Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    6. ద్యావా భూములు అగ్నిని ఇద్దరు యువతులవలె సేవించుచున్నవి. గోవులు తమ దూడలనువలె ద్యావాపృథ్వులు అగ్నిని అలరించుచున్నవి. ఋత్విజులు అగ్నిని హవిస్సులతో తృప్తిపరచుచున్నారు. అందువలన అగ్ని బలాధికులలో బలాధిపతి అయినాడు.

    7. సూర్యునివలె అగ్ని జ్వాలలలను ప్రసరింపచేయుచున్నాడు. పైపైకి ఎగయుచున్నాడు. సూర్యునివలెనే భయంకరుడు అగు అగ్ని ద్యావాభూములను అలంకరించుచున్నాడు. సర్వపదార్థములందలి రసమును పైకిలాగుచున్నాడు. తనతల్లులయిన వానమబ్బులనుండి వెలుగులను వెదజల్లుచున్నాడు.

    8. అంతరిక్షమున సంచరించు జలములతో కూడిన అగ్ని మహత్తరకాంతిని ప్రసరించుచున్నది. అది చూడ శక్యముగాకున్నది. ఆ అగ్ని దూరదర్శియు సర్వులను పోషించదగినది అగును. అట్టి అంతరిక్షమును తన తేజస్సుతో నింపినది. అట్టి తేజస్సును మేము స్తుతించుచున్నాము.

    9. అగ్నీ ! నీవు ఘనుడవు. శత్రుంజయుడవు. వెలుగులవాడవు. జాజ్వల్యమానుడవు. అప్రతిహతుడవు. నీ తేజస్సు అంతరిక్షమున అలముకున్నది. నీవు మమ్ము రక్షింపుము. పాలింపుము.

    10. ఆకసమున తిరుగు నీటిని ఈ అగ్ని ప్రవాహముగ మార్చుచున్నది. భూమిని తడుపుచున్నది. సమస్త అన్నములను గర్భమున ధరించుచున్నది. పండించుచున్నది.

    11. అగ్నీ ! పావకా ! సమిధలు నిన్ను సమృద్ధము చేయుచున్నవి. మాకు సంపన్నములగు అన్నములు ప్రసాదించుము. అట్టి అన్నమును మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, భూమి, ద్యులోకము రక్షించవలెను.

        తొంబది ఆరవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు
                       దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.


    1. అగ్ని జలములకు జనించినది. పుట్టుకతోడనే సనాతనునివలె ప్రజ్ఞావంతుడు అయినాడు. సత్యమును ధరించినాడు. అంతరిక్ష జలములు అగ్నిని మిత్రునిగా చేసికున్నవి. అగ్ని ధనదాత. అతనిని దేవతలు ధరించినారు. దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    2. అగ్ని పుత్రుడు, గుణసూచకుడు. మనువు స్తుతించినవాడు. మానవులను సృష్టించినాడు. అతని తేజస్సు సర్వత్ర వ్యాపించి ఉన్నది. ద్యులోకము అంతరిక్షము ఆ తేజస్సుతో నిండి ఉన్నవి దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    3. అగ్ని ప్రభవు. దేవతలందు ముఖ్యుడు. యాగ సాధకుడు. హోత, స్తుతింపదగినవాడు. అన్నమునకు పుత్రుడు. ప్రాణులకు ఆధారభూతుడు. ధనదాత. ఋత్విజులారా ! అగ్నిని స్తుతింపుడు దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    4. అగ్ని అంతరిక్షమున ఉన్నవాడు. బలవంతుడు. స్వర్గమును ఇచ్చువాడు. లోక రక్షకుడు. ద్యులోకమును సృష్టించినవాడు. అట్టి అగ్ని మా పుత్రులకు కర్మ మార్గము కలుగ చేయవలెను. దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    5. రాత్రింబవళ్ళు పరస్పరము బాధించుకొనుచున్నవి. కూడియున్నవి. పగలు పుత్రుడు అగ్ని. దినము అగ్నికి పాలిచ్చుచున్నది. అట్టి అగ్ని భూమియందును, అంతరిక్షమునను ప్రకాశించుచున్నాడు. దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    6. అగ్ని ధనములకు మూలము. జీవనమునకు ఆధారము. యజ్ఞ జ్ఞాత. భక్తులకు వరప్రదుడు. ధనదాత అగు అగ్నికి దేవతలు అమృతత్వము ప్రసాదించినారు. దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    7. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అగ్నియే ధనములకు స్థానము. పుట్టినవారికి పుట్టబోవు వారికి జీవనాధారము. ఆకాశాదులగు సమస్త నిత్య పదార్థములకు రక్షకుడు. దేవా అగ్నిం ధారయన్ద్రవిణోదామ్

    8. ధనము ప్రసాదించు అగ్ని చరధనమును, పుత్రధనమును, అన్నధనమును దీర్ఘాయువును ప్రసాదించవలెను.

    9. అగ్నీ ! నీవు పవిత్రము చేయువాడవు. సమిదలతో వృద్ధిపొందువాడవు. మాకు అనంత అన్న సమృద్ధి ప్రసాదించుము. అట్టి అన్న సమృద్ధిని మిత్రుడు, వరుణుడు, సముద్రము, అదితి, భూమి, ద్యులోకము రక్షించవలెను. 

        తొంబది ఏడవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు
                        దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి
   

    1. అగ్నీ ! పాపములు మమ్ము విడువవలెను. శత్రువులను బాధించవలెను. మా కొఱకు ధనద్వారములు తెరువుము. మాపాపము నశింపచేయుము. అపనః శోశుచ దఘమ్

    2. మంచిక్షేత్రము, మంచి తలంపు, మంచిదారి, మంచిధనము కొఱకు అగ్నిని పూజించుచున్నాము. అపనః శోశుచ దఘమ్

    3. కుత్సుడు ఈ స్తుతులను రచించినాడు. ఆ స్తుతులనే స్తుతి కర్తలు పఠించుచున్నారు. అపనః శోశుచ దఘమ్

    4. అగ్నీ ! నిన్ను స్తుతించువారు పుత్రపౌత్రాదులు కలిగి ఉన్నారు. అట్లే మాకును పుత్రపౌత్రాదులు కలుగవలెను. అపనః శోశుచ దఘమ్

    5. అగ్ని శత్రుంజయుడు. అతనికాంతులు సర్వత్ర వ్యాపించి ఉన్నవి. అపనః శోశుచ దఘమ్

    6. అగ్నీ ! అన్ని దిశలందు వ్యాపించు జ్వాలలు కలవాడవు. మమ్ము అన్ని దిశలందు రక్షింపుము. అపనః శోశుచ దఘమ్

    7. అగ్నీ ! సర్వదిశలందు నీముఖములు కలవు. నీవు ఓడవై శత్రువు నుంచి మమ్ముదాటించుము. అపనః శోశుచ దఘమ్

    8. ఓడ నదిని దాటించును. అట్లే మమ్ము శత్రువులనుండి క్షేమముగా దాటించుము. అపనః శోశుచ దఘమ్

        తొంబది ఎనిమిదవ సూక్తము - ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు.
                          దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.


    1. అగ్ని అనుగ్రహమును అందరు అర్థింతురు. అగ్ని మమ్ము అనుగ్రహించవలెను. వైశ్వానరాగ్నిని అందరు భక్తితో భజించుచున్నారు. ఆ అగ్ని సర్వభూతములకు ప్రభువు అయినాడు. అగ్ని అరణులందు పుట్టినాడు. లోకమును వీక్షించుచున్నాడు. సూర్యునితో కలియుచున్నాడు.

    2. వైశ్వానరాగ్ని ద్యులోకమున సూర్యరూపమున ఉన్నాడు. భూమిమీద అగ్నిరూపమున ఉన్నాడు. అన్ని ఓషధులందు పార్థివాగ్ని రూపమున ప్రవేశించినాడు. జలములందు పుట్టిన అగ్ని రాత్రింబవళ్ళు మమ్ము శత్రువులనుండి రక్షించవలెను.

    3. వైశ్వానరాగ్నీ ! మేము చేయు కర్మలు సఫలము కావలెను. ధనవంతులయి పుత్రులు మమ్ము సేవింపవలెను. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రము, పృథ్వి, ద్యులోకము మమ్ము రక్షించవలెను.

            తొంబది తొమ్మిదవ సూక్తము

        ఋషి - మరీచి పుత్రుడు కశ్యపుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని అందరు ఎరిగినవాడు. అగ్నికొఱకు సోమరసమును పిండుచున్నాము. అగ్ని మా శత్రువుల ధనమును దహించవలెను. ఓడతో నదిని దాటించినట్లు అగ్ని మమ్ము సమస్త కష్టములనుంచి దాటించవలెను. అగ్ని మా పాపములను పరిహరించవలెను.

        నూరవ సూక్తము, ఋషులు - వృషాపుత్రులు 1. ఋజాశ్వుడు
        2. అంబరీషుడు 3. సహదేవుడు 4. భయమానుడు 5. సురాధసుడు
                    దేవత - ఇంద్రుడు. ఛందస్సు -త్రిష్టుప్.


    1. ఇంద్రుడు వర్షించువాడు. వర్షణాది శక్తులతో కూడి ద్యులోక, భూలోకములను ఏర్పరచినాడు. ఉదకములను కలిగించినాడు. యుద్ధములందు పిలువబడువాడు. మరుత్తులతో కూడుకున్నవాడు. ఇంద్రుడు మమ్ము రక్షించవలెను. వోభవత్విన్ద్రఊతి.

    2. ఇంద్రుడు సూర్యునివంటి గమనము కలవాడు. ఎవ్వరికిని అందనివాడు. వేగవంతులగు మరుత్తులు మిత్రులుగా కలవాడు. మరుత్తులతో కూడి వర్షించువాడు. ప్రతి యుద్ధమునందు శత్రువును ఎండగొట్టవాడు. వోభవత్విన్ద్రఊతి. ఆ ఇంద్రుడు మమ్ము రక్షించవలెను.

    3. ఇంద్రుడు శత్రుంజయుడు. పౌరుషవాక్యములచే శత్రువును తిరస్కరించువాడు. ఇంద్రుని కాంతుల వర్షము కలిగించును. ఆ కాంతులు సూర్యకిరణములవలె బలమయినవి. అవి స్వర్గము నుండి బయలుదేరుచున్నవి. మరుత్తులతో కూడిన వోభవత్విన్ద్ర ఊతి.

    4. ఇంద్రుడు వేగవంతులకన్న వేగవంతుడు. వర్షించువారికన్న వర్షించువాడు. మిత్రులకన్న మిత్రుడు. పూజ్యులకన్న పూజ్యుడు. స్తవనీయుల కన్న స్తవనీయుడు. మరుత్తులతో కూడిన వోభవత్విన్ద్ర ఊతి.

`    5. ఇంద్రుడు తన పుత్రులతో కూడినట్లు రుద్రపుత్రులు మరుత్తులతో కూడినారు. యుద్ధములందు శత్రువులను జయించినాడు. సమానస్థాయిగల వాయువులతో కూడినాడు. వర్షము కలిగించినాడు. మరుత్తులతో కూడిన వోభవత్విన్ద్ర ఊతి.

    6. ఇంద్రుడు యుద్ధములు చేయువాడు. శత్రువులను జయించువాడు. మాకు సూర్యకాంతిని దర్శింపచేయవలెను. సత్పురుషుల పాలించువాడు. బహజనులచే ఆహ్వానించబడువాడు. మరుతులతో కూడిన వోభవత్విన్ద్ర ఊతి.

    7. యుద్ధములందు వాయువువలె విజృంభించమని ఇంద్రుని ప్రోత్సహించుచున్నాడు. ఇంద్రుడు నరుల ధనమునకు రక్షకుడు. సమస్త కర్మలకు ఇష్టఫలప్రదాత ఒక్క ఇంద్రుడే. మరుత్తులతో కూడి వోభవత్విన్ద్ర ఊతి.

    8. బలమున గెలువవలసిన యుద్ధములకుగాను జయశీలురు ఇంద్రుని స్తుతించుచున్నారు. ధనము కొఱకు జనులు ఇంద్రునే ఆశ్రయించుచున్నారు. ఇంద్రుడు అంధకార యుద్దమందును విజయము పొందును. మరుత్తులతోకూడి వోభవత్విన్ద్ర ఊతి.

    9. ఇంద్రుడు మహామహా వీరులను సహితము ఎడమచేత వధించుచున్నాడు. కుడిచేత యజమానులు సమర్పించిన హవిస్సులు అందుకొనుచున్నాడు. ఇంద్రుడు తనను స్తుతించిన వారికి ధనములు ప్రసాదించును. మరుత్తులతో కూడి వోభవత్విన్ద్ర ఊతి.

    10. ఇంద్రుడు మరుత్తుల సహితుడయి ఇష్ట ఫల ప్రదాత అగుచున్నాడు. అతడు సమస్త రథములతోను, ప్రజలతోను విరాజిల్లుచున్నాడు. తన బలమున శత్రువును పరిమార్చుచున్నాడు. మరుత్తులతో కూడి వోభవత్విన్ద్ర ఊతి.

    11. ఇంద్రుని ఎందరో ఆహ్వానించుచున్నారు. మరుత్తులతో కూడి ఇంద్రుడు స్వబంధువులు, బంధువులు కానివారితోను యుద్ధమునకు సిద్ధపడుచున్నాడు. తనను ఆశ్రయించినవారు బంధువులు అయినను కాకున్నను వారికి పుత్ర పౌత్రులను అనుగ్రహించుచున్నాడు. మరుత్తులతోడి వోభవత్విన్ద్ర ఊతి.

    12. ఇంద్రుడు వజ్రాయుధము ధరించువాడు. దస్యులను వధించువాడు. భయంకరుడయినవాడు. సర్వమును తెలిసిన రసమువంటివాడు. తన బలమున అయిదు జాతుల నదులను పాలించువాడు. మరుత్తులతో కూడి వోభవత్విన్ద్ర ఊతి.

    13. ఇంద్రుడు వజ్రము ధరించును. శత్రువును ఏడిపించును. వర్షము కురిపించును. దూర్యునివలె ప్రకాశించును. గర్జించును. ఇంద్రుని ధనములు ఆశ్రయించినవి. దానములు ఆశ్రయించినవి. మరుత్తులతో కూడిన వోభవత్విన్ద్ర ఊతి.

    14. ఇంద్రుని బలము స్తుతించ తగినది. ఇంద్రుని ఉత్సాహమే భువిని, దివిని పాలించుచున్నది. ఇంద్రుడు యజ్ఞములకు సంతసించవలెను. పాపములను దూరము చేయవలెను. మరుత్తులతో కూడి వోభవత్విన్ద్ర ఊతి.

    15. ఇంద్రుని బలమును దేవతలు పొందలేరు. ఇంద్రుడు లేక నరులు జలమును పొందలేరు. ఇంద్రుడు తన బలమున దివిని భువిని వర్థిల్లచేయుచున్నాడు. మరుత్తులతో కూడి వోభవత్విన్ద్ర ఊతి.

    16. ఇంద్రుని అశ్వములు ఎర్రనివి. నల్లనివి. పొడవగు అవయవములు కలవి. అలంకారములు కలవి. అలంకారములు కలవి. ద్యులోకమున ఉండునవి. ఇంద్రుని రథమునకు పూన్చబడినవి. ఋజాశ్వునకు ధనమును ఇచ్చుటకు బయలుదేరినవి. ఆ అశ్వములు గంభీరములయి నరులందును సైనికులందును కనిపించుచున్నవి.

    17. ఇంద్రుడు వర్షము కలిగించువాడు.ఇంద్రుని సంతోష పెట్టుటకు వృషాగిరుని పుత్రులు ఋజాశ్వుడు, అంబరీషుడు, సహదేవుడు, భయమానుడు, సురాధసుడు అనువారు ఈ స్తోత్రమున ఇంద్రుని వర్ణించుచున్నారు.

    18. ఇంద్రుడు మరుద్గణములతో కూడినాడు. భూమి మీద ఉన్న శత్రువులను, రాక్షసులను వజ్రాయుధముచే సంహరించినాడు. మరుత్తులతో కలిసి శత్రుసంబంధమయిన భూమండలమును ఆక్రమించినాడు. సూర్యుని ఆక్రమించినాడు. జలములను ఆక్రమించినాడు. జలములను ఆక్రమించినాడు. సర్వమును ఆక్రమించినాడు.

    19. ఇంద్రుడు నిరంతరుడు. ఇంద్రుడు మా విషయమున పక్షపాతము వహించవలెను. మేము కుటిల స్వభావములేక హవిస్సులను ఆర్జింతుము. మేము ఆర్జించిన హవిస్సును మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, భూమి, స్వర్గము రక్షించవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.