Home » vaddera chandidas » Anukshanikam 2



    "నువ్విట్లా మాట్లాడుతుంటే శ్రీపతి మాట్లాడుతున్నట్లుగా వుంది" అన్నాడు.
    "యెప్పుడో అతని దగ్గిరే వినివుంటానేమో"
    "శ్రీపతి ఆలోచనా అవగాహనా అపారం" అన్నాడు.
    "శ్రీపతిగారు దిగకుండానే లోతు గ్రహించి ఫీలయ్యి అనుభూతిస్తారు. దిగి లోతు అనుభవించి ఐక్యమయ్యే స్వభావం కాదు. అనుభూతిలోంచి అనుభవం రాదు. అనుభవం, అనుభవంలోంచే వస్తుంది. యిదికూడా అతని మాటలలోంచే గ్రహించానేమో__"
    "స్వప్నా"
    "వూఁ"
    "స్వప్నా"
    "వూఁ"
    "నా కారణంగా నువ్వు అన్యాయంగా__"
    మధ్యలోనే అందుకుని, "ఆ పాత విషయం దేనికి? లోకం కారణంగానో. యెవరి కారణంగానో, ఆఖరికి మీ కారణంగానో కాదు. నా కారణంగా అనంత విశ్వపరిధిలోని నా వునికి నాకు వొకానొక అనంత పరిధిలోంచి ఆకళింపుకి వచ్చింది. ఆ అనుభూతినీ ఆ అనుభవాన్నీ అధిగమించలేను. అధిగమించితే అనంత విశ్వపరిధి నా జీవన వలయం అవుతుంది" అంది.
    "నువ్వు చెప్తున్నది యెంతగా అర్ధమవటం లేదంటే యెంతో బాగా అర్ధమైపోయినట్లుగా అనిపిస్తున్నది. తమాషా కదా?" అన్నాడు.
    "అంతకంటే తమాషా ఏమిటంటే. నేను చెబుతున్నది నాకు అసలుకే అర్ధమవటం లేదు. యెలా చెబుతున్నానో యెందుకు చెబుతున్నానో నాకే తెలియదు. అదేదో బయటికి వెలువడిన లోలోపలి సవ్వడేమో" అంది.
    అతను లేచి ఆమె చెయ్యి అందుకున్నాడు.
    నడుస్తున్నారు__ అనంత్ రెడ్డి స్వప్నరాగలీనలు.
    ఇల్లు. భోజనం. పడక.
    నిద్రపట్టటంలేదు ఇద్దరికీ. నిద్రపట్టించుకోవాలంటే __
    నిద్రలేకుండా పడుకున్నారు మంచంమీద అటొకరు ఇటొకరు.
    రెండు గంటలు.
    అతనికి కునుకు పట్టింది.
    __అతనిలోంచి నిద్రపోగల తన లోలోతుల నిద్రలేమితో భాషలేని భావాల కలవరింతల తను లేని నేను లేని నేను లేని తను లేని తను లేని నేను చిటికెడు సహారా మంచుమైళ్ళ వుగ్గిన్నెడు నగరాల వగరుధ్వనుల వొంటరితనపు పాతిక పచ్చని గుండెల జానెడు పులుపు చేతుల చెమ రెక్కల శూన్యపు గుప్పెడు మెరుపు తీగెల చేదు మణుగుల కళ్ళ శిరోజాల నిశ్శబ్దపు సోలెడు మనసుల కౌగిలింతల కడివెడు మట్టి చెవుల దాహపు చిరిగిన ఆకాశాల ఉప్పు నీళ్ళ బిగిసిన లాలిత్యాల నల్లని పరిమళపు కోసెడు కండరాల రాగాల పగిలిన చల్లని తీపి సౌందర్యపు తెల్లని ఐశ్వర్యపు నెత్తుటి లోతుల పెదాల బండెడు రసరాగపు కుంచెడు శరీరాల నవ్వుల చంకల కలల సంధ్య గర్భస్రావాల వూదా అనురాగపు గరుకునిద్ర నిరీహమైనం పుల్లల కత్తుల దారాల శోభనాల పాషాణవీధుల ఆవేదనల సముద్రాల తొడల బుట్టెడు యిసక ప్రవాహాల చీలిక దాహాల నాలుకల అనంత నిష్క్రమణల........
    దొంతర రాత్రుల కలత నిద్రలోకి నిష్క్రమిస్తుంది. ప్రతి నిత్యమూ మేల్కొలిపే ఉషస్సంధ్యని స్నిగ్ధనగ్న మానసంతో ఆహ్వానిస్తూ.
    అలా ఆహ్వానించి, లేచి: తన సన్నని పొడవాటి వేళ్ళతో అనంత్ రెడ్డి చెంపలను స్పర్శించి నిద్ర మేల్కొలుపుతుంది స్వప్నరాగలీన.

                              120

    మాక్స్ ముల్లర్ భవన్ లో శ్రీపతి వేసిన చిత్రలేఖనాల ప్రదర్శన.
    ఒకరోజు శ్రీపతి గదిలో, చేతులోంచి జారి గచ్చుమీద దొర్లి వో మూలకి పోయిన యాభయ్ పైసల బిళ్ళకోసం రామ్మూర్తి, బట్టలస్టాండు వెనక్కి దూరినప్పుడు పెద్ద కాగితాల చుట్ట కనిపిస్తే_
    "యీ కాగితాల సిలిండరేమిటి శ్రీపతీ" అని అంటే; "అది నా అత్యయిక స్థితికాలంలోని వ్యాపకం. రంగుల గీతల మరకలు. చూస్తే జడుసుకుంటావు. మీ ఆవిడ బాబాల విభూతి కోసం వెళ్ళాల్సొస్తుంది" అన్నాడు శ్రీపతి.
    "చెప్పావుకాదేం!" అని ఆ కట్ట ఇవతలకి లాగి, బూట్లు తుడిచే బనియను బట్టతో దుమ్మూ బూజూ దులిపి కట్ట విప్పాడు. చూసి విస్తుపోయి "యింత గొప్పగా పెయింటింగ్ చేసి_" అని అంటూంటే మధ్యలోనే ఆపి "కొయ్యకు రామ్మూర్తీ. నీకు పెయింటింగ్ గురించి యెంత తెలుసో నాకు తెలుసుగా!" అన్నాడు శ్రీపతి.
    "అని నీకు తెలుసునని తెలిసిన నేను__ అందునా నీ దగ్గిర కొయ్యడమా? యెంతమాట! కానీ యేమీ తెలియకపోయినా ఇవేవో గొప్పగా వున్నావని మాత్రం తెలుస్తోంది." అని వాటిని భద్రంగా చుట్టముట్టి వచ్చి కుర్చీలో కూర్చుని, "వీటిని ప్రదర్శిద్దాం, వన్ మ్యాన్ షో" అన్నాడు రామ్మూర్తి.
    "వన్ మ్యాన్ షో రాణించదోయ్. టూ మెన్ షో ఐతే హోమోగానూ టూ విమెన్ షో ఐతే లెస్బియన్ గానూ, వన్ మ్యాన్ వన్ వుమన్ షో ఐతే ప్రోజాయిక్ పొయిట్రీగా పొయిటిక్ ప్రోజ్ గా వుంటుంది" అని నవ్వాడు శ్రీపతి.
    రామ్మూర్తికి మాక్స్ ముల్లర్ భవన్ లో వొక వ్యక్తి తెలుసు తన వెనకటి వుద్యోగమప్పుడు. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని వెళ్ళి తను యిప్పుడు ఏంచేస్తున్నదీ చెప్పి శ్రీపతి చిత్రలేఖనాల గురించి మహా ఇదిగా చెప్పి రెండు చిన్నవి చూపెట్టి __ అక్కడ యేర్పాటు చేయించాడు.    
    "ఓ మంత్రితో, యెవరో యెందుకు మన రవితో ఓపెన్ చేయిద్దాం. ప్రదర్శన" అని రామ్మూర్తి అంటే, "అయన సతీమణి ది ఇజిప్షియన్ బ్లాక్ స్నేక్ గాడెస్ తోనో, మన బస్టాప్ దగ్గిర అడుక్కునే పేరున తిరుగుతూ కక్కుర్తి నీడుల అవసరాలు తీరుస్తూండే భారత పౌరురాలితో ఐనా చేయించవచ్చు." అని నవ్వి, "యేఁవొద్దు ఇంతదాకా గుంజావు చాలు. పత్రికల్లో ఓ ప్రకటనివ్వు. వారం రోజుల ప్రదర్శన ఆసక్తి వున్నవాళ్ళు వస్తే వస్తారు. నేను అక్కడే వుంటాను. కానీ ఆ బొమ్మల నేరం చేసినవాడిని నేనేనని తెలియకుండా ఆ బొమ్మల్ని చూసేవాళ్ళని చూడాలని" అన్నాడు శ్రీపతి.
    అన్ని రకాలూ కలిసి అరవయ్ దాకా వున్నాయి.
    అతని చిత్రలేఖనాలు చిత్రంగా వున్నాయి. ప్రతి చిత్రలేఖనంలో యే రకం చిత్రలేఖనమో చెప్పటమూ కష్టమే. ఓల్డ్ మాస్టర్స్ రీతులు, ఎక్స్ ప్రెషనిజం ఇంప్రెషనిజం కేవ్ యెన్ గ్రేవింగ్సు క్యూబిజం వివిధ ఆధునిక నైరూప్య రీతులు అజంతా రాజస్థానీ జాపనీ రేఖాచిత్ర రీతులు__ వీటిలో యే రీతీ కాదు. ఆ రేఖలూ వున్నాయి. అలా అని కేవలం, అన్ని రీతుల మిశ్రమమూ కాదు. చూడగానే ఇదేదో శ్రీపతి గందరగోళం అనిపిస్తుంది. ఈ చిత్రలేఖనం శ్రీపతీ పైత్యలేఖనం అనిపించవచ్చు. వాటిలో అర్థంకానితనం కంటే అర్ధమయ్యేతనం యెక్కువ. అస్పష్టత లోంచి మరింత స్ఫుటంగా అనిపించే స్పష్టత.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.