Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    పక్షం గడిచింది. ఒకనాటి మధ్యాహ్నం బామ్నీ లేఖదగ్గరికి ఆదుర్దాగా పరుగెత్తి మిద్దెమండుతూందని రొప్పుకుంటూ చెప్పింది. లేఖ మెట్లెక్కి చూస్తే గదిలోంచి పొగవస్తూంది. తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళింది. తండ్రివైపు ఒక్కసారి చూసి బామ్నీ ముఖాన్నే దఢాల్న తలుపు వేసింది.
    కాలూ నేలమీదకూర్చొని తిత్తి ఊదుతూ బాగుచేయాల్సిన ఒక బక్కెట్టుణు అతుకుతున్నాడు. ముఖంమీదా మెడమీదా చెమట మెరిసిపోతూంది. కాలూ తలెత్తి కూతురువైపు చూస్తే అతని కళ్ళు మిణకరించాయి.
    పొట్ట చెక్కలయ్యే నవ్వురాగా లేఖ నోటిమీద చేయివేసుకుంది.
    "ఓహో! గొప్పయోగమే!! నీవు తలుపువేసుకొని తపస్సు చేస్తూంటే మేం శ్వాస బిగపట్టి చూస్తున్నాం."
    యోగసాఫల్యంతో మెరిసిపోయేకళ్ళుగల కాలూ "నా యోగం ఫలించింది. నా చంద్రలేఖను పూర్వంలా నవ్వించగలిగాను. అదే నాకు దైవ సాక్షాత్కారం" అన్నాడు.
    పొగలా పొగకథ పాకిపోవడంతో  కొలిమి వదులుకోవాల్సి వచ్చింది. ఆ రాత్రి కాలూ తన పనిముట్లను గుడిబావిలో పారేశాడు. అవి నీళ్ళలో పడ్డధ్వనివిని నిట్టూర్పు విడిచాడు. మళ్ళీ అతనికి చేతులు బరువైనాయి.
    
                                       10
    
    యుద్దం మూలాన మార్కెట్టునుంచి మాయం అయిన సిమెంటు, ఉక్కులాంటి వస్తువులు సహితం దేవాలయ నిర్మాణానికి బ్లాకు మార్కెట్టునుంచి ప్రవాహంలా వచ్చిపడ్డాయి. వేల సంవత్సరాలనుంచి వస్తున్న ఆచారాన్ననుసరించే అదే పద్దతిలో, అదే రూపంలో దేవాలయం నిర్మించబడుతూంది. ఎత్తుగా ఉన్న గాలిగోపురంమీద ఇత్తడి త్రిశూలం సూర్యుని కాంతికి మెరుస్తూంది. బ్రాహ్మాండమైన వటవృక్షం పక్క తెల్లని సిమెంటుతో నిర్మించబడిన స్ఫటికంలాంటి దేవాలయం ఘనీభవించిన జలయంత్రంలా ఉంది.
    ఒక శుభముహూర్తాన, ఆడంబరమైన క్రతువుల్తో ప్ర్రారంభోత్సవం జరిగింది. తన సహజ నైపుణ్యంతో మోతీచంద్ ఉత్సవానికి చేసిన ఏర్పాట్లు నేటికీ నగర ప్రజల స్మృతిపథంలో నిలిచిపోయాయి. గొప్పగొప్ప అతిథుల్ని ఆహ్వానించడం జరిగింది. యోగులు, రాజకీయ వేత్తలు, ఉన్నతాధికారులు అంతా విచ్చేశారు. దేవాలయావరణం అంతా అతిథుల కార్లతో నిండిపోయింది. ఆహ్వానితులకంటే అనాహ్వానితులు పదిరెట్లు వచ్చారు. నగరమధ్యప్రాంతంనుంచీ, దశదిశలనుంచీ బస్సులనిండా వచ్చారు. అది ఒక తిరునాళ్ళు అయింది.
    అది కాలూకు మహదానందదినం అనేవిషయం అతనికి తెలుసు. విశాలమై విజ్ఞానం ఉట్టిపడే అతని నుదుట ఎర్రని త్రిశూల చిహ్నం మెరుస్తూంది. సిల్కు దుస్తుల్లోంచి ఎగిరేధోవతిలోంచి మెరిసే అతని శరీరం కనిపిస్తూంది. అతని శరీరవర్చస్సు ఆత్మానందాన్ని సూచిస్తూంది. తెల్లని స్తంబాలుగల గేటులో నుంచొని జోడించిన చేతుల్తోనూ, స్నేహ పూర్వకమైన మందహాసంతోనూ, అతిథుల్ను ఆహ్వానిస్తున్న అతని అవయవాలనుంచి గౌరవం ఉట్టిపడుతూంది. అతని వ్యక్తిత్వాన్ని చూచిన జనం, యోగులకూ, పండితులకూ అరుదైన గౌరవం పేదవాడూ, అజ్ఞాతుడూ అయిన బ్రాహ్మడికి భగవంతుడు ఎందుకు ప్రసాదించాడో అర్ధంచేసుకున్నారు. ఆజానుబాహువైన మొరటు విగ్రహంలో అపూర్వమైన వ్యక్తిత్వం గోచరిస్తూంది. దేవాలయాన్నీ దాని ఆదర్శాలనూ నిలుపగల బలమూ శక్తీ ఉన్నాయి. జోడించి ఉన్న పెద్దపెద్ద చేతులు పిడికిలి బిగించి పోరాటం సాగించగలవు. నాస్తికులూ, విశ్వాసహీనులూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అలాంటి వ్యక్తికే నిలువడమూ, నిలపడమూ సాధ్యం అవుతుంది. భగవంతుడు తగినవాన్నే ఎన్నుకొన్నాడు.
    తన ఔన్నత్యానికి కారణం తెలిసినకాలూ ఆనందించాడు. ధనికులూ, అధికారులూ, గౌరవనీయులూ అంతా ఆయనతో చేయికలపడానికి ఆదుర్దాపడ్తున్నారు. దూరంనుంచి రక్కసులుగా కనిపించినవారు, దగ్గరనుంచి చూస్తే మానవులుగాను, ప్రేమపాత్రులుగను కనిపించారు. వారిలో ఎవరిభుజంమీదనైనా చేయివేసి తనస్వంత మనుష్యుల్ను అడిగినట్టు "ఏఁ. ఉత్సవం ఎలా ఉంది?" అని అడగొచ్చు.
    అతనిగుండెలో ఔన్నత్యం పొంగిపొర్లింది. అతడు పరివర్తనం చెందిన మనిషి. ముహూర్తం సూర్యాస్తమయం తరువాత గంటకు. శివుని ముందు అయిదు కళికలదివ్వె వెలుగుతూంది. అనంతవిజ్ఞానం కలిగి పవిత్రమైన తొమ్మిది మంది బ్రాహ్మలు శ్రావ్యంగా మంత్రపఠనం సాగిస్తున్నారు. ఆహ్వానితులైన అతిథులు అమూల్యములైన తివాసీలమీద ఆసీనులై ఉన్నారు. అనాహ్వానితులు పచ్చనిగడ్డి మీద కూర్చొనీ, నిల్చొనీ ఉన్నారు.
    మోతీచంద్ ఉపన్యసించడానికి నుంచున్నాడు. దేవాలయ నిర్మాణంలోగల తనపాత్రను అతి సూక్ష్మంగా చెప్పి మంగల్ అధికారిని పొగుడుతూ దేవాలయ చరిత్రయావత్తూ చెప్పాడు. 'నన్నుగురించి మోతీచంద్ చెప్పిందంతా నిజమేనా?' అని కాలూ తన్నుతానే ప్రశ్నించుకున్నాడు.
    మంగల్ అధికారిని నాలుగుమాటలు మాట్లాడవలసిందిగా మోతీచంద్ కోరాడు. కాలూ ఉపన్యాసం ప్రారంభించేందుకు ముందు "ఈ శుభసమయాన, భగవంతునికి ప్రియతములైన మీకు, ఈ సభవారంతా జోహార్లర్పిస్తున్నారు" అని చెప్పాడు.
    పెద్దమల్లెదండ మోతీచంద్ కాలూ మెళ్ళోవేశాడు. అది మెళ్ళోపడగానే ప్రేక్షకులంతా పెద్దగా కరతాళధ్వనులు చేశారు.
    కూలూ చేతులుజోడించి ప్రేక్షకులందరికీ వినమ్రంగా నమస్కరించాడు. మొదట కొద్దిక్షణాలపాటు అతనిధైర్యం అడుగంటింది. నోరు ఎండిపోగా ఒకటిరెండుసార్లు నాలుకతో పెదవుల్ని తడుపుకున్నాడు. నాలుక తడబడుతూండగా ఉపన్యాసం ప్రారంభించాడు.
    "నేను మహాశివుని దాసుణ్ణి. అతనిచేతిలో కీలుబొమ్మను, అంతకంటే ఎక్కువగానీ, తక్కువగానీ కాను. నా మిత్రుడు, వర్తకప్రముఖుడు అయిన మోతీచంద్, నాపై ఉండే ఆదరాభిమానాలతో అతిగాపొగిడేశాడు. అవి నాకు సంబంధించినవికావు. వాటికి మంగల్ అధికారి గుణగుణాలతో సంబంధంలేదు. అవి మంగల్ అధికారికి మోతీచంద్ హృదయంలోగల గౌరవం పలికించిన పలుకులు. అతడు హృదయపూర్వకంగా పలికినవి కాబట్టి అవి అసత్యాలు కావు. మిత్రులారా, సోదరులారా. వినండి, నామున్దున్న ఆ మహాదేవునికి, ముక్కంటికి, కైలాసవాసికి దాసుణ్ణికావడమే నా లక్ష్యం."
    కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. శ్రోతల ఉత్సాహం అతన్ని ఉర్రూత లూగించింది. అతని ఆనందం కట్టలు తెంచుకొని కన్నుల్లోంచి ప్రవహించేంత పనైంది. "మీరంతా సజ్జనులు. నామీద ఎంత దయా ఎంత అభిమానమూ!" అన్నాడు రుద్దకంఠంతో.
    సామాన్యుడైన ఊరికమ్మరికి ఎంత గొప్ప విజయం! ఎంత ఉచ్చస్థాయి!! అతని పథకంకంటే అనేకరెట్లు ఎక్కువగా విజయం లభించింది. అతని ఆయుధాలు మొక్కవోయినాయి. అతనిచేతులు పడిపోయాయి. అతనిలో ఒక కొత్తనినాదం మారుమ్రోగింది. 'నీ ఉద్దేశం ఫలించింది. స్వయంకల్పిత బ్రాహ్మణుడవైన నీకు ప్రజలు ఉన్నతాసనం కల్పించారు. నీ కుట్రనూ మోసాన్నీ రక్తంతో కడిగేసి వారి గౌరవానికి అర్హంగా సిద్దంకావడం ఉత్తమం.'
    మళ్ళీ మోతీచంద్ లేచాడు. బోర్డు మీటింగులోలా సంక్షిప్తంగానూ, అవసరానికి మించకుండానూ మాట్లాడాడు. అతడు విరాళాలు అర్ధించాడు. ఒక తాకట్టు విడిపించాల్సి ఉంది. కొత్తస్థలం కొనడానికీ, దేవాలయవిస్తరణకూ, నిర్వహణకూ, డబ్బుకావాల్సి ఉంది. ఈ దేవాలయం నగర దేవాలయాలకు తలమానికంకావాలి. ఇక్కడున్నవారంతా, ముఖ్యంగా వర్తకులు ఈ విషయాన్నీ గుర్తుంచుకొని గుండెలతోపాటు ముళ్ళెలు విప్పాలి. వారు తన పేరు ప్రఖ్యాతులూ, దాతృత్వమూ ప్రకటించబడాలి. తనముందు కూర్చొని ఉన్న లక్షాధికార్లు ఇతరులకు మార్గం చూపాలి.
    వాగ్దానాలు కుప్పలు తిప్పలుగా పడ్డాయి. బ్లాక్ మార్కెట్టు నుంచీ కరువువల్ల బియ్యపు వ్యాపారంలో సంపాదించిన లాభాలనుంచీ, ఎగవేసిన పన్నులలాభాలనుంచీ దేవాలయంమీద కనకవర్షం కురిసింది. స్వర్ణభారంతో కాలూ తల వంగిపోయింది. ఎడమ ప్రక్కను స్త్రీలలో కూర్చొని ఉన్న లేఖను కాలూ చూచీచూడనట్లుచూచాడు. లేఖ తల కాలూ వక్షానికి ఆనించి ఉండగా ఆమెతో 'మనం కోరుకున్నదానికంటే వెయ్యిరెట్లు అధికంగా ఫలితం లభించింది. వారు నిన్నూనన్నూ ఎలాగౌరవించుతున్నారో చూశావుగా? నీవూనేనూ ఏదోవారికీ దగ్గరి బంధువులమైనట్లు ప్రవర్తిస్తున్నారు. చూశావా ఎంతవిలువైన పదార్ధాలు మనముందు కుప్పలుతిప్పలుగా పడి ఉన్నాయో" అందామనుకున్నాడు. అయితే చంద్రలేఖ తనమాట వినగలిగేంత దగ్గరగా లేదు. పైగా ఆమె ఆడవారి గుంపులో ఉంది. కాబట్టి అటువైపు కన్నెత్తి కూడా చూసేట్లులేదు.
    దేవాలయంలో 'గణగణా' గంటలు మ్రోగాయి. గుళ్ళో తానునిలిపిన బూటకపు శివుని విషయం మరిచి వాస్తవంగా శివుడే ఆలయంలో అవతరించాడా? అనుకున్నాడు కాలూ. తాను మోసంతో నిలబెట్టిన బూటకపుదేవుడు మిధ్య. ఇంకదాన్ని మరిచిపోవడం ఉత్తమం. బూటకపు దేవుడు నిజమైనదేవునిగను, బూటకపు బ్రాహ్మడు వాస్తవ బ్రహ్మడుగను మారిపోయారు. వారు మరో అవతారం, మరోజన్మా ఎత్తారు. దానికి గంతంతో సంబంధంలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.