Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    'లోకములన్నియున్  గడియలోన జయించినవాడ వింద్రియానీకము  జిత్తమున్ గెలువనేరవు"

    మానవుని వద్ద ఒక మహత్తున్నది. అది ఆలోచన - అన్వేషణ. అది ఆగదు. ఆది మానవుని నుంచి భగవంతుని కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అతనికి భగవంతుడు లభించలేదు. అంతటితో మనిషి మిన్నకుండలేదు. భాగవంతుని ప్రతిరూపాలను కల్పించాడు. సృష్టించాడు.

    అలాంటి ఈశ్వరుని ప్రతిరూపాలే దేవతలు. మహాత్ములు. యోగులు, అవతారాలు, ప్రవక్తలు. వీరిలో ఎవరూ భగవంతుని సంపూర్ణ రూపాన్ని దర్శించలేదు. అందరూ భగవదంశను మాత్రము దర్శించగలిగారు. వీరిలో కొందరు భాగవదంశ అయినా కావచ్చు. భగవంతుడు మాత్రము కాదు.

    అయితే మహాత్ములు చూపిన దేవతాది ప్రతిరూపాలను ఆరాధించడం దోషం కాదు. పరాత్పరుడు అందనివాడు. యోగులు ప్రవక్తలు వారికి అందిన వారిని మనకు చూపారు. పరాత్పరుడు సత్యం, దేవాదులు విశ్వాసం.

    సత్యం దర్శనం ఇవ్వనప్పుడు విశ్వాసమే మహత్తం
    సముద్రం చూడనివానికి తటాకమే సముద్రం!

    ప్రభుత్వం దేశమంతటా ఉంటుంది. గ్రామస్తునికి గ్రామాధికారియే ప్రభుత్వం. ఎవరికి కావలసిన శాఖ వానికి ప్రభుత్వం. ప్రభుత్వం సాంతం ఎవరికీ తెలియదు!

    గ్రామస్తునికి గ్రామాధికారి వంటి వారే దేవతలు.
    యేప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః|
    తేపి మామేవ కౌంతేయ యజన్త్యవిధిపూర్వకమ్

    అన్య దేవతలను శ్రద్ధగా పూజించేవారు. పరోక్షంగా నన్నే పూజిస్తున్నారు అన్నాడు గీతలో కృష్ణపరమాత్మ.

    టాక్స్ కలెక్టరుకు ఇచ్చిన పన్ను ప్రభుత్వానికి చెందుతుందికదా!

    'ఏకం సద్విప్రాబహుధా వదంతి అంటుంది వేదం. వేదం సత్యం కాదు. సత్యాన్వేషణమే. దర్శించని సత్యాన్ని పండితులు బహుధా ఎలా చెప్పగలరు?

    'ఏకం సద్విప్రా బహుధా వదన్తి' అంటే సూర్య, చంద్ర, అగ్ని, వాయువులు భగవంతులుకారు వారు భగవంతుని అంశామాత్రులే అని.

    పరాత్పరుడు కర్త; సూర్యచంద్రాదులు అతని సృష్టి మాత్రమే. వారు  అశాశ్వతులు వారికి అంతం ఉంది. భగవానుడు శాశ్వతుడు. అనంతుడు.

    ఋగ్వేదం 10వ మండలం 7వ అధ్యాయం 121 సూక్తం 1- 10 మంత్రాల్లో పరాత్పరుని గుణగణాలు వర్ణిస్తూ "కస్మై దేవాయ హవిషా విధేమ?" అంటుంది. "ఏ దేవతకు హవిస్సులర్పింతుము? అనేది ఒక అర్థం అవుతే 'అట్టి దేవతకు హవిస్సులు అర్పింతుము' అనేది రెండో అర్థం అవుతుంది.

    మానో హంసీజ్జనితాయః పృథివ్యాయోవాదివ సత్య ధర్మాజజాన|
    యశ్యాపశ్చిన్ద్రా బ్రాహతీర్జిజానకస్మై దేవాయ హవిషా విధేయ||

    ఎవరు భూమిని సృష్టించాడో, ఎవని బలము సత్యమగునో ఎవడు ఆకసమును, ఆనంద వర్ధకమగు జలరాశిని సృష్టించాడో అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పింతుము. అట్టి దేవతకు హవిస్సులు అర్పింతుము?

    అతడెవరో తెలియలేదు. ఎవడు? ప్రశ్న మాత్రమే మిగిలింది.

    "ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల నుండు లీనమై
    యెవ్వని యందుడిందు పరమేశ్వడెవ్వడు మూల కారణం
    బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు సర్వము దానెయైన వా
    డెవ్వడు వానినాత్మభవునీశ్వరునేశరణంబు వేడెదన్"
    
    అన్నాడు శ్రీమదాంధ్రమహాభాగవతంలో పోతనామాత్యుడు.

    ఒక విషయం స్పష్టం. ఒక్కొక్క  మతానికీ, వర్గానికీ, సిద్ధాంతానికి ఒక్కొక్క పరమాత్మ పరాత్పరుడు, ఈశ్వరుడు ఉండరు. ఉన్నది ఒకే సర్వేశ్వరుడు. స్పష్టి, స్థితి, లయకర్త.

    భగవానుడు ఒక్కడే. ప్రవక్తలు పెక్కురు.

    భూగోళం ఒక్కటే. దేశాలు అనేకం. ఆకాశం ఒక్కటే, గ్రహ నక్షత్రాదులు అనేకం. సముద్రం ఒక్కటే - నదులు అనేకం.

    "ఏకోవైబ్రహ్మ నాద్వితీయం"

    అయిన ఇందరు దేవతలేల? అని వెక్కిరించవద్దు. "లోకోభిన్నరుచిః" ఎవని రుచిని బట్టి వాడు. ఒకే ప్రవక్తను నమ్మమనడం, పూజించమనడం, నియంతృత్వం, ప్రకృతి విరుద్ధం కూడా. చరిత్రలో కలకాలం నిలవలేదు.

    ఒక గ్రామానికి, ఒక స్థలానికి ఒకే మార్గం ఉండటం బూటకం. లక్ష్యం చేరుకోవడానికి అనేక మార్గాలుంటాయి. ఒకని అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మార్గం ఎన్నుకుంటారు.

    ఒకేదారి పట్టినవానికి ప్రమాదం తప్పదు. లక్ష్యం చేరడం. మార్గమే లక్ష్యం అవుతుంది.

    భారతీయులు బహుదేవతారాధకులు. అట్లని సిగ్గు పడనక్కరలేదు. వారి లక్ష్యం పరాత్పరుడు, మార్గాలు దేవతలు.

    వేదంలో దేవతలు ప్రత్యక్షం కారు. మాయం కారు. తపస్సుకు మెచ్చి వరాలివ్వరు. వేదం వాస్తవం. అభూత కల్పనలు అరుదు.

    వర్ణనలు, ఉపమానాలు, అతిసాధారణాలు. గ్రామ సంబంధులు వాస్తవాలు. అతి సుందరములు.

    వేదం - అర్థం - వ్యాఖ్య

    కౌత్సఋషి వేదానికి అర్థం ఉండదనీ, వేదార్థం తెలిసికోరాదని సిద్ధాంతీకరించారు. ఇందుకు  ఏదో బలమైన కారణం ఉండాలి. ఋషి స్వ ప్రయోజనం మాత్రం కాకపోవచ్చు.

    వేదం చదువరాదని నిషేధించాలని సర్వే సర్వత్ర కొందరిలో  ఆగ్రహం ఉంది. నాలుగు  వేదాల్లోను ఎక్కడా వేదాధ్యయనాన్ని గురించి విధి నిషేధాలున్నట్లు నాకు కనిపించలేదు. మహా భాగవతం, మనుస్మృతిలో ఈ నిషేధాలున్నమాట వాస్తవం. వ్యాస మహర్షియే వేదాల సంహితలు చేశాడు. ఇక్కడ నిషేధం విధించనివాడు భాగవతంలో ఎందుకు నిషేధిస్తాడు? మహా  భారతంలో కౌశికుని కథ ఉంది. అందులో వ్యాసమహర్షి కటికవానితో తపస్సంపన్నుడైన కౌశికునికి ఉపదేశం చేయిస్తాడు. మరొక చోట కుక్కమాంసం విషయంలో చండాలుడు విశ్వామిత్రునికి సహకరిస్తాడు. మహర్షులు మహాత్ములు, కులం. మతం లాంటి కొంచెం వాటికి లొంగరు. వారికి 'ఆత్మవత్సర్వ భూతాని' - తమ వంటివే సమస్త ప్రాణులు.

    భారత, భాగవత, మనుస్మృత్యాదుల్లో వేద పఠనాన్ని గురించిన నిషేధం ప్రక్షిప్తం అని నా  అభిప్రాయం. వేదకర్మలే ఉపాధిగా జీవించే కొందరు స్వప్రయోజనాపరులు చేర్చి ఉండవచ్చు.

    అచ్చుయంత్రం వచ్చింది. వేదం సకల జనులకూ అందుబాటులోకి వచ్చింది. అన్య  మతస్తులూ వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. అంతకు ముందు విధి నిషేధాలు వాస్తవంగా ఉన్నా అవి ఆవిరి అయిపోయాయి. ప్రస్తుతం వేదాధ్యయనానికి శ్రద్ధ మాత్రమే అవసరం!

    వేదం సూర్యుని వంటిది. సూర్యకాంతి వంటిది. వేదం కుల, మత, ప్రాంత, దేశాలకు అతీతం అయింది. అది సకల మానవాళికి చెందింది. వెలుగునూ, అగ్గిని మూటకట్టి దయగల మొనగాడు లేడు. కులమతాలకు అతీతంగా అందరికీ వేదం అందాలనేది నా సంకల్పం. పరాత్పరుడు నా సంకల్పాన్ని ఆశీర్వదించాడు. లేకుంటే నాలుగు వేదాల అనువాదం నావంటి సామాన్యునికి సాధ్యం అయ్యేదికాదు.

    మేం వేద కవాటాలు తెరిచాం. శాంతికవాటాలు తెరిచాం. వెలుగను వేదాన్ని ప్రజాయత్తం చేశాం. కుల, మత, వివక్ష లేకుండా వేదాన్ని సకల జనులూ తాకండి. నమస్కరించండి. అర్చించండి. పూజించండి. అధ్యయనం చేయండి. ఆలోచించండి. వ్యాఖ్యానించండి.

    నాకు పరమానందంగా ఉంది. నా జీవితం ధన్యం అయింది. దశ పూర్వేషాం దశపరేషాం మా వంతూ పవిత్రం అయింది. వేదం అందరికీ అందించగలిగాను. పరాత్పరుడు నాతో ఆ పనిచేయించాడు.

    వేదం కన్న ప్రాచీన గ్రంథ ప్రపంచం లేదు. వేదాన్ని ఇంట్లో పెట్టుకొండి. చాలు. ఉంటే చదువుతారు. అది మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వేదం నుంచి కర్మ ఆశించవద్దు. జ్ఞానం ఆశించాలి.

    వేదం విషయంలో పాశ్చాత్యులు అనేక కువాఖ్యలు చేశారు. వాటినే మన మేధావులు ప్రమాణంగా భావిస్తున్నారు. ఇది సాంస్కృతిక బానిసత్వం. మేధావులను ఈ బానిసత్వం నుంచి బయటపడేయడానికి ఇంతవరకు సరియైన ప్రయత్నం జరుగలేదు. ఇది అందుకు పర్యాప్తం కాదు. ఒక్క విషయం మాత్రం  మనవి చేస్తాను. వేదాన్ని గౌతమ బుద్ధుని నుంచి రామానుజుని వరకు నిరసించారనే ఒక మూఢ నమ్మకం పాశ్చాత్యులు కలిగించారు.

    వాస్తవం ఏమంటే బుద్ధుడు, ఆదిశంకరుడూ రామానుజుడు వేదాలను నిరసించలేదు. వారు నిరసించింది వేదం పేర జరిగే కర్మలను. స్వప్రయోజనపరులు వేదం అంటే యజ్ఞ, యాగాది క్రతువులు మాత్రమే అనే నమ్మకం కలిగించారు. ప్రజలను చీకట్లో ముంచారు. తమ పబ్బం  గడుపుకున్నారు. ఇది ఈనాటికి జరుగుతున్నది. ధనార్జన కోసం ఈనాడు చేస్తున్న అన్ని యజ్ఞ యాగాది క్రతువులకు వేదంలో ప్రమాణం లేదు. ఈ కేవల ధనర్జననే అందరు ఆచార్యులూ నిరసించారు. మేము నిరసిస్తున్నాం. అయితే సామాన్యుల స్వభావం స్వప్రయోజనపరులకు నమ్మకమే? వాస్తవాన్ని విశ్వసించేవారు అరుదు!!!

`    క్రీస్తుకు వేయి సంవత్సరాల పూర్వపు వాడు యాస్కుడు. అతడు వేదానికి అర్థం తెలుసుకోవాలని వాదించాడు. వేదార్థ భాష్యమను 'నిరుక్తం' రచించాడు.

    'దైవం స్థాణోరపరాధః యదేనం అంధో న పశ్యతి. పురుషాపరాధః నా భవతి" ఒక పదార్ధం ఉంది. దాన్ని అంధుడు చూడడు. అపరాధం పదార్థానిది కాదు. అంధునిది అవుతుంది.

    వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోనివాడు అంధుడు అవుతున్నాడు. అంధునికి వేద కర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు. వేదార్థం తెలియపరచే యాస్కుని ప్రయత్నం మూడు వేల సంవత్సరాల క్రితమే మొదలయింది!

    "స్థాణురయం భారవాహఃకిణ భూత్ అధీత్య వేదాన్ నవిజానాతియ్కోర్థం|
   
    య్కోర్థజ్ఞఇత్ సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞానవిధూత పాప్మా||

    "ఒకడు బరువు మోస్తాడు. మోసిందేమిటో తెలియదు. అలాంటివాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు.

    వేదం చదివి అర్థం చేసుకున్నవాడికే సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాల్ను కడిగేస్తుంది.  అతనికి స్వర్గం ప్రాప్తిస్తుంది" అన్నాడు యాస్కఋషి.

    తదుపరి 1. స్కందస్వామి. 2. ఉద్గీత 3. వేంకటస్వామి వేదానికి వ్యాఖ్యానం రచించారు. స్కందస్వామి 'వల్లభి' నివాసి.  'వల్లభి' గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. పేరును బట్టి వేంకట మాధవులు తెలుగువాడేననిపిస్తున్నాది. వారు ఆంధ్రులైనందుకు ఆంధ్రజాతిగా గర్విస్తామా?

    ఆంధ్రులు వేద వ్యాఖ్యకు అపారం అయిన సేవలు చేశారు.

    వేదాలకు అధికారపూర్వక వ్యాఖ్య చేసిన ఆంధ్రుడు సాయణాచార్యులు. ప్రాకృశ్చిమ విద్వాంసులు ఎవరైనా సాయణుని వ్యాఖ్య ఆధారంగానే వేదాన్ని అర్థం చేసుకుంటున్నారు.

    సాయణాచార్యుడు క్రీ.శ. 1315లో జన్మించాడు. 72 సంవత్సరాలు జీవించాడు. 1387లో పరమపదించాడు.

    ఆంధ్రుడు ఆచార్య సాయణుడు రాజనీతి విశారదుడు. అతడు కంపపడ్డాయి. విస్తరిస్తున్నాయి. అలంటప్పుడు విద్యారణ్యస్వామి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యం స్థాపింపచేశాడు. మహారాష్ట్రులకు శివాజీ వంటివారు ఆంధ్రులకు హరిహర, బుక్కరాయలు. మహారాష్ట్రులు చాటుకుంటారు! ఆంధ్రుల నోరు మూసుకుంటారు!

    బుక్కరాయలు వేద ధర్మాన్ని ఉద్ధరించదలిచాడు. సాయాణాచార్యులను వేదాలకు వ్యాఖ్య చేయవలసిందని అర్థించాడు.

    "ఇతి శ్రీమద్ రాజాధిరాజ పరమేశ్వర వైదిక మార్గ ప్రవర్తక వీర బుక్క భూపాల సామ్రాజ్య ధురంధరేణ సాయణాచార్యేణ విరచితే మధవీయ వేదార్థ ప్రకాశ ఋక్ సంహితా భాష్యే ప్రథమాష్టక్కేష్టమాధ్యాయుః సమాప్తః" అని చెప్పుకున్నాడు సాయాణాచార్యులు ఋగ్వేదపు ప్రథమాష్టక సమాప్తి గద్యలో.

    సాయాణాచార్యుడు ఆంధ్ర బ్రాహ్మణుడు. అతనిది భరద్వాజ గోత్రం. బోధాయన సూత్రం మాయన, శ్రీమతి అతని తల్లిదండ్రులు.

    సాయణునికి ఒక రాజు రాజకీయ, ఆర్ధిక బలం లభించింది. అతడు అనేకమంది పండిత ప్రకాండులను కూర్చుకున్నాడు. వేద వ్యాఖ్య రచించాడు.

    నేటి స్థితి, రాజకీయాలకు అర్థదాహం, అధికారతపన తప్ప అక్షరజ్ఞానం శూన్యం. భర్తృహరి కవిత
   
    బోద్ధారోమత్సరగ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః|




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.