Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ రంగాచార్య, దాశరథి
పొంగరా జలధివై
మంచుకొండను మ్రింగ
వచ్చిందిరా చైన
కంచు కోటను కూల్చ
పొంచిందిరా చైన
పెంచరా నీ శక్తి
మించరా పగవాని
రగిలించరా అగ్గి
గుండెలో బండలో
వెలిగించరా జ్యోతి
చీల్చరా చీకట్లు
పట్టరా ఆయుధము
కట్టరా నడుము
పూనరా రౌద్రమున్
మానరా శమము
ఎత్తరా నీ జండ
ఒత్తరా శంఖమ్ము
పొంగరా జలధివై
మ్రింగరా అరుల
నింగిలో అశనివై
కూల్చరా గిరుల
ఈ నేల, ఈ రాలు
ఈ గనులు నీవిరా
ఈ నదులు, ఈ చేలు
ఈ శోభ నీవిరా
నీ తల్లి నెవ్వడో
చెరచగా వచ్చెరా
నీ ఇంటి నెవ్వడో
దోచగా వచ్చెరా
ఉరకరా తరుమరా
నరకరా వాని
త్రుంచరా పగవాని
పిండుల న్బెండురా
పెరుగరా పొంగరా
ఉరమరా శూర
రుద్రరూపము దాల్చి
దుమకరా పోర
నిగ్రహము చాలురా
నింగినే చీల్చరా
ఆగ్రహము పూనరా
మ్రుచ్చులం గూల్చరా!
* * * *





