Home » vaddera chandidas » Anukshanikam 2



    రాజకీయ అభ్యర్థిత్వపు అర్హత కోల్పోయిన చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పునరావాసం పొందిన చెన్నారెడ్డి, ఎలక్షన్ల ముందువేళకి కోర్టువారు విధించిన అనర్హత గడువు తీరినందున యే పార్టీలో చేరాలా అని ఆలోచించి__ కాసేపు జనతా, కాసేపు అధికార కాంగ్రెసు, మినుకుమినుకుమంటున్న ఇందిరా కాంగ్రెస్ లో__ దేన్లో చేరటమా అని ఆలోచిస్తూ, బేరీజులు వేస్తూ జనతాలో చేరినా అధికార కాంగ్రెసులో చేరినా తనకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత వుండదని అనిపించినందున చివరికి ఇందిరా కాంగ్రెస్ లో చేరాడు__ యెక్కడో దివాన్ గిరీ కంటే వూళ్ళో మునసబు గిరీ మేలన్న భావంతో.
    అన్నీ ఆముదపు మొక్కలవటంతో, అసలే రాజకీయ తంత్రపు బుర్రేమో మహా వటవృక్షంగా నిలబడి ముఖ్యమంత్రి అయ్యాడు__ చెన్నారెడ్డి. యీ మంత్రివర్గంలో, రవి, తనకి శాసనసభలోని ఇందిరా కాంగ్రెసులో వున్న బలం దృష్ట్యా మంత్రి అయ్యాడు. కార్మిక శాఖ.
    మాజీ అధికార కాంగ్రెస్ ఐన కాసు వెంగళ'రావుల కాంగ్రెస్ ఒకటున్నదనేందుకు అన్నట్లుగా వెంగళ్రావు వంటి ఒకరిద్దరు అభ్యర్థులు గెలిచారు. ఓడిపోయిన యెందరో కాసు కాంగ్రెస్ అభ్యర్థుల్లో గోవర్ధన్ రెడ్డి కూడా వున్నాడు. అసెంబ్లీలో జనతా అభ్యర్థి ప్రతిపక్ష నాయకుడు.
    రవిని సమర్థించే శాసనసభ్యులు తదితరులు గంగిని సంప్రదించి రవికి సన్మానసభ యేర్పాటు చేశారు. మాటవరసకి వద్దన్నాడుగానీ, లోన ఇష్టంగానే వుంది. ఆనాడు అసెంబ్లీలో అనామకంగా నిలుచున్న రోజున మినిస్ట్రీ కుర్చీమీద పడిన అతని కన్ను, అధికారం మీదకి మళ్ళిన అతని మనసు__ యీ రోజున సంతృప్తిగా దానికి ప్రతిరూపాలైన సన్మాన సత్కారాలను ఆనందిస్తున్నాడు. అదే వేదికమీద రవితోపాటు అతని ధర్మపత్ని గంగినీ కూర్చోబెట్టారు ఆదర్శ దంపతులుగా అభివర్ణించి ఇందుకుగాను మరికొన్ని పూలమాలలు వేశారు.

                             119

    అనంత్ రెడ్డి, స్వప్నరాగలీనలు చీకట్లో రోడ్డుమీద నడుస్తున్నారు. వొకరి ప్రక్కన వొకరు విమానాశ్రయానికి వెళ్ళే రోడ్డువెంట. యెనిమిదీ పావు. చుట్టూ నిశ్శబ్దం. అలా అని మరీ అంత నిశ్శబ్దమూ కాదు.
    యెప్పుడన్నా అలా పైకి లేచి దిగివచ్చే విమానం, మెత్తగా దూసుకెళ్ళే ఓ కారు, వొకరో ఇద్దరో నడిచివెళ్ళిన బూట్లచప్పుడు.
    అనంత్ రెడ్డి, బేగంపేటకి యీ కొసన సికిందరాబాద్ వైపుకి చిన్న బంగళా అద్దెకి తీసుకున్నాడు. టెలిఫోను పెట్టించాడు. ఇంటినుంచి డబ్బు తెచ్చి కారు కొన్నాడు. దాన్లోనే రోజూ కాలేజీకి వెళతాడు. స్వప్నరాగలీన రీసెర్చి వదిలేసింది. రోజంతా ఇంట్లోనే వుంటుంది. వూరినుంచి పంపిన పనిమనిషే అన్ని పనులూ చేస్తుంది. వంట కూడా చేస్తుంది. కానీ చాలావరకు వంట తనే చేస్తుంటుంది. సంగీతం వింటూ వుండిపోతుంది. అప్పుడప్పుడు ఓ సాహిత్యం పుస్తకం.
    అప్పుడప్పుడు సాయంత్రాలు తెలిసిన వాళ్ళింటికి వెళుతుంటారు. యెక్కువగా ఆమె పినతండ్రి నాగిరెడ్డి యింటికి వెళుతుంటారు. అక్కడికి వెళ్ళిన సాయంత్రం, రాత్రి భోజనం అక్కడే. అనంత్ రెడ్డి నాగిరెడ్డితోనో మరొకరితోనో మాట్లాడుతూ వుంటాడు. తనూ కాసేపు మాట్లాడి, వొక్కతీ బయటికి వచ్చి పచ్చికమీద పరుంటుంది. ఆ పచ్చిక ఆమెకి యెంతో ఆత్మీయంగా అనిపిస్తుంది. అది ఆమె జీవితపు కలల వూహల అనుభూతుల పచ్చిక.
    సాధారణంగా డాబామీద వెల్లకిలా పడుకుని వుండిపోతుంది. చాలాసార్లు తన చేతివేళ్ళతో నక్షత్రాలని తడుముతుంది. కొనలు గుచ్చుకోగా__ పాపం, అంత యిదిగా గుచ్చుకోవాలంటే యెంత కష్టం __ అన్నట్లుగా జాలిగా వాటి అంచుల్ని తడుముతుంది. వంటరిగా దిగులుగా కదిలే మబ్బు తునకకి ఆప్యాయంగా చెంప అన్చుతుంది. నిరాధారంగా పోతున్న గాలిని తన చర్మంతో స్పర్శించి ఆసరా యిస్తుంది. క్రీనీడనే వుండిపోయిన ఆకాశాన్ని దగ్గిరికి లాక్కుని తన పచ్చని వక్శపు మెత్తని వెలుతురుమీద పరుండ బెట్టుకుంటుంది. అవతలెటో వీధుల్లో తిరిగి తిరిగి దుమ్ము కొట్టుకుని జాబిలీ వస్తే కన్నీటితో స్నానం చేయించి ఒళ్ళోకి తీసుకుంటుంది.
    గదిలో వర్క్ చూసుకుంటూ, పైకి వచ్చి ఆమెపక్కన పడుకుని, "స్వప్నా" అంటాడు అనంత్ రెడ్డి. "వూఁ" అంటుంది ఆమె ఐదో పదో నిమిషాలు. లేచి ఆమె చెయ్యి అందుకుంటాడు. మెట్లు దిగి లోన గదిలోకి వస్తారు. మంచంమీద పడుకుంటారు. ఆమె వొంటి చందనం పరిమళం అతనిని ఆవరిస్తుంది. పక్కకి తిరిగి తలనుంచి పాదాల దాకా ఆమెని చూస్తాడు. విద్యుదయాస్కాంత వలయంలా అనిపిస్తుంది. ఇటీవల అతనికి సడన్ గా తెలిసింది__ ఎలక్ట్రో మేగ్నెటిక్ ఫీల్డ్ అంశం మీదకి తనకు ఆసక్తి కలగటం, ఆమెని చూశాకనే అని. ఆమెవైపు తిరిగి దగ్గిరిగా జరిగి ఆమె పెదాలమీద పెదాలు అడ్డుతాడు. అతనిలో ఆమెలో చల్లని మాధుర్యపు ధార ప్రవహించి నెత్తుట్లో కలిసి సెగరగిల్చి__ వొకరినొకరు వళ్ళంతా స్పర్శిస్తూ, పెనవేసుకుని__ ప్రవాహం కట్టలు తెంచుకో యత్నించే క్షణాన__ అద్వైత యుగళ సర్వశక్తి పరిధిలో వొక వడలిన కాంతిరేఖ__ చిట్లిన గాలిబూరలా చిటుక్కున విడివడి మంచానికి చెరో అంచుమీదకీ తిరిగిపోతారు. ఇద్దరి కళ్ళనిండా నీళ్ళు__ ఆ కన్నీళ్లు రాకుండా వుండటం కోసం, ఒకే మంచం మీద పరున్న యిద్దరి శరీరాల మధ్యా కొన్ని యోజనాల దూరం విస్తరింరించుకుంటారు.
    పోలీసు లైన్సు వైపు నుంచి తిరిగి బేగంపేట రోడ్డు వెంట నడుస్తున్న వాళ్ళిద్దరూ కుడివైపున మైదానంలోకి అడుగులు వేశారు. గడ్డి ఎండిపోయి కొంతా, గడ్డి బాగా పెరిగిపోయి కొంతా __ మైదానం.
    యెత్తుగా అస్తవ్యస్తంగా పెరిగివున్న గడ్డిలో కూర్చునిపోయింది. అతనూ కూర్చుంటూ, "పాములుంటాయేమో__" అన్నాడు.
    "మనమూ వుంటాంగా. అలాగే అవీ" అంది.
    "కాటు వేస్తే?"
    "మనదారిని మనం కూర్చుని వుంటే వాటికేం అవసరం కాటు వెయ్యవు" అంది.
    "వెళ్తూ దారిలో మనం అడ్డొచ్చి భయపడి"
    "చేసేదేముంటుంది? బ్రతికి వుండటం యెంత సహజమో మరణమూ అంతే సహజం. మరణం అంటే భయపడటం కూడా అంతే సహజం. నాకెందుకో భయం వెయ్యటం లేదు. ఇది అసహజం. అసహజత్వాన్ని అనాది సహజత్వమో అనంత సహజత్వమో అని అనాలేమో_" అంది.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.