Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ భాస్కరరావు, టి.
ఎవ్వడురా?
శివుడుండెడి కొండలపై
దవానలము ముట్టించిన దెవ్వడురా?
నిదురపోవు సింగంబును
బెదరగొట్టి తట్టిలేపె నెవ్వడురా?
పిరికితనము రుచి యెరుగని
భరతజాతి నదలించెడి దెవ్వడురా?
హద్దుదాటి యిరుగు పొరుగు
పెద్దలతో గ్రుద్దులాడు నెవ్వడురా?
ఉవ్వెత్తున గాలిమేసి
క్రొవ్వెక్కిన కొండచిలువ యెవ్వడురా?
రువ్వి రువ్వి కొమ్ము విసరి
చివ్వకు కాల్దవ్వు పసర మెవ్వడురా?
ఎవ్వని మాటేని వినక
నవ్వుల పాలైన కోతి యెవ్వడురా?
తనకోసమె తనగోతికి
కనుగానక త్రవ్వుకొన్న దెవ్వడురా?
ఎవ్వడైన నేమి, వాని
క్రొవ్వు కాచి కరిగించుట కర్తవ్యము!
ఎవ్వడైననేమి, వాని
త్రవ్వి పూడ్చి పెట్టించుట కర్తవ్యము!
* * * *





