Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    ఉత్సవంముగిసింది. దేవాలయం సద్దుమణిగింది. అంతా వెళ్ళిపోయారు. చెదురు మదురుగా అక్కడిద్దరు, ఇక్కడిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో మోతీచంద్ కొత్తమిత్రుణ్ణి కాలూ దగ్గరికి తీసుకొనివచ్చాడు.
    "మీకు జోగీష్ మిత్రాతో పరిచయం లేదుకదూ? మిత్రా జనప వ్యాపారంలో ప్రముఖుడు."
    కాలూ నివ్వెరపోయి ఆపాదమస్తకం చూశాడు. నోటివెంట మాటలు పెకలక "ఎ.....వ.......రు" అన్నాడు.
    "జోగీష్ మిత్రా! మీకు స్వయంగా చెక్కు అందించాలని వచ్చాడు. ఆ డబ్బుతో ఒక మంటపం నిర్మించాలని అతని ఉద్దేశం."
    కాలూ వెర్ర్రిగా చూస్తూనే ఉన్నాడు.
    "మంటపం ఎనిమిదిరేకుల పద్మంలా తెల్లని సిమెంటుతో నిర్మించబడాలని నా ఉద్దేశం. నేలమీద చలవరాళ్ళు పరచబడ్డాయి" జోగీష్ మిత్రా అన్నాడు.
    "చాలా మంచి ఆలోచన" అన్నాడు మోతీచంద్.
    "జనపనార వ్యాపారంలో ప్రముఖుడు" ఆ మాటలు వినేవరకు కాలూ తల తిరిగిపోయింది. తనముందున్న వ్యక్తికోసం స్మృతిపథం యావత్తూ గాలిస్తూంటేకాలూకు పిచ్చెక్కినట్లు అయింది.
    "ఇంతతో సరిపోకుంటే మరొకసారి ఇంకొంత డబ్బు ఇస్తాను" అని జేబులోంచి చెక్కుబుక్కు తీస్తూ "నాకొక పనివా......" జోగీష్ ఆగిపోయాడు. కాలూముఖం గడ్డకట్టుకొనిపోయింది.
    మోతీచంద్ కాలూ చేయిపట్టుకొని "మండుటెండలో రోజంతాపని. ఏదీ గ్లాసుడు నీళ్ళు అందుకోండి" అన్నాడు.
    కాలూ తల చితక్కొడుతున్నట్లయింది. తూలి పడిపోయాడు.
    "కాస్త అలా పడుకోండి. మిగతావన్నీ నేను చూసుకుంటా" అన్నాడు మోతీచంద్.
    జోగీష్, మోతీచంద్ లు ఒకరినొకరు ప్రశ్నార్ధకంగా చూసుకున్నారు.
    "అదేమిటి? నన్నుచూసి బెదిరినట్లు కనిపిస్తాడు" జోగీష్ తడబడుతూ అన్నాడు.
    "ఇంతకుముందెప్పుడూ చూడలేదూ?"
    "లేదు"
    "విచిత్రంగానే ఉంది"
    జోగీష్ ఆలోచనలో పడిపోయాడు. మంగల్ అధికారి, మంగల్ అధికారి, అని గునుస్తూ తన స్మృతికూపంలోంచి మంగల్ అధికారిని బైటికి తీయడానికి ప్రయత్నించాడు.
    చంద్రలేఖ గబగబా వచ్చి మర్యాదగా కాస్తదూరంలో నిలిచిపోయింది. "అధికారి బాగా అలసిపోయారు. కాస్త పడుకొమ్మని చెప్పాను. ఒక గ్లాసు వేడి పాలివ్వండి" అన్నాడు మోతీచంద్.
    చంద్రునిమీదికి ఎర్రని మబ్బుతెర వచ్చిపోయినట్లు క్షణం తెల్లబడి ఎరుపు క్రమ్ముకున్న చంద్రలేఖ ముఖకవళికమీద మోతీచంద్ దృష్టి ఆటలాడింది.
    తనలో కలిగిన మార్పును బైటపడనీయకుండా ఉండేందుకుగాను గొంతు సవరించుకొని "ఆదుర్దా ఏమీలేదు. నేను ఉన్నానుగా?" అన్నాడు మోతీచంద్.
    నేలవైపుచూస్తూ "మీకు మామీద చాలాదయ" అన్నది రాబోతూ ఉన్న రోప్పును ఆగబట్టుకోవడానికి యత్నిస్తూ.
    "నేను స్వయంగా మీ తండ్రికి చెక్కు అందించలేకపోయాను. మీరు యిది ఆయనకు అందించండి" అని జోగీష్ చెక్కు అందించాడు.
    లేఖ చెక్కు తీసుకొని దాతవైపు చూసింది. రోజూ చూస్తున్న వేలకొద్ది జనంలో అతడు ఒకనిలా ఆమెకు కనిపించింది. పెద్ద తేడా ఏమీలేదు అదే వెడల్పు ముక్కూ, ధనికసహజమైన మందహాసం.
    లాంఛనంగా "ఏదో మీదయ" అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ఎత్తుపిరుదుల కదలికా, నడకలోని వయ్యారాన్ని వదల్లేక మోతీచంద్ దృష్టి లేఖ వెంటనే నడిచింది.
    కాలూ మట్టిముద్దలా పడిపోయాడు. అతని పేకముక్కల మేడ చెదిరిపోయింది. ఆనందంతో వెలిగిపోతూ ఉన్న కళ్ళల్లో నీరసం తాండవమాడింది. దూరంగా వుంచదల్చుకున్న విషాదగతం కళ్ళల్లో గూళ్ళుకట్టుకొని కూర్చుంది. ఈ దుస్సంఘటన ఇలాంటి సంతోషదినానే జరగాలా?లేఖను పతనకూపందాకా తీసికెళ్ళినవాడు వీడే సంపద, దయ- వీటి ముసుగులో అతని దుష్టత్వం, జారత్వం దాక్కున్నాయి. కాలూకు ఆ ముఖం ఏమాత్రం గుర్తులేదు. కాని ఆ తార్పుకత్తె మాటలు అతని చెవుల్లో ఇంకా రింగ్ మంటున్నాయి. తుదకు తనకు ఆ మనిషి ఎదురుకానే అయినాడు. అయితే మాత్రం? తాను చేయగలిగిందేమిటి -చేతులు జోడించి అతనికి కృతజ్ఞత తెలియపర్చడం తప్ప? తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు!
    రెప్పపాటులో వారు తనను నలిపివేయగలరు. దేవాలయం యావత్తూ తనదేమీకాదు. అయితే దాని ఆదాయంమాత్రం తానే అనుభవిస్తున్నాడు. దేవాలయంమీద నిర్మాతలు ఎన్నుకున్న అయిదుగురు ధర్మకర్తలది అధికారం. తాను చేసిన మోసాన్ని కప్పిపుచ్చడానికి వారితో స్నేహం చేస్తున్నాడు. తనకు మిత్రులున్నారనే ఆనందకిరణలవం అంతటితో మాయం అయింది. తాను నిర్మించిన బూటకపు దేవుడూ, గుడీ, పూజారీ అన్నింటినీ మరచిపోయాడు.
    మళ్ళీ అతని కులం పడిపోయింది. మంగల్ అధికారి కాలూ అయిపోయారు. స్నేహపాత్రులుగా కనిపించినవారంతా నరరూపరాక్షసులుగా అతనిచుట్టూచేరి వికటాట్టహాసం చేస్తున్నారు. లేఖను రక్షించాలి.......
    కాలూ శత్రువుపన్నిన వలలో చిక్కుకున్నాననుకున్నాడు. తెరవెనుక తాను తార్చిన విటులు ఇంకెందరు ఉన్నారో? వారంతా తన్ను గుర్తిస్తారా? బ్రాహ్మన్ని తార్పుగానితో పోల్చగలిగే ధైర్యం ఎవరికుంటుంది? ఇప్పుడతడు దారిద్ర కాలూగానీ, గాంధీటోపీ కాలూగానీకాదు. అతడు పూర్తిగా మారిపోయాడు. ఏది ఎలా ఉన్నా పులిని ఎక్కినవాడు దిగజారాడో అది మింగేస్తుంది. కాబట్టి ఒకటే ఉపాయం -ఎక్కి స్వారీ చేస్తుండాలి......చేస్తుండాలి. అంతే.
    జోగీష్ మళ్ళీ ఇక్కడికి వస్తాడు. లేఖ వాణ్ణి చూస్తుంది అనే ఆలోచనవచ్చేవరకూ కాలూ గడగడా వణికిపోయాడు.
    లేఖ భయంతో మందగించిన గొంతుతో "బాబూ, జబ్బుగా ఉందా?" అని అడిగింది. ఆమె అతనిపక్కనే కూర్చుని నుదుటిమీద చేయిపెట్టింది. ముఖం చమటతో తడిసి ఉంది. కణతల నరాలు బాదుతున్నాయి.
    "నీరసంగా ఉంది. పెత్తనంకదూ? ఇంటికి వెళ్దాంపద"
    ధ్వనిలో నూతనోత్సాహం గోచరిస్తూ ఉండగానే లేఖ "నీ ప్రభావానికి ఆడవారంతా కంట తడిపెట్టారు. 'ఈ కలికాలంలో ఇంత విశ్వాసంగలవాళ్ళు ఉంటారా? అని కన్నీరు తుడుచుకున్నారు," అంది.
    హాస్యంగా అంటుందేమోనని తటాల్న తలపైకెత్తి చూచాడు. ఆమె అపహాస్యం చేయడంలేదు. ముఖంమీద సంతోషరేఖలు ఉన్నాయి.
    'ఇదిగో డబ్బు."
    కాగితం ముక్కలు ముక్కలుగా చీల్చివేద్దామనిపించింది కాలూకు. కాని మరుక్షణంలోనే స్పృహవచ్చింది.
    భయంతో అతని ముఖం మొద్దుబారగా "ఎవరిచ్చారు" అని అడిగాడు.
    "దాత ఆయన స్వయంగా ఇచ్చాడు."
    కలవరంతో ఆమెవైపు చూశాడు. ఆమె ముఖం స్వచ్చంగా ఉంది. లేఖ వాణ్ణి గుర్తించలేదా? నాటిరాత్రి వాడి ముఖం చూడలేదేమో? ఆ మాటలు ఎలా మరుపుకు వస్తాయి? ఏమిటి మరిదంతా?
    అతడు సస్పెన్సు భరించలేకపోయాడు. చెక్కు మీదినుంచి తన వాడి చూపులు లేఖమీద నిగిడ్చి, బరువుగా ఊపిరిపీలుస్తూ "జనప వ్యాపారంలో ప్రముఖుడు" అన్నాడు.
    "అలాగా. వీళ్ళకు కొన్నివేలు అంటే పెద్దలెక్క ఏమీకాదు."
    అమాంతంగా తలమీదినుంచి బరువు దింపేసి నట్లయింది. కళ్ళుమూసుకొని తల రొమ్ముమీద పడేదాకా వంచాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.