Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అన్నింటిని కోల్పోయిన నలుడు నట్టింట కూర్చున్న దమయంతి దగ్గరికి వచ్చినాడు. ఆమె ఆలోచించలేదు. నలుని అనుసరించినది. అడవులలో భర్తతో ఉండవచ్చుననుకున్నది. నలుడు ఆమెకు ఆ సుఖము సైతము దక్కనీయలేదు. చీర సైతము సగము చించుకొని తన దారిన వెళ్లిపోయినాడు!
    దమయంతి చేసిన పాపము ఏమి? ఆమె ప్రేమించినది. అది ఆమె చేసిన తప్పు. ఆ తప్పుకు ఇంత శిక్షా! దమయంతి భీమరాజు కూతురు. నల మహారాజు భార్య. రాజ సౌధములందు పెరిగిన సుకుమారి. నట్టడవిలో ఒంటరిగా నలుని కొఱకు వెదక సాగినది. ఆకలి దప్పులకు బాధపడినది. అలసినది. అయినను అన్వేషణము ఆపలేదు. నేటి మన సినిమాలలోవలె ఒక కిరాతుడు తటస్థించినాడు. ఆమె మానమును హరించదలిచినాడు. ఆమె అబల అయి లొంగలేదు. సబల అయి ఎదిరించినది. వానిని హతమార్చినది.
    వ్యాసుడు ఆడదానిని అబలగా సృష్టించలేదు. ఆమెను శక్తి స్వరూపిణిగా చిత్రించినాడు. స్త్రీకి ధైర్య సాహసములు ఉండవలె. ఎదిరించ గలిగిననాడే ఆమెకు విముక్తి.
    భీమరాజు వెదికించి తెప్పించు వరకు దమయంతి పుట్టింటికి కూడ వెళ్లలేదు. పుట్టింటికి వెళ్లి భర్త కొఱకు వెదకించినది. తన చాతుర్యము ప్రదర్శించి నలుని రప్పించినది.
    ఇంత చేసిన దమయంతి మీద నలునకు నమ్మకము లేదు. ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెట్టినాడు. దమయంతి నైర్మల్యమును గురించి వాయుదేవుడు సాక్ష్యము ఇవ్వవలసి వచ్చినది. అయినను దమయంతి నలుని అంగీకరించినది. మనసా, వాచా, కర్మణా అతనితో ఏకమైనది!
    4. ఈ కథ మొత్తమున నలుని స్వప్రయత్నము అంతగా కనిపించదు. దమయంతిని, పెండ్లాడుటలో అతని ప్రయత్నము లేదు. పరీక్షించినాడు. జూదమాడి రాజ్యమును, సంపదను కోల్పోవుటలో మాత్రము అతని పూర్తి ప్రయత్నమున్నది. తన భార్యను గురించిగాని, బిడ్డలను గురించిగాని అలోచించలేదు. తనవెంట అడవికి వచ్చిన దమయంతి సౌశీల్యమును సహితము అర్థము చేసుకొనలేదు. ఆమెను పుట్టింటికి పంపి వదిలించుకొనదలచినాడు. ఇందుకు రెండు కారణములు కావచ్చునని నా ఊహ.
    1) దమయంతి తనతో అడవులలో కష్టపడుట ఇష్టములేక పుట్టింటికి వెళ్లమన్నాడు. దమయంతి వెళ్లనన్నది. ఇందు విషయమున చిన్న తగాదా జరిగియుండును. ఆకోపమున అర్ధరాత్రి దమయంతిని విడిచిపోయినాడు.
    2) దమయంతి నలునకు ఒక పీడగా తోచి ఉండును. దమయంతి వలననే పుష్కరునితో స్పర్ధ ఏర్పడినది. అందువలననే జూదమాడవలసి వచ్చినది. ఇవన్నియు దమయంతి వచ్చినప్పటి నుండియే జరిగినవి. వీటి అన్నింటికి ఆమె రాకయే కారణము అనుకొని ఉండవచ్చును. కాని ఇది మంచి నమ్మకము కాదు. నలునివంటి ధీరునకు తగదు.
    అంతమాత్రమున నలుడు దౌర్భాగ్యుడని చెప్పలేము. అతడు చెడి అత్తవారింటికి వెళ్లదలచలేదు. తాను దమయంతిని విడిచిపోయిన ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లి సుఖించుననుకున్నాడేమో! రాజ్యము సాధించి, దమయంతిని తెచ్చుకుందమను కున్నాడేమో!
    నలుడు రాజ్యము సాధించుటకు కర్కోటకుడు సాయపడినాడు. మంటలలో నుంచి పామును రక్షించిన కథ ఒకటి "పంచతంత్రము"న ఉన్నది. పర్యవసానములు భిన్నముగా ఉన్నవి. అయినను ఒకదాని ప్రభావము మరొక దానిమీద ఉన్నట్లు కనిపించుచున్నది.
    నలుడు బాహుకుడుగా ఋతుపర్ణుని వద్ద చేరినది. అక్షవిద్యకొఱకే. అది అభ్యసించి రాజ్యము సాధించుట అతని ఉద్దేశ్యము.
    ఒక్కొక్కసారి 'విధి' తన ప్రభావమును విపరీతముగా కనబరచును. మనిషి ఎంత శక్తిమంతుడయినను దానికి లొంగవలసి వచ్చును. అది ఈడ్చినట్లు నడువవలసి వచ్చును.
    అడుగడుగునా ఆడుదాని మీద అపనమ్మకము పురుష స్వభావముగా కనిపించుచున్నది. స్త్రీ తాను నమ్మిన వానికి తనను అర్పించును. ఆమె నమ్మకమును పరీక్షించుటకే పురుషుని జీవితము సరిపోకున్నది. యుగములతో నిమిత్తము లేక ఇట్టి పురుష స్వభావము నిలుచునట్లున్నది. ఇది మానుట అవసరము.
    5. రామాయణ కథ ఛాయలు కొన్ని ఇందు కనిపించుచున్నవి. రెండును విడిపోయి కలిసిన కథలే! రెంటిలోను స్త్రీని పరీక్షకు గురిచేయుట జరిగినది. దమయంతి కథ మీద సీత కథ ప్రభావము పరిశీలింతము.
    1) నలుడు పోయిన తరువాత దమయంతి నలుని వెదకుటలో రాముడు సీత కొఱకు వెదకిన పోలికలు కనిపించును.
    2) కబంధునకు కర్కోటకునకు పోలికలు కనిపించుచున్నవి. ఉభయులు మునులకు అపకారము తలపెట్టి శాపములు తెచ్చుకున్నారు. కబంధుడు రామునకు సుగ్రీవుని జాడ చెప్పినాడు, కర్కోటకుడు నలునకు ఋతుపర్ణుని జాడ చెప్పినాడు. వారి సలహాల వల్ల రామునకు, నలునకు కార్యసాధన జరిగినది.
    3) దమయంతికి కనిపించిన మునిపల్లె శబరి ఆశ్రమమును తలపించుచున్నది. దమయంతికి మునుల వలనను, రామునకు శబరి వల్లను సాంత్వనము లభించినది. ఉభయులును ఆత్మవిశ్వాసముతో కదలినారు. ఇక్కడ ఒక విషయము గమనించవలసి ఉన్నది శ్రీరాముడు అరణ్యమున సంచరించినపుడు అడుగడుగున కళకళలాడు మున్యాశ్రమములు కనిపించినవి. ఈ కథ సాంతమున ఒకే ఒక మునిపల్లె కనిపించినది. మున్యాశ్రమములు అంతగా కనిపించక పోవుటకు గల కారణమును పరిశీలించవలసి ఉన్నది.

                                                 అగస్త్యుని కథ

    ధర్మరాజాదులు కామ్యక వనమున ఉన్నారు. అక్కడికి రోమశ మునీంద్రుడు వచ్చినాడు. అతడు మహా తేజోవంతుడు. ధర్మరాజు ఆయనను ఆదరమున ఆహ్వానించినాడు అర్ఘ్య పాద్యము లిచ్చినాడు. ఆసనము చూపి, ఆసీనుని చేసినాడు. "మహాత్మా! మీరాక ఎక్కడనుంచి? అక్కడి విశేషములేవి?" అని అడిగినాడు. అందుకు రోమశుడు చెప్పినాడు:-
    "ధర్మజా! నేను ప్రస్తుతము స్వర్గము నుంచి వచ్చుచున్నాను. అక్కడ నాకు నీ తమ్ముడు అర్జునుడు కనిపించినాడు. అతడు తేజోవంతుడయి ఉన్నాడు. ఇంద్రునితో ఏక సింహాసనమున కూర్చుండి ఉన్నాడు. ఈశ్వరుడు మున్నగు సకల దేవతలు అర్జునునకు సకల దివ్యాస్త్రములను ప్రసాదించినారు. మహాబలవంతులగు భీష్మాదులు అర్జునుని ముందు నిలువజాలరు. కర్ణుడు అర్జునునకు పదారవ భాగమునకయిన పనికిరాడు".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.