Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                         ఏబది ఎనిమిదవ సూక్తము

   ఋషి - భరద్వాజుడు, దేవత - పూష, ఛందస్సు - 2 జగతి, మిగిలినవి త్రిష్టుప్.

    1. పూషా ! నీ ఈ పగటి రూపము తెల్లనిది. మరొక రాత్రి రూపము యజనీయము. నీయొక్క దిన-రాత్రి రూపములు విభిన్నములు. నీవు సూర్యునివలె ప్రకాశమానుడవు. నీవు దాతవు. జ్ఞానివి. ఇప్పుడు నీ శుభప్రద దానము వెల్లడి కావలెను.

    2. పూష ఛాగ వాహనుడు. పశుపాలకుడు. అతని గృహము అన్నపూర్ణము. అతడు స్తోతలదాత. అఖిల భువనములమీద స్థాపించబడినవాడు. అతడు సూర్యరూపమున సకల ప్రాణులను ప్రకాశింప చేయును. తనచేత రంపము. పట్టుకొని నభోమండలము లోనికి పోవును.

    3. పూషా ! నీవి హిరణ్మయ నౌకలు. అవి సముద్ర మధ్యస్థిత ఆకాశమున నడచును. వాటి ద్వారా నీవు సూర్యుని దూత కార్యము నిర్వహింతువు. నీవు హవ్యరూప అన్నము కోఱువాడవు. స్తోతలు నీకు పశువులు మున్నగునవి సమర్పించి నిన్ను వశపరచుకొందురు.

    4. పూష స్వర్గము, భూమికి శోభన బంధువు. అన్నములకు అధిపతి. ఐశ్వర్యశాలి. మనోహరమూర్తి. బలశాలి. స్వచ్చందముగా సమర్పించిన పశువులు మున్నగువానితో ప్రసన్నుడగువాడు. శుభగమనుడు. అతనిని దేవతలు సూర్యుని స్త్రీ వద్దకు పంపినారు.

    (సూర్యుని కూతురును అశ్వినుల కొఱకు అడుగుటకుగాను దేవతలు పూషను సూర్యునివద్దకు పంపినారని శాయణుడు)


                                          ఏబది తొమ్మిదవ సూక్తము

    ఋషి - భరద్వాజుడు, దేవత - సూర్యుడు, అగ్ని, ఛందస్సు - 1-7 అనుష్టుప్. మిగిలినవి జగతి.

    1. ఇంద్రాగ్నులారా ! మీరు శౌర్యమును ప్రకటించినారు. మేము దానిని గురించే ముచ్చటింతుము. అప్పుడు సోమరసము అభిషుతమగును. మీరు అసురులను హతమార్చినారు. మీరు అక్షయులు.

    2. ఇంద్రాగ్నులారా ! ప్రతిపాదితమైన మీ జన్మమాహాత్మ్యము యదార్థము. ప్రశంసనీయము. మీ ఇద్దరి తండ్రి ఒక్కడే. మీరు కవలలు. మీ తల్లి సర్వత్ర విద్యామాన్యురాలు.

    3. ఇంద్రాగ్నులారా ! వడిగల రెండు అశ్వములు ఎట్లు గడ్డివైపు పరిగెత్తునో, అట్లే మీరు సోమరసము అభిషుతముకాగా కలిసి వెళ్లుదురు. మా రక్షణకుగాను నేడు మేము వజ్రధరుడు, దానాది గుణయుక్తుడగు ఇంద్రుని, అగ్నిని యజ్ఞమునకు పిలుచుచున్నాము.

    4. ఇంద్రాగ్నులారా ! మీరు యజ్ఞసమృద్ధి ప్రదాతలు. మీ స్తోత్రములు ప్రసిద్ధములు.సోమరసము  అభిషుతముకాగా ప్రేమరహిత స్తోతద్వారా కుత్సితముగా మిమ్ము స్తుతించువాని సోమమును మీరు ముట్టరు.

    5. దీప్తి సంపన్నులగు ఇంద్రాగ్నులారా ! మీలో ఇంద్రుడు సూర్యాత్మకుడు. అతడు నానా ప్రకార గమనములుగల అశ్వములను రథమున కూర్చి అగ్ని సహితముగా ఆ రథమును ఎక్కి సాగును. అప్పుడు మానవులలో ఎవడు మీ కార్యమును గమనమును ఎరుగు సమర్థుడగును.

    6. ఇంద్రాగ్నులారా ! పాదరహిత ఉష ప్రాణుల శిరోదేశములను ఉత్తేజపరచి, వాని నాలుకలతో బిగ్గర శబ్దములు పలికించి, పాదసంపన్నయ నిద్రిత ప్రాణులకు అభిముఖమగుచున్నది. ఆమె అట్లే ముప్పది అడుగులు ముహూర్తములు సాగును.

    7. ఇంద్రాగ్నులారా ! మీరు యోద్ధలు. రెండు చేతులతో ధనుస్సు లాగుదురు. ఈ మహా సంగ్రామమున గోవులను అనుసంధానము చేయునపుడు మమ్ము వదలకండి.

    8. ఇంద్రాగ్నులారా ! హంతకులు, ఆక్రమించువారగు శత్రువులు మమ్ము బాధించుచున్నారు. వారిని దూరము చేయండి. వారికి సూర్యదర్శనము లేకుండ చేయండి.

    9. ఇంద్రాగ్నులారా ! మీరు దివ్య పార్థివ ఉభయ ధనములకు అధిపతులు. కావున ఈ యజ్ఞమున జీవన పోషణకుమగు సమస్త ధనములను ప్రసాదించండి.

    10. ఇంద్రాగ్నులారా ! మీరు స్తోత్రములు. ఉపాసనలతో కూడి ఆహ్వానములను ఆలకింతురు. మేము సమర్పించు సోమరస పానమునకు విచ్చేయండి.

   
                                              ఆరువదవ సూక్తము

                        ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రాగ్నులు.
      ఛందస్సు 1-3, 13 త్రిష్టుప్, 4-12 గాయత్రి, 14 బృహతి, 15 అనుష్టుప్.

    1. ఇంద్రాగ్నులు బృహత్ ధనస్వాములు. బలవంతులగు శత్రువులను పరిమార్చువారు. అన్నాభిలాషియై వారిని సేవించు వారి శత్రువులను సంహరింతురు. అన్నము ప్రసాదింతురు.

    2. ఇంద్రాగ్నులారా ! మీరు దొంగిలించిన గోవులను, జలరాశిని, సూర్యుని, ఉషల కొఱకు యుద్ధములు చేసినారు.   

    ఇంద్రా ! నీవు దిశలు, సూర్యుని, ఉషలను, విచిత్ర, జలమును, గోవులను లోకమునకు కూర్చినారు. అశ్వాధిపతీ ! అగ్నీ ! నీవు కూడ అట్టి పనులు చేసినావు.

    3. వృత్రహంత ఇంద్రా ! అగ్నీ ! మా హవ్యాన్నమున పరిపుష్టులగుటకుగాను మీ శత్రునాశక బలముతో మా ముందుకు విచ్చేయండి. మీరు అనింద్యము, అత్యుత్కృష్టమగు ధనమును వెంట పెట్టుకొని మా వద్ద ఆవిర్భూతులు కండి.

    4. ప్రాచీన కాలమున ఋషులచే వీరకార్యములు కీర్తించబడిన ఇంద్రాగ్నులను పిలుచుచున్నాను. వారు స్తోతలను హింసించరు.

    5. ఇంద్రాగ్నులు ప్రచండ బలశాలులు. శత్రుహంతలు. మేము వారిని ఆహ్వానించుచున్నాము. వారు మమ్ము ఈ యుద్ధమున కృతకృత్యులను చేసి సుఖవంతులను చేయవలెను.

    6. సాధుజన రక్షకులు ఇంద్రాగ్నులు. వారు ధార్మికులు. ఆధార్మికులు చేసిన సమస్త, ఉపద్రవములను నివారింతురు. వారు సకల విద్వేషులను సంహరించినారు.

    7. ఇంద్రాగ్నులారా ! ఈ స్తోతలు మిమ్ము స్తుతించుచున్నారు. సుఖదాతలారా ! మీరు ఈ సోమమును స్వీకరించండి.

    8. నేతలగు ఇంద్రాగ్నులారా ! మీ అశ్వములు బహుజన వాంఛనీయలు. హవ్యదాతల కొఱకు పుట్టినవి. మీరు ఆ గుఱ్ఱములన్నింటిమీద స్వారిచేయుచు రండి.

    9. నేతలగు ఇంద్రాగ్నులారా ! అభిషుత సోమపానము చేయుటకు ఈ యజ్ఞమునకు వేంచేయండి.

    10. అగ్ని తన శిఖల జ్వాలలతో సమస్త అరణ్యములందు వ్యాపించును. జ్వాలారూప జిహ్వతో వానిని మసిచేయును. స్తోతలారా ! అట్టి అగ్నిని స్తుతించండి.

    11. ప్రజ్వలితమగు అగ్నిలో ఇంద్రునికొఱకు సుఖకరమగు హవ్యము సమర్పించువారికి ఇంద్రుడు దీప్తి సంపన్న అన్నము కలిగించి జల వర్షము కురిపించును.

    12. ఇంద్రాగ్నులారా ! మాకు బలము కలిగించు అన్నము అందించండి. మా హవ్యమును బలిష్ఠము చేయుటకు మాకు వేగముగల అశ్వములను ఇవ్వండి.

    13. ఇంద్రాగ్నులారా ! హోమము ద్వారా మీ ఇద్దరిని అనుకూలురును చేసి కొనుటకు నేను మిమ్ము పిలుచుచున్నాను. హవ్యము ద్వారా త్వరగా తృప్తులను చేయుటకు మీ ఇద్దరిని పిలుచుచున్నాను. మీరిద్దరు అన్నము, ధనము ఇచ్చువారు. అందుకే అన్నలాభము కొఱకు మీ ఇద్దరిని పిలుచుచున్నాను.

    14. ఇంద్రాగ్నులారా ! గోవులు, అశ్వములు, విపుల ధనముతో మీరు మా వద్దకు రాగలరు. మిత్రవంతులు, దానాదిగుణభూషితులు, సుఖప్రదాతలగు ఇంద్రాగ్నులను మాతో మైత్రికిగాను ఆహ్వానించుచున్నాము.

    15. ఇంద్రాగ్నులారా ! మీరు సోమాభిషవము చేయు యజమాని పిలుపు వినండి. హవ్యము కోరండి. రారండి. మధుర సోమరస పానము చేయండి.


                                           ఆరువది ఒకటవ సూక్తము


    ఋషి భరద్వాజుడు, దేవత సరస్వతి, ఛందస్సు 1-3, 13 జగతి, 14 త్రిష్టుప్, మిగిలినవి గాయత్రి.

    1. ఈ సరస్వతియే హవ్యదూత బధ్న్యశ్వునకు వేగవంతుడు. ఋణమోచకుడగు దివోదాసు అను పుత్రుని ప్రసాదించినది. దివోదాసు బహుజనులను బాధించు, దానవిముఖ, పణులను సంస్కరించినాడు.

    సరస్వతీ ! నీవు చేసిన ఈ దానము ఎంతో గొప్పది.

    2. ఈ సరస్వతీనది గడ్డలు త్రవ్వువానివలె వేగవంతములగు తరంగములతో పర్వత తటములను భగ్నము చేయును. మా రక్షణ కొఱకుగాను స్తుతులు యజ్ఞములతో రెండు దరులను కూల్చు సరస్వతిని సేవింతుము.

    3. సరస్వతీ ! నీవు దేవనిందకులను వధించినావు. సర్వ వ్యాపి వృసయ, త్వష్ట పుత్రుని సంహరించినావు. అన్నసంపన్న సరస్వతీ ! నీవు మానవులకు భూమి ఇచ్చినావు. వారికొఱకు వర్షము కలిగించినావు.

    4. దానశీల, అన్నయుక్త, స్తోతల రక్షించు, సరస్వతి మాకు అన్నము అందించి తృప్తులను చేయవలెను.

    5. సరస్వతీ ! ఇంద్రునివలె నిన్ను స్తుతించు వ్యక్తి ధనప్రాప్తికిగాను యుద్ధమున దిగినపుడు అతనిని రక్షింపుము.

    6. అన్నపూర్ణా ! సరస్వతీ ! యుద్ధమున మమ్ము రక్షింపుము. పూషవలె, మా అనుభవమునకు ధనము ప్రసాదించుము.

    7. భీషణ, హిరణ్మయ రథమున ఎక్కిన శత్రుఘాతిని సరస్వతి మా మనోహర స్తోత్రములను కోరవలెను.

    8. సరస్వతి యొక్క అపరిమిత, అకుటిల, దీప్త, అప్రతిహతగతి జలవర్షక వేగము ప్రచండ ధ్వని చేసి సాగును.

    9. నియత భ్రమణకారి సరస్వతి సూర్యునివలె పగళ్ళను తెచ్చును. అట్లే మా సకల శత్రువులను పరాజితులను చేయును. ఆమె తన జలమయ భగిమలతో మావద్దకు రావలెను.

    10. సప్తనది స్వరూప, సప్తభగినీయుక్త, ప్రాచీన ఋషి సేవిత, మా ప్రియతమ సరస్వతి మా స్తుతి పాత్రురాలు కావలెను.

    11. సరస్వతి పృథివి, స్వర్గముల విస్తీర్ణ ప్రదేశములను తన దీప్తితో నింపినది. ఆ సరస్వతియే నిందకుల నుండి మమ్ము రక్షించవలెను.

    12. త్రిలోక వ్యాపిని, గంగాది సప్తనదియుక్త, పంచవర్ణుల సమృద్ధిదాయిని సరస్వతి ప్రతి యుద్ధమునందును ఆహ్వాన యోగ్య అగును.

    13. మాహాత్మ్యము, కీర్తివలన దేవతలందు ప్రసిద్ధమైనదియు, నదులన్నింటిలో వేగవతియు, శ్రేష్ఠతవలన అత్యంత గుణశాలినియు అగు సరస్వతి జ్ఞానులగు స్తోతల స్తుతియోగ్య అగును.

    14. సరస్వతీ ! మమ్ము ప్రశస్త ధనము వైపు నడిపించుము. మమ్ము హీనులను చేయకుము. ఎక్కువ నీటితో మమ్ము బాధించకుము. మా బంధుత్వమును, గృహమును స్వీకరించుము. మేము నీ వద్ద నుండి నికృష్ట స్థానమునకు పోరాదు.

    దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును ఆంధ్ర ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును కమలానామ్మి ధర్మపత్నీ సహితుండును చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు, మానవత, శరతల్పం, పావని, రానున్నది ఏది నిజం? ఇత్యాది నవలా రచయితయునగు శ్రీ దాశరథి రంగాచార్య విరచిత ఆంధ్ర వచన ఋగ్వేద సంహితమున నాలుగవ అష్టకము సమాప్తము.

                                                    కాలేవర్షతు పర్జన్యః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.