Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ రంగాచార్యులు, బృందావనం
విజయరథం
చెలిమిగోరి చెయిజాచిన
స్నేహితునకె విద్రోహం-
విశ్వశాంతి నభిలషించు
వీరకోటి కపకారం-
కాలదోష మంటిందట
మెక్ మోహన్ గీతకు
మంచుమల ప్రతిధ్వనించె
మరఫిరంగి మ్రోతకు
దయమాలిన దానవగణ
తాండవ సంరంభం
అహంకృతికి చిహ్నముగా
అంధుని విజృంభణం
హిమాలయము చలించింది
సమాధాన మిస్తుంది
అంతిమ విజయాన్ని ధర్మ
మందుకొని హసిస్తుంది.
ఇంటింటా జయగీతులు
ఘంటారావములు
వాడవాడలా సువర్ణ
వర్షమ్ముల ధారలు
ధర్మవీర సముద్ధతికి
తథ్యము జయమ్మురా!
కర్మభూమి నడుగిడుచో
ఖాయ మపజయమ్మురా!
ప్రత్యర్థుల నెదిరించి
ప్రత్యంగుళ మాక్రమించి
భరతమాతృ వందనం
నెరపును మన వీరగణం
మనదే ఆ విజయరథం!
కనవోయీ నవపథం!
* * * *





