Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



                                        ఎనిమిదవ అనువాకము

    1. ఒకప్పుడు సూర్యుడు ప్రకాశింపకుండినాడు. దేవతలు సూర్యునకు ప్రకాశము కలిగించదలచినారు. వారు - సూర్య దేవతాకమైనదియు, తెల్లనిదియునగు, గొడ్డుటావును వధించినారు. దాని వలన దేవతలు సూర్యుని యందు కాంతిని స్థాపించినారు.

    2. బ్రహ్మవర్చస్సును కోరువాడు - సూర్యదేవతాకమైనదియు, తెల్లదియునగు - గొడ్డుటావును వధించవలెను. అతడు తన భాగధేయమున సూర్యుని యజించవలెను. అప్పుడు సూర్యుడే అతని యందు బ్రహ్మవర్చస్సును ఏర్పరచును. అతడు బ్రహ్మవర్చస్సు కలవాడు అగుచున్నాడు.

    3. యూపస్తంభము బిల్వ - మారేడు - సంబంధి కావలెను. సూర్యుడు పుట్టిన చోటునుండియే బిల్వము పుట్టినది. సూర్యుడు, బిల్వము ఒకే యోనినుండి పుట్టినారు. కావున - మారేడు యూపము వలన యజమానికి బ్రహ్మవర్చస్సు కలుగుచున్నది.

    4. శత్రువధ కోరువాడు - బ్రహ్మణస్పతి దేవతాకమును, పింగళవర్ణపు చెవులు కలదియునగు పశువును ఆలంభనము చేయవలెను.

    5. అతడు వరుణదేవతాకమగు దశ కపాలమును తొలుత నిర్వాపము చేయవలెను. అందువలన వరుణుడు శత్రువును బాధించును. బ్రహ్మణస్పతి శత్రువును పీడించును.

    6. పశువు బభ్రుకర్ణి కావలెను. అది బ్రహ్మస్వరూపము అగును. అది యజమానికి సమృద్ధి కారణము అగుచున్నది.

    7. యూపము దారుఖడ్గాకారము కావలెను. అది వజ్రాయుధమగును. శత్రువును వజ్రాయుధము వలె వధించును.

    బర్హి స్సు రెల్లుకావలెను. అది శత్రువును నిశ్చయముగా హింసించును.

    సమిధ తాండ్రసంబంధి కావలెను. అది శత్రువును ఛేదించి తీరును.

    8. యజ్ఞమును చేయనివాడు - విష్ణుదేవతాకమును, పొట్టిదియునగు - పశువును బలి ఇవ్వవలెను. విష్ణువర్వైయజ్ఞః. విష్ణువే యజ్ఞము అగుచున్నాడు. యజమాని స్వభాగధేయమున విష్ణువును యజించవలెను. అప్పుడు విష్ణువే అతనికి యజ్ఞము కలిగించును. అతడు యజ్ఞము చేసినవాడు అగుచున్నాడు.

    వామనో భవతి వైష్ణవో - పొట్టిది విష్ణుసంబంధి అగును. అది యజమానికి సమృద్ధి కలిగించును.

    9. పశువులను కోరువాడు త్వష్టదేవతాకమగు వడబను వధించవలెను. త్వష్టావై పశూనాం మిథునానామ్ ప్రజనయితా - త్వష్టయే పశుమిథునమును సృష్టించుచున్నాడు. అతడు స్వభాగధేయమున త్వష్టను యజించవలెను. ఆ త్వష్టయే అతనికొరకు పశుమిథునములను కలిగించును.

    10. ఒక పశువు మగది అయ్యు ఆడుదాని లక్షణములు కలిగి యుండును. దానిని చూచి ప్రజలు, పశువులు ఆడది అనుకొందురు. అట్టి ఆడదని భ్రమ కలిగించు సహజ పురుష పశువు వడబ అగును. అది యజమానికి వెంటనే పశువులను కలిగించు చున్నది.

    11. సంగ్రామే సంయత్తే సమయకామో - సంగ్రామమునకు ఆయత్తమై సంధికోరువాడు - మిత్ర దేవతాకమగు, తెల్లని పశువును వధించవలెను. స్వభాగధేయమున మిత్రుని సేవించవలెను. అప్పుడు మిత్రదేవతయే అతనికి మిత్రుని సమకూర్చును.

    12. యూపము విశాలము కావలెను. అది సంధి కోరువానికి ధైర్యము కలిగించును.

    13. వర్షము కోరువాడు ప్రజాపతి దేవతాకమగు నల్లని పశువును వధించవలెను. ప్రజాపతిర్వై వృష్ట్యాఈశే - ప్రజాపతియే వృష్టి కలిగించ సమర్థుడు అగును. ప్రజాపతిమేవ స్వేన భాగధేయేనో ధావతి - అతడు ప్రజాపతిని తన భాగధేయమున యజించవలెను. అతడే యజమానికి వర్షము కలిగించును.

    14. పశువు నల్లనిది కావలెను. అదియే వర్షపు రూపము అగును. ఆ రూపముననే యజమానికి వర్షము కలుగుచున్నది.

    15. పశువు కలగలుపు రంగులది అయినపుడు యజమానికి మెరుపుతో కూడిన వర్షము కలుగుచున్నది.

    16. పశువు ముఖము వైపు వంగిన కొమ్ములు కలది అయినపుడు, అది యజమాని కొరకు వర్షమును నియంత్రించుచున్నది.

                                    తొమ్మిదవ అనువాకము

    1. వరుణుడు సోమాభిషవము చేసినాడు. అయినను అతనికి అన్నాదులు లభించలేదు. అప్పుడు అతనికి నల్లనిగొడ్డుటావు కంటపడినది. అతడు దానిని స్వ దేవతాకము చేసికొన్నాడు. దానిని ఆలంభనము చేసినాడు. అప్పుడే అతనికి అన్నాదులు లభించినవి.

    2. ఒకడు అన్నాదులు ఆర్జించుటకు సమర్థుడు అగును. అట్లయ్యు అతడు అన్నాదులు ఆర్జించలేకపోవును. అట్టివాడు వరుణ దేవతాకమగు నల్లని పశువును వధించవలెను. వరుణుని స్వభాగధేయమున అర్చించవలెను. వరుణుడే అతనికి అన్నము ప్రసాదించును. అతడు అన్నము కలవాడు అగుచున్నాడు.

    పశువు నల్లనిది కావలెను. అది వరుణ దేవతాకము అగును. దానివలన యజమానికి సమృద్ధి కలుగుచున్నది.

    3. అన్నము కోరువాడు జలములు, ఓషధుల మధ్య మిత్రదేవతాకమగు తెల్లని పశువును - వరుణదేవతాకమగు నల్లని పశువును వధించవలెను. ఓషధులు మిత్ర దేవతాకములు. జలములు వరుణ దేవతాకములు. మనము జలముల, ఓషధుల రసముపై జీవించుచున్నాము.

    అన్నము కోరువాడు మిత్రావరుణులను స్వభాగధేయమున యజించవలెను. వారే అతనికి అన్నము ప్రసాదింతురు. అతడు అన్నము కలవాడు అగుచున్నాడు.

    4. జలములను ఓషధులను పొందుటకు జలముల ఓషధుల మధ్య ఆలంభనము చేయవలెను.

    5. యూపము - విశాఖః - వివిధ శాఖలు కలది కావలెను. ఆ ఇరువురు దేవతలు యజమానికి సమృద్ధి కలిగింతురు.

    6. దీర్ఘరోగము కలవాడు మిత్ర దేవతాకమగు తెల్లని పశువును, వరుణదేవతాకమగు నల్లని పశువును వధించవలెను. పశువు మిత్ర దేవతాకము. అందువలన మిత్రుని చేతనే వరుణుని శాంతింపచేయును. పశువు వరుణ దేవతాకము అయినందున వరుణుడు స్వయముగనే అతనిని వరుణ పాశముల నుండి విముక్తి కలిగించును. యదీతాసుర్భవతి జీవత్యేవ - గతాసువైనను జీవించును.

    7. దేవతలు పుష్టిని పొందలేకపోయినారు. మానవ మిథునమునందు వారికి పుష్టి గోచరించినది. అయినను వారు పుష్టిని పొందలేక పోయినారు. అప్పుడు అశ్వినులు ఈ పుష్టి తమకు సంబంధించినదనియు ఇందును గురించి దేవతలు మాట్లాడరాదనియు అన్నారు. అందువలన ఆ పుష్టి అశ్వినీదేవతల వశము అయినది.

    8. పుష్టిని కోరునట్టివాడు అశ్వినీ దేవతాకమగు కవలలుగా పుట్టినవానిలో ఆడ గొడ్డుటావును వధించవలెను. అశ్వినీ దేవతలను స్వభాగధేయమున సేవించవలెను. అశ్వినులు అతనికి పుష్టిని ప్రసాదింతురు. అతడు - పుష్యతి ప్రజయా పశుభిః - అతడు సంతానము, పశువులు కలిగి పుష్టికలవాడు అగును.

                                      పదవ అనువాకము

    1. ఒకడు దుర్భ్రాహ్మణుడు. అట్లయ్యు సోమమును అభిషవించకోరును. అతడు నొసట తెల్లని మచ్చ కలిగి, మిగిలిన దేహము ధూమ్రవర్ణమైన పశువును వధించవలెను.

    దేవతలందు అశ్వినులే సోమపానము చేయనివారై ఉండిరి. తదనంతరము వారు సోమపానమునకు అధికారము కలవారు అయినారు.

    దుర్భ్రాహ్మణులకు అశ్వినులు దేవతలు అగుదురు. అతడు అశ్వినులను స్వభాగధేయమున అర్చించవలయును. అశ్వినులే అతనికి సోమపాన అధికారమును ప్రసాదింతురు. అతడు సోమపానమునకు అధికారి అగును.

    పశువు ధూమ్రవర్ణము కలది అయినందున దుర్భ్రాహ్మణుని నుండి దౌర్భ్రాహ్మణ్యమును తొలగించును. పశువు నొసట తెల్లని మచ్చ అతనికి ముఖ్య తేజస్సును కలిగించును.

    2. అతడు బ్రాహ్మణుని వధించడు. అయినను వధించినాడని అపవాదు కలుగును. అట్టివాడు వాయు దేవతాకమగు గోమృగమును వధించవలెను. హత్యచేయని వానిని చేసినాడని అపవాదు కలిగిన - అట్టిదానిని అపవిత్ర వాక్కు ఆక్రమించుచున్నది.

    ఈ గోమృగము గ్రామమున సంచరించునది కాదు. అరణ్యమున సంచరించునది కాదు. అట్లే హత్యాపవాదమునకు గురియైనవాడు గ్రామమున ఉండడు. అరణ్యమున ఉండడు.

    వాయువు దేవతలందు పవిత్రుడు. కావున స్వభాగధేయమున వాయువును పూజించవలెను. వాయువే అతనిని పవిత్రుని చేయును.

    3. ఒకడు అశ్వినులను స్తుతించుచుండును. అప్పుడు సూర్యుడు ఆవిర్భవించును. జగమునకు తెల్లవారినను అతనికి తెల్లవారకుండును. అట్టివాడు సూర్యదేవతాకమగు పలు రంగుల పశువును వధించవలెను. అతడు స్వభాగధేయమున సూర్యుని అర్చించవలెను. సూర్యుడే అతని చీకటిని, పాపమును పోగొట్టును. రాత్రి అతనికి తెల్లవారును. చీకట్లను, పాపములను తరిమివేయును.

                                    పదకొండవ అనువాకము

    1. ఇంద్రుడు మాకు విశ్వతస్వరీంద్రుడు, మరుత్తులు నరులు అగుదురు గాక.

    2. హవిస్సులు సముపార్జించుచున్నాము. ఇంద్రుడు, అగ్ని మున్నగు దేవతలను - యజమానికి శ్రేయస్సు కలిగించమని హవిస్సులు అందుకొనమని ఆహ్వానించుచున్నాము.

    ఇంద్రుడు సుముఖముగా ఆహ్వానించదగినవాడు. పాప విమోచనుడు. హితంకరుడు, స్వయంభువు. వర్షము కలిగించి పంటలు పండించువాడు. ఇంద్రుని, అగ్నిని, మిత్రుని, వరుణుని, భగుని, ద్యావాపృథ్వులను, మరుత్తులను, ఇతర దేవతలను యజమానికి శ్రేయస్సు కలిగించుటకు హవిస్సులు అందించుచు ఆహ్వానించుచున్నాను.

    3. అగ్ని సర్వభక్షకుడు. అతడు మమ్ము సంతోషపెట్టును గాత. దినావసానము కలిగించు సూర్యుడు మమ్ము సంతోషపెట్టును గాత. వాయువు మమ్ము సంతోష పెట్టును గాత. నీటిని వర్షించు పర్జన్యుడు మమ్ము సంతోషపెట్టును గాత. ఇంద్ర, పర్వతములారా! మా పాపములను దూరము చేయండి. మేము హవిస్సులను ఇచ్చుచున్నాము. దేవతలందరు మమ్ము కరుణింతురు గాత.

    4. మరుత్తులారా! మీరు హవిస్సుల కొరకు ఆతురులు అగుచున్నారు. మీరు తృప్తిని కోరుచున్నారు. మిమ్ము - మాకు ప్రియములగు నామములతో ఆహ్వానించుచున్నాము.

    5. మరుత్తులు పురోవాతరూపులు. జనులకు సుఖమును, శ్రేయస్సును కలిగించువారు. వారు తమ ప్రకాశమాన కిరణములచే భూమిని తడుపవలెను అనుకొనుచున్నారు. వారు మంత్ర సహిత హవిస్సును ఆరగించినారు. అందువలన వారు ఉత్సాహవంతులు అయినారు. కేకలు వేయుచున్నారు. తమ ఇండ్ల వైపు సాగుచున్నారు. నిర్భయముగా మరుత్తుల స్థానమునకు చేరుచున్నారు.

    6. అగ్ని మమ్ము రక్షించును గాత. రుద్ర సహిత సోముడు మమ్ము స్వయముగా రక్షించును గాత. మరుత్సహిత ఇంద్రుడు మాకు ఋతువులకు తగిన భోగములు కలిగించును గాత. ఆదిత్య సహిత వరుణుడు మమ్ము యజ్ఞములు చేయువారిని చేయును గాత.

    7. వసువులతో కూడిన అగ్ని మాకు అనుష్ఠానము తెలుపును గాత. రుద్ర సంబంధ తనువులతో కూడిన సోముడు మాకు అనుష్ఠానమును తెలుపును గాత. యజ్ఞయోగ్యులైన మరుత్తులతో కూడిన ఇంద్రుడు మాకు అనుష్ఠానమును తెలుపును గాత. ఆదిత్య సహిత వరుణుడు మాకు అనుష్ఠానము తెలుపును గాత.

    8. ఆదిత్యులు వసువులతో సంగతులగుదురు. మరుత్తులు రుద్రులతో సంగతులగుదురు. అగ్నీ! అట్లే నీవు విశ్వేదేవతలతో సంగతుడవు అగుము. సకల దేవతలు - శత్రువు అపహరింపజాలని ఐశ్వర్యవంతులు అగుదురుగాక. సమాన మనస్కులు అగుదురుగాక.

    9. స్విష్టకృద్దేవుని అనుగ్రహమున మానవులు ఎచ్చటెచ్చటనో ఆనందించుచున్నారు. ఆ దేవునకు యజమానులు సమంత్రకముగా ఆహుతులు సమర్పించుచున్నారు. ఇంధనములు ప్రజ్వలింప చేయుచున్నారు. ఫలములు పొందుచున్నారు. అట్టి స్విష్టకృద్దేవత ప్రసన్నుడు అగును గాత.

    10. స్విష్టకృద్దేవర అనుగ్రహమున కోరిన అన్నములను పొందుచున్నాము. యజమానులము హోమ యోగ్యములగు ద్రవ్యములు పొందుచున్నాము. అందువలన ధన, బల, యజ్ఞ ప్రకాశములు పొందుచున్నాము. అట్లు మమ్ము అనుగ్రహించిన స్విష్టకృద్దేవుని భజించుచున్నాము.

    11. ఈ యజ్ఞము దేవతల సుఖము కొరకు జరుగుచున్నది. ఆదిత్యులారా! మీరు మాకు సుఖములు ప్రసాదించండి. మీ అనుగ్రహము మాకు మరల మరల కలుగును గాత. పాపములను నశింపచేయునది యగు మీ అనుగ్రహబుద్ధి మా పరిచర్యలను గుర్తించును గాక.

    12. యజమాని అన్న, భోగాదులు కలవాడు. శత్రువును ధిక్కరించగలవాడు. దీర్ఘాయువు, ఉత్తమ పుత్ర, భృత్యవంతుడు. అతడు శుచిమంతుడై యజ్ఞ ఫలమును శీఘ్రముగ పొందుచున్నాడు. ఆదిత్యులను సేవించునట్టి ఆ యజమానికి శత్రువులు దూరమునుండి గాని దగ్గర నుండి గాని నష్టము కలిగింపజాలరు. 

    13. ఆదిత్యులు తొలగిన వానిని తమ దేశమున స్థాపింతురు. జగత్తును అనుగ్రహింతురు. జగత్పాలనకు నిశిత బుద్ధి కలవారు. ప్రకాశించువారు. జగద్రక్షకులు. అసుర్యమును రక్షించువారు. సత్యవాక్కులు, శత్రువునకు రుణాది బాధలు కలిగించువారు. అట్టి ఆదిత్యులు మా కోరికలను తీర్చుదురు గాక.

    14. ఆర్యమ, వరుణ, మిత్రాది నామములు గల ఆదిత్యులారా! మీ మహిమ గొప్పది రమణీయము. ఆ మహిమచే మీరు స్వర్గ, మర్త్య, పాతాళములను సూర్య, చంద్ర, వహ్నులను యజమాని యజ్ఞమునందలి మనో వాక్కాయ కర్మలను సత్యవచనులై పాలించుచున్నారు.

    15. అభీష్టసిద్ధి కలిగించుటకు సమర్థులైన క్షత్రియులవంటివారును, మరిన్ని సుఖములు ప్రసాదించువారును అగు ఆదిత్యులను మమ్ము రక్షించుమని ప్రార్థించుచున్నాము.

    16. ఆదిత్యులారా! మీరు వసతి ప్రసాదించువారు. నేనో బాలుని వంటి వాడను. బుద్ధిపండని వాడను. కాతర చిత్తుడను. ఉత్తర, పశ్చిమ, తూర్పు, పడమర దిక్కులు సహితము తెలియనివాడను. శత్రు భయరహితమగు మీ అభయ జ్యోతిని అర్థించుచున్నాను.

    17. మేము యజమానులము. ఆదిత్యులు మాకు నూతన రక్షణలు కల్పించినారు. శాంత, సుఖయుక్త సంపద కలిగియున్నాము.

    ఆదిత్యులారా! మీరు మా నిరపరాధత్వమును నిలిపి ఉంచండి. మా స్తుతులు ఆలకించండి. మా యజ్ఞమును శీఘ్రముగా రక్షించండి.

    18. వరుణదేవా! నా పిలుపును ఆలకింపుము. మాకు సుఖములు కలిగించుము. నేను నీ పాలన కోరుచున్నాను. నిన్ను మిక్కిలిగా ప్రార్థించుచున్నాను.

    19. యజమాని రక్షణల కొరకని నిన్ను సమంత్రకముగ నమస్కరించి ప్రార్థించుచున్నాను. యజమాని హవిస్సులు అర్పించి అట్టి రక్షణలు వేడుకొనుచున్నాడు.

    విశాలస్తుతిమంతా! వరుణదేవా! మా విన్నపముల నెరుంగుము. మా ఆయువును తగ్గించకుము.


            శ్రీమదాంధ్రవచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
            రెండవ కాండమునందలి మొదటి ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.