Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    వసోః పవిత్రమసి ద్యౌరసి పృథివ్యసి
    మాతరిశ్వానో ఘర్వోసి విశ్వధా అసి|
    పరమేణ ధామ్నా దృఁహస్వ మహ్వార్వాతే యజ్ఞపతిర్హ్వార్షీత్

                                                                                     శుక్ల యజుర్వేదం 2వ మంత్రం.

    మానవా! నీవు వసువులను పవిత్రీకరించువాడవు. నీవే ద్యులోకమవు. పృథ్వివి. నీవు ప్రాణపు ఉష్ణమవు. విశ్వమును ధరించువాడవు. పరమ ధామము నుండి ముందుకు సాగుము. నీవు కపటివి కాకుము. నీ యజ్ఞపతి కుటిలుడు కాకుండునుగాక.

    ప్రాణపు వేడి సహితంగా సమస్తం మానవుడే అనుచున్నాడు. మానవుడు కపటి, కుటిలుడు కానంతవరకే అన్నీ కాగలడు! మానవుడు మనసుగలవాడు - మంచివాడు. కాని వాడు కాడు. వేదం మానవునికి అంతటి అంతస్తు కలిగించింది.

    వేదానికి మనిషిమీద అతని సంకల్పం మీద అనంత విశ్వాసం. నరుడు "అహం బ్రహ్మస్మి" నేను బ్రహ్మను వరకు చేరుకోగలడు. ముందు అతడు మానవుడు కావాలి.

    శతం జీవ శరదో వర్థమానః శతం హేమంతాచ్ఛతమువసంతాన్

                                                                               ఋగ్వేదం 10 - 161 - 4

    నూరు శరత్తులు, సుఖంగా నూరు హేమంతాలు, నూరు వసంతాలు జీవించు.

    ఇందులో ఎవరినీ అర్థించడం, ప్రార్థించడం లేదు. ఆశీర్వదించడమే! విశ్వాసం సంకల్పం మీదనే - దేవతల మీద కాదు.

    శంనో వాతః పవతాం శంనస్తపతు సూర్యః |
    శం నః కనిక్రదద్దేవః పర్జన్యో అభివర్షతు                                         యజుర్వేదం 36-10

    మాకు వాయువు సుఖముగా వీచునుగాత. సూర్యుడు సుఖకరముగా ప్రకాశించునుగాత. ఉరుముల దేవత పర్జన్యుడు మా కొరకు సుఖకర వర్షము కురిపించును గాత.

    ఇది మానవ సంకల్పం, ఆశయం. ఇందులో అర్థించడం లేదు. ప్రార్థించడం లేదు. సంకల్పమే దేవత.

    ద్యౌః శాన్తిరన్తరిరిక్షం శాన్తిః పృథివీ శాన్తి రాపః శాన్తిరోషధయః శాన్తిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాన్తి ర్బ్రహ్మ శాన్తిః సర్వం శాంతిః శాన్తిరేవ శాన్తిః సామా శాన్తిరేధ

    ద్యులోకం శాంతించాలి. భూలోకం శాంతించాలి. జాలం శాంతించాలి. విశ్వేదేవతలు శాంతించాలి. బ్రహ్మ శాంతించాలి. సకలం శాంతించాలి. శాంతి కూడా శాంతించాలి. అలాంటి సమస్త శాంతి నన్ను వర్థిల్ల చేయునుగాత.

    యుద్ధం లేనిది మాత్రమే శాంతి కాదు. సమస్తం శాంతించినపుడే శాంతి. శాంతికి సహితం శాన్తి కావాలంటున్నాడు. అన్ని శాంతంగా ఉన్నప్పుడే ప్రగతి సాధ్యం. ఇది శాంతికి సంపూర్ణ నిర్వచనం. ఇది మానవ జాతి ఆశ, ఆశయం, ఆకాంక్ష.

    "తచ్చక్షుర్దేవ హితం పురస్తాచ్ఛు క్రముచ్చరత్|
    పశ్యేమ శరదః శతమ్ జీవమే ప్రబ్రవామ శరదః శతమదీనాఃశ్యామ
    శరదఃశతమ్ భూయశ్చ శరదః శతాత్||

    దేవతలచే నిర్దేశింపబడిన వాడు, సర్వనేత్రుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

    మేము నూరేళ్లు చూడాలి. నూరేళ్ళు జీవించాలి. నూరేళ్లు వినాలి, నూరేళ్లు చక్కగా మాట్లాడాలి. నూరేళ్లు దీనులం కాకుండాలి. మరో నూరేళ్లు జీవిస్తాం.

    నూరేళ్లు బతకడం కాదు. అవయవాలన్నీ  బాగుండి జీవించాలి. వేదం జీవిత రహస్యాలు కనిపెట్టింది. "అదీనాఃస్యామ శరదః శతమ్" దీనులు కాకుండా పరాధీనులు కాకుండా నూరేళ్లు జీవించాలి. అలాంటి జీవితమే అవుతే మరో  నూరేళ్లు జీవించడం మానవజాతి ఆశయం. లక్ష్యం. కోరిక.

    "త్రయవైదేవాః వసవో, రుద్రా, ఆదిత్యాః" దేవతలు మూడు విధాలు 1. వసువులు, 2.  రుద్రులు, 3. ఆదిత్యులు. అష్టౌవసవః + ఏకాదశ రుద్రాః + ద్వాదశాదిత్యాః వసువులు 8మంది + రుద్రులు 11 మంది + ఆదిత్యులు 12 మంది = 13 అవుతుంది.

    దేవతావావ త్రియంస్త్రిణో అష్టౌవసవః + ఏకాదశి రుద్రాః + ద్వాదశాదిత్యాః  +ద్యావా +  పృథివీ. ఈవిధంగా పైన పేర్కొన్న 31 టికి ద్యావా + పృథ్వులను చేర్చగా 33  అయినారు.

    మరొక పద్ధతి  31 +  ప్రజాపిత + వషట్కారం చేరగా 33 అయింది. "ప్రాణోవైవషట్కారః" అని శతపథం.

    దేవతల సంఖ్య 33గా నిర్ణయించడం జరిగింది. వేదంలోని 33 దేవతల వర్గీకరణ ఇది.

    11 మంది భూమి మీద వారు, వారు అగ్ని, జలము మున్నగువారు.

    11 మంది అంతరిక్షవాసులు నాకవాసులు, ఇంద్రాదులు

    11 మంది ద్యులోక వాసులు సూర్య చంద్రాదులు.

    వేదంలో ఈ సంఖ్య అంతటితో ఆగినట్లు కనిపించదు. రోలు, మండుకము, సోమము, ఋతువులు, దాతలు, రాజులు పెక్కురు దేవతలున్నారు.

    "యస్య వాక్యం సరుషిః యతేనోచ్యతేసః దేవతా" అన్నాడు కాత్యాయనుడు ఋస్సిర్వాను క్రమణికలో చెప్పిన వాడు ఋషి. చెప్పబడినవాడు దేవత.
 

    దేవతలు ఎవరు?
    మానవ సమాజానికి హితవు చేకూర్చిన వారిని దేవతలు అనవచ్చు. ప్రకృతి. శక్తులయిన సూర్య, చంద్ర, అగ్ని మున్నగు వాటితోనే సకల  చరాచర సృష్టి జీవిస్తున్నది. నశిస్తున్నది. కావున వీరు దేవతలు. 1. పృథివి,  2. అప్ జలము 3. తేజస్సు 4. వాయువు 5. ఆకాశం. ఇవి పంచభూతాలు. ఇవే సమస్త సృష్టి, స్థితి, లయాలకు కారణం అవుతున్నవి. అయితే వేదంలో పంచభూతాల వంటి స్పష్ట నిర్వచనం లేదు. కాబట్టి దేవతల సంఖ్య స్పష్టంగా లేదు.

    వృక్ష, లతా, గుల్మాదులు, మానవ జాతి మనుగడకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఒక చెట్టు కొందరు మనుష్యుల కన్నా ఉపకారం చేస్తున్నది. చెట్లన్నీ కొట్టిన  తరువాత సైంటిస్టులు అనిపించుకునేవారికి ఇవ్వాళ వృక్ష ప్రాముఖ్యత అర్థం అయింది. వేదం వృక్ష ప్రాధాన్యతను గుర్తించింది. వృక్షలతా గుల్మాదులను దేవతల్లో చేర్చింది.

    సూర్యచంద్రాదులు తమ కున్న శక్తుల వలన దేవతలైనారు. ఇంద్రుడు, అశ్వినులు, ఋభువులు తమ కర్మల వలన దేవతలైనారు.

    ఇంద్రుడు వృత్రుని వధించాడు. జలములను ప్రవహింపచేశాడు. అతడు శతక్రతువు. మూడు సత్కార్యములు చేసినవాడు. క్రతువు అంటే యజ్ఞం మాత్రమే కాదు. సత్కార్యం కానిది యజ్ఞం కాబోదు! ఇంద్రుడు సాధించిన విజయ పరంపరను గురించి ఋగ్వేదంలో చాలా చోట్ల చాలా సార్లు చెప్పబడింది.

    భారత దేశం కర్మభూమి. 'కర్మ' అనే పదాన్ని 'ఖర్మ'గా  వికృతం చేశారు. దానికి అరిష్టం అనే అనర్థం కల్పించారు. ఇప్పుడు అసలు అర్థం చెప్పినా నమ్మే స్థితిలో లేరు!

    మేలిమి బంగారం కన్న నకిలీ బంగారం మెరుస్తుంది. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, అన్నాడు వేమన్న.

    వాల్మీకి రామాయణంలో, అహల్య రాయి కాదు. లక్ష్మణ రేఖలు లేవు. శబరి ఎంగిలి పళ్లు పెట్టదు. కాని వాటినే జనం ఎక్కువ నమ్ముతున్నారు.

    "గాజు బొమ్మలు మెచ్చు కనులకు కోమలుల సౌరెక్కునా?" అన్నారు గురజాడ.

    'కర్మ పదం కూడా అలాంటిదే. కర్మ అంటే పని, కార్మికుడు పనిచేసేవాడు. కర్మభూమి అంటే పని, కృషి, నైపుణ్యానికి విలువ నిచ్చే దేశం అని అర్థం. ఇంద్రుడు, అశ్వినులు, ఋతువులు కేవలం తమ పరిశ్రమతోనే దేవతలైనారు. మానవుడు స్వశక్తితో దేవత కాగలడని నమ్మకం కలిగించింది కర్మ భూమి - భారత భూమి.

    కర్మ, పని, పరిశ్రమ, నైపుణ్యం లాంటి వాటికి అంతటి గౌరవం, స్థాయి, అంతస్తు కలిగించింది భారతతాత్వికత!

    మానవ వికాసానికి తోడ్పడిన పనిముట్లు సహితం దేవతలైనాయి. రోలు, రోకలి, రుబ్బురాయి, మానవ జీవిత వికాసానికి ఎంతగానో తోడ్పడినాయి. అందువల్లనే వాటిని శుభకార్యాల్లో పూజిస్తాం. ఒక చోట కప్పను దేవతను చేసి స్తుతించడం జరిగింది. ఆ సూక్తం అపహాస్యంగా తోస్తుంది. కాని కప్పలు అరుస్తే వాన వచ్చే సూచన! బొద్దింకల వింత ప్రవర్తన రానున్న భూకంపాన్ని సూచిస్తుందని చైనాలో కనుగొన్నారు.

    నేడు సైన్సు ఒక మూఢ నమ్మకం అయింది. పెరుగన్నం మంచిదనడానికి - తల్లిపాలకు  ప్రత్యామ్నాయం లేదనడానికీ, వేప, తులసి మున్నగు గుణాలు తెలుసుకోవడానికీ పరిశోధనలు చేయటం సైంటిస్టులవంతు అయింది. నాడు వాటిని కనుగొన్న శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఎంతటివి అయ్యుండునో తెలియలేకున్నారు!

    ఈనాటి సైన్సు పారిశ్రామిక సంపన్నుల చేతి కీలుబొమ్మ అయింది. వారు సైన్సు. ను తమబొక్కసాలు నింపుకోవడానికి దోపిడి చేస్తున్నారు. ఇది ఖర్మను మించిన నల్లమందు. మానవజాతిని అంతం చేయకమానదు. తస్మాత్ జాగ్రత - జాగృత!

    అవతరించడం అంతరించడం ప్రకృతి ధర్మం. సృష్టిలో - పరాత్పరునకుతప్ప - శాశ్వతత్వం లేదు, అన్నీ మారాలి, అన్నీ అంతరించాలి. కాలవ్యత్యాసం అంతే. సూర్య చంద్రాదులూ అంతరించవలసినవారే!

    ఋగ్వేదంలో ఒక మండలం సాంతం 'సోమము' నకే అంకితం అయింది. సోమము దేవత అయింది. డానికి అంతటి ప్రభావం ఉండిందేమో! ఇంద్రాదులకు అదే శక్తిని ప్రసాదించింది. అంతటి సోమము కాలగర్భములో కలిసిపోయింది!
   
    అవతరించడం -  అంతరించడం దేవతలకు వర్తిస్తుంది. వేద దేవతలు నేడు లేరు. వారికి ఆరాధన లేదు. ఇవ్వాళ రామకృష్ణాద్యవతారాలు వారికి ఆలయాలూ ఆరాధనలు ఉన్నాయి.

    వేదంలో అవతారాలు లేవు. ఒక్కచోట వామనుడు ప్రస్తావన వస్తుంది. అప్పటి  వామనుడు అవతార పురుషుడు కాడు.

    భారత తాత్వికత జడం కాదు. అది స్రవంతి. అవతారాలు సిద్ధాంతానిది ఒక  మహా ఇతిహాసం! ఎన్నని చెప్పడం?

    నేడు బుద్ధునికీ, జైనతీర్థంకరులకూ, ఆది శక్తి, పరాశక్తులకు జానపద దేవతలకు ముత్యాలమ్మ, గంగానమ్మ, మరిడమ్మ, పోశమ్మలకు ఆలయాలూ, ఆరాధనలు ఉన్నాయి.

    ఈ మధ్య కొత్త దేవతలు అవతరిస్తున్నారు. సాయి, సత్యసాయి, రాఘవేంద్రస్వామి, సంతోషిమాత లాంటివారు. కాలక్రమంలో మరికొందరు దేవతలు రావచ్చు. వ్రాతలో తప్ప సృష్టికి ఫుల్ స్టాప్ లేదు. కామాలు మాత్రమే ఉంటాయి, దేవతలు పుట్టుకురావడం ప్రాకృతం నిరోధించడం వికృతం!

    వేదంలో దేవతలు నిరాకారులుగానే స్తుతించబడినారు. ఆరాధించబడినారు. నాకు తెలిసినంతవరకు వేదాల్లో, ఉపనిషత్తుల్లో రామాయణ భారతాల్లో విగ్రహారాధన లేదు.

    భారత తాత్వికత కాలప్రవాహం లాంటిది. మార్పులను చాలా సహజంగా తనలో ఇముడ్చుకుంటుంది. విగ్రహారాధానది ఒక అనంత గాథ, ఎన్నని చెప్పడం?

    వేదయజ్ఞాలు, ఆరాధనలు, స్తుతులు అన్నీ కోరికలు తీర్చుకోవడానికి. సుమారు వేదం నిండా కామ్య కర్మలే! ఋగ్వేదంలో ఒక చోట దీన్ని వర్తకం అన్నారు. హవిస్సులు అర్పించడం వరాలు కొనుక్కోవడానికే!

    కామ్యకర్మలు యజమానులు స్వయంగా చేయరు. పురోహితులతో చేయిస్తారు.
   
    కామ్య కర్మలు సాధారణంగా  కాయికములు. మనసుతో అంత సంబంధం ఉండదు. అట్లని వేదానికి మనసు తెలియదని కాదు. వేదంలో మనసు ప్రస్తావన ఉంది.

    కామ్యకర్మ విధానమే నేటికీ అన్ని మతాల ఆరాధనలో కనిపిస్తుంది. దేవతలు  వేరు కావచ్చు.

    హెచ్చుతగ్గుగా ప్రపంచమంతటా భారత ధర్మంలో వలెనే సాకార, నిరాకార, ఆరాధనలున్నాయి. క్రైస్తవంలో సాకార, నిరాకార ఆరాధన ఉంది. ఇస్లాంలో విగ్రహారాధన నిషేధించింది. మళ్లీ నిరాకార ఆరాధన భారతీయమే అవుతుంది!

    ఈ దేవతలు - అవతారాలు, ప్రవకర్తలుగా చెప్పుకున్నవారూ ఒక్కొక్కరు గాని అందరు కలిసిగాని, పరాత్పరుడు, ఈశ్వరుడు, ప్రభువు అల్లా కాజాలరు.

    పరమాత్మ సత్యస్వరూపుడు, సత్య దర్శనానికి మానవ జాతి సాంతం - దేవకాల వ్యత్యాసం లేకుండా - నిరంతరం అన్వేషిస్తున్నది. ఇంతవరకు ఎంతటి మహర్షులకు, అవతార పురుషులకూ సత్యదర్శనమే కాలేదు. సృష్టి, స్థితి, లయకారుడగు పరమాత్మ అగమ్య గోచరుడు. అనిర్వచనీయుడు. అతని \ ఆమె రూపగుణాలను దర్శించిన నాకు ఇంత వరకు లేదు. పరమాత్మ లభించడు. అందడు. ఆ పరాశక్తి పరాత్పరుడు మహొన్నతులు. అతడు నరునికి అందడు. మావుని జ్ఞానము సర్వేశ్వరుని ఎరుగుటకు అపర్యాప్తం.

    ఆశక్తియే - ఆ పరాత్పరుడే సమస్తాన్ని సృష్టించాడు. ఆధారం లేకుండానే భూమిని, సూర్యచంద్రాది గ్రహనక్షత్రాదులను సృష్టించాడు. విశ్వం, భూమి, సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులకు పరమేశ్వరుడే ఆధారభూతుడు.

    మానవుడు, దుర్బలాతి దుర్బలుడు. వ్యాపారం. కోసం ఎన్నో యంత్రతంత్రాలను కనుగొన్నాడు. ప్రకృతిని - మానవ ప్రకృతిని - వ్యక్తిగా తన ప్రకృతిని తెలియలేకపోయాడు! ఏం గెలుస్తాడు? ఇన్ని యుగాలకాలంలో ఏం గెలిచాడు? తనను గెలువలేదు. శ్రీ మహాభాగవత పురాణం ఈ సత్యం ప్రవచించింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.