలాసార్లు వుండటం లేదని తేలింది. అంచేత తొందర పడితే కాదు_ అసలుకి సాధ్యమే _యెప్పుడో జరుగుతుంది_ అన్నారు.
    గంటనుంచి లా పుస్తకంలో మునిగివున్న మోహన్ రెడ్డి తలపక్కకి తిప్పి చూస్తే_కుర్చీలో కూచుని టేబుల్ మీది అరుణ ఫొటోలోకి చూస్తూండటం గమనించాడు.
    ఆమెని చూస్తూ__
    ఐదు నిమిషాలు అలాగే చూస్తుండిపోయింది.
    ఒకసారి ఆ ఫొటో తీసి దాచేశాడు.
    గమనించి, "మోహన్, ఫొటో తీసి అక్కడ పెట్టు" అంది. గొంతు ఎంతో తీక్షణంగానూ కఠినంగానూ వుంది.
    "ఏ ఫొటో?" అన్నాడు చిన్నగా.
    యీసారి తీక్షణంగా కఠినంగా నిశ్శబ్దంగా చూసింది.
    వంట గదిలోకి వెళ్ళి తెచ్చి బల్లమీద పెట్టాడు. ఆ వుదయం తీసి వంటగదిలో యెక్కడో దాచాడు.
    "ఆ అరుణ మన దగ్గిరే మనలోనే వుంది." అని మోహన్ రెడ్డి అంటే, "లేదు. అరుణ అరణ్యాలలోకి వెళ్ళిపోయింది. ముక్కుమూసుకుని కొంగ జపం చేసుకునే అరణ్యాలలోకి కాదు. నిప్పులు చెరిగే అరుణోదయపుటడవుల్లోకి కబుర్లూ కాకరకాయల మనల్నందర్నీ పరిహసిస్తూ వెళ్ళిపోయింది" అంది.
    మరో ఐదు నిమిషాలు చూశాడు.
    గాయత్రి అలా చూస్తూనే వుండిపోయింది.
    మోహన్ రెడ్డికి భయంగా అనిపించి, "గాయత్రీ ఓ పసిపాపని పెంచుకుందామా?" అన్నాడు.
    "దేశంలోని పాపలందరూ నా పాపలే. అలా కాదు నాలోని నా నెత్తుట్లోని అరుణ అరుణోదయంలా అరుణ మార్గంలా కాంతిరేఖలా నాకేదో చూపే నా అరుణ కావాలి." అంది.
    "కొన్నాళ్ళు ఓపికపట్టు. అదే జరుగుతుంది. నువ్వు మరీ ఇదవుతున్నావు. నాకు లేదేం అంత యిది?" అన్నాడు.
    "నువ్వు మనిషివి కాదేమో__" అంది.
    "ఆ ఫీలింగ్ లేనివాళ్ళంతా మనుషులు కాదంటావా? శ్రీపతిని అడిగితే యేమంటాడో__"
    "శ్రీపతి ఏమనేది చెప్పటానికి శ్రీపతే సిద్ధంగా వున్నాడు" అంటూ చక్కా గుమ్మం లోపలికి వచ్చాడు శ్రీపతి.
    సంతోషంగా తనవైపు చూసిన ఇద్దరివంకా చూస్తూ, "నేను గుమ్మంలోకి వచ్చేసరికి మోహనుడు నా శుభనామం ఉచ్చరించటం విన్నాను. అంతకు పూర్వ గ్రంథం మరి తెలియదు" అని చిన్నగా నవ్వాడు శ్రీపతి.
    వెళ్ళి మంచం అంచుమీద కూచున్నాడు, మంచంమీద యిటుపక్కకి తిరిగి పడుకునివున్న మోహన్ రెడ్డి భుజంమీద చెయ్యివేస్తూ.
    "మామూలు గొడవే. అరుణ. గాయత్రిని ఏం చెయ్యాల్నో తోచటంలేదు శ్రీపతీ! యెంతసేపూ ఆ ఫొటోలోకి చూస్తూనో, కళ్ళు మూసుకుని తలుచుకుంటూనో_యిప్పుడే అన్నాను మరీ అంత యిదిగా ఫీలవకూడదని; యేమన్నదో తెలుసా, నేను మనిషిని కానట. నాకు మాతృభావన లేకపో__"
    "నీకు మాతృభావనేమిటోయ్__పితృభావన."
    "వుండటం సహజం కాదంటారా చెప్పండి శ్రీపతిగారూ" అంది.
    "సహజం. మహా సహజం_సంధి వుందని విడదీసి మహా అసహజం చెయ్యక్కర్లేదు. మన చక్కని తెలుగు భాషలో వున్న సందుల తికమక సౌలభ్యం యిది. ప్లేటో కమ్యూనిజంలో యూజెనిక్స్ అంటూ చాలా రాశాడు. పెళ్ళీ పెటాకులూ, ఆమాటకొస్తే స్త్రీ పొందూ లేనివాడు అతగాడికేం తెలుసు బిడ్డల సంగతి!" అన్నాడు శ్రీపతి.
    "వుండాలనేమిటి? నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఆ భావనే లేదసలు. నాలుగేళ్ళ క్రితం ఒకసారి వూళ్ళో మా తమ్ముడు ఒక సందర్భంలో__'దేవుడ్ని నమ్మవు నువ్వు మనిషివికావా?' అని అడిగాడు" అన్నాడు మోహన్ రెడ్డి.
    "దేవుణ్నయితే నేనూ నమ్మను. యిది నమ్మటం గురించి కాదు. నెత్తుట్లోని స్పందన" అంది గాయత్రి.
    చెప్పమన్నట్లు శ్రీపతివంక చూశాడు మోహన్ రెడ్డి.
    "ఆదిమ కమ్యూనిజం కూడా అంతగా ఆదిమం కాదు. ఆదిమ కమ్యూనిజం కూడా ఒక వ్యవస్థే. అంతకంటే ముందు తొలి మానవులు, పూర్తిగా మానవుల్లా అవకముందు, ఆకలీ సెక్సూ దాహం లాంటి వాటిని ఆ క్షణంలో తీర్చేసుకుని ఆ తరవాత దాని తాలూకు ఏమీ వుండకపోయిన స్థితి కానీ పశు పక్ష్యాదుల్లో కూడా దానికి ముందు వెనక వుంది. ప్రతి సహజత్వానికి ముందు వెనక గొళ్ళెం లింకు. గాయత్రి యీ సహజత్వాన్ని ఒప్పుకుంటే అదే లెక్కని ఎక్విజిషన్ వీ పొపెసివ్ నెస్ నీ ఒప్పుకోకతప్పదు. ఆ మాటకొస్తే ఫ్యామిలీ అనేది ఎక్విజిషన్ లెక్కకే వస్తుంది. ఒకలాంటి ఆస్తి తనదనే తనకు ఒక ఆస్థిలాంటిది_అందుకే మార్క్స్ యెంగెల్స్ మార్క్సిజంలోకి ఫ్యామిలీకి చోటు పెట్టాల్సొచ్చింది. వెనకటి గ్రీకు బానిసకి తన బానిసత్వం స్పృహ లేనేలేదు. ఆ స్పృహ కలిగి, చైతన్యవంతం అయ్యాకకదా తిరగబడింది. అలాగే మాతృ సహజాతం. కొందరికి ముందుగానే అనిపిస్తుంది__పెరిగిన వాతావరణమో ఇతరాంశాల కారణంగానో. కొందరికి సాక్షాత్తూ గర్భవతి అయ్యేవరకూ తెలియదు_"




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.