Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
నలుబదవ అధ్యాయము
సమాప్తం కర్మకణ్డమిదానీం జ్ఞానకాణ్డం ప్రస్తూయతే. కర్మకాండము పూర్తి అయినది. ఇక జ్ఞాన కాండమును ప్రస్తావించుచున్నాను.
1. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్|
తేన త్యక్తేన భుజ్జీథా మాగృధః కస్య స్విద్ధనమ్ ||
ఇది సాంతము ఈశ్వరమయము. ఈ లోకమున అగుపించు సమస్త చరాచర ప్రపంచము ఈశ్వరమయము. ఈశ్వరుడు ప్రసాదించిన వానిని అనుభివించుము. మరొకని ధనమునకు ఆశపడకుము.
2. మానవుడు కర్మ చేయుచునే నూరేండ్లు జీవించ నిచ్చగించవలెను. అందుననే ముక్తి ఉన్నది. మరొక మార్గములేదు. ఆ విధముగా చేయువానికి కర్మలు చుట్టు కొనవు.
3. అసూర్య మను లోకములు ఉన్నవి. అవి అంధకారము తమస్సులతో నిండి యుండును. ఆత్మహనులగు జనులు మరణానంతరము ఆ లోకములకు చేరుదురు.
(అంతరాత్మ ఆక్రందన వినక అకార్యములు చేయువాడు ఆత్మహననుడు)
4. అతడు నిశ్చలుడు. ఒక్కడు. మనసును మించిన వేగవంతుడు. వేగమున దేవతలు అతనిని అందుకొనజాలరు. అతడు తొలినుండియే సర్వత్ర వ్యాపించినవాడు. పరిగెత్తు ఇతరులను అతడు దాటిపోవును. అతని యందే గాలి, నీరు నిలిచి ఉన్నవి.
5. అతడు కదులు వాడగును. కదలనివాడగును. అజ్ఞానికి అతడు బహుదూరము. జ్ఞానికి అతడు అతి దగ్గర. అతడు సర్వాంతర్యామి. అతడే బాహ్య ప్రపంచము.
"తదన్తరస్య సర్వస్య తదు సర్వసాస్య బాహ్యతః"
6. ఎవడు సర్వభూతములను తనలో చూచుచున్నాడో సర్వభూతములందు తనను చూచుచున్నాడో, అతనికి సందేహమన్నది ఉండదు.
7. ఎవడు సర్వభూతములను తానుగానే గ్రహించుచున్నాడో, అతనికి మోహమెక్కడ? శోకమెక్కడ? 'ఏకత్వమను పశ్యతః' అతడు అన్నింటిని ఏకముగ చూచువాడు కదా!
8. అతడు సర్వవ్యాపకుడు. వీర్యరూపుడు. కాయము లేనివాడు. వ్రణము లేనివాడు. స్నాయు బంధములకు అతీతుడు. శుద్ధుడు, పాప బంధములు లేనివాడు. విద్వాంసుడు. మనీషి, పరితః వ్యాప్తుడు. స్వయంభువు. అతడే కాలానుగుణముగా పంచభూతాత్మక సృష్టిని ఏర్పరుచును.
9. అసంభూతి ఉపాసించువారు అంధతమమునకు చేరుదురు. సంభూతి యందే మునిగిన వారు మరింత అంధకారమునకు చేరుదురు.
(మృతస్యసతః పునః సంభవోనాస్తేతి అసంభూతిః పునర్జన్మ లేదనుట అసంభూతి.
ఆత్మైవాస్మి నాన్యాత్కించిదస్తీత్యయమభి ప్రాయః తాను తప్ప అన్యము లేదనుట సంభూతము)
10. స్థూల జగత్తును ఉపాసించుట వలన ఒకే ఫలము కలుగును. అసంభూత మూల జగత్తును ఉపాసించుటవలన వేరు ఫలము కలుగును. మాకు బ్రహ్మతాత్త్వ వివేచన కలిగించిన విద్వాంసులు అది అసంభవమని చెప్పగా విన్నాము.
11. ఉత్పత్తి, వినాశము, రెండింటిని వెంట వెంట తెలిసిన పండితుడు వినాశమున మృత్యువును దాటి సంభూతి ద్వారా అమృతత్వము నొందును.
12. అవిద్యను ఉపాసించువారు అంధతమమున చేరుదురు. ఆత్మ విద్య కాక అన్య విద్యారతులు మరింత అంధతమమునకు చేరుదురు.
13.ఆత్మజ్ఞానమునకు అమృతత్వ ఫలమని కొందరు అనుచున్నారు. అవిద్యకు పితృలోక ఫలమని కొందరు అనుచున్నారు. అట్లని జ్ఞానకర్మల విచక్షణ గల విద్వాంసులు అన్నారని వినుచున్నాము.
14. విద్య, అవిద్య రెంటిని వెంట వెంట తెలిసి కొనవాడు. అవిద్య వలన మృత్యువును దాటి విద్యవలన అమృతత్వము నొందుచున్నాడు.
15. ప్రాణము వాయువునందు, ఆత్మ అమృతత్వమునందు లీనములగును. దేహము బూడిద అగును. కావున పరమాత్మను స్మరించుము. లోకమును స్మరించుము. చేసిన దానిని స్మరింపుము.
16. అగ్నేనయ సుపథారాయే అస్మాన్విశ్వాని దేవ వయువాని విద్వాన్|
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ||
7- 43 చూడండి.
17. హిరణ్మయేన పాత్రేణ సత్యప్యాపిహితం ముఖమ్|
య్కోసావాదిత్యే పురుషః స్కోసావహమ్||
ఓం ఖం బ్రహ్మ
సత్యపు ముఖమును బంగారు పాత్ర కప్పిపెట్టినది. ఆదిత్యుని యందున్న పరమ పురుషుడను నేనే అగుదుము.
ఓం మహాబ్రహ్మన్
విద్వాంసుడు. బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాలసాహిత్యకారుడు. విమర్మకుడు, చలనచిత్ర రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, కార్మికోద్యమకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రగతి పథగామి, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, ప్రపన్నుడు, బుధజన విధేయుడగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహిత యందలి పరమాత్మనిరూపకమగు
నలుబదవ అధ్యాయమును శుక్ల యజుర్వేద సంహితయు
సర్వము సమాప్తము.
ద్యౌః శాన్తి రన్తరిక్షం శాన్తిః పృథివీ శాన్తి రాపః శాన్తి రోషధయః శాన్తిః
వనస్పతయః శాన్తిర్విశ్వే దేవాః శాంతి ర్బ్రహ్మ శాన్తిః సర్వంశాన్తిః శాంతిరేవశాన్తిః సామాశాన్తిరేధి||
(శుభం)




