Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    కర్ణుడు అంగరాజు అయినాడు. అది భీమునకు నచ్చలేదు. అతడు దుర్బాషలాడినాడు. కర్ణా! శూద్ర కులమున పుట్టినావు బెత్తము సంపాదించుకొని రధము తోలుకోనుము. రాజ దండము పట్టి రాజ్యము చేతువా! తులువా!! అర్జునుడు క్షత్రియ కులశ్రేష్టుడు . అతనితో యుద్దము చేయుటకు నీవు తగవు. పురోడాశము యజమానులకు గాని కుక్కలకు కాదు" అని దూషించినాడు.
    రాజ చిహ్నములతో తెజరిల్లిన కర్ణుడు తెల్లబారినాడు. వేడి నిట్టూర్పులు విడిచినాడు. తలవంచుకున్నాడు. నేలను చూచినాడు. భూదేవి మిన్నకున్నది.
    భీముని మాటలు విన్నాడు దుర్యోధనుడు. మండిపడినాడు. సభా మధ్యమునకు వచ్చినాడు. "భీమా! కర్ణుని గురించి దుర్బాషలాడుట తగదు. కర్ణుడు శూద్రకులమువాడు కాడు. అందుకు అతని దివ్యతెజస్సే నిదర్శనము. అదియు గాక శూరులు పుట్టిన క్రమము, దేవతలు పుట్టిన విషయము, నదులు పుట్టిన విధానము ఎవరికినీ తెలియ శక్యము కాదు. కుమారస్వామి గంగాజలమున పుట్టినాడు. కృపాచార్యుడు శరస్తంభమున పుట్టినాడు. ద్రోణుడు కుంభసంభవుడు. ఉత్తమ క్షత్రుయులు బ్రాహ్మణుల వలన పుట్టినారు. మీరును అట్లే పుట్టినారు. కర్ణుడు దివ్య లక్షణములు గలవాడు. సహజ కవచ కుండలములు గలవాడు. శూరుడు. అతడు తన బలమున అంగరాజ్యము నే కాదు ,సకల  భూమందలమును యేలుటకు సమర్ధుడు" అన్నాడు.
    భీముడు మారు పలుకలేదు.
    సూర్యుడు అస్తమించినాడు.
    దుర్యోధనుడు అర్జునుని భయము వీదినాడు. ఆ రాత్రి గుండె మీద చేయు వేసుకొని నిద్రించినాడు.

                                                            ఆలోచనామృతము
    
1. క్రీడా శాస్త్రజ్ఞులు పరిశీలించవలసినది, పరిశోధించవలసినది చాల ఉన్నది. క్రీడా, రంగస్థల నిర్మాణమునకు ఒక శాస్త్రము ఉన్నాడని చెప్పబడినది. దాని కొలతల ప్రకారము రంగస్థలము నిర్మాణము అయినది. ఆ శాస్త్రము ఏమయినది? భారత జాతి సుమారు వేయేళ్ళు నిజాతీయుల నాగరికత కింద నలిగినది. అప్పుడు అనేక శాస్త్రములు అంతరించినవి. అదియు అట్టిదే అయి ఉండవలెను. దానిని వెలికి తీయుటకు ప్రయత్నించవలెను.
    శాంతి, సుస్థిరత, భద్రత ఈ మూడు లేని జాతి అభివృద్ధి చెందలేదు. ఆనాడు అవి ఉన్నవి. అందుకే శాస్త్రము అవతరించినది. అప్పటి రంగ స్థలము నేటి స్టేడియములకు ఏమాత్రము తీసిపోనట్లు కనిపించుచున్నది. ఆ రంగ స్థలపు వైశాల్యమును తలచుకొనిన ఆశ్చర్యము కలుగును. సింహములు మున్నగు క్రూరమృగములు పరిగెత్తుటకు తగి ఉన్నది. నేడు క్రీడలు చూచు జనుల ఆనందోత్సాహాములు అనాడును కనిపించినవి.
    క్రీడలు చూచి వ్యాఖ్యానించుట అనాడును ఉన్నది. బహుశా విదురుడు ఆనాటి క్రీడా వ్యాఖ్యాత. జరుగుచున్న దానిని కనులతో చూచినట్లు ధృతరాష్ట్రునకు నివేదించినాడు. క్రీడలను గురించిన "రిపోర్టింగ్" ఎంత సొగసుగా జరిగినదో ఈ అధ్యాయము వలన తెలియును.
2. కులమును స్వార్ధమునకు వాడుకొనుటకు కర్ణుని వృత్తాంతము నిదర్శనము. ఇది ఈనాటికి ఉన్నది. రాజకీయములందు ఒక కులమునకు ప్రాతినిధ్యము లేదని ఎలుగెత్తి చాటి మంత్రులయిన మహానుభావులు మనందరకూ తెలియును.
    కర్ణుని వృత్తంతమందును కులమున కన్న రాజకీయము కే ఎక్కువ ప్రాధాన్యత కనిపించుచున్నది. అర్జునని మించిన వాడుండరాదనీ పాండవుల పట్టుదల. ఏకలవ్యుడు ఆ పట్టుదలకు బలి అయిన తోలివాడు. ఏకలవ్యుడు తాను వ్రేలు కోసి ఇచ్చినాడా? పాండవులు అతని వేలు కోసి తెచ్చినారా? అని సంశయము కలుగుచున్నది.
    అది విన్ననాటి నుండి కర్ణుడు గుంభనముగా ఉన్నాడు. కర్ణునకు ద్రోణుదు నేర్పినది కొద్ది. కర్ణుడు నేర్పినది ఎక్కువ. కర్ణుడు ఒంటరిగా , ఏకాంతమున అర్జునుని ఎదిరించలేడు. సమయమున ఎదిరి చూచినాడు. సకల జనుల ముందు బయటికి వచ్చినాడు. తమ పుట్టుక ఎరిగిన పాండవులు కర్ణుని నిందించినారు. తమ పని నెరవేర్చుకొనుటకు కులమును ఆశ్రయించినారు. దుర్యోధనుడు పాండవుల పుట్టుకను గుర్తుకు తెచ్చినాడు. కీలెరిగి వాత పెట్టినాడు.
    దుర్యోధనుడు కులమును యెదిరించినవాడు కాడు. అతనికి స్వార్ధమున్నది. అతడు కర్ణుని వంటి వానికై వెదుకుచున్నాడు. దొరికినాడు. రాజ్యమును ఇచ్చినాడు.
    వృత్తిని బుట్టిననే కులములని స్పష్టమయినది. కర్ణుడు సూతపుత్రుడు. అంగరాజు అయినాడు . క్షత్రియుడు అయినాడు.   
    కులములు వాడును నేడును ప్రగతికి అడ్డుపడుచున్నవి. స్వార్ధపరులకు పనికి వచ్చుచున్నవి.
    కుంతి పరిస్థితిని గురించి ఎంతో ఆలోచించవలసి ఉన్నది. కర్ణుడు ఆమె కొడుకు. కొడుకుని చెప్పుకోనలేదు. ఆమె బాధ వర్ణించలేనిది. అర్ధము చేసుకొనవలె.

                                                       గురుదక్షిణ
    ఆరాత్రి గడిచినది. తెల్లవారినది. ద్రోణుడు రాజకుమారులందరిని పిలిచినాడు. పాంచాల రాజు ద్రుపదుని  పట్టి తెచ్చి తనకు గురుదక్షిణ ఇవ్వవలసినది అన్నాడు. అందుకు రాజకుమారులు సమ్మతించినారు. కౌరవులు నూరుగురును ఇతర రాజకుమారులను రధము లేక్కినారు. ఆయుధములు ధరించినారు. కాంపిల్య నగరమునకు బయలుదేరినారు. వారి వెనుక ద్రోణుని సహితముగా పాండవులు బయలుదేరినారు.
    ద్రుపదుడు ద్రోణునితో చదువుకున్నవాడు. ధనుర్విద్యా విశారదుడు. ఈ విషయము కౌరవులు గ్రహించలేదు. కాంపిల్యమును ముట్టడించినారు. ద్రుపదుడు బాణము అందుకున్నాడు. దుర్యోధనాదుల మీద శరవర్షము కురిపించినాడు. వర్షబిందువులచేత తామరులవలె ద్రుపదుని బాణముల చేత దుర్యోధనాధుల కప్పబదినారు. కామ్పిల్యనగారపు ప్రజలు యుద్దమునకు ఉరికినారు. కౌరవ భటులను కొట్టి చంపినారు. ద్రుపదుని ధాటికి తాళలేక పోయినారు. దుర్యోధనాదులు వెనుదిరిగినారు. ద్రోణుని వద్దకు వచ్చినారు. జరిగినది చెప్పినారు.
    అది విన్నాడు అర్జునుడు, ద్రోణునకు నమస్కరించినాడు. ద్రుపదుని పట్టితెత్తునని చెప్పినాడు. బయలుదేరినాడు. భీముడు సేనకు ముందు నడచినాడు. నకుల సహదేవులు చక్రరక్షకులుగా ఉన్నారు. ద్రుపదుని మీద దాడి జరిగినది. భీముడు తన గదాయుధముతో విజ్రుంభించినాడు. ఏనుగులను కొట్టినాడు. నాటి కుంభస్థలములు బద్దలు అయినవి. అవి తన్నుకున్నవి. మావటీండ్రు నేలమీద పడినాడు. నుగ్గునుగ్గు అయినారు.
    అర్జునుడు విజ్రుంభించినాడు. తన బాణములచే ఏనుగులను, గుఱ్ఱములను , భటులను హతమార్చినాడు. అప్పుడు యుద్దము ఆకాశము వలె కనిపించినది. అర్జునుడు సూర్యుని వలె కనిపించినాడు. అర్జునుని బాణములు సూర్య కిరణముల వలె కనిపించినవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.