Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


                                                                         ఆలోచనామృతము


1. భీష్ముడు ద్రుతరాష్ట్రునకు  రాజ్యము వప్పగించినాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు, రాజ్యము ఇచ్చినాడు అనుకున్నాము. ఇందులో ఏదో రహస్యము ఉన్నట్లున్నది. మరొక సందర్భమున ధృతరాష్ట్రుడు స్వయముగా వెల్లడించినాడు. గుడ్డివాడయినందున తనకు రాజ్యార్హత లేదని - పాండురాజు సమ్మతినే తాను రాజు అయినానని.
    ఇది చాల రహస్యము వలే ఉన్నది. ఇట్టి రహస్యము రామాయణమున ఒకటి ఉన్నది. దశరధుడు కైకను పెండ్లాడునప్పుడు ఆమెకు పుట్టినవానికే రాజ్యము ఇత్తును అన్నాడు.
    ధృతరాష్ట్రుడు ఈ రహస్యమును దుర్యోధనునికి వెల్లడించినాడు. రాముడు భరతునకు వెల్లడించినాడు. రెండును క్లిష్టసమయములే.
    ఇందును గురించి ఆలోచించిన మరొక అనుమానము కలుగుచున్నది. పాండురాజు అడవికి వెళ్ళుటకు వేటకాక మరేదో కారణము ఉండవచ్చును. రాచరికమును గురించి ఏదో జరిగి ఉండును. అలిగి అడవికి పోయినాడు పాండురాజు. మరలిరాలేదు.
    అప్పటి ప్రజాభిప్రాయము పాండురాజును అనుకూలముగా ఉన్నట్లున్నది. అందును అనుసరించి ధర్మరాజును యువరాజును చేసినట్లున్నారు.
    అప్పుడు ధృతరాష్ట్రునకు రాజార్హత ఉన్నదా?
    ఇప్పుడు ధర్మరాజునకు యౌవరాజార్హత ఉన్నదా?
    ఇది ఒక చిక్కు సమస్య. అప్పటికి అమలునందున్న శాస్త్రమేది? దేనిని అనుసరించినారు? ఇందును గురించి రాజకీయశాస్త్రజ్ఞులు పరిశీలించి పరిష్కరించవలసి ఉన్నది.
2. పాండురాజు దశదిక్కులను గెలిచినాడు. సంపదలు తెచ్చినాడు. అని చెప్పబడినది. ధృతరాష్ట్రుని కాలమున దండయాత్రలు ఉన్నట్లు కనిపించవు. రాజ్యము బలహీనము అయినట్లు కనిపించుచున్నది. సమర్దుడగు రాజు కావలసివచ్చినది. అర్జునుని మించిన సమర్ధుడు లేడు. అర్జునుడు రాజు కాలేదు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. అతను యువరాజు అయినాడు. మరల దండయాత్రలు సాగినవి. సంపద పోగుపడినది.
3. దండయాత్రలు పాండురాజు చేసినాడు. పాండవులు చేసినారు. అవి అంతకు ముందు కూడ జరిగినవి. కాని రాజ్యములను గెలిచి, తన రాజ్యములో కలుపుకొనుట ఉన్నట్లు కనిపించదు.
    రామాయణమున కూడ అట్లే జరిగినది. రాముడు కిష్కిందను గెలిచినాడు. దానిని కోసలలో కలుపుకొనలేదు. సుగ్రీవునకు ఇచ్చినాడు. లంకను గెలిచినాడు. విభీషణునకు ఇచ్చినాడు.
    అర్జునుడు ద్రుపదుని గెలిచినాడు. అతని రాజ్యము తీసుకొనలేదు.
    యుద్దములకు ప్రయోజనము రాజ్య విస్తరణగా కనిపించును.
    స్థానిక ప్రభువులను కాదని రాజ్యము చేయుట కష్టము. అందులకే అలగ్జాండరు పురుషోత్తమునకు రాజ్యము ఇచ్చినాడు. ఆంగ్లేయులు బలవంతులు అయినను స్థానిక ప్రభువులను బలపరాచినారు.

                                                         లక్క ఇంటికధ

    ధర్మరాజు యువరాజు అయినాడు. సార్వభౌముని గౌరవము పొందినాడు. పాండవులు పరాక్రమవంతులు అయినారు. ప్రజల ప్రశంసలు అందుకున్నారు. దుర్యోధనుడు అది చూచినాడు. సహించలేక పోయినాడు. అతనిలో అశాంతి ప్రవేశించినది. నిదురరాకున్నది. పాండవులను హతమార్చదలచినాడు. అందుకు పన్నాగములను గురించి ఆలోచించినాడు. శకుని, కర్ణుడు మున్నగువారిని సంప్రదించినాడు. శకునికి ముఖ్యమంత్రి కణికుడు. అతడు దుర్యోధనునకు రాజకీయ ఉపాయములను బోధించినాడు :-
    "నిప్పురవ్వ చిన్నది అయినను కొండకోనలను కాల్చును. శత్రువు బాలుడు అయినను అపాయము కలిగించును. శత్రువును చేర్చుకొనుట చెట్టు కోన కొమ్మన నిద్రించుటవంటిది. సామ, దాన, భేద దండోపాయములు ప్రయోగించి శత్రువును రూపుమాపవలెను. ఇది శుక్రనీతి. శత్రువు గురువు అయినాను బంధువు అయినను ఉపేక్షించరాదు. పాండవులు నీకు బంధువులు. అయినను శత్రువులు. వారిని నాశనము చేయుట నీ కర్తవ్యము. నిన్ను రక్షించుకొనుట పగవారిని తుదముట్టించుట నీ విధి."
    దుర్యోధనుడు కణికుని మాటలు నచ్చినవి. అందుకు వారు ఒక పదకమును రచించినారు. అందులోని భాగముగా దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళినాడు. కంటికి కడివెడుగా ఏడ్చినాడు:-
    "తండ్రీ! పాండవులు శూరులు. అదియే నా హృదయమునకు శల్యముగా ఉన్నది. ఇప్పుడు ధర్మరాజు యువరాజు అయినాడు. అది నా గుండెను కెలుకుచున్నది. జనులు ధర్మరాజునే రాజును చెయవలెను అనుకొనుచున్నారు. భీష్ముడు వృద్దుడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ఇక ధర్మరాజే రాజు కావలెను. అనుకోనుచున్నారు జనులు. నిన్ను గాని భీష్ముని గని లెక్క చేయుట లేదు. వారి మాటలు నా గుండెను శూలములు అగుచున్నవి. కాబట్టి పాండవులు హస్తిన వదులునట్లు చేయవలెను."
    "దుర్యోధనా! నాయనా! నేనట్లు చేయలేను. నేను అనేక శాస్త్రములు చదివినాను. బలవంతుడను అయినను దండెత్తుటకు సమర్దుడను కాను. అందువలన నాకు రాజ్యార్హత లేదు. అయినను నా తమ్ముడు పాండురాజు నన్ను రాజును చేసినాడు. అతడు సకల జగత్తును గెలిచినాడు. కురువంశ రాజ్య భారమును వహించినాడు. అట్టి పాండురాజు పరలోకగతుడు అయినాడు. పాండవులు అతని కుమారులు. తండ్రిని మించినవారు. గుణవంతులు. వారిని హస్తిన నుండి పంపజాలను."
    "తండ్రీ! పితృధనమగు రాజ్యమును పూర్వము పాండురాజు పాలించినాడు.   అందువల్ల అతని కుమారుడు ధర్మరాజు రాజయినాడు. తదుపరి అతని కుమారులు రాజ్యము వహింతురు. ఆరీతిగా రాజ్యము పాండవ వంశస్థులకు దక్కును. మేము పాండవులను సేవించుచు బ్రతుకవలసి వచ్చును. నేను అది సహించలేను. ప్రజావాక్యము పూర్వము పాండురాజును సమర్ధించినది. ఇప్పుడు పాండవులను సమర్ధించుచున్నది. పాండవులను కొంతకాలము వారణావతమునకు పంపుము. మనకు ప్రజలు వశులు అగుదురు. అటు పిమ్మట వారిని పిలిపింతుము."
    "నాయనా దుర్యోధనా! ఇప్పుడు నీవు చెప్పినట్టే నేనును తలచుచుందును. అయినను పాండవులను వారణావతమునకువెళ్ళమనుటకు వాక్కు రాదు. భీష్మ, ద్రోణాదులు అందుకు సమ్మతించరు. అది నావలన అగుపని కాదు. నేను చేయలేను."




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.