Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    3. ఇంద్రా ! నిప్పు మండుచున్నది. సోమము అభిషుతమయినది. శక్తిశాలులగు నీ అశ్వములు నిన్ను తీసికొనిరావలెను. నీమీద లగ్నముచేసి ఆహ్వానించుచున్నాము. మా విశాలసమృద్ధికొఱకు విచ్చేయుము.

    4. ఇంద్రా ! సోమపానమునకుగాను అనేకమారులు యజ్ఞములకు వెళ్లినావు. కావున ఇప్పుడు సోమపానము చేయు కోరికతో, మహా అంతఃకరణముతో ఈ యజ్ఞమునకు విచ్చేయుము. మా స్తోత్రములను ఆలకింపుము. నీ దేహపుష్టికిగాను యజమాని నీకు సోమరూప అన్నము సమర్పించును.

    5. ఇంద్రా ! నీవు స్తుతిపాత్రుడవు. అశ్వముల అధిపతివి. నీవు దూరపు స్వర్గమున మరేచోటున నీ ఇంట ఉన్నను, లేకున్నను మరుత్తుల సహితముగా ప్రసన్నుడవై మమ్ము రక్షించుటకుగాను మా యజ్ఞమును రక్షింపుడు.


                                      నలుబది ఒకటవ సూక్తము

          ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

   
    1. ఇంద్రా ! నీ కొఱకు పవిత్ర సోమరసము. అభిషుతము అయినది. క్రోధరహితుడవై మా యజ్ఞమునకు విచ్చేయుము. వజ్రధరా ! గోవులు కొట్టములోనికి వెళ్లినట్లు సోమరసము కలశమున చేరినది. కావున ఇంద్రా నీవు రమ్ము. నీవు యజ్ఞయోగ్య దేవతలందు ప్రధానుడవు.

    2. ఇంద్రా ! నీ నాలుక సుంధానిర్మితము. సువిస్తృతము. నీవు దానితోనే సోమపానము చేయుదువు. అట్లే మా సోమరసమును ఆ నాలుకతోనే పానము చేయుము. ఋత్విక్కు సోమరసముతో నీ ముందు నిలిచి ఉన్నాడు. ఇంద్రా ! శత్రువుల గోవులను పట్టుటకు అభిలషించు నీ వజ్రము శత్రు సంహారము చేయవలెను.

    3. సోమము ద్రవరూపము. అభీష్టవర్షి. వివిధరూపము. అట్టి సోమము కోరికలు తీర్చు ఇంద్రుని కొఱకు సంస్కరింపబడినది. ఇంద్రా ! నీవు అశ్వాధిపతివి. శాసకుడవు. బలశాలివి. నీవు ఎంతోకాలముగా సోమముపై ప్రభుత్వము చేసినావు. అది నీకు అన్నరూపమని చెప్పబడినది. ఆ సోమరసమునే త్రాగుము.

    4. ఇంద్రా ! అభిషుత సోమము అనభిషుత సోమముకన్న శ్రేష్ఠతరము. మేధావిని అగు నీ కొఱకు అధిక ప్రసన్నకారకము. శత్రువిజయ ఇంద్రా ! యజ్ఞ సాధన సోమము వద్దకు విచ్చేయుము. సోమముతో నీ సర్వశక్తులను పూరింపుము.

    5. ఇంద్రా ! మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. మా ముందుకు రమ్ము. మేము అందించు ఈ సోమము నీ దేహమునకు పర్యాప్తము కావలెను. శతక్రతు ఇంద్రా ! అభిషుత సోమపానమున ఉల్లాసవంతుడవగుము. యుద్ధమున అందరి నుండి నలుదిశలనుండి మమ్ము రక్షింపుము.


                                      నలుబది రెండవ సూక్తము

 ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 4 బృహతి, మిగిలినవి అనుష్టుప్.

    1. ఇంద్రుడు పిపాసువు, సర్వజ్ఞుడు, సర్వగామి. యజ్ఞ అధిష్ఠాత. యజ్ఞనాయకుడు. అందరకు అగ్రగామి. ఋత్విక్కులారా ! అట్టి ఇంద్రునకు సోమరసము సమర్పించండి.

    2. ఇంద్రుడు అతిశయ సోమరసపాయి. ఋత్విక్కులారా ! మీరు సోమరస సహితులయి ఇంద్రునివద్దకు చేరండి. అభిషుత సోమరసము నిండిన పాత్రతో బలశాలి ఇంద్రుని ముందుకురండి.

    3. ఋత్విక్కులారా ! అభిషుతము, దీప్తమగు సోమరసముతో ఇంద్రుని వద్దకు చేరండి. ఇంద్రుడు మేధావి. అతడు మీ మనసులు గుర్తించగలడు. శత్రుసంహార సహితముగా అతడు మీ కోరికలు తీర్చగలడు.

    4. ఋత్విక్కులారా ! సోమరూప అన్నపు అభిషుత రసము ఏకమాత్ర ఇంద్రునకే ఇవ్వండి. ఇంద్రుడే ఉత్సాహవంతులయి మనను గెలుతుమన్న శత్రువుల ద్వేషము నుండి మనను రక్షించగలడు.


                                     నలుబది మూడవ సూక్తము

            ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - ఉష్ణిక్.

    1. ఇంద్రా ! సోమరసపానమున ఉత్సాహవంతుడవయినావు. దివోదాసునకుగాను శంబరుని వశపరచుకున్నావు. అదిగో అటువంటి సోమమే అభిషుతమైనది. నీవు దానిని పానము చేయుము.

    2. ఇంద్రా ! సోమరసము మాదకము. ప్రాతః, మధ్యాహ్న సాయం పూజలందు అభిషుతమగును. అప్పుడు నీవు దానిని స్వీకరింతువు. ఈ సోమరసము నీ కొఱకు అభిషుత మయినది - పానము చేయుము.

    3. ఇంద్రా ! మాదక సోమరస పానముచేసి పర్వత మధ్యమున కనిపించకుండ, కట్టివేయబడిన గోవులను విడిపించినావు. అదే సోమరసము నీకొఱకు అభిషుతమైనది. పానము చేయుము. "సుతఃపిబ"

    4. ఇంద్రా ! సోమరూప అన్నపు రసపానముచేసి ఉత్సాహవంతుడవయినావు. బలములు పొందినావు. అదే సోమము నీ కొఱకు అభిషుతమైనది. పానము చేయుము "సుతఃపిబ"

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము ఆరవ మండలమున మూడవ అనువాకము సమాప్తము)


              నాలుగవ అనువాకము             నలుబది నాలుగవ సూక్తము

 ఋషి - బృహస్పతి పుత్రుడు, శంయుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్ 
                           7, 8, 9 విరాజము, 18 విరాట్.

    1. ఇంద్రా ! నీవు ధనశాలివి. సోమరూప అన్న రక్షకుడవు. సోమము ధనశాలి దీప్తయశమున సముజ్వలము. అదే అభిషుత. సోమము నిన్ను ఉల్లాసవంతుని చేయును.

    2. ఇంద్రా ! నీవు విస్తృత సుఖకారివి. సోమరూప అన్న రక్షకుడవు. సోమము నిన్ను ప్రసన్నుని చేయును. నీ స్తోతలను ఐశ్వర్యవంతులను చేయును. అదే అభిషుత సోమము నిన్ను ఉల్లాసవంతుని చేయును.

    3. ఇంద్రా ! నీవు సోమరూప అన్న రక్షకుడవు. సోమపానముచేసి బలము పెంచుకున్నావు. నిన్ను రక్షించు మరుత్తుల సహితుడవై రిపునాశనము చేసినావు. అదే అభిషుత సోమము నిన్ను ఉల్లాసవంతుని చేయును.

    4. ఇంద్రుడు భక్తవత్సలుడు. బలస్వామి. విశ్వవిజేత. యుగాదిక్రియల నాయకుడు. శ్రేష్ఠదాత. సర్వదర్శకుడు. యజమానులారా ! మేము మీ కొఱకు అట్టి ఇంద్రుని స్తుతింతుము.

    5. మా స్తుతులతో ఇంద్రుని శత్రుధనహరణబలము వృద్ధిచెందును. స్వర్గదేవతలు, పృథ్వీదేవతలు ఆ బలమును సేవింతురు.

    6. స్తోతలారా ! ఇంద్రుని కొఱకు మీ స్తోత్రములు విస్తృతపరచండి. మేధావి వ్యక్తివలె మీ రక్షణ ఇంద్రుని వెంట ఉన్నది.

    7. యజ్ఞాది కార్యములందు దక్షుడగు యజమాని మాటలు ఇంద్రునకు తెలియును. ఇంద్రుడు మిత్రము, నవీనతను సోమము త్రాగువాడు. అతడు స్తోతలకు శ్రేష్ఠ ధనము ప్రదానము చేయును. హవ్యరూప అన్న భోజనుడగు ఇంద్రుడు ప్రవృద్ధములు, పృథ్వివిని వడకించు అశ్వములపై స్తోతలను రక్షించవలెనని వచ్చి వారిని రక్షించవలెను.

    8. యజ్ఞ మార్గమున సర్వదర్శి సోమము పానము చేయబడును. ఋత్విక్కులు ఆ సోమమునే ఇంద్రుని మనసును ఆకర్షించుటకు ఉపయోగింతురు. ఇంద్రుడు శత్రువిజేత. విపుల శరీరి. ఆ ఇంద్రుడే మా స్తవములకు ప్రసన్నుడు కావలెను. మాముందుకు వేంచేయవలెను.

    9. ఇంద్రా ! మాకు అతిదీప్తవంతమగు బలమును ఇమ్ము. నీ ఉపాసకుల అసంఖ్యాక శత్రువులను దూరము చేయుము. నీ బుద్ధితో మాకు కోరిన అన్నము ప్రసాదించుము. ధనమును అనుభవించుటకు మమ్ము రక్షింపుము.

    (ధనము ఉన్నంత మాత్రమున సరిపోదు. అభద్రత దానిని అనుభవించనీయదు. అనుభవించుటకు భద్రత అత్యవసరము)

    10. ధనశాలి ఇంద్రా ! నీ కొఱకే మేము హవ్యములు ఇచ్చుచున్నాము. నీవు అశ్వముల స్వామివి. మాకు ప్రతికూలుడవు కారాదు. మానవులలో నీవుకాక మరొక మిత్రుడు కనిపించడు. ఇంద్రా ! నీలో ఈ గుణము లేకుండినచో ప్రాచీనులు నిన్ను ధనిదుడని ఎందుకు అందురు?

    11. ఇంద్రా ! నీవు అభీష్టవర్షివి. మమ్ము కార్యవినాశక రాక్షసులవద్ద విడువకుము. నీవు ధనయుక్తుడవు. నీ బంధుత్వమున ఆరాధపడినాము. మాకు ఎట్టి విఘ్నములు కలుగరాదు. మానవులు నీకు అనేక విఘ్నములు కల్పింతురు. అభిషవకర్త కానివానిని సంహరింపుము. నీకు హవ్యము ఇవ్వని వానిని నాశము చేయుము.

    12. గర్జించు పర్జన్యుడు మేఘములు సృష్టించును. ఇంద్రుడు స్తోతలకు ఇచ్చుటకు అశ్వములను, గోవులను సృష్టించును. ఇంద్రా ! నీవు స్తోతల ప్రాచీన రక్షకుడవు. నీకు హవ్యము ఇవ్వక ధనికులు నీ విషయమున అన్యదా ఆచరించరాదు.

    13. ఇంద్రుడు సోమమునకు స్వామి. ఋత్విక్కులారా ! మీరు ఇంద్రునకే అభిషుత సోమము అర్పించండి. ఈ ఇంద్రుడే ఋషుల ప్రాచీన, నవీన స్తోత్రములతో పరివర్థితుడైనాడు.

    14. ఇంద్రుడు జ్ఞాని. బాధించనివాడు. అతడు ఈ సోమమునే పానము చేసినాడు. ఉల్లాసవంతుడయినాడు. అసంఖ్యాకులగు ప్రతికూల ఆచరణపర శత్రువులను నాశము చేసినాడు.

    15. ఇంద్రుడు అభిషుత సోమపానము చేయవలెను. ఉల్లసితుడు కావలెను. వృత్రుని సంహరించవలెను. ఇంద్రుడు గృహదాత. స్తోత్రరక్షకుడు. యజమాని పాలకుడు. అతడు దూరదేశమున ఉన్నను యజ్ఞమునకు రావలెను.

    16. ఇంద్రునకు పానయోగ్యము, ప్రియము, సోమరూప అమృతమును ఇంద్రుడు సేవించవలెను. అందువలన అతనికి ఉల్లాసము కలుగవలెను. ఉల్లాసమున అతడు మమ్ము అనుగ్రహించవలెను. మా శత్రువులను పాపములను దూరము చేయవలెను.

    17. శౌర్యశాలి ఇంద్రా ! ఈ సోమరసము సేవింపుము. ప్రసన్నుడవగుము. మాకు ఆత్మీయులయినను అనాత్మీయులైనను ప్రతికూలాచరణ శత్రువులను నాశము చేయుము. మా ముందునకు వచ్చి అస్త్రములు అర్పించు శత్రు సైన్యములను పరాఙ్ముముచేసి తరలింపుము.

    18. ఇంద్రా ! మా ఈ సమస్త సంగ్రామమున మాకు అతులధనము సులభము చేయుము. మమ్ము జయప్రాప్తికి సమర్థులను చేయుము వర్షము, పుత్ర, పౌత్రుల నిచ్చి మమ్ము సమృద్దులను చేయుము.

    19. ఇంద్రా ! నీ అశ్వములు అభీష్ట వర్షులు. స్వేచ్చగా రథమున నియుక్తములు. అభీష్ట దాత రథమును లాగునవి. వారివర్షకములు. కిరణ సంయుక్తములు. ద్రుతగాములు. నిత్యతరుణులు, వజ్రవాహకములు. ఆ అశ్వములు నిన్ను బాగా మత్తుకలిగించు సోమపానమునకు తీసికొని రావలెను.

    20. అభీష్టవర్షి ఇంద్రా ! నీ అశ్వములు జలవర్షకములు. తరుణులు. అవి సముద్ర తరంగములవలె ఉల్లసితములు కావలెను. నీ రథమునకు చేరవలెను. నీవు తరుణుడవు. అభీష్టవరుదుడవు. ఋత్విక్కులు నీకు రాతితో అభిషవించిన సోమరసము అర్పింతురు.

    21. ఇంద్రా ! నీవు స్వర్గపు సేవనకర్తవు. పృథ్వికి వర్షకర్తవు. స్థావర జంగమ విశ్వమునకు అభీష్టకర్తవు. అభీష్టప్రదాయక ఇంద్రా ! నీవు శ్రేష్ఠ సేచనకారివి. నీ కొఱకు తేనెవంటి తీయని పానయోగ్యమగు సోమరసము పెరుగుచున్నది.

    22. దీప్తిమంతమగు ఈ సోమము, మిత్రుడు ఇంద్రునితోసహ, జలముగ్రహించి బలాసురుని, నిరోధించినది. ఈ సోమమే గోరూప ధనమును దొంగిలించిన ద్వేషుల మాయను, అస్త్రములను వ్యర్థము చేసినది.

    23. ఈ సోమమే ఉషాపతి సూర్యుని శోభాసంపన్నము చేసినది. ఈ సోమమే సూర్యమండలమున దీప్తి స్థాపించినది. ఈ సోమమే దీప్తిసంయుక్త త్రిభువన మధ్యమందలి స్వర్గమున రహస్యముగా నిలిచిన త్రివిధ అమృతములను అందుకున్నది.

    24. ఈ సోమమే స్వర్గమును భూమిని తమ తమ స్థానములందు నిలిపినది. ఈ సోమమే సప్త రశ్మి రథమును యోజితము చేసినది. ఈ సోమమే స్వేచ్చానుసారముగా గోవులలో దుగ్ధధారలు ఏర్పరచినది.


                                      నలుబది అయిదవ సూక్తము

 ఋషి - బృహస్పతి పుత్రుడు శంయుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - అనుష్టుప్, గాయత్రి.

    1. ఉత్కృష్ట నీతితో తుర్వశుని యదువును దూరదేశము నుంచి తెచ్చిన ఇంద్రుడు మాకు మిత్రుడు కావలెను.

    2. తనను స్తుతించని వానికి సహితము ఇంద్రుడు అన్నము ప్రసాదించును. ఇంద్రుడు తీవ్రగతిగల అశ్వమున అధిరోహించి శత్రువు మధ్యనున్న సంపదను గెలుచును.

    3. ఇంద్రుని నీతులు ఉత్కృష్టములు. గొప్పవి. అతని స్తుతులు నానావిధములవి. అతని రక్షణల కథలు ఏనాటికి తరగవు.

    4. ఇంద్రుడు మనకు మరింత బుద్ధిని కలిగించువాడు. అందువలన బంధువులారా ! మంత్రములద్వారా ఆహ్వానయోగ్యుడగు ఇంద్రుని పూజించండి. స్తుతించండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.