Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    9. మరుత్తులు గణమై పరస్పరము ఆశ్రయించుకొనువారు. శూరులు. యజమానులు ఆశ్రితులుగా గలవారు. మరుత్తులారా ! బలమున చంపగలంతటి కోపమున ద్యులోకభూలోకముల గర్జించుడు. మీ రథములు స్వచ్చకాంతి గలవి. మెరుపులు గలవి. మెరుపులు గలవి. వాటిమీద ఆసీనులయిన మిమ్ము సర్వజనులు చూచుచున్నారు.

    10. మరుత్తులు సర్వజ్ఞులు. నిధిపతులు. బలవంతులు. మహత్తులు. శత్రుంజయులు. అక్షయ బలవంతులు. సోమపాయులు. ప్రతిదానిని నడిపించువారు. అట్టి మరుత్తులు తమ బాహువులందు ధనుర్బాణములు ధరించినారు.

    11. మరుత్తులు వర్షమును పెంచువారు. యజ్ఞవంతులు. యజ్ఞ స్థలములకు ఏగువారు. స్వయముగ శత్రువులను అణచువారు. అచలములను చలింపచేయువారు. ఇతరులు మోయశక్యముకాని వారు. దీపించు చూపులవారు. అట్టి మరుత్తులు చక్రములతో మేఘములను ఎగురగొట్టుచున్నారు.

    12. మరుత్తులు శత్రుంజయులు. పావకులు. వర్షించువారు. రుద్రపుత్రులు. బలయుతులు. ఋత్విజులారా ! మరుత్తులను స్తుతిమంత్రములతో ఆహ్వానించుడు. ధనమునకై స్తుతింపుడు.

    13. మరుత్తులారా ! మీ రక్షణ పొందిన నరుడు అందరికన్న బలవంతుడు అగును. అతడు అశ్వముల సాయమున అన్నము, నరుల సాయమున ధనమును ఆర్జించును. సత్ర్కతువులను చేయును. సంపన్నుడయి వర్ధిల్లును.

    14. మరుత్తులారా ! సర్వకర్మ కుశలుడు, అజేయుడు, కాంతిమంతుడు, శత్రుదమనుడు, సంపన్నుడు, కీర్తనీయుడు అయిన పుత్రుని, పౌత్రుని మేము నూరు హేమంతముల వరకు పోషించునట్లు చేయుము. పుష్యేమ తనయం శతః హిమాః

    (పౌత్రునికి నూరేళ్లు వచ్చువరకు జీవించవలెనను ఆశయము. సంవత్సరము హిమవంతము నుండి ప్రారంభమయినట్లున్నది)

    15. స్థిర సకల్పులు, వీర్యవంతులు, శత్రుజయులు అగు పుత్రులను నూర్లకొద్ది, వేలకొద్ది వర్థించునట్లు మరుత్తులు అనుగ్రహించవలెను. తెల్లవారుతుండగా త్వరగా మరుత్తులు దర్శననీయవలెను.

                       (ప్రథమ మండలమున పదకొండవ అనువాకము సమాప్తము.)

                   పన్నెండవ అనువాకము - అరువది అయిదవ సూక్తము
              ఋషి-శక్తిపుత్రుడు పరాశరుడు, దేవత-అగ్ని, ఛందస్సు-విరాట్టు.


    1. అగ్నీ ! నీవు గుహలో ఉన్నవాడవు. అన్నమయుడవు. హవ్యవాహనుడవు. పశువులు దొంగలను అనుసరించినట్లు దేవతలు నీ అడుగుజాడలను అనుసరించుచున్నారు. యజింపదగిన దేవతలందరు నిన్ను చేరుచున్నారు.

    2. అగ్ని పారిపోయినది. దేవతలు అగ్నిని అంతటను వెదకినారు. ఇంద్రాదులు భూలోకమున అన్వేషించినారు. అందువలన భూమి స్వర్గమయినది. స్తుతుల కారణముగా యజ్ఞముల అగ్ని ఎదిగినది. జలములు అగ్నిని దాచినవి.

    (జలములు పెరిగినవి. అగ్నిని తమలో దాచుకున్నవి. జలములందు అగ్ని ఉన్నదని భావము. జలము నుండి విద్యుత్తు ఉత్పత్తి అగుచున్నది. అది జలములందలి అగ్ని అగును. ఇది జలమున దర్శించుట కావచ్చును)

    3. అగ్ని రమణీయమయినది. పుష్టికరము. భూమివలె విస్తీర్ణమయినది. పర్వతమువలె ఫలములను ఇచ్చునది. ఉదకమువలె సుఖకరమయినది. యుద్ధమునందలి అశ్వమువలె అప్రమత్తమయినది. నీటివలె ప్రవహించునది. అటువంటి అగ్నిని నివారింప సమర్ధుడు ఎవడు?

    4. తోడబుట్టినవారివలె అగ్ని ఉదకములకు బంధువు. రాజు ధనవంతులను పీల్చినట్లు, అగ్నివనములను కాల్చును. వాయువును కలిసి వనములను చికాకు పరచినపుడు అగ్నియే పృథ్వి యొక్క రోమములను ఛేదించును.

    5. అగ్ని దూరతీరములకు ప్రకాశించును. అగ్ని సర్వ వ్యాపకుడు. ఉదకములందు హంసవలె జలమున అగ్ని అణగి ఉన్నది. సోముడు ఔషధములను సృష్టించినట్లు అగ్ని సమస్త పదార్థములను సృజించును.

               ఆరువది ఆరవ సూక్తము - ఋషి - శక్తిపుత్రుడు పరాశరుడు,
                         దేవత - అగ్ని, ఛందస్సు - విరాట్టు.


    1. అగ్ని ధనమువంటిది. సంపాదించదగినది. సూర్యునివలె సమస్తము చూపించునది. ఆయువువంటిది. జీవనాధారము. పుత్రునివలె నిత్యమయినది. అశ్వమువలె రక్షణను ఇచ్చునది. పాలవలెప్రియము అయినది. విశేష ప్రకాశముగలది. అడవులను అంటుకొనునది.

    2. అగ్ని క్షేమకరము. ఇంటివలె ఆశ్రయమును ఇచ్చునది. ధాన్యమువలె పక్వము అగునది. శత్రుంజయము. ఋషివలె దేవతలను స్తుతించునది. యజమానులు స్తుతించునది. గుఱ్ఱమువలె హర్షమును ఇచ్చునది. అట్టి అగ్ని మాకు అన్నము ప్రసాదించవలెను.

    3. అగ్ని అశక్య తేజోవంతుడు. యజ్ఞకర్తవలె నిత్యుడు. భార్యవలె అలంకారము. చిత్ర విచిత్ర దీప్తివంతుడు. సూర్యునివలె తెల్లని ప్రకాశముకలవాడు. రథమువలె బంగారుకాంతితో మెరయువాడు. యుద్ధములందు దీపించువాడు అగును.

    4. ప్రభువు పంపిన సేనవలె, వాడి బాణమువలె అగ్ని ఎల్లరకు భయము కలిగించును. పుట్టినది అగ్నియే. పుట్టబోవునది అగ్నియే. కన్యలకు కన్యాత్వము పోగొట్టునది అగ్నియే. భార్యల రక్షించునది అగ్నియే.

    5. చర, స్థిర భూతముల హవిస్సులచేత అగ్ని దీపించును. ఆవులు ఇంటికి చేరినట్లు అట్టి అగ్నిని మేము చేరుదుము. అగ్నిజ్వాలలు ప్రవహించు నీటివలె అటునిటు ఉరుకులు పెట్టును. స్వర్గమందలి అగ్ని సూర్యునిగా కిరణములు దాల్చినది.

        ఆరువది ఏడవ సూక్తము-ఋషి-పరాశరుడు, దేవత-అగ్ని, ఛందస్సు- విరాట్టు.


    1. అగ్ని వనముల పుట్టును. మానవులకు ప్రియతముడు. హవిస్సులను అందించువాడు. రాజు దృఢగాత్రులను ఆదరించును. అట్లే అగ్ని యజమానుని ఆదరించును. అగ్ని శుభములు కలిగించును. దేవతలను పిలుచును. హవ్యములు అందించును.

    2. హవిరూపము అగు అన్నముల తీసుకొని అగ్ని గుహయందు దాగినాడు. జలమున చేరినాడు. దేవతలను బెదిరించినాడు. జగత్తును నడిపించువారును, కర్మలను పోషించువారును అయిన దేవతలు అగ్నిని గ్రహించినారు. హృదయ పూర్వకముగ అగ్నిని స్తుతించుచున్నారు.

    3. భూమి, అంతరిక్షములను సూర్యుడు ధరించినాడు. సూర్యునివలె అగ్నియు ధరించినాడు. ద్యులోకమును అగ్ని సత్యమంత్రములచే నిలిపినాడు. అగ్నీ ! నీవు సర్వభక్షకుడవు. పశువులకు ప్రియమయిన గడ్డిని, నీరును కాపాడుము. గోవులు సంచరించని అంతర్గుహలో నిలిచియుండుము.
 
    4. గుహయందున్న అగ్నిని తెలియువాడు, యజ్ఞమును ధరించు అగ్నిగా ఉపాసించువాడు, యజ్ఞమును చేయువాడు, అగ్నిని శ్రావ్య స్తుతుల నుతించును. స్తుతి కర్తలకు అగ్ని ధనమును ప్రసాదించును.

    5. అగ్ని గొప్ప గొప్ప చెట్లను ఆవరించును. ఆ చెట్ల ఫలములందుగల బీజములను సహితము మిగల్చడు. అగ్ని కదలికకు కారణము అగును. అగ్ని జలములందు వసించును. అగ్ని గృహములందు సర్వభక్షకుడు అగును. అట్టి అగ్నిని పండితులు పూజింతురు.

         ఆరువది ఎనిమిదవ సూక్తము - ఋషి - పరాశరుడు, దేవత - అగ్ని
                                   ఛందస్సు - విరాట్టు.

    1. అగ్ని హవిస్సును భరించును. హవిస్సులతో కలియును. హవిస్సులను ప్రాప్తించును. అగ్ని సర్వ దేవతలందు ప్రకాశించును. అగ్ని మాత్రమే చరాచరముల మహత్తుకు కారణము అగును. అట్టి అగ్నియే రాత్రులందు చరాచర జగత్తును ప్రకాశింపచేయును.

    2. అగ్నీ ! నీవు ఎండు కర్ర నుంచి జ్వలించుచు అవతరించగనే యజమానులు నీకొఱకు క్రతువులు చేయుచున్నారు. నిన్ను స్తుతులచే సేవించుచున్నారు. దేవత్వము పొందుచున్నారు.

    3. అగ్ని యజనమునకు వచ్చును. అప్పుడు అతనిని నుతించుచున్నారు. యాగములు చేయుచున్నారు. హవిస్సులు అందించినవారికి కర్మలు చేయగోరువారికి అగ్ని ధనములు ప్రసాదించును.

    4. అగ్నీ ! నీవు దేవతలను పిలుచువాడవు. అయినను నరులను ఆశ్రయింతువు. నీవే ప్రజల ధనమును కాపాడుదువు. ఆ ప్రజలు రేతస్సు రూపమున నీవే వారిలో ఉన్నట్లు భావింతురు. వారు మూఢత్వము మాని సమర్ధులయి తమ పుత్ర సహితులయి నిన్ను ఉపాసింతురు.

    5. అగ్ని శాసనమును, తండ్రిశాసనమువలె సేవించు యజమానికి అగ్ని సర్వసంపదలు కలిగించును. యజ్ఞ గృహములందు మనసు ఉంచిన అగ్ని నక్షత్రములతో ద్యులోకమును ఏర్పరచినాడు.

              ఆరువది తొమ్మిదవ సూక్తము - ఋషి - శక్తిపుత్రుడు పరాశరుడు,
                             దేవత - అగ్ని, ఛందస్సు - విరాట్టు.


    1. ఉషస్సును తొలగించి సూర్యుడు ప్రకాశించును. అట్లే శుభ్రవర్ణముగల అగ్ని సర్వప్రకాశకుడు అయినాడు. అగ్నియొక్క కాంతి సూర్యకాంతివలె ద్యులోక భూలోకముల నిండి ఉన్నది. అగ్ని తాను ఉద్భవించినాడు. జగత్తునందలి సర్వకర్మలందు వ్యాపించినాడు. ఋత్విజులకు పుత్రుడయి పోషించుచున్నాడు.

    2. అగ్నీ ! నీవు సర్వకర్తవు. నిగర్వివి. సదసద్వివేకవంతుడవు. గోవు పొదుగువలె అన్నములకు రుచికలిగింతువు. గ్రామస్తులు ఉపకారిని ఆహ్వానింతురు. అట్లే నిన్ను ఆహ్వానించుచున్నారు. నీవు యజ్ఞగృహములందు నిలిచినావు. అందరి స్తుతులు అందుకొనుచున్నావు.

    3. గృహమునందు పుత్రునివలె పుట్టిన అగ్ని ఆనందము కలిగించును. అగ్ని అశ్వమురీతి సాయముచేయును. నేను దేవతలను ఆహ్వానించినపుడు ఈ అగ్ని సర్వదేవతారూపుడు అగుచున్నాడు.

    4. అగ్నీ ! నీవు యజ్ఞనిర్వాహకుడవు. జనులకు సుఖములను ప్రసాదించువాడవు. నీ కర్మలకు అడ్డువచ్చువారిని సహించవు. మరుత్తులతో కలిసి పారదోలుదువు. అందువలన నీకు సంబంధించిన కర్మలు నిరాటంకముగ నిర్వర్తించబడును.

    5. ఉషస్సును తొలగించి ప్రకాశించు సూర్యునివలె అగ్ని విశేష ప్రకాశమున విరాజిల్లుచున్నాడు. అగ్నిదేవుని కిరణములు హవిస్సులను గ్రహించి అంతరిక్షమున సూర్యకిరణములయి వ్యాపించినవి.

        డెబ్బదివ సూక్తము-ఋషి-పరాశరుడు, దేవత-అగ్ని, ఛందస్సు-విరాట్టు.

    1. అగ్ని బుద్ధిగోచరుడు. కాంతిమంతుడు. దేవతల, నరుల కర్మలు తెలియువాడు. కర్మలన్నింట ఉన్నవాడు. అట్టి అగ్ని అన్నములను ప్రసాదించవలెను.

    2. అగ్ని ఉదక గర్భములందు ఉన్నాడు. చరాచర జంతువుల గర్భములందు ఉన్నాడు. గృహములందు ఉన్నాడు. పర్వతములందు ఉన్నాడు. అట్టి అగ్నికి హవిస్సులు అర్పింతుము. రాజు ప్రజలకువలె అగ్ని అమృతుడు, శుభంకరుడు అగుచున్నాడు.

    3. అగ్ని రాత్రులందు వెలుగును ఇచ్చును. యోగ్యములు అయిన స్తుతిమంత్రముల అగ్నిని ఆరాధించు యజమానికి ధనములు లభించును. చైతన్యము కలుగును. దేవతలను, నరులను తెలిసిన అగ్ని భూమండలమునందలి ప్రాణులను రక్షించవలెను.

    4. ఉషస్సులు రాత్రులు, చరాచరములు ఉదకమునందున్న అగ్నిని వృద్ధి పొందించును. అటువంటి అగ్ని సత్య ఫలములు గల సర్వకర్మలను చేయును. సుఖప్రదమగు దేవయజన స్థానమందు ఉండును. అగ్ని ఆరాధింపబడును.

    5. అగ్ని పశువులకు శుభములు కలిగించవలెను. జనులందరు మాకు కానుకలు తెచ్చి ఇచ్చునట్లు చేయవలెను. అగ్నిని జనులు నానా దేవయజన స్థానములందు పూజింతురు. వృద్ధుడయిన తండ్రి ధనమును పుత్రుడు గ్రహించును. అట్లే అగ్ని నుండి మానవులు ధనములను పొందుచున్నారు.

    (అగ్ని తండ్రివంటివాడు. పూజించువారికిని, పూజించనివారికిని ధనములు ఇచ్చును.)

    6. అగ్ని సాధకునివలె సాధ్యఫలమును గ్రహించును. అగ్ని బాణములు విడుచు శూరునివలె శత్రువులను కొట్టును. అగ్ని హింసకులకు భయంకరుడు అగును. అగ్ని యుద్ధములందు వెలుగులు కలిగించును.

             డెబ్బది ఒకటవ సూక్తము - ఋషి - శక్తిపుత్రుడగు పరాశరుడు
                       దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.


    1. భార్య తన భర్తను నిత్యము ప్రసన్నము చేయును. అట్లే వ్రేళ్లు హవిస్సులు అర్పించి అగ్నిని ప్రసన్నుని చేయును. ఉషను కిరణములు సేవించును. అట్లే వ్రేళ్లు అగ్నిని సేవించును.

    2. మా పితరులు అంగిరసులు. వారు అగ్నిని మంత్రములచే స్తుతించినారు. అగ్నిని భజించినారు. గొప్పదియగు ద్యులోకమును తెలియపరచినారు. సుఖములు కలిగించు పగళ్ళను తెలుసుకున్నారు. సూర్యుని కిరణములను తెలుసుకున్నారు.

    3. అంగిరసులు అగ్నికి యజన స్థానము ఏర్పరచినారు. అగ్నియొక్క కర్మలను సాధించినారు. అప్పుడు అంగిరసులు ధనవంతులు అయినారు. అగ్నికి జ్వాలలు కల్పించినారు. అంగిరసులు ఆశలు వదిలినారు. కర్మలు చేసినారు. హవిస్సుల రూపమున ఉన్న అన్నమున దేవతలను, మానవులను వృద్ధిపొందించినారు. అంగిరసులు అగ్నిని ఆరాధించినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.