Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    4. కోరికలు తీర్చువాడవును, భజనీయుడవగు ఇంద్రా ! మహా అన్నము, మహాబలము కలిగి, బహువత్సవతి వడవతో కలిసి నీ స్తుతికర్తకు మానవులందు సుఖములు ప్రసాదించుటకు అభిముఖముగా విచ్చేయవలెను.

    5. ఇంద్రుడు హింసకుల పరాభవకారి. ఉద్యతబలుడు. సతత గమనశీలుడు. అతడు తన తేజస్సుతో కలిసి సూర్యుని దక్షిణాయనమైనంత మేఘములకు విముక్తము చేయును. ఈవిధముగా విశేష జలరాశి నిత్యము క్షోభశూన్య సముద్రమున పడును. అందువలన జలరాశికి పునరావర్తనము ఉండదు.


                                      ముప్పదిమూడవ సూక్తము

          ఋషి - శునహోత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు అభీష్టవర్షివి. మాకు పుత్రుని ప్రసాదించుము. ఆ పుత్రుడు బలవత్తముడు, స్తుతికర్త, యజ్ఞకర్త హవ్యప్రదాత కావలెను. అతడు ఉత్తమ అశ్వారూఢుడై, సంగ్రామమున అశ్వసమూహాలను వశపరచుకొని ప్రతికూల ఆచార శత్రువులను పరాభవించువాడు కావలెను.

    2. ఇంద్రా ! మానవులు వివిధ స్తుతిరూప వచనములుగలవారు. వారందరును యుద్ధమున రక్షణకుగాను నిన్ను ఆహ్వానింతురు. నీవు మేధావులగు అంగిరులతో కలిసినావు. పణులను సంహరించినావు. నిన్ను భజించువారిని నీవు రక్షింతువు. అన్నలాభము కలిగింతువు.

    3. ఇంద్రా ! నీవు వీరుడవు. శూరుడవు. దస్యులు ఆర్యులు ఉభయ శత్రువులను సంహరించినావు. గొడ్డలిపట్టినవాడు చెట్లను కొట్టినట్లు యుద్ధమున అస్త్ర, శస్త్రములతో శత్రువులను నరుకుదువు.

    4. ఇంద్రా ! నీవు సర్వత్ర సంచరించువాడవు. మాకు శ్రేష్ఠములగు రక్షణలు కలిగించుము. సమృద్ధిని వృద్ధిపరచుము. మిత్రుడవగుము. మేము కొందరితో యుద్ధము చేయువారము. ధనలాభమునకు నిన్ను ఆహ్వానింతుము.

    5. ఇంద్రా ! ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడు నిశ్చయముగా నీవు మావాడవు కావలెను. మాదశను అనుసరించి సుఖములు ప్రసాదించుము. మేము స్తుతించువారము. గోవులను భజించుచు, ద్యుతిమంతములగు నీ సుఖముల చేరుదుము.

    (సుఖములు అందరకు ఒక తీరువికావు. వ్యక్తినిబట్టి మారుచుండును. వ్యక్తికి సహితము దశనుబట్టి సుఖము మారును. ఆకలిలేనపుడు ఆకలి, అన్నములేనపుడు అన్నము, ఆరోగ్యములేనప్పుడు ఆరోగ్యము సుఖములగును)


                                     ముప్పది నాలుగవ సూక్తము

          ఋషి - శూనహోత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! అసంఖ్యాకములగు స్తోత్రములు నిన్ను చేరుచున్నవి. నీవు స్తోతలను తగినంత ప్రశంసింతువు. పూర్వకాలమునను, ఇప్పుడును నిన్ను పూజించు విషయమున ఋషులలో స్తోత్రము ఉపాసన మంత్రము అను అభిప్రాయ భేదములు ఉన్నవి.

    2. ఇంద్రుడు బహుజన ఆహూతుడు. ప్రశంసితుడు. మహామహుడు. అద్వితీయుడు. యాజమానస్తుతుడు. మేము సర్వదా ఇంద్రుని ప్రసన్నుని చేయుదుము. మహాలాభమునకుగాను రథమువలె ఇంద్రునకు అనురక్తులము కావలెను. ఇంద్రుని స్తుతించవలెను.

    3. సమృద్ధి కలిగించు స్తోత్రములు ఇంద్రుని చేరవలెను. కర్మలు స్తుతులు ఇంద్రుని బాధించరాదు. లక్షల స్తవకారి. స్తుతి భాజనుడగు ఇంద్రుని స్తుతించి ప్రీతుని చేతుము.

    4. ఈ యజ్ఞ దినమున స్తోత్రమువంటి పూజ సహితముగా సమర్పించుటకు మిశ్రిత సోమము ఉన్నది. ఊషర క్షేత్రమునకు సాగు నీరు ప్రాణులను పోషించినట్లు హవ్య సహిత స్తోత్రము ఇంద్రుని ముదావహుని చేయును.

    5. సర్వత్ర సంచరించు ఇంద్రుడు యుద్ధమున మాకు రక్షకుడు, సమృద్ధిదాయకుడు కావలెను. స్తోతల స్తోత్రములు వారి కోరికలు సహితముగా ఇంద్రునకు అందవలెను.


                                     ముప్పది అయిదవ సూక్తము

          ఋషి - నరస్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! రథారూఢుడవగు నీవద్దకు మా స్తోత్రము ఎప్పుడు చేరును? స్తోత్రముచేయు నాకు వేయి పురుషుల గోసమూహము లేక పుత్రులను ఎప్పుడు ప్రసాదింతువు? నా స్తోత్రములకు ఎప్పుడు ధనపురస్కారము ప్రదానము చేతువు? అగ్నిహోత్రాది కార్యములను ఎప్పుడు అన్నమును రమణీయము చేయుదువు?

    2. ఇంద్రా ! మా పురుషులతో శత్రు పురుషులను - మా పుత్రులతో శత్రుపుత్రులను ఎప్పుడు కలిపెదవు? యుద్ధమున మాకు ఎప్పుడు జయము కలిగింతువు? శత్రువులనుండి పాలు, పెరుగు, నేయి, ధరించిన గోవులను ఎప్పుడు జయింతువు? మాకు వ్యాప్త ధనమును ఎప్పుడు ప్రసాదింతువు?

    3. బలవత్తను ఇంద్రా ! స్తోతలకు వివిధ అన్నములను ఎప్పుడు ప్రదానము చేస్తావు? నీలో స్తోత్రమును, యజ్ఞమును ఎప్పుడు యుక్తము చేస్తావు? స్తోత్రములను ఎప్పుడు గోదాయకములను చేస్తావు?

    4. ఇంద్రా ! మేము భరద్వాజ పుత్రులము. నిన్ను స్తుతించువారలము. మాకు గోదాయకము, అశ్వదాయకము, బలదాయకమగు అన్నమును ప్రసాదించుము. అన్నములను, సులభముగా పితుకదగు ఆవులను పరిపుష్టము చేయుము. ఆ గోవులు శోభన దీప్తివంతములగునట్లు చేయుము.

    5. ఇంద్రా ! మా శత్రువులకు ఏదోవిధముగా యమపథము చూపుము. నీవు శక్తివంతుడవు. వీరుడవు. శత్రుహంతవని నిన్ను మేము నుతింతుము. నీవు విశుద్ధ వస్తుప్రదాతవు. మేము స్తోత్రములు చదువుటలో నిమగ్నులము.

    6. ప్రాజ్ఞుడవగు ఇంద్రా ! అంగిరులను అన్నముద్వారా ప్రసన్నులను చేయుము.


                                        ముప్పది ఆరవ సూక్తము

           ఋషి - నరస్యుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీయొక్క సోమపానజనిత హర్షము సమస్త జనులకు హితకరమగును. ఇది నిశ్చయము. దేవతలందు నీవే బలవంతుడవు. ఇది నిశ్చయము.

    2. యజమానులు విశేషముగా ఇంద్రుని బలమును అర్పింతురు. వీర కర్మలు చేయుటకుగాను వారు ఇంద్రుని తమముందు ఉంచుకొందురు.

    అవిచ్చిన్న శత్రుశ్రేణి నిరోధకర్త. హింసాకారుడు ఆక్రమణకారి ఇంద్రుడు వృత్రుని సంహరిస్తాడు. కావున యజమానులు ఇంద్రుని సేవింతురు.

    3. మరుద్గణములు కలిసిమెలిసి ఇంద్రుని సేవింతురు. వీర్యము, బలము కలిగిన రథాశ్వములు ఇంద్రుని సేవించును. నదులు సముద్రమున కలసినట్లు ఉపాసనా బలముగల స్తోత్రములు విశ్వవ్యాపి ఇంద్రునిలో విలీనములగును.

    4. ఇంద్రా ! స్తూయమానుడవు అనేకులకు అన్నదాయకుడవు. గృహదాయకుడవగుము. వారికొఱకు ధనధారను ప్రవహింప చేయుము. నీవు సమస్త ప్రాణిజాలమునకు ఉత్కృష్ట అధిపతివి. సమస్త భూతజాతములకు అసాధారణ అధీశ్వరుడువు.

    5. ఇంద్రా ! శ్రోతవ్య స్తోత్రములను జాగుచేయక వినుము. మా సేవలను కోరుకొనుము. సూర్యునివలె శత్రుధనమును గెలువుము. నీవు బలసంపన్నుడవు. స్తోత్రములు హవ్యముల ద్వారా తెలియబడువాడవు. మా వద్దకు ఇదివరకటి వలెనే విచ్చేయుము.

                                      ముప్పది ఏడవ సూక్తము

         ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉద్యతాయుధ ఇంద్రా ! నీ రథాశ్వములు మాముందునకు విశ్వవందనీయమగు నీ రథమును తేవలెను. భరద్వాజుడు గుణవంతుడగు స్తోత. అతడు నిన్ను ఆహ్వానించుచున్నాడు. నీతోబాటు హృష్టులమై మేము వర్థిల్లుదుము.

    2. మా యజ్ఞమునందు హరితవర్ణ సోమరసము ప్రవహించును. అది పవిత్రమై ఋజుభావమున సాగును. పురాతనము, దీప్తిసంపన్నము, మాదకమగు సోమరసమునకు ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడు మా సోమరసమును పానము చేయవలెను.

    3. నలుదిశల పయనించు రథమున కూడిన సరళశమనములుగల అశ్వములు గట్టి చక్రములుగల రథముమీద బలశాలి అగు ఇంద్రుని మాముందుకు తేవలెను. అమృతమయి సోమలక్షణ హవి గాలికి చెడిపోకుండవలెను.

    4. ఇంద్రుడు నిరతిశయ బలశాలి. బహుకార్యరతుడు. హవిరూపధనము సమర్పించు వ్యక్తులతో యజమానికి దక్షిణ ప్రదానము చేయును. వజ్రధర ఇంద్రా ! నీవు దక్షిణలతో పాపములను నశింప చేయుము. శత్రువిజయ ఇంద్రా! మాకు ధనరాశియు, స్తుతికర్తయగు పుత్రుడు లభించునట్టి దక్షిణను ప్రోత్సహించుము.

    5. ఇంద్రుడు శ్రేష్ఠ అన్నము, బలముల ప్రదాత. అత్యదిక తేజోవంతుడగు ఇంద్రుడు, మా స్తుతుల ద్వారా మరింత వృద్ధి చెందవలెను. శత్రువులను బాధించు ఇంద్రుడు ఆక్రమణచేసిన శత్రువును సంహరించవలెను. ఇంద్రుడు వేగవంతుడై మాకు సమస్త ధనములు ప్రసాదించవలెను.


                                      ముప్పది ఎనిమిదవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఆశ్చర్యతమ ఇంద్రా ! మా పానపాత్రలో సోమరసము త్రాగుము. దీప్తిమంతమగు మా మహా ఆహ్వానమును స్వీకరించుము. దానశీల ఇంద్రుడు ధార్మికుడగు యజమాని యజ్ఞమున అతిశయ స్తుతులు, సేవలు, హవ్యము గ్రహించవలెను.

    2. ఇంద్రుని చెవులు దూరదేశపు స్తుతులను సహితము వినగలవు. స్తోతలు ఉచ్ఛస్వరమున స్తోత్రపాఠము చేస్తారు. ఇది ఇంద్రుని ఆహ్వానించు స్తుతి. ఇది స్వయం ప్రేరితము కావలెను. ఇంద్రుని మా ముందునకు తేవలెను.

    3. ఇంద్రా ! నీవు ప్రాచీనుడవు. క్షయరహితుడవు. ఇంద్రునిలో హవ్యరూప అన్నము, స్తోత్రము ఇమిడి ఉన్నవి. ఉత్కృష్టతమ స్తుతి హవ్యములతో ఇంద్రుని అర్చిస్తాము. మహా స్తోత్రము అధిక వర్ధమానమగును.

    4. ఇంద్రుని యజ్ఞము సోమరసము వర్థిల్లచేయును. హవ్యము, స్తుతి, ఉపాసన, పూజ వర్థిల్ల చేయును. దివారాత్రుల నడకలు వర్థిల్ల చేయును. మాస, సంవత్సర దినములు వర్థిల్ల చేయును.

    5. మేధావివి అగు ఇంద్రా ! నీవు అట్లు ఆవిర్భవించి సమృద్దుడవు, బలశాలివి, ప్రచండుడవయినావు. మేము నేడు ధనము, కీర్తి, రక్ష, శత్రునాశములకు నిన్ను సేవింతుము.

           
                                       ముప్పది తొమ్మిదవ సూక్తము

        ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మా సోమము మాదకరము, పరాక్రమకారి, స్వర్గీయము, విజ్ఞసమ్మతము, ఫలదాత, సేవనీయము. ఇంద్రా ! అట్టి సోమమును సేవింపుము. మాకు గోప్రముఖ అన్నము ప్రసాదింపుము.

    2. ఈ ఇంద్రుడే పర్వతములలో దాచినట్లు ఉంచబడిన గోవులను ఉద్దరించదలచినాడు. అంగిరులను వెంట పెట్టుకున్నాడు. అంగిరుల సత్యరూప స్తోత్రములకు ఉత్తేజితుడు అయినాడు. దుర్భేద్య పర్వతమును బద్దలు కొట్టినాడు. ఫణులను పరాభవించినాడు.

    3. ఇంద్రా ! ఈ సోమము దీప్తిశూన్య దివారాత్రులు. వర్షము అన్నింటిని ప్రదీప్తము చేసినది. ప్రాచీన కాలమున దేవతలు ఈ సోమమును దినమునకు కేతన స్వరూపను చేసినారు. ఈ సోమమే తన దీప్తితో ఉషలను ప్రకాశితము చేసినది.

    4. ఈ ఇంద్రుడే సూర్య రూపమున ప్రకాశితమైనాడు. వెలుగులేని భువనములకు వెలుగులు కలిగించినాడు. అతడే సర్వత్ర గతిశీలక దీప్తిద్వారా ఉషల అంధకారమును నష్టపరచినాడు.

    ఇంద్రుడు మానవుల కోరికలు తీర్చువాడు. అతని అశ్వములు స్తోత్రము ద్వారా నియోజితములు. అట్టి అశ్వములులాగిన ధనపూర్ణమగు రథమును ఎక్కి ఇంద్రుడు వెళ్లినాడు.

    5. ఇంద్రా ! నీవు పురాతనుడవు. ప్రకాశమానుడవు. నిన్ను స్తుతించువాడు. ధనదానయోగ్యుడు అయినచో అతనికి బోలెడు ధనమును ఇమ్ము. స్తోతలకు జలము, విషరహిత ఓషధులు, గోవులు, అశ్వములు, మానవులను దానము చేయుము.


                                          నలుబదవ సూక్తము

         ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! ఇది నీ మదవర్ధనమునకు సిద్ధమయిన సోమము - పానము చేయుము. నీకు మిత్రులవంటి అశ్వద్వయమును రథమున పూన్చుము. ఇచటికి వచ్చి అశ్వములను విడువుము. స్తోతలమధ్య కూర్చొనుము. స్తోత్రములు ఉచ్చరించుటలో మాతో కలుపుము. స్తోత అగు యజమానికి అన్నము ప్రదానము చేయుము.

    2. ఇంద్రా ! నీవు ఉల్లాసము వీరత్వము వెల్లడించదలచినావు. పుట్టగానే సోమపానము చేసినావు. అట్లే సోమపానము చేయుము. నీ కొఱకు సోమము సిద్ధము చేయుటకుగాను గోవులు, ఋత్విక్కులు, జలము, శిలలుకూడినవి - నారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.