Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                    శ్రీ మదాంధ్ర వచన ఋగ్వేద సంహిత

                శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
                ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

                                         అయిదవ అష్టకము
                                      ఆరవ మండలము
                మొదటి అధ్యాయము             ఆరవ అనువాకము

                                          ఆరువది రెండవ సూక్తము

            ఋషి - భరద్వాజుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.   

    1. అశ్వినులు క్షణమాత్రమున శత్రువును ఓడించగలవారు. ప్రభాత కాలమున పృథివి పర్యంతమగు అంధకారమును దూరము చేయువారు. ద్యులోక నేతలు, భువనములకు ఈశ్వరులు. అట్టి వారిని నేను స్తుతింతును. మంత్రములతో ఆహ్వానింతును.

    2. అశ్వినులు యజ్ఞమువైపు తరలినారు. నిర్మల తేజోబలమున తరలినారు. రథపు దీప్తిని ప్రకటించుచు తరలినారు. ఎల్లలు ఎరుగని వెలుగులు కల్పించుచు తరలినారు. జలము కొఱకు అశ్వములతో మరుదేశము లంఘించి తరలినారు.

    3. అశ్వినులారా ! మీరు ఉగ్రులు. సమృద్ధముకాని గృహమును సమృద్ధము చేయుటకు వెళ్లుదురు. మీరు వాంఛనీయులు. మనోవేగవంతులు. అశ్వములమీద స్తోతలను స్వర్గమునకు చేర్చండి. హవ్యదాతను బాధించువారికి దీర్ఘనిద్ర కలిగించండి.

    4. అశ్వినులు యువకులు. హోతలు. ద్రోహరహితులు. వారు గుఱ్ఱములను పూన్చవలెను. అన్నము, పుష్టి, రసము వహించవలెను. అభినవ స్తోతల మనోజ్ఞస్తుతులవద్దకు చేరవలెను. ప్రాచీన అగ్ని వారి యాగము చేయవలెను.

    5. అశ్వినులు స్తుతికారుని, స్తుతికర్తలను సుఖింపచేయుదురు. స్తుతికర్తకు బహువిధ దానములు ఇచ్చెదరు. వారు రుచిరులు. బహుకర్ములు. ప్రాచీనులు. దర్శనీయులు. నేను కొత్త స్తుతితో వారిని సేవింతును.

    6. తుగ్రపుత్రుడు భుజ్యుడు సముద్రమధ్యమున నావలేని వాడయినాడు. అప్పుడు మీరు ధూళిరహిత మార్గమున రథయుక్తులై బయలుదేరినారు. అశ్వములతో జల ఉత్పత్తి స్థానమగు సముద్రము నుండి భుజ్యుని బయటికి తెచ్చినారు.

    (ధూళిరహిత మార్గము ఆకాశ మార్గము)

    7. అశ్వినులారా ! మీరు రథారూఢులు. మీ రథము విజయవంతము. దానిమీద సాగుడు. మార్గమధ్యమున ఉన్న పర్వతములను బద్దలుకొట్టండి. మీరు కోరికలు తీర్చువారు. సంతానము కోరువారి పిలుపు వినండి. స్తోతల కోరికలు తీర్చండి. స్తోతయొక్క ప్రసవము ఉడిగిన గోవును పాలిచ్చుదానిని చేయండి. ఈవిధముగా మీరు సుబుద్ధిశాలులు కండి. సర్వత్ర సంచరించండి.

    8. ప్రాచీన ద్యావాపృథ్వులారా ! ఆదిత్యులారా ! వసువులారా ! రుద్రపుత్రులారా ! మానవులు అశ్విద్వయ సేవకులు. వారి విషయమున దేవతలకు మహా క్రోధమున్నది. దానిని తాపకరమగు రాక్షసపతిని వధించుటకు ఉపయోగించండి.

    9. అశ్వినులు రాజులు. వారిని సమయానుసారము సేవించువారున్నారు. వారిని గురించి మిత్రావరుణులకు తెలియును. ఆ వ్యక్తి మహాబలి రాక్షసుని మీదకు అస్త్రము విసరును. అభిద్రోహాత్ములగు మానవుల వచనానుసారము అస్త్రము విడుచును.

    10. అశ్విద్వయమా ! ఉత్తమ చక్రములు కలిగి, దీప్తివంతమై, సారథియుక్తమగు రథమున ఎక్కండి. సంతానము ప్రసాదించుటకు మా ఇంటికి రండి. క్రోధము విడువండి. మానవులకు విఘ్నములు కలిగించువారి తలలు త్రుంచండి.

    11. అశ్వినులారా ! ఉత్తమ, మధ్యమ, సాధారణ అశ్వములతో మా వద్దకు రండి. బలిష్టములయిన గోవులునిండిన గోశాల తలుపులు తెరవండి. నేను స్తుతి కర్తను. నాకు విచిత్ర ధనము ఇవ్వండి.


                                        అరువది మూడవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వినులు అనేకుల ఆహూతులు. మనోహరులు. వారు నిలిచినచోట హవ్యయుక్తమగు పంచదశాది స్తోమము దూతవలె వారిని ఆహ్వానించవలెను. ఈ స్తోమమే అశ్విద్వయమును నావైపు మరలించినది. అశ్విద్వయమా ! స్తోత స్తుతికి మీరు ప్రసన్నులుకండి.

    2. అశ్విద్వయమా ! మా ఆహ్వానములను మన్నించండి. చక్కగా వెడలండి. స్తుతించినవారి సోమపానము చేయండి. మా ఇంటిని శత్రువులనుండి రక్షించండి. దగ్గరి దూరపు శత్రువు మా ఇంటిని నష్టపరచరాదు.

    3. అశ్వినులారా ! చక్కగా అభిషవించిన సోమము మీ కొఱకు నిలిచి ఉన్నది. మెత్తని కుశలు పరచి ఉన్నవి. మిమ్ము వరించిన స్తోతలు చేతులు జోడించి మిమ్ము స్తుతించుచున్నారు. శిలలు మీకొఱకు సోమరసము వెల్లడించినవి.

    4. అశ్వినులారా ! మీ యజ్ఞమున అగ్నిపైకి లేచును. యజ్ఞమునకు చేరును. హవ్యవంతుడు, ఘృతవంతుడు అగును. అశ్వద్వయమును స్తుతియుక్తుని చేయు స్తోతయే బహుకర్మి ఉద్యుక్తుడు అనబడును.

    5. అశ్వినులారా ! సూర్యపుత్రి మీ బహురక్షక రథము ఎక్కినది. దాని వన్నె పెంచినది. మీరు దేవతల ఈ జన్మలోనే ప్రాజ్ఞుల నుండి ప్రాజ్ఞ నేతలయి నృత్యశాలురగుడు.

    6. ఇదే దర్శనీయ కాంతితో సూర్యశోభ పెంచుటకు పుష్టివంతులుకండి. శోభకొఱకు మీ గుఱ్ఱములు అందముగా సాగును. స్తవనీయ అశ్వద్వయమా ! విందువంటి స్తుతులు మిమ్ము వ్యాపింప చేయవలెను.

    7. అశ్వినులారా ! మీ గుఱ్ఱములు నడకలు నేర్చినవి. మోయుటలో ఎంతో చతురలు. అవి మిమ్ము అన్నమువైపు తేవలెను. మనోవేగముగల మీ రథము అభిలషణీయ, అనంత అన్నమువైపు సాగవలెను.

    8. బహుపాలక అశ్వినులారా ! మీవద్ద బోలెడు ధనము ఉన్నది. మాకు ఆవులు, అన్నము ప్రసాదించండి. అవి మాకు ప్రియము కలిగించవలెను. ఇతరుల వద్దకు తరలిపోరాదు. మా దయతలగు అశ్వద్వయమా ! మీకు స్తోతలు ఉన్నారు. స్తుతులు ఉన్నవి. నీ అనుగ్రహము కోరువారి సోమము సహితము ఉన్నది.

    9. పురయుని యొక్క సరళగతులు, శీఘ్రగామినులు, అగు రెండు పడవలు నావద్ద ఉన్నవి. సమీఢరాణి ఇచ్చిన వంద ఆవులు నావద్ద ఉన్నవి. పేరుకరాణి వండిన అన్నము నావద్ద ఉన్నది. శాంతుడను రాజు అశ్విద్వయ స్తోతలకు హిరణ్యమయములు, చక్కనివి పది రథములు ఇచ్చినాడు. అందుకు తగినట్లుగ శత్రునాశకులు, సుందరులగు పురుషులను ఇచ్చినాడు.

    10. నా సత్యద్వయమా ! మీ స్తోతలకు పురుపాంథుడను రాజు వందల, వేల అశ్వములు ఇచ్చినాడు. వీర అశ్విద్వయమా ! ఆ స్తోత భరద్వాజునకు సహితము ఇవ్వవలెను.

    11. అశ్వినులారా ! నేను విద్వాంసుల సహితముగా మీరు అందించు, సుఖములు కలిగించు, ధనములచే చుట్టబడవలెను.


                                         అరువది నాలుగవ సూక్తము

                         ఋషి - భరద్వాజుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉషలు దీప్తిమంతులు. శుక్లవర్ణలు. సౌందర్యమునకుగాను జలతరంగములవలె లేచును. ఉష సమస్త ప్రదేశములను సుపథములను, సుగమములను చేయును. ఉష ధనవతి సమృద్ధవతి అగును.

    2. ఉషాదేవీ ! నీవు పెండ్లి కూతురువలె ఉన్నావు. పెరిగి అందముల సంతరించుకొనుచున్నావు. వెలుగులు నీ కిరణముల సొగసులు పంచుచున్నవి. దీప్తిమతులగు నీ కిరణములు ఆకసమున అలరారుచున్నవి. తేజస్సుతోనిండిన నీ రూపము వెలుగులు పరచుచున్నది.

    3. లోహితవర్ణ, దీప్తిమంత కిరణములు సుభాగ, విస్తీర్ణ, ప్రథమ ఉషను వహించును. శీఘ్రగామి సేనాపతివలె చీకట్లను నిలుపును. ఆయుధ ప్రయోగమున నిపుణుడగు వీరుడు శత్రువును పారదోలినట్లు చీకట్లను పారదోలును.

    4. పర్వతములు, వాయువులేని ప్రదేశము నీకు సుపథము సుగమము అగును. స్వప్రకాశయుక్తా ! నీవు అంతరిక్షమును అధిగమింతువు. విశాలరథవతి, సౌందర్యవతి, ద్యులోక దుహితా ! మాకు కోఱిన ధనము ఇమ్ము.

    5. ఉషా ! నీది అప్రతిహతగతి. ప్రీతిపూరక అశ్వములతో నీవు ధనము మోయింతువు. మాకు ధనము అందించుము. ద్యులోక పుత్రీ ! నీవు వెలుగులరాణివి. ప్రథమ ఆహ్వానమున పూజనీయవు. అందువలన నీవు దర్శనీయవు.

    6. ఉషా ! నీవు వెలువడగనే పిట్టలు గూళ్లు వదలును. అన్నము ఆర్జించుటకు మనుష్యులు నిద్ర వదులుదురు. నీవు దగ్గరనున్న హవ్యదాతకు కోఱిన ధనము ఇమ్ము.


                                          అరువది అయిదవ సూక్తము

                       ఋషి - భరద్వాజుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉష వెలుగుల కిరణములు కలది. రాత్రి చుక్కల వెలుగుతో చీకట్లను తరుముచు కనిపించును. ఆ ద్యులోక పుత్రియే మాకు చీకట్లను దూరము చేయును. జనులను వెల్లడించును.

    2. ఉషాదేవి, కాంతుల రథము కలది. అప్పుడే మహాయజ్ఞపు ప్రథమ పాదము నిర్వర్తించి అరుణవర్ణ అశ్వములతో విస్తృత రూపమున పయనించుము. ఆమెలో చిత్ర, విచిత్ర సొగసుల చొరబడును. ఆమె రేయి చీకట్లను తరిమికొట్టును.

    3. ఉషాదేవీ ! నీవు మానవ హవ్యదాతలకు కీర్తి, బలము, అన్నము, రసము ప్రసాదింతువు. నీవు ధనశాలినివి. గమనశీలవు. నిన్ను సేవించువారికి నేడు పుత్ర, పుత్రికాయుక్తమగు అన్నధనము ప్రసాదించుము.

    4. ఉషాదేవులారా ! మిమ్ము సేవించువారి కొఱకు మీ వద్ద ధనము ఉన్నది. వీరుడగు హవ్యదాతకొఱకు మీ వద్ద ధనము ఉన్నది. ప్రాజ్ఞుడగు స్తోత కొరకు మీ వద్ద ధనము ఉన్నది. 'ఉక్థ' మంత్రములున్న నా సమాన వ్యక్తికి, పూర్వమువలెనే ధనము ఇమ్ము.

    5. గిరితట ప్రియ ఉషాదేవి ! అంగిరులు నీ అనుగ్రహమున గోవులను సృజించినారు. పూజనీయ స్తోత్రములతో అంధకారమును నశింపచేసినారు. నేతలగు అంగిరుల స్తుతులు ఫలవంతములు అయినవి.

    6. ద్యులోకదుహితా ఉషా ! ప్రాచీనులకువలెనే మా కొఱకునను అంధకారము దూరము చేయును. ధనశాలిని ఉషా ! భరద్వాజునివలె స్తుతించు నాకు పుత్ర, పౌత్రాదియుక్త ధనము ఇమ్ము. అనేకులకు సరిపడ అన్నము నిమ్ము.


                                          అరువది ఆరవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మరుత్తుల రూపము సమానము. స్థిర పదార్థములందు స్థిరము. ప్రీతికరము. గతిపరాయణము. ఆ రూపము విద్వాంసులగు స్తోతలవద్ద వెల్లడికావలెను. అది అంతరిక్షమున ఒకసారి శుక్లవర్ణ జలమును తరిగించును. మర్త్యలోకమున అన్య పదార్థములు పితుకుటకు పెరుగును.

    2. మరుత్తులు, ధనికులు. అగ్ని సమాన దీప్తులు. వారి ఇష్టప్రకారము ఇమ్మడి, ముమ్మడి పెరుగువారు. వారి రథము ధూళి రహితము. సువర్ణ అలంకారయుతము. ఆ మరుత్తులే ధనము, బలములతో ఆవిర్భూతులయినారు.

    3. మరుత్తులు సేచనకారి రుద్రుని పుత్రులు. భరించగలవారు. అంతరిక్షమును భరించుటకు సమర్థులు. ఆ మరుత్తుల తల్లి పృశ్ని బహుగొప్పది. ఆమె మానవ జీవనము కొఱకు గర్భము లేక జలము ధరించినది.

    4. మరుత్తులు స్తోతలవద్దకు పయనించరు. వారి మనసులందు నిలుతురు. వారి పాపములను రూపుమాపుదురు. మరుత్తులు దీప్తిమంతులు. స్తోతల కోరిక ప్రకారము నీరు అందింతురు. కాంతిమంతులయి తమను ప్రకాశితము చేయుదురు. నేలను తడుపుదురు.

    5. మరుత్తులు అపహరణకర్తలు. గమనశీలురు. మహత్వయుక్తులు, ఉగ్రులు. స్తోతలు వారిని ఉద్దేశించి మరుత్ సంజ్ఞక మంత్రమును ఉచ్ఛరింతురు. కోరికలు తీర్చుకొందురు. దానకర్తయగు యజమాని మరుత్తులను క్రోధశూన్యులను చేయును.

    6. మరుత్తులు ఉగ్రులు. బలశాలురు. ఘర్షించు సేనలను ద్యావాపృథ్వులతో కలుపుదురు. భూమిని తృప్తిపరతురు. రుద్రపత్ని సంబంధమగు మాధ్యమికీవాక్కు స్వదీప్తితోకూడియు మరుత్తుల దీప్తికి అడ్డురాదు. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.