Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
5. వేయి పశువుల పొందుటకు ఎవడు అర్హుడు అను విషయము అభిజ్ఞులు చెప్పుచున్నారు:-
అహోరాత్రుల కొరకు వేయి పశురూపమైన వామన పశువును వధించవలెను. ఏలనన అహోరాత్రులే పశువులు కదా! ఆ విధముగా చేయుట వలన పశువులకు, పశు సంతానమునకు తృణ, జల సమృద్ధిగల ప్రదేశము కలుగును.
6. సంతానము కోరువాడు ఓషధులకు గర్భవినాశిని అగు గోవును బలి ఇవ్వవలెను.
సంతానము కలిగించుటకు సమర్థుడయ్యు సంతానము లేనివాడు అగుచున్నాడో అతనిని ఓషధులే బాధించుచున్నవి. ఓషధులు గోవునకు గర్భనాశనము కలిగించుచున్నవి. ఆ ఓషధులే గర్భనాశనమును పరిహరించుచున్నవి.
సంతానార్థ ఓషధులను స్వభాగధేయమున యజించవలెను. ఓషధులే అతని వీర్యము వలన సంతానమును కలిగించుచున్నవి. అతడు సంతానము కలిగినవాడు అగుచున్నాడు.
"ఆపోవా ఓషధయః" - జలములే ఓషధులగును. యజమానికి కలుగు పుత్రుడు - ఏర్పడకముందు - 'అసత్' అగుచున్నాడు. ఓషధులే అతనికి 'అసత్' నుండి 'సత్' ను ప్రసాదించుచున్నవి. అందువలనను - ఈ విషయము తెలిసినవాడును - తెలియని వాడును జలమే 'అసత్' నుండి 'సత్' ను కలిగించును అని తెలియవలెను.
('అసత్' లేనిది. 'సత్' ఉన్నది. జలములే లేనిదాని నుండి ఉన్నది కలుగుటకు కారణములు అగుచున్నవి అని చెప్పుట.)
7. ఐశ్వర్యము కోరువాడు - ఒకసారి ఈనిన గొడ్డుమోతుదైన గోవును వధించవలెను.
సంపద సంపాదించు సామర్థ్యము కలిగియు సంపన్నుడు కాకున్నాడో వాడు పుట్టియు పుట్టనివాడు అగుచున్నాడు. ఆ గోవు తొలుత ఇంద్ర సమమైన గోవును కని కదా వంధ్య అయినది!
కావున సంపద ఆశించువాడు - స్వభాగధేయమున ఇంద్రుని యజించవలెను. అందువలన ఇంద్రుడు అతనికి ఐశ్వర్యము కలిగించును. అతడు నిశ్చయముగా ఐశ్వర్యవంతుడు అగుచున్నాడు.
8. ఏ గోవు - ఒక దూడను కని వంధ్య అయినదో ఆ దూడనే ఆలంభనము చేయవలెను. ఆ దూడ ఇంద్ర స్వరూపము అగును. అందువలన యజమాని ఇంద్రియము కలవాడు అగుచున్నాడు.
9. తాత, తండ్రి, తాను వరుసగా సోమపానము చేయనివాడు విచ్చిన్నుడు అగుచున్నాడు. ఆ దోష నివారణమునకు ఇంద్రాగ్ని దేవతాకమగు ఎద్దును ఆలంభనము చేయవలెను.
విచ్చిన్నుడైన బ్రాహ్మణుడు ఇంద్రాగ్నులను - స్వభాగధేయమున - యజించవలెను. ఆ విధముగా చేయుట వలన ఇంద్రాగ్నులే అతనిని సోమపానము చేసినవానిని చేయుదురు.
10. పశువు ఇంద్ర దేవతాకము. సోమము వీర్యవృద్ధి హేతువు. సోమపానము ఇంద్రియ వృద్ధిహేతువు అగుట వలన ఇంద్రియ రూపముగా చెప్పబడినది. సోమపానము వలన ఇంద్రియ రూపమును పొందును. పశువు అగ్ని దేవతాకము. బ్రాహ్మణుడు అగ్ని సంబంధి కదా! కావున అతడు తన రూపమునే కొనసాగించినవాడు అగుచున్నాడు.
11. కొంతకాలము పొలము దున్నుట మొదలగు పనులు చేసి మానిన ఎద్దు 'పునరుత్సృష్ట' అనబడును. పితరులు సహితము సోమపానము చేసి మానినందున పునరు త్సృష్ట పశువధ వలన యజమానికి సమృద్ధి కలుగును.
(ఇది సాదృశ్యము.)
12. శత్రువునకు హాని తలపెట్టిన వాడు బ్రహ్మణస్పతి దేవతాకమగు కొమ్ములు లేని పశువును వధించవలెను. బ్రహ్మణస్పతిని స్వభాగధేయమున యజించ వలెను. బ్రహ్మణస్పతి అతని శత్రువునకు హాని కలిగించును. వెంటనే శత్రువు మరణించును.
13. కొమ్ములు లేని పశువు లక్ష్మీసహితమగును. ఆ లక్ష్మి మంగలి కత్తి వలె పదునైన వజ్రము అగును. అందువలన అది యజమాని సమృద్ధికి కారణము అగుచున్నది.
14. యూపము స్ఫ్య కావలెను. స్ఫ్య వజ్రమగును. వజ్రమే యజమాని శత్రువును సంహరించును.
15. బర్హిస్సు రెల్లుకావలెను. అది యజమాని శత్రువును నిశ్చయముగా వధించును.
16. ఈ శత్రువును తాండ్ర చెట్టు సమిధ వధించుట నిశ్చయము.
ఆరవ అనువాకము
1. ఎవడు సమానులందు అధికుడు కాదలచునో, ఎవడు గ్రామాధికారము కోరునో అతడు బృహస్పతి దేవతాకమగు తెల్లని వెనుక భాగము కల పశువును ఆలంభనము చేయవలెను. బృహస్పతిని స్వభాగధేయమున యజించవలెను. బృహస్పతియే అతనిని సమానులందు అధికుని చేయును.
2. తెల్లని పృష్ఠభాగము కల పశువు బృహస్పతి దేవతాకము అగును. కావున బృహస్పతి సమృద్ధి కలిగించును.
3. అన్నము కోరువాడు పూషదేవతాకమగు నల్లని పశువును వధించవలెను. అన్నము పూషదేవత స్వరూపము. అతడు పూషను స్వభాగధేయమున అర్చించవలెను. పూషదేవతయే అతనికి అన్నము కలిగించును. అతడు అన్నవంతుడు అగును.
4. పశువు నల్లనిది కావలెను. నలుపు అన్నపు రూపము అగును. కావున అది యజమానికి అన్న సమృద్ధి కలిగించును.
5. అన్నము కోరువాడు మరుద్దేవతాకమగు తెల్లని పశువును బలి ఇవ్వవలెను. అన్నం వైమరుతః అన్నము మరుత్తులు అగుచున్నది.
యజమాని మరుత్తులను స్వభాగధేయమున యజించవలెను. మరుత్తులే అతనికి అన్నము కలిగింతురు. అతడు అన్నవంతుడు అగును.
6. పశువు తెల్లనిది కావలెను. తెలుపే అన్నపు రూపమగును. అది యజమానికి అన్న సమృద్ధి కలిగించును.
7. బలము కోరువాడు ఇంద్ర దేవతాకమగు ఎర్రని పశువును వధించవలెను. యజమాని ఇంద్రుని స్వభాగధేయమున యజించవలెను. ఇంద్రుడే అతనికి బలము కలిగించును. అతను బలశాలి యగును.
8. పశువు దట్టమైన కనుబొమలు కలదికావలెను. దట్టపు కనుబొమలు ఇంద్రుని రూపమగును. ఆ పశువు యజమానికి సమృద్ధి కలిగించును.
9. ఇతరులు చేయు దానమును తాను కోరువాడు సవితృ దేవతాకము, కలగలపు రంగుగల పశువును వధించవలెను. సూర్యుడు ప్రేరణ కలిగించువాడు అగును. అతడు దానము చేయువానికి ప్రేరణ కలిగించును. దానము కోరువాడు సవితృదేవుని స్వభాగధేయమున కొలువవలెను. సవితా దేవతయే ఇతనికి దానమిచ్చు దాతకు ప్రేరణ కలిగించును. ప్రజలు అతనికి భూరి దానములు చేయుదురు.
10. పశువు కలగలుపు రంగుది కావలెను. అప్పుడు అది సవితృదేవతాకమగును. యజమానికి సమృద్ధి కలిగించును.
11. అన్నము కోరువాడు విశ్వేదేవతాకమైన అనేక రంగుల పశువును వధించవలెను. అన్నము విశ్వేదేవతాకమగును. యజమాని విశ్వేదేవతలను స్వభాగధేయమున పూజించవలెను. ఆ దేవతలే అతనికి అన్నము కలిగింతురు. అతడు అన్నవంతుడు అగును.
12. పశువు బహురూపము అనేక రంగులది కావలెను. అన్నము కూడ - భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య - బహురూపములు కలదికదా! ఆ పశువు యజమానికి సమృద్ధి కలిగించును.
13. గ్రామము కోరువాడు విశ్వేదేవతాకమగు బహువర్ణ పశువును వధించవలెను. విశ్వేదేవతలు అనేకులు అయినందున అనేక బంధువుల సామ్యులు అగుదురు కదా!
యజమాని విశ్వేదేవతలను, తన భాగధేయమున యజించవలెను. వారే అతనికి సకల బంధువులను కలిగింతురు. అతడు గ్రామాధిపతి అగును.
14. బహువర్ణ పశువు బహుదేవతాకము అగుచున్నది. అది యజమానికి సమృద్ధి కలిగించుచున్నది.
15. రోగలక్షణములు కనిపించవు. బలహీనమగుచుండును. అది దీర్ఘకాలము కొనసాగును. అట్టి వ్యాధిగ్రస్తుడు ప్రజాపతి దేవతాకమైన, కొమ్ములు లేని ఎద్దును వధించవలెను. దీర్ఘరోగము వైద్యునికి తెలియక పోయినను ప్రజాపతికి తెలియును కావున రోగి ప్రజాపతిని తన భాగధేయమున అర్చించవలెను. ప్రజాపతియే అతనికి అజ్ఞాత రోగము నుండి విముక్తి కలిగించును.
16. పశువు కొమ్ములు లేనిది కావలెను. అట్లగుటచే అది ప్రజాపతి దేవతాకము అగును. అది యజమానికి సమృద్ధి కలిగించును.
ఏడవ అనువాకము
1. వషట్కార దేవత గాయత్రి శిరమును ఖండించినాడు. ఆ శిరము నుండి జలము, రక్తము బయల్వెడలినది. దానిని తొలుత బృహస్పతి గ్రహించినాడు. అది వెనుక భాగము తెల్లగా ఉన్న వంధ్య పశువు అయినది. రెండవసారి పడిన దానిని మిత్రావరుణులు సేకరించినారు. అది రెండు రంగుల వంధ్యపశువు అయినది. మూడవసారి విశ్వేదేవతలు సేకరించినారు. అది బహువర్ణ వంధ్య పశువు అయినది. నాలుగవసారి పడిన దానిని భూమి గ్రహించినది. ఇది తన అనుభవమునకు అగుగాక అని బృహస్పతి అనుకున్నాడు. అది వ్యర్థవీర్యమగు వృషభము అయినది. ఆ విధముగా పడిన ఎర్రని రక్తమును రుద్రుడు తీసికొన్నాడు. అది రుద్రదేవతాకమగు ఎర్రని వంధ్య పశువు అయినది.
2. బ్రహ్మవర్చస్సు కోరువాడు బృహస్పతి దేవతాకమగు తెల్లని వీపుగల పశువును ఆలంభనము చేయవలెను. యజమాని స్వకీయ భాగధేయమున బృహస్పతిని ఆరాధించవలెను. బృహస్పతియే అతని యందు బ్రహ్మవర్చస్సు కలిగించును. యజమాని బ్రహ్మవర్చస్సు కలవాడు అగును.
3. వంధ్య పశువు ఛందస్సుల రసరూపమగును. ఛందస్సుల రసరూపమే కదా బ్రహ్మవర్చస్సు. అందువలన అది బహ్మవర్చస్సు కలిగించుచున్నది.
4. వర్షము కోరువాడు మిత్రావరుణ దేవతాకమగు రెండు రంగుల పశువును వధించవలెను. పగలు మిత్ర దేవతాకము - రాత్రి వరుణ దేవతాకము. మేఘుడు పగలు, రాత్రి వర్షించునుకదా!
యజమాని మిత్రావరుణులను స్వభాగధేయమున యజించవలెను. మిత్రావరుణులే అతని కొరకు రాత్రింబవళ్లు వర్షము కలిగింతురు.
వంధ్య పశువు ఛందస్సుల రసరూపమగును. వర్షము రసము వంటిది కదా! కావున యజమానికి వర్షము కలుగుచున్నది.
5. సంతానము కోరువాడు మిత్రావరుణ దేవతాకమగు రెండు రంగుల పశువును వధించవలెను. పగలు మిత్రసంబంధి. రాత్రి వరుణసంబంధి. రాత్రింబవళ్లు జననములు జరుగుచున్నవి.
వంధ్య పశువు ఛందస్సుల రసరూపమగును. రసమే సంతానము కదా! కావున యజమానికి సంతానము కలుగును.
6. అన్నము కోరువాడు విశ్వేదేవతాకమగు బహువర్ణ పశువును ఆలంభనము చేయవలెను. అన్నము విశ్వేదేవతా సంబంధియగును. యజమాని స్వభాగధేయమున విశ్వేదేవతలను యజించవలెను. విశ్వేదేవతలే అతనికి అన్నము కలిగింతురు. అతడు అన్నము కలవాడు అగును.
వంధ్య పశువు ఛందస్సుల రసరూపమగును. రసమే అన్నము అగును. అందువలన అన్నముగలవాడు అగుచున్నాడు.
7. గ్రామము కోరువాడు విశ్వేదేవతాకమగు బహువర్ణ పశువును బలి ఇవ్వవలెను. బంధుమిత్రులు విశ్వేదేవ సంబంధులు. యజమాని స్వభాగధేయమున విశ్వేదేవతలను పూజించవలెను. వారే అతనికి బంధుమిత్రులను సమకూర్చుదురు - అతడు గ్రామాధిపతి యగును.
వంధ్య పశువు ఛందస్సుల రసరూపమగును. రసమే బంధు మిత్రులగుదురు. అందువలన గ్రామాధిపత్యము కలుగును.
8. బ్రహ్మవర్చస్సు కోరువాడు బృహస్పతి దేవతాకమగు వ్యర్థవీర్య వృషభమును ఆలంభనము చేయవలెను. యజమాని స్వభాగధేయమున బృహస్పతిని అర్చించవలెను. బృహస్పతియే అతనికి బ్రహ్మవర్చస్సు కలిగించును. అతడు బ్రహ్మవర్చస్సు కలవాడు అగును.
9. ఆవులతో అడవులకు పోయి వానివెంట తిరిగి వచ్చునది వశః అగును. బ్రహ్మవర్చస్సు వశము వంటిది కదా! కావున అతడు బ్రహ్మవర్చస్సును పొందుచున్నాడు.
10. శత్రుసంహారము కోరువాడు రుద్ర దేవతాకమగు ఎర్రని పశువును వధించవలెను. యజమాని రుద్రుని స్వభాగధేయమున యజించవలెను. రుద్రుడే యజమాని శత్రువులను సమూలముగ ఖండించును. శత్రువు వెంటనే చచ్చును.
ఎర్రని పశువు రుద్ర సంబంధమైనది. అందువలన అది సమృద్ధి కలిగించుచున్నది.
11. యూపము స్ఫ్య కావలెను. స్ఫ్య వజ్రరూపము అగుచున్నది. యజమాని దీనినే శత్రువు మీద ప్రయోగించును. బర్హి సు రెల్లు కావలెను. అది శత్రువును అణచి తీరును.
సమిధ తాండ్ర చెట్టుది కావలెను. అది శత్రువును ఖండించి తీరును.





