Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "రోమశా! అతి సంతోషకరమయిన అర్జునుని వర్తమానము అందించినావు. మా అందరికి సంతోషము కలిగించినావు. అర్జునుడు ఏమన్నాడు? మాకేమయిన చెప్పమన్నాడా?" ఆతురతగా అడిగినాడు ధర్మజుడు. ద్రౌపది ఉత్తరమునకై వేచినది.
    "ధర్మజా! ఇంద్రుడు అర్జునుని పొగడినాడు. మీతో చెప్పమన్నాడు. పాశుపతము పూర్వము అమృతమున పుట్టినది. శివుని వలన ఆ అస్త్రమును అర్జునుడు సాధించినాడు. యమ, వరుణ, కుబేరాదుల వలన అనేక దివ్యాస్త్రములను అర్జునుడు పొందినాడు. అర్జునుడు మానవ మాత్రుడు కాడు. అతడు దివ్యపురుషుడు. అన్యులకు సాధ్యము కాని దేవతా కార్యములను అర్జునుడు తీర్చవలసి ఉన్నది. అర్జునుడు త్వరలోనే తిరిగి భూలోకమునకు వచ్చునని నీవు ధర్మరాజుతో చెప్పుము. అంతేకాక తీర్థయాత్ర చేసినవారికి, శాంత చిత్తులకు తపస్సంపన్నులకు సాధ్యముకాని కార్యములేదు. కావున నీవు ధర్మజుని వద్దకు వెళ్లుము. అతనికి సాయముగా ఉండి తీర్థయాత్రలు చేయించుము అని ఇంద్రుడు నన్ను ఆదేశించినాడు" అని రోమశుడు చెప్పినాడు. రోమశుని మాటలు విని అందరు ఆనందించినారు. ద్రౌపది ఆనందబాష్పములు రాల్చినది, ధర్మరాజు కనులు చెమ్మగిల్లినవి.
    "ధర్మజా! మానవునకు అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములున్నవి. శ్రోత్ర త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణేంద్రియములు జ్ఞానమునకు సంబంధించినవి. వాక్పాణి పాదపాయూపస్థలనునవి కర్మమునకు సంబంధించినవి. ఇవికాక మనసు ఒకటి ఉన్నది. దశేంద్రియములను మనమున నిలుప గలవాడు మహాపురుషుడు. తీర్థయాత్రలు చేయుట వలన అతనికి ఉభయలోక సౌఖ్యములు కలుగును. విజ్ఞానము కలుగును. బుద్ధి వికసించును. నేను భూచక్రమందుండు సకల తీర్థములను ఇదివరకు రెండుసార్లు చూచినాను. ఇంద్రుని ఆదేశము మేరకు మీతో మరొకసారి తీర్థములను సేవింతును" అన్నాడు రోమశుడు.
    ధర్మజుడు రోమశుని మాటలు విన్నాడు. ఆనందించినాడు. ధౌమ్యాదులను సంప్రదించినాడు. తీర్థయాత్రలకు సిద్దమయినారు. ధర్మరాజు వెంట ఉన్న విప్రులు కూడా తీర్థయాత్రలకు వత్తుమన్నారు. ధర్మరాజు వారిని వారించలేదు. వెంట వచ్చుటకు సమ్మతించినాడు.
    ధర్మరాజాదులు ప్రయాణ సన్నాహమందుండగా వేదవ్యాస, పర్వత, నారదులు వచ్చినారు. వారిని పాండవులు పూజించినారు. "పాండవులారా! శరీర నియమములు మానవ వ్రతములు. మనో, బుద్ధి, శౌచములు దేవ వ్రతములు. అట్టి శాంత వ్రతములను జరుపుచు, సత్య మార్గమందు ప్రవర్తించుచు పుణ్య తీర్థములను సేవించి మహాభిష, నాభాగ, భరత, భగీరథ, ముచికుంద, మాంధాతృ, సగర, సార్వభౌమ, అష్టక, రోమపాద మహారాజులవలె సకల శత్రువులను జయించి సర్వలోక సుఖములను పొందుదు" అని ఆశీర్వదించి ముగ్గురు మునులు వెళ్లినారు.
    అప్పుడు ధర్మరాజు రోమశుని అడిగినాడు:-
    "మహాత్మా! లోకమున ధర్మ హీనులకు, కుత్సిత పురుషులకు జయము కలుగుచున్నది. ధర్మాత్ములకు, పరిశుద్ధ మనస్కులకు హీనస్థితి కలుగుచున్నది. అట్లు జరుగుట ధర్మ విరుద్ధము. అట్లు జరుగుటకు కారణమేమి?".
    అందుకు రోమశుడు సమాధానము చెప్పినాడు:-
    "ధర్మజా! పూర్వజన్మము, ప్రారబ్ధము రెండు మనిషిని అంటి ఉన్నవి. అవి నీడవలె మనిషిని వీడవు. వాని వలన ధర్మాత్ములకు కూడా కష్టములు వచ్చును. కాని అవి కలకాలము నిలువవు. కొంతకాలమే ఉండును. తరువాత కాలమున సుఖములు, శుభములు కలుగును. ధర్మాత్ములకు కష్టములు తాత్కాలికములు. "దుర్మార్గులకు కర్మము, ప్రారబ్ధము వలన అభివృద్ధి కలుగవచ్చును. కాని అది కలకాలము నిలువజాలదు. కొంతకాలమే నిలుచును. తరువాత కాలమున కష్టములు బాధలు కలుగును. దుర్మార్గులకు సుఖములు తాత్కాలికములు.
    "దైత్యులు దానవులు అధర్మ ప్రవృత్తి గలవారు. వారికి తాత్కాలిక జయములు లభించినను వారికి అభివృద్ధిలేదు. దేవతలు ధర్మాత్ములు. వారికి తాత్కాలికములయిన అపజయములు కలిగినను శాశ్వత లక్ష్మినిపొంది సుఖించుచున్నారు.
    దుర్యోధనాదులు దానవులవంటివారు. అధర్మపరులై వృద్ధి పొందుచున్నారు. వారు రాక్షసుల వలెనే దైవముచేత నశింతురు. వారు ఎట్లు నశింతురనగా:-
    "అధర్ములకు విజయము వలన గర్వము జనించును. గర్వము వలన దురహంకారము పుట్టును. దురంహంకారము వలన క్రోధము చెలరేగును. క్రోధము వలన సిగ్గు, సదాచారము నశించును. సదాచారము నశించినపుడు మనసు నశించును. మనసు నశించిన మానవుడు నశించినట్లే".
    "మీరు దేవతల వంటివారు. పుణ్యాత్ములు. గొప్ప బుద్ధి గలవారు. మీకు తప్పక లక్ష్మీ విభవము కలుగును. మీరు సకల శత్రువులను జయించగలరు. విజయలక్ష్మి మిమ్ము వరింపనున్నది. తీర్థయాత్రలు, యజ్ఞములు, దానములు శ్రేయస్సును కలిగించును. కావున యాత్రలకు బయలుదేరుదము".
    పాండవులు రోమశునితో యాత్రలు చేసినారు.వారు నైమిశము, అశ్వ తీర్థము, గంగా ఘోషము, నాగకన్యా తీర్థము, గోమతి, బాహుద, మహానది, ప్రయాగ, గంగా యమునా సంగమములను దర్శించినారు. స్నానములు చేసినారు. దానములు చేసినారు. విప్రుల వలన వేదార్థములను తెలుసుకున్నారు. వారు "గయ" చేరినారు. అక్కడ చాతుర్మాస్య క్రతువులు నిర్వహించినారు. ఋషులు, మునులు వారికి అనేక పుణ్యకథలు వినిపించినారు.
    శమంతుడు గయా తీర్థమును గురించిన కథ చెప్పినాడు:-
    పూర్వము ధూర్తుడను వాడుండెను. అతనికి "గయుడు" అను కుమారుడు కలిగినాడు. గయుడు రాజర్షి, శాంతమూర్తి, దానపరుడు. అతడు ఈ గయా తీర్థమందును, బ్రహ్మ శర తీర్థమందును అనేక యజ్ఞములు చేసినాడు. అతడు సమస్త జనులకు అన్నదానము చేసినాడు. వారు భుజించగా మిగిలిన అన్నరాసులు పర్వతములవలె ఇరువదియైదు అంకెలుగల వరుసకు మించిన లెక్కను అతిక్రమించి ఉండెను. ఆ యజ్ఞములందు గయుడు బహువిధ దక్షిణలు ఇచ్చెను. ఇసుక రేణువులనైన లెక్కించవచ్చును గాని గయుడు ఇచ్చిన దక్షిణలను లెక్కించ శక్యముకాదు. అతని పేర ఈ తీర్థమునకు "గయ" అను పేరు వచ్చినది. గయా తీర్థము పితృ దేవతలకు హితము కలిగించును. ఇందు పిండ ప్రదానము చేసిన ఇష్టసిద్ధి కలుగును.
    పాండవులు గయా తీర్థము నుండి అగస్త్యాశ్రమమునకు వెళ్లినారు. అక్కడికి చేరి ధర్మరాజు, రోమశుని "అగస్త్యుడు మహాతేజోధికుడు. తపస్సంపన్నుడు. నిర్మల చరిత్రుడు. అతని ఆశ్రమమున అగస్త్యుని కథ వినవలెనని కుతూహలముగా ఉన్నది. కావున అతని పవిత్రకథ వినిపించుడు" అనివేడుకున్నాడు.
    రోమశుడు అగస్త్యుని కథ చెప్పినాడు:-
    అగస్త్యుడు బ్రహ్మచర్యమున ఉండి బహుకాలము తపస్సు చేసినాడు. అతడు వనములందు తిరుగాడువాడు. ఒకనాడు ఒక సరస్సు వద్ద అగస్త్యుని పితరులు తలక్రిందులుగా వ్రేలాడుచు కనిపించినారు. "కుమారా! నీవు వివాహము చేసికొని, సంతానము పొందువరకు మాకు ఊర్ద్వగతులు లేవు" అన్నారు. అగస్త్యుడు పెండ్లాడుదునని పితరులకు వాగ్దానము చేసినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.