Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    6. రాత్రి చీకటి కొసన ఉష ఉద్భవించినది. చీకట్లను చెదరగొట్టినది. జనులకు విజ్ఞానము కలిగించినది. యాచకుడు ధనికునిముందు నవ్వినట్లు ఉష తనకాంతులతో నవ్వుచు అందరికి ఆనందము అలముచున్నది.

    7. ఉష తేజోవతి. సత్యప్రియ. ద్యులోకపుత్రిక. ఆమె గౌతములు స్తుతించినారు.

    ఉషా ! మాకు పుత్ర, పౌత్రులను, పరిచారకులను, గోవులను, గుఱ్ఱములను సంపదలను ప్రసాదించుము.

    8. ఉషా ! కీర్తి, యోగ్యతగల పుత్రులను, పరిచారకులను, అశ్వాది సంపదలు ప్రసాదించినావు. హవిస్సులు, అర్చనలు అందించువారలకు ప్రసాదించునట్టి ధనమును మాకును సమకూర్చుము.

    9. ప్రకాశమానయగు ఉష సర్వలోకములను ప్రకాశింప చేసినది. పశ్చిమాభిముఖియై వెలుగులు పెంచుచు విరాజిల్లుచున్నది. సర్వప్రాణులను కదలుటకు ప్రేరేపించుచున్నది. ప్రాణులు ఉషను మనోవాక్కులతో కొనియాడుచున్నారు.

    10. ఉష మరణము లేనిది. మరల మరల పుట్టునది. అనాదిగా ఉన్నది. ఒకేరంగుతో విరాజిల్లును. పక్షులను పట్టు ఎరుకత పక్షుల ఆయువును హరించినట్లు ఉష మర్త్యుల ఆయువులను తగ్గించుచున్నది.

    11. ఆకాశపు అంచున చీకటిని చిమ్మివేయుచు ఉష దర్శనమిచ్చినది. అనంతరము తానుగా జారిపోవుచున్న రేయిని తొలగదోసినది. నరుల యుగములను తగ్గించుచు సూర్యభార్య అగు ఉష తేజోమూర్తియై వెలుగుచున్నది.

    12. గోపాలురు అడవిలో ఆవులను వ్యాపింపచేతురు. అట్లే ఉష తన వెలుగులను జగమున ప్రసారము చేయుచున్నది. వృద్ధిచెందిన ఉష జలములతో పల్లపు నేలలకు ప్రాకి జగత్తును ప్రకాశవంతము చేయుచున్నది. యజ్ఞ సంబంధ కర్మలను చక్కబరచుచు సూర్యకిరణములతో కలిసి కనిపించినది.

    13. ఉషా ! నీవు హవిస్సు మున్నగు అన్నక్రియలు గల దానవు. మాకు పుత్ర పౌత్రాదులను పోషించదగిన ధనమును ప్రసాదించుము.

    14. ఉష గోవులు కలది. అశ్వములు కలది. కాంతులు గలది. సత్యప్రియవాక్యములు కలది. అట్టి ఉషా ! మా ఉదయకాల కర్మలు సాగునట్లు చీకట్లు తొలగింపుము.

    15. హవిస్సు మొదలగు అన్ని ప్రక్రియలు జరుపు ఉషోదేవతా ! ఎరుపురంగు గుఱ్ఱములను రథమునకు పూన్చుము. మాకు సమస్త సౌభాగ్యములు కలుగచేయుము.

    16. అశ్వినులారా ! మీరు శత్రుంజయులు. మాకు జీవనాధారమయిన గృహమును, గోవులను, అశ్వములను ప్రసాదించుడు. మీ రథమును మనస్పూర్తిగా మా ఇంటికి తోలుకొనిరండు.

    17. అశ్వినులారా ! మీరు ద్యులోకమున ఉన్నవారు. స్తుతింపదగినవారు జనులకొఱకు తేజస్సును కలిగించినారు. మాకు బలమును అన్నమును ప్రసాదించుడు.

    18. అశ్వినులు సుఖములు కలిగించువారు. శత్రుదమనులు. సువర్ణ మార్గముగలవారు. ఉదయముననే మేల్కొన్న అశ్వములు అశ్వినులను సోమపానమునకుగాను ఈయాగమునకు తీసికొని రావలెను.

        తొంబది మూడవ సూక్తము - ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు,
        దేవత - అగ్నీషోములు, ఛందస్సు 1-3 అనుష్టుప్, 4 -7,12 త్రిష్టుప్,
                                    8 జగతి, 9-11 గాయత్రి.

    1. అగ్నీషోములారా ! మీరు వర్షించువారు. మా పిలుపును వినుడు. మా స్తుతులను స్వీకరించుడు. యజమానునకు సుఖములు ప్రసాదించుడు.

    2. అగ్నీషోములారా ! యజమాని మిమ్ము గూర్చి కర్మచేయుచున్నాడు. వాక్కున స్తుతించుచున్నాడు. అతనికి సామర్థ్యము, అశ్వములు, గోవులు సమృద్ధి ప్రసాదించుడు.

    3. అగ్నీషోములారా ! మీకు అజ్యాహుతిని ఇచ్చువారును, పురోడాశాది ఆహుతులు ఇచ్చువారును సంతానమును, సంపూర్ణ ఆయువును పొందుదురు.

    4. అగ్నీషోములారా ! మీరు వీరులు. పణి అపహరించిన గోవులను విడిపించినారు. వృత్రుని సంహరించినారు. బహుజనుల కొఱకు సూర్యుని ఏర్పరచినారు. మీ సామర్ధ్యము మేము ఎరుగుదుము.

    5. సోమా ! నీవు, అగ్ని సమాన కర్మలు గలవారు. మీరు గ్రహ నక్షత్రాదులను అంతరిక్షమున నిలిపినారు. అగ్నీషోములారా ! మీరు నదుల పాపమును తొలగించినారు.

    6. అగ్నీషోములారా ! మీ ఇరువురిలో ఒకడు అగ్ని. అట్టి అగ్నిని వాయువు ద్యులోకము నుండి తెచ్చినాడు. రెండవవాడు సోముడు. అట్టి సోముని డేగరూపయగు గాయత్రి మేరుపర్వతము నుండి తెచ్చినది. మీరు మంత్రముచేత వృద్ధిపొందినవారు. యజ్ఞము కొఱకు లోకమును విస్తారపరచినారు.

    7. అగ్నీషోములారా ! హవిస్సును ఆరగించుడు. వర్షము కలిగించు మిమ్ము మేము సేవింతుము. మీకు రక్షణ, సుఖములు కలుగవలెను. తదుపరి యజమానికి రోగశాంతిని, భయపరిహారమును అనుగ్రహించుడు.

    8. అగ్నీషోములారా ! దేవతలందు భక్తి కలిగి మంచి మనసుతోనూ, హవిస్సుతోను సేవించు యజమాని కర్మలను రక్షించుడు.

    9. అగ్నీషోములారా ! హవిస్సున మీకు సమాన భాగము ఉన్నది. సమాన ఆహ్వానము ఉన్నది. మా స్తుతులను గ్రహించుడు. మీరు దేవతలందు నుతికెక్కినవారు.

    10. అగ్నీషోములారా ! మీకు భక్తుడయి నేతి హవిస్సులు ఇచ్చు యజమానికి గొప్ప ధనము ప్రసాదించుడు. 

    11. అగ్నీషోములారా ! మా హవిస్సులు అందుకొనుడు. ఉభయులు కలిసి మావద్దకు రండు.

    12. అగ్నీషోములారా ! మా అశ్వములను రక్షింపుడు. ఆజ్యాది హవిస్సులను ఇచ్చు గోవులను వృద్ధిపరచుడు. హవిస్సులను ధనములు సమర్పించు మాకు బలమును ప్రసాదించుడు. మా యాగమును అగునట్లు చేయుడు.

        (ప్రథమ మండలమున పదునాలుగవ అనువాకము సమాప్తము.)

             పదిహేనవ అనువాకము - తొంబది నాలుగవ సూక్తము,
              ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు, దేవత - అగ్ని,
                  ఛందస్సు 1-14 జగతి, 15-16 త్రిష్టుప్.


    1. అగ్నిహోత్రుడు పూజ్యుడు. మా బుద్ధి చురుకయినది. మా బుద్ధితో అగ్నికి ఈ సూత్రము నందలి స్తుతులు నిర్మించినాము. అవి రథమువలె గొప్పవి. అగ్నిని సేవించినాము. అందువలన మా మనసు మంగళకరము అయినది. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు సఖ్యే మారిషామా వయం తవ

    2. అగ్నీ ! నీవు యజమాని కొఱకు దేవతలను యజించుచున్నావు. అట్టి యజమాని సర్వకార్యములు సాధించగలడు. అతనిని శత్రువు ఓడించలేడు. అతని ధనము, బలము వృద్ధిచెందును. అతనిని దరిద్రము అంటదు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    3. అగ్నీ ! నిన్ను వృద్ధిచేయగలము. నీవు మా కర్మలను సాధించుము. మేము దేవతలను ఆహ్వానించుచున్నాము. నీవు వారిని తీసికొనిరమ్ము. నీయందు హోమము చేసిన హవిస్సులను దేవతలు స్వీకరింతురు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    4. అగ్నీ ! సమిధలను సంపాదించుచున్నాము. అమావాస్య, పౌర్ణమి పర్వదినములందు నిన్ను ధ్యానించుచున్నాము. హవిస్సులు అర్పించుచున్నాము. మా చిరంజీవిత్వమునకుగాను నీవు మా కర్మములను నెరవేర్పుము. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    5. అగ్ని కిరణములు సమస్త ప్రాణులను రక్షించుచున్నవి. ఆ కిరణములతోనే జీవించుచున్నవి. అగ్నీ నీవు చిత్రకాంతులవాడవు. తేజస్సు కలిగించువాడవు. ఉషస్సును మించిన గుణవంతుడవు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    6. అగ్నీ ! నీవు అధ్వర్యుడవు. ముఖ్యహోతవు. ప్రశస్తుడవు. ముఖ్యహోతవు. ప్రశస్తుడవు. హోతవు. జన్మతః పురోహితుడవు. నీకు ఋత్విజకార్యములు అన్నియు బాగుగా తెలియును. అందువలన నీవు యజ్ఞమును పూర్తిచేయగలవు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    7. అగ్నీ ! నీవు అందగాడవు. అందరిని మించినవాడవు. దూరమున ప్రకాశింతువు. దగ్గర ప్రకాశింతువు. రాత్రిపూట చీకటిని మింగి వెలుగుదువు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    8. సర్వదేవతలారా ! సోమరసము అందించు యజమాని రథమును రక్షింపుడు. మా శత్రువు దుర్బుద్ధి. అతనికి మా శాపము తగులవలెను. నా మాటను గ్రహించుడు. నావాక్కును పాలింపుడు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    9. అగ్నీ ! నీవు ఆయుధము ధరింపుము. దుర్మార్గులను హతమార్చుము. దూరమందున్నను, దగ్గర ఉన్నను రాక్షసులను హతమార్చుము. తదుపరి యజమానికి సరియైన మార్గము చూపుము. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    10. అగ్నీ ! నీ అశ్వములు ఎర్రనివి వాయువేగముగలవి. వానిని నీ రథమునకు పూన్చినంతనే అడవులు తగులబడును. అప్పటి నీ ధ్వని ఆబోతు రంకెవంటిది అగును. అపుడు నీవు ధూమధ్వజుడవు అగుదువు. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    11. అగ్నీ ! నీవు అడవులు కాల్చునపుడు నీధ్వనికి పక్షులు బెదురును. నీమంటలు గడ్డికొసలను అంటుకున్నప్పుడు నీ రథము తేజోవంతమయి అడవి సాంతమున అగుపించుచున్నవి. అగ్నీ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    12. ఈ యజమానిని, స్తుతికర్తను మిత్రుడు, వరుణుడు రక్షించవలెను. అంతరిక్షమున మరుత్తుల కోపము మెండగుచున్నది. ఆ మరుత్తుల మనసు శాంతించవలెను. వారు ప్రసన్నులు కావలెను. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    13. అగ్నీ ! నీవు ప్రకాశకుడవు. సకల దేవమిత్రుడవు. యజ్ఞములందు ధనములకు ఆవాసమవు. మాకు నీ ఆశ్రయము కలుగచేయుము. నీకు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    14. అగ్నీ ! ఉత్తరవేది నీ స్వగృహము. అచట నీవు ప్రజ్వరిల్లుచున్నావు. సోమము సేవించుచున్నావు. అది ప్రశంసనీయము. యజ్ఞఫలమును, ధనమును, సుఖమును, యజమానికి ప్రసాదించుము. నీకు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    15. అగ్నీ ! నీవు అఖండుడవు. యాగములు చేయు యజమానుల పాపమును హరించుచున్నావు. అతనికి శుభములు, బలములు కలుగచేసి సమృద్దుని చేయుచున్నావు. మాకు అన్నము, ధనము, సంతానము కలుగచేయుము. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మమ్ము బాధలు అంటవు.

    16. అగ్నీ ! నీవు భాగ్యవంతుడవు అగుము. ఈ యాగమునందు మా ఆయువును వృద్ధిచేయుము. అట్టి ఆయువును మిత్రావరుణులు, అదితి, సముద్రుడు, భూమి, ద్యులోకము రక్షించవలెను.

    శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొ.అష్టకము ప్ర.మండలమున ఆరవ అధ్యాయము సమాప్తము.

        ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
        నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||

            ఏడవ అధ్యాయము - తొంబది అయిదవ సూక్తము
            ఋషి - అంగిరస పుత్రుడు కుత్స, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.


    1. దివారాత్రులు విరుద్ధ రూపములు. అవి పునరావృతములు అగుచున్నవి. రాత్రి పుత్రుడు సూర్యుడు. తల్లిపుత్రునకు పాలు, రసము ఇచ్చుచున్నది. పగటిపుత్రుడు అగ్ని. తల్లి పుత్రునకు పాలు, రసము ఇచ్చుచున్నది.

    2. అగ్ని వాయువునకు పుత్రరూపుడు. సకల ప్రాణులందు ఉన్నవాడు. కాంతిమంతుడు. కీర్తిమంతుడు. అన్ని స్థానముల ప్రకాశించువాడు. రెండు చేతులతో అరణులు తరచగా అగ్ని ఉద్భవించినది. ఋత్విజులు అట్టి అగ్నిని అన్నిచోట్లకు తీసికొని వెళ్లుచున్నారు.

    3. అగ్నికి మూడు రూపములు ఉన్నవి. అవి సముద్రమున బడబాగ్ని, ద్యులోకమున సూర్యుడు, జలములందు వైద్యుతాగ్ని అగుచున్నవి. వాటితో ఋతువులు ఏర్పడినవి. తూర్పుదిక్కు శ్రేష్ఠమని తెలిసినది.

    4. సమస్త ప్రాణులందు అంతర్హితమయిన అగ్నిని ఎరుగువారెవరు ? మేఘ గర్భమందు ఉన్నందున మేఘము అగ్నికి తల్లి అగును. అగ్ని తల్లి కొఱకు హవిరూపమగు అన్నమును సృష్టించుచున్నాడు. తేజోవంతుడు, విద్వాంసుడు, అన్నవంతుడు అగు అగ్ని ఉషస్సు అయి సముద్రము నుండి బయలు వెడలుచున్నాడు.

    5. ఉదకములందు ఉన్న అగ్ని అందగాడయి పుట్టినాడు. కుటిలగమనముగల జలములందు ఉండియు జాజ్వల్యమానుడయి, కీర్తిమంతుడయి వర్థిల్లుచున్నాడు. ద్యులోకభూలోకములు అగ్నికి భయపడుచున్నవి. అగ్నిని సేవించుచున్నవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.