Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    "తండ్రీ! నీవు అట్లు అనరాదు. నీ మాటయందు భీష్మ, ద్రోణులకు గౌరవము ఉన్నది. పాండవులను వారణావతమునకు పంపుడును అనుము. వారు సమ్మతింతురు. పాండవులు పోయిరా వారందరు నా పక్షము వారు అగుదురు. అది ఎట్లు అందువేమో వినుము. అశ్వత్ధామ నాకు మిత్రుడు. నన్ను వీడిపోడు. ద్రోణుడు కొడుకును వీడిపొడు. కృపుడు బావను అల్లుని విడిచిపోడు. ఈ విధముగా వారందరు నా పక్షము వహింతురు. ప్రజలను వశపరచుకుందును. నాకు అడ్డు ఉండదు. కావున పాండవులను వారణావతమునకు పంపుము. నాకు పాండవులను తలచిన భయమగుచున్నది. నిదురరాకున్నది. నిదురలేనందున శుష్కించుచున్నాను. శుష్కించి ఏమగుదునో నాకు తెలియదు. నన్ను రక్షింపుము. పాండవులను పంపుము." అని అనేక విధముల తండ్రిని రాపాడినాడు.
    ధృతరాష్ట్రుడు తండ్రి, దుర్యోధనుని మాటలు విన్నాడు. దుర్యోధనుడు కొడుకు. అతని క్షేమమును ఆలోచించినాడు. యోచించినాడు. యోచించినాడు. పాండవులను పంపుటకు నిశ్చయించినాడు.
    ధృతరాష్ట్రుడు ఒకనాడు పాండవులను పిలిపించినాడు. "పాండవులారా!" మీరు అయుడుగురు ఉత్తములు. నాయందు అమితము అయిన ప్రేమ కలబరచినారు. పాండురాజు నాకు తమ్ముడు. అతడు నాకు ఎంతయో మేలు చేసినాడు." అని పాండురాజును తలచుకున్నాడు. భోరున ఏడ్చినాడు. కన్నీరు తుడుచుకున్నాడు. అన్నాడు:-
    "పాండవ కుమారులారా! మిమ్ము ఒక పని చేయుటకు నియమింతును. అందువలన మీకు మేలు కలుగును. వారణావతమను పట్టణము ఉన్నది. అది మనోహరము అయినది. గంగాతీరమున ఉన్నది. ఆ పట్టణమున పూర్వము రుద్రుడు నివసించినాడు. అందువలన అది పుణ్యస్థలము. మీరు అయిదుగురు, కుంతీదేవి యుక్తముగా అక్కడికి వెళ్ళుడు. మంత్రులు పరిచారకులు మీ వెంట వత్తురు. అచ్చట మీ తండ్రికి పుణ్యగతులు కలుగు కార్యములు చేయుడు. బ్రాహ్మణులకు సంతర్పణ చేయుదు. గోవులను, అగ్రహారములను దానము చేయుము. కొంతకాలము అచట ఉండుడు. తిరిగి హస్తినకు రండు."
    ధర్మరాజాదులు ధృతరాష్ట్రుని మాటలు విన్నారు. మారు పలుకలేదు. హస్తిన వదులుటకు సమ్మతించినారు. వారణావతమునకు ప్రయాణమగుటకు సిద్దపడినారు. ప్రయాణ ప్రయత్నములు సాగించినారు.
    అది విన్నాడు దుర్యోధనుడు. మిక్కిలి సంతోషించినాడు. మిగిలిన కార్యము ముగించుటకు ఏర్పాట్లు చేసినాడు. పురోచనుడు అను వానిని పిలిచినాడు. అతనిని ఆజ్ఞాపించినాడు.
    "పురోచనా! నీవు నాకు విశ్వాసపాత్రుడవు. నిన్ను అతి ముఖ్య కార్యమునకు నియమించుచున్నాను. నీ నీర్పరి తనము చూపవలెను. కార్యము నిర్విఘ్నముగా నిర్వర్తించవలెను."
    "పాండవులు వారణావతము వెళ్ళుచున్నారు. వారి కంటే ముందు నీవు అక్కడికి చేరుము. జవనాశ్వములు పూన్చిన రధములో వెళ్ళుము."
    "నీవు పాండవుల కొఱకు ఒక ఇల్లు కట్టుము. ఇల్లు కట్టుమట్టిలో నేయి, నూనె, లక్క సర్జకరసము కలుపుము. ఇల్లు మనోహరముగా ఉండవలెను. అందు నాలుగు శాలలు ఉండవలెను. అయుధాగారము ఇంటికి దగ్గరలో ఉండవలెను. ఇల్లు తెల్లగను అందముగను ఉండవలెను."
    "నీవు నిర్మించిన లక్క ఇంటిలో పాండవులను ప్రవేశపెట్టుము. కొంతకాలము జరుపుము. ఆ తరువాత వారికి నమ్మకము కలుగును. వారు అప్రమత్తులై నిదిరించుటను గమనింపుము. లక్క ఇంటివాకిలికి నిప్పు పెట్టుము. అది తగలబడును. పాండవులు కాలి చత్తురు. అప్పుడు నీవు ఇచ్చటికి రమ్ము. నాకు ఆ వార్త ఎరిగించుము. నా శత్రువులు నశింతురు. నాకు సకల రాజ్యము లభించును. అట్లయిన నీవు శాశ్వత భోగములు అనుభవించగలవు. అట్లని దుర్యోధనుడు పురోచనుని పంపినాడు. పురోచనుడు వారణావతముచేరినాడు. తన పనికి పూనుకున్నాడు.
    అట్లుండగా పాండవులు వారణావతమునకు పయనమయినారు. వారు ధృతరాష్ట్రునకు మ్రొక్కినారు. భీష్మ, ద్రోణాదులకు పాదాభివందనము చేసినారు. అందరి నుండి అనుమతి పొందినారు. బయలుదేరినారు.
    హస్తిన ప్రజలు వారిని అనుసరించినారు. "శంతనుని తరువాత, ఒకరి తరువాత ఒకరుగా చిత్రాంగద, విచిత్రవీర్యులు రాజులయినారు. పిమ్మట రాజ్యమును పాండురాజు పాలించినాడు. పాండురాజు తరువాత ధర్మరాజు కావలెను. ధృతరాష్ట్రుడు ధర్మము తప్పినాడు. పాండవులను వారణావతమునకు పంపుచున్నాడు. ఇది అధర్మము. మనము కూడ హస్తిన విడుతుము. ధర్మరాజుతో వారణావతమునకు వెళ్ళుదము" అని పాండవుల వెంట బయలుదేరినారు.
    ధర్మరాజు అది చూచినాడు. "ప్రజలారా! ధృతరాష్ట్రుడు మాకు తండ్రి. అతడు చెప్పినట్లు చేయుట మా విధి. మీరు తిరిగి వెళ్ళుడు." అని వారి వద్ద సెలవు  తీసుకున్నాడు. వారు ధర్మరాజును కన్నీటితో సాగనంపినారు.
    ధర్మరాజాదులు రధములు ఎక్కినారు. రధములు సాగినవి. విదురుడు వారి వెంట కొంత దూరము వెళ్ళినాడు. ధర్మరాజుతో ఇట్లు అన్నాడు:-    
    "ధర్మరాజా! నీవు సకలము తెలిసినవాడవు అయినను నాకు తెలిసినంత చెప్పెదను. దుర్యోధనుడు ఆకారణముగా మిమ్ము వారణావతమునకు పంపుచున్నాడు. మేలు చేయువానివలె కన్పించుచున్నాడు. కీడు తల పెట్టుచున్నాడు. మీరు అప్రమత్తులయి ఉండవలెను. విషాగ్నుల వలన కీడు కలుగకుండ జాగ్రత్త పడవలెను. అతడు చేయు దుష్కార్యములను తెలిసికొందును. మీకు తెలియపరతును. తప్పించుకొని ఉపాయమును సూచింతును, సమాచారము పంపుదును" అని విదురుడు రధము దిగినాడు. నిలిచినాడు. వారిని సాగనంపినాడు.
    రధములు సాగినవి. విదురుడు చూపు. అందినంత వరకు నిలిచి చూచినాడు. వెనుదిరిగిపోయినాడు. సాగిపోవచ్చి ఆగిపోయిన జనులు కనిపించినారు. పాండవులను గురించి ప్రస్తావించుకున్నారు. అందరు కలిసి హస్తినలో ప్రవేశించినారు.
    పాండవుల రధములు వారణావతము ప్రవేశించినవి. ప్రజలు ఘనముగా స్వాగతము పలికినారు. రధములు , గుఱ్ఱములు ఏనుగులతో ఎదురు వచ్చినారు. తోడ్కొనిపోయినారు. ప్రతి ఇంటిని అందముగా అలంకరించినారు. ముగ్గులు పరచినారు. తోరణములు కట్టినారు. సువాసన ద్రవ్యములు చల్లినారు. అట్లు పాండవులు అలంకారశోభితము అయిన రాజగృహమున ప్రవేశించినారు. వారు ఫాల్గుణ శుక్లఅష్టమి నాటి రోహిణి నక్షత్రమున వారణావతమున ప్రవేశించినారు.
    కొంతకాలము పాండవులు రాజగృహమున ఉన్నారు. అప్పుడు పురోచనుడు అక్క ఇల్లు పూర్తి చేసినాడు. ఆ విషయము పాండవులకు విన్నవించినాడు. పాండవులు లక్క ఇల్లు చూచినారు. సంతసించినాడు. పురోచనుడు శిల్పాచార్యుడు . అతనిని పూజించినారు. పుణ్యాహవాచనము చేసినారు. లక్క ఇంట ప్రవేశించినారు.
    ధర్మరాజు మాయోపాయములు తెలియగల సమర్ధుడు. అతడు లక్క ఇంటి రహస్యము కనిపెట్టినాడు. విషాగ్నుల వలన భయమని విదురుడు చెప్పిన మాటలు తలచుకున్నాడు. భీమునితో పురోచనుడు లక్క ఇల్లు కాల్చగలడని చెప్పినాడు. ఇప్పుడే లక్క ఇంటి నుండి బయటపడుట మేలని భీముడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమునితో ఇట్లు అన్నాడు :-
    "మనము పురోచనుని గుట్టు తెలుసుకున్నట్లు అతడు గ్రహించరాదు. అది జరిగిన మనను మరింత తొందరగా దహించును. దుర్యోధనుడు మనకు అనేక అపాయములు తలపెట్టుచున్నాడు. మనము మరొక చోటికి వెళ్ళినచో అతడు మనకు తప్పక అపాయము కలిగించును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.