Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    ద్రోణుడు మరింత చదువు చదివినాడు. అగ్నివేశుని వద్ద ధనుర్విద్యను అభ్యసించినాడు. ఆగ్నేయాస్త్రము సంపాదించినాడు. మరిన్ని దివ్యాస్త్రములు పొందినాడు. భరద్వాజుని అజ్ఞ ప్రకారము పెండ్లాడినాడు. కృపాచార్యుని చెల్లెలు కృపి. ఆమె ద్రోణుని భార్య అయినది. వారికి అశ్వత్ధామ జన్మించినాడు.
    పరశురాముడు మహేంద్ర పర్వతమున తపము చేసినాడు. అతడు బ్రాహ్మణులకు భూరి దానములు ఇచ్చుచున్నాడు ద్రోణుడు. అదివిన్నాడు. ధనాశతో పరశురాముని దగ్గరికి వెళ్ళినాడు. ధనము అడిగినాడు. "నాకున్న ధనమంతయు ఇదివరకే దానము చేసినాను. భూమి కశ్యపునకు ఇచ్చినాను. నా వద్ద నా దేహము ఉన్నది. అస్త్రములు ఉన్నవి. శస్త్రములు ఉన్నవి. నీకు కావలసినది తీసుకొనుము." అన్నాడు. ద్రోణుడు అస్త్రశస్త్రములు అడిగినాడు. పొందినాడు.
    ద్రోణుడు విద్యలందు అరితెరినాడు. కాని ధనమును అర్జించలేకపోయినాడు. అశ్వత్ధామను పెంచుట పోషించుట కష్టము అయినది. ధనికుల పిల్లలు పాలు తాగుదురు. అశ్వత్ధామ అది చూచును. తనకు పాలు కావలెను అని అడుగును. కొడుకు పాలు అడిగినాడు. ద్రోణుడు ఇవ్వలేకపోయినాడు. విలవిలలాడినాడు. అతడు దరిద్రుడు. పాలు ఇచ్చు అవును సహితము అర్జించుకోనలేకపోయినాడు. దారిద్ర్యమును మించిన కష్టము మరొకటి లేదు. అనుకున్నాడు. అయినను అవివేకులగు రాజులను ఆశ్రయించలేదు. వివేక హీనుల వద్ద దానుము గ్రహించలేదు.
    అప్పుడు ద్రోణునకు తన బాల్య స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకు వచ్చినాడు. ద్రుపదుడు తనతో చదువుకున్నాడు. ఇప్పుడు రాజు అయినాడు. అప్పుడు తనను రమ్మన్నాడు. అతడు మిత్రుడు. మిత్రుని వేడుట తప్పుకాదు. ద్రుపదుడు ధనరాసులు ఇవ్వక పోవచ్చును. నాలుగయిదు పాడి ఆవులను అయిన ఇవ్వవచ్చును. ఆ పాలు అశ్వత్ధామకు పనికి వచ్చును అనుకున్నా డు. ద్రోణుడు పాంచాలమునకు పయనమయినాడు.
    ద్రోణుడు పాంచాలము చేరినాడు. ద్రుపదుని దర్శించినాడు అన్నాడు.
    "మిత్రమా! పాంచాల రాజా! నేను ద్రోణుడను. బ్రాహ్మణుడను. మనము బాల్యమున కలిసి చదువుకున్నాము. భరద్వాజుని ఆశ్రమమున వేదము చదివినాము. నన్ను నీవు ఎరుగుదువు. నిన్ను నేను ఎరుగుదును." ద్రోణుడు సవినయముగా విన్నవించినాడు.
    ద్రుపదుడు ద్రోణుని చూచినాడు. అతని మాటలు విన్నాడు. పరిచయము లేనట్లు చూచినాడు. అన్నాడు. "ఒయీ! బాపడా! నీవు మాట్లాడిన తీరు బాగుండలేదు. నా గౌరవము తెలియక మాట్లాడినావు. నీకు నేను స్నేహితుడను అన్నావు. అట్లనుట తప్పు. నీవు పేదవు. నేను రాజును. పేదకు రాజుకు స్నేహము అసంభవము. దరిద్రునకు ధనవంతునకు , బ్రహ్మవేదికి, మూడునకు , శాంతచిత్తునకు క్రూర చిత్తునకు, శూరునకు , పిరికివానికి, గృహస్తునకు జోగునకు, సజ్జనునకు దుర్జనునకు స్నేహము కలుగదు. స్నేహమున సమాన స్వభావ , గుణములు అవసరములు. రాజులకు కార్యవశమున స్నేహ, విరోధములు సంభవించును. అయినను నీవంటి పేద బాపలతో కార్యాచరణ వశమునను స్నేహము సంభవించదు. కాబట్టి మాటలు చాలింపుము. వచ్చిన దారిన వెళ్ళుము."
    ద్రుపదుడు అహంకారముతో మాట్లాడినాడు. రాచరికపు మదముతో మాట్లాడినాడు. కండకావరమున కూసినాడు. ద్రోణుడు దరిద్రుడు. నిస్సహాయుడు. తలవంచుకున్నాడు. కారుకూతలు విన్నాడు. పొంగిన కోపము మింగినాడు. ఉద్వేగమున రాజును విడిచినాడు. వేగముగా బయటపడినాడు. బుసలు కొట్టినాడు. అవమానమును గుండె యందు అణచినాడు. అప్పటికి మరచినాడు.
    ద్రోణుడు పాంచాలము విడిచినాడు. భార్యాపుత్ర, అగ్నిహోత్ర శిష్య గణముతో బయలుదేరినాడు. హస్తినకు చేరినాడు. అప్పుడు కౌరవ పాండవులు బంతి ఆటలు అడుచున్నారు. ఆట సందర్భమున బంతి బావిలో పడినది. బాలురందరూ బావి చుట్టూ మూగినారు. బంతి వచ్చుట లేదు. ప్రయత్నించుచున్నారు. అటు ఇటు ఉరుకుచున్నారు. అది అందుట లేదు. బావిలో కనిపించుచున్నది. అందుట లేదు.
    ద్రోణుడు ఆ మార్గమున వచ్చుచున్నాడు. అది చూసినాడు. వారిని సమీపించినాడు. "భరత పుత్రులారా! కృపాచార్యుడు మీకు గురువు. శాస్త్రాస్త్రములు తెలిసినవారు. బావిలోని బంతిని తీయలేరా? చూచుచుండుడు. నేను తీసి ఇత్తును" అన్నాడు. బాణము సంధించినాడు. బావిలోనికి విడిచినాడు. అది బంతికి గుచ్చుకున్నది. నిలిచినది. మరొక బాణము వేసినాడు. అది మొదటి బాణము పిడికి గుచ్చుకున్నది. అట్లు అనేక బాణములు వేసినాడు. బాణ పరంపర తాడువలె ఏర్పడినది. పైకి లాగినాడు. ఒక్కొక్క బాణమును తీసినాడు. చివరకు బంతి గ్రుచ్చుకున్న బాణము వచ్చినది. బంతిని బాలురకు ఇచ్చినాడు.
    బాలురు ద్రోణుని చూచినారు. అతని విద్యను చూచినారు. చకితులు అయినారు. కనుల రెప్పలు వాల్చలేదు. ద్రోణుని ఆపాదమస్తకము చూచినారు. ఆశ్చర్యపడినారు. ద్రోణుని భీష్ముని వద్దకు తీసుకొని వెళ్ళినారు.
    భీష్ముడు ధనుర్విద్యా విశారదుడు. అతని ముందు ద్రోణుడు నిలిచినాడు. ద్రోణుడు ధనుర్విద్యా పారంగతుడు. ఇద్దరు రెండు కొండలు. కొండలు ఎదురెదురుగా నిలిచినట్లున్నారు.
    భీష్ముడు ద్రోణుని చూచినాడు. ద్రోణుడు నల్లగా ఉన్నాడు. శుష్కించి ఉన్నాడు. అయినను తేజోవంతముగా ఉన్నాడు. ధనుర్విద్య మూర్తీభవించినట్లు ఉన్నాడు. భీష్ముడు ద్రోణుని గురించి ఇదివరకే విన్నాడు. ఇప్పుడు చూచినాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చినాడు. చిరునవ్వు నవ్వి స్వాగతము పలికినాడు. ఆసనము చూపించినాడు. ఆదరమున అన్నాడు :-
    "ధనురాచార్యా! ద్రోణాచార్యా! మీరు ఎచటి నుండి బయలుదేరినారు. హస్తినకు ఏల వచ్చినారు? ఏ కార్యమునకయి ఇచ్చటకు వచ్చినారు? మేము మీకు చేయగల కార్యమేమి?"
    ద్రోణుడు భీష్ముని చూచినాడు. అతని ఆదరమున కనుగొన్నాడు. సంతసించినాడు. అతని మనసు వికసించినది. దరహాసమున పలికినాడు.
    "భీష్మ పితామహా! నేను ద్రోణుడనువాడను. కృపికి భర్తను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు అశ్వత్ధామ. నేను, ద్రుపదుడును భరద్వాజాశ్రమమున చదువుకున్నాము" అని; అది మొదలుగా కధ అంతయు చెప్పినాడు. ద్రుపదుడు అవమానించిన తీరు వివరముగా చెప్పినాడు. అంతే ద్రోణుడు భీష్ముని అడుగలేదు. యాచించలేదు.
    భీష్ముడు శ్రద్దగా విన్నాడు. ద్రుపదుడు ద్రోణునిచే చిక్కినాడని సంతసించినాడు. ద్రోణుని ఆదరించినాడు. పూజించినాడు. ధనధాన్యములు ఇచ్చినాడు. తృప్తిని చేసినాడు. కౌరవ పాండవులను ద్రోణునకు అప్పగించినాడు.
    "ఆచార్యా! కౌరవ పాండవులు నీ శిష్యులు. వారికి విలువిద్య విశారదులను చేయుము. విలువిద్యయందు పరశురాముడు కూడ నీకు చాలడని విన్నాను. వీరిని తీర్చిదిద్దుట నీపని" అన్నాడు.
    ద్రోణుడు సంతోషించినాడు. ఆచార్యత్వమునకు అంగీకరించినాడు. అతడు కురు పుత్రులకు గురువు అయినాడు. హస్తినలో ప్రధానుడయినాడు , అందరకు ఆచార్యుడు అయినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.