Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    7 వర్షము కలిగించు ఈ యజ్ఞ సవనములందు ఇంద్రుడు సోమపానము చేసినాడు. హవిస్సులను స్వీకరించినాడు. సర్వజగముల వ్యాపించినాడు. అసురధనమును హరించినాడు. శత్రుంజయమగు వజ్రాయుధముతో మేఘమును కొట్టినాడు.

    8. ఇంద్రుడు వృత్రుని సంహరించినాడు. అప్పుడు దేవతలను పాలించువారును, ప్రాణప్రదులు అయిన ఛందస్సులు స్తోత్రములు రచించినారు. అట్టి బుక్కులు భూమి, అంతరిక్షమును అతిక్రమించినవి. కాని భూమి, అంతరిక్షము ఇంద్రుని మహిమను అతిక్రమింపలేకపోయినవి.

    9. ఇంద్రుడు శత్రుమర్దనుడు. తేజో విరాజితుడు. సర్వసమర్ధుడు. అపరిమితుడు. అతడు మేఘములమధ్య యుద్ధము కల్పించినాడు. ఇంద్రుని మహిమ ముల్లోకములను అతిక్రమించినది. 

    10. ఇంద్రుని బలపు వెదికి వృత్రుడు ఎండిపోయినాడు. దొంగలు ఆవులను నరికినట్లు ఇంద్రుడు వృత్రుని నరికినాడు. వృత్రుడు దాగతగిన ఉదాకములను విడగొట్టినాడు. హవిస్సులు అర్పించిన యజమానులకు ఇంద్రుడు ఎదురుగా వచ్చి ధనములను ఇచ్చినాడు.

    11. ఇంద్రుడు వజ్రమున సముద్రమును ఏర్పరచినాడు. ఇంద్రుని ప్రకాశబలముననే సముద్రము విలసిల్లుచున్నది. ఇంద్రుడు తాను ఐశ్వర్యవంతుడు అయినాడు. యజమానులకు ధనములను ఇచ్చినాడు. శత్రువులను హింసించినాడు. 'తుర్వీతు'నకు నివాసము కల్పించినాడు.

    12 ఇంద్రుడు త్వరితుడు. ఈశ్వరుడు. అమిత బలవంతుడు. అట్టి ఇంద్రుడు వృత్రునిమీద వజ్రము విసరవలె. మేఘములు నీటిని కోనుచున్నవి. ఆ నీరు ప్రవహించుటకు అడ్డు తగులుచున్నవి. అటువంటి మేఘములను ఇంద్రుడు పశువును చేదించినట్లు ఛేదించవలెను.

    13. ఇంద్రుడు యుద్ధమునకు త్వరపడును. ఆయుధము విసరును. శత్రువును హింసించును. అట్టి ఇంద్రుడు అభిముఖముగా ఉన్నాడు. ఋత్విజా ! అతని వీరకృత్యములను స్తుతింపుము.

    14 ఇంద్రుని భయమున పర్వతములు నిశ్చలముగా ఉన్నవి. లోకములు కంపించుచున్నవి. ప్రకాశించు ఇంద్రుని రక్షణ కోరి 'నోధస్సు' ఇంద్రుని మాటి మాటికి స్తుతించినాడు. వీర్యవంతుడు అయినాడు.

    15. సమర్ధుడు, ధనస్వామి అయిన ఇంద్రుని కొరకే ఈ స్త్రోత్రములు రచింపబడినవి. ఇంద్రుడు 'సువశ్య' పుత్రుడు అగు 'సూర్యుని' పై స్పర్థ వహించినాడు సోమములను అమ్దిమ్చిన 'ఏతశు'ని రక్షించినాడు.

    (సువశ్వుడు తపము చేసి సూర్యాంశమున పుత్రుని బడసినాడు. అతనికి ఏతశునకు యుద్ధము జరిగినది. అందు ఇంద్రుడు ఏతశుని రక్షించినాడు) 

    16. అశ్వముల రథమువాడా ! ఇంద్రా ! గోరమువంశీయులు నిన్ను ప్రసన్నుని చేయుటకు స్తుతిమంత్రములు నిర్మించినారు. ఈ స్తుతి కర్తలకు బహువిధముల ధనమును ప్రసాదించుము. రేపుకూడ ప్రాతఃకాలమున విచ్చేయుము.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొ.అష్టకము ప్ర.మండలము-నాలుగవ అధ్యాయము సమాప్తము.)

        ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
        నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||

             అయిదవ అధ్యాయము - అరువది రెండవ సూక్తము
          ఋషి - నోధస్సు - దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.


    1 ఇంద్రుడు తన బలమున శత్రువును సంహరించువాడు. అతడు స్తుతించదగినవాడు. అంగిరసుడు ఇంద్రుని సుఖహేతువు అయిన స్తోత్రములచే స్తుతించినాడు. ఆ స్తోత్రములను మేము తెలిసికున్నాము. ఇంద్రుని ఋషులు తమ స్తోత్రములచే అర్పింతురు. ఆ ఇంద్రుడు ప్రసిద్ధుడు. అందరిని నడిపించగలవాడు. ఇంద్రుని గూర్చిన స్తుతులను ఉచ్ఛరింతుము.

    2 మన పితరులు, పూర్వర్షులు, అంగిరసులు ఇంద్రుని మార్గమును ఎరిగినారు, అర్చించినారు. ఇంద్రుడు వారి గోవులను విడిపించినాడు. అతి బలుడు అయిన ఇంద్రుని కొఱకు ఋత్విజులారా ! గంభీరములు శ్రావ్యములు అయిన స్తోత్రములను సంపాదించుడు.

    3. ఇంద్రునకై అంగిరసులు యాగము చేసినారు. ఆ సవనమున ఆడకుక్క తన కొడుకు కుక్కకు అన్నము ఆర్జించినది. తదుపరి దేవరాజు ఇంద్రుడు అసురుని భేదించినారు. గోవులను విడిపించినాడు. దేవతలు ఆ గోవులను తోలుకొని పోవుచు హర్షద్వానములు చేసినారు.

    ('పణి' అనువాడు దేవతల గోవులను గుహలో దాచినాడు. దేవతలు గోవులను కనుగొనలేకపోయినారు. ఇంద్రుడు తనవద్ద ఉన్న ఆడకుక్కను గోవులను వెదకిరమ్మన్నాడు. ఆ కుక్క తనబిడ్డకు అన్నము పెట్టిన వెదుకుదును అన్నది. అన్నము పెట్టగా కుక్కపసికట్టి గోవులను కనుగొన్నది. ఇంద్రుడు గోవులను విడిపించినాడు.)

    4. అంగిరసులు రెండు తెగలవారు. తొమ్మిది నెలలు యాగము చేసినవారు నవగ్వులు. పదినెలలు యాగము చేసినవారు దశగ్వులు. అట్టి ఏడుగురు అంగిరసులు ఇంద్రుని కొఱకు సుఖకరములు, సుస్వరములు అయిన స్తుతులను రచించినారు. అటువంటి ఇంద్రుడు, తన ధ్వనిచే నీరునిండిన మబ్బును భయపెట్టినాడు.

    5. శత్రుమర్దనుడగు ఇంద్రుని అంగిరసులు స్తుతించినారు. ఇంద్రుడు ఉషస్సు, సూర్యుల కిరణములతో చీకట్లను పారద్రోలినాడు. భూమి ఉపరితలమును విశాలము చేసినాడు. అంతరిక్ష మూలమును బలపరచినాడు.

    6. ఇంద్రుడు నేలమీద నాలుగు మధుర జల నదులను ప్రవహింప చేసినాడు. "కర్మదస్మస్యచారుతమ మస్తిదంసః" అతడు చేసిన ఈ పని అత్యంత పూజనీయము. శుభప్రదము అయినది.

    7. ఇంద్రుడు దుర్లభుడు. అయినను స్తుతించువారికి సులభుడు. ఒకేచోట ఉండిన ద్యావాపృథ్వులను విడగొట్టినాడు. స్మరణీయుడు, శ్రేష్ఠుడు. అంతరిక్షమున ఉన్న సూర్యునివలె ఇంద్రుడు అనేక శుభకర్మలు చేసినాడు. ద్యావా పృథ్వులను ధరించినావు.

    8. ఉషస్సు, రాత్రి రెండు వేరు వేరు రూపములుగలవారు. వారు ప్రతిదినము పుట్టుచున్నారు. యవ్వనవంతులు. చిరకాలముగా భూలోక, ద్యులోకములను మరల మరల చుట్టి వచ్చుచున్నారు. రాత్రి చీకట్లతోను, ఉషవెలుగుతోను ఒకదాని తరువాత ఒకటి వచ్చుచున్నవి.

    9. ఇంద్రుడు కంటితో చూడ శక్యముకానివాడు. మంచి పనులు చేయువాడు. బలమునకు పుత్రుడు. శుభప్రదుడు. అతడు యజమానుల సఖ్యతను, చిరకాలముగ పోషించుచున్నాడు. అపక్వగోవులందు పక్వమయిన పాలను ఇచ్చుచున్నాడు. నల్లని, ఎర్రని గోవులకు కూడ తెల్లని పాలనే కల్పించినాడు.

    10 ఇంద్రుని చేతివ్రేళ్లు సమాన నివాసములు గలవి. గమనములేనట్టివి. అవి తమ బలమున అనేకవేల కర్మలను నిర్వహించుచున్నవి. తమంత తాము ప్రసరించు వ్రేళ్లు, దేవ భార్యలవలె ఇంద్రుని సేవించుచున్నవి.

    11. ఇంద్రుడు దర్శనీయులలో శ్రేష్ఠుడు. నమస్సులు, స్తుతిమంత్రములచే నుతింపబడుచున్నాడు. ధనమునుకోరు యజమానులు బహుప్రయాసలతో ఇంద్రుని ఆశ్రయించుచున్నారు. కాముకులయిన భార్యలు భర్తలను చేరినట్లు యజమానుల స్తుతులు ఇంద్రుని చేరుచున్నవి.

    12. ఇంద్రా ! నీవు అందగాడవు. నీ బాహువులందు చిరకాలమునుండి ధనము నిలిచి ఉన్నది. నిన్ను స్తుతించువారికి ఇచ్చుచున్నావు. అయినను తరుగలేదు. నీవు బుద్ధిమంతుడవు. దీప్తిమంతుడవు అయినావు. కర్మ హేతువవు, కర్మవంతుడవగు నీ పనుల వలన మాకు ధనము కలిగించుము.

    13. అగ్రగణ్యుడవు, బలవంతుడవు అగు ఇంద్రా ! నీవు అశ్వమును పూన్చి రథము నడిపింతువు. గోతమ పుత్రుడగు నోధస్సు నీ కొఱకు నవ్యములు, సూక్తరూపములయిన సోత్రములను రచించినాడు. అవి మాకొఱకును అగును. ఇంద్రా ! ఉదయమున వేగిరముగ విచ్చేయుము.

          ఆరువది మూడవ సూక్తము, ఋషి - గోతమ పుత్రుడు నోధస్సు,
                  దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.


    1. ఇంద్రా ! నీవు గణాధికుడవు. అసురులు పుట్టగానే నీవు పుట్టినావు. నీబలమున శత్రువును శోషింపచేసినావు. ద్యులోక, భూలోకములను ధరించుచున్నావు. ప్రపంచమునందలి భూతములు, పర్వతములు, ఇతర స్థావరములు దృఢమయినవి. అయినను నీ భయమున, సూర్యకిరణములవలె కంపించును.

    2. ఇంద్రా ! నీవు తీరని పనులున్నవాడవు. నీవు రథమున గుఱ్ఱములను పూన్చెదవు. అప్పుడు స్తోత నిన్ను స్తుతించును. వెంటనే శత్రువును గమనించునపుడు అనేక అసుర పురములను ఛేదింపనున్నావు.

    3. ఇంద్రా ! నీవు అందరికన్న మిన్నవు. ఋభువులకు అధిపతివి. నరులకు హితకారివి. శత్రుంజయుడవు. నిర్లక్ష్య స్వభావుడవు. హింసాకరమయిన యుద్ధమున దీప్తివంతుడు, పిన్నవాడయిన కుత్సునకు సాయము చేసినావు. 'శుష్ణు'ని వధించినావు.

    4. ఇంద్రా ! నీవు 'కుత్సు'నకు సాయము చేసినావు. అతనికి ప్రసిద్ధ ధనము సమకూర్చినావు. నీవు వర్షము కురిపింతువు. వజ్రాయుధము ధరింతువు. దస్యులు వెన్నిచ్చి పారిపోవునట్లు చేతువు.

    5. ఇంద్రా ! ఎంతటివారికయినను నీవు హింస కోరవు. నిన్ను మేము ప్రార్థించుచున్నాము. మా అశ్వములకు దారులు తెరువుము. పర్వతము వంటి నీ వజ్రాయుధమున శత్రువులను ధ్వంసము చేయుము.

    6. యుద్ధములు లాభములకొఱకు, జలముల కొఱకు జరుగును. ఎట్టి యుద్ధమయినను యుద్దమందు ప్రసిద్ధుడవయిన ఇంద్రా ! నిన్నే సాయము కోరుదురు. యుద్ధమందు మా ముందుండి రక్షింపుము. మేము కోరినది నీ రక్షణయే.

    7. వజ్రీ ! ఇంద్రా ! పురుకుత్సునికై యుద్ధము చేసినావు. ఏడు పురములను భేదించినావు. 'అంహు'ని ధనమును దర్భను కోసినంత అనాయాసముగ కోసి తెచ్చినావు. దానిని పురవంశపు సుదాసునకు ఇచ్చినావు.

    8. ఇంద్రదేవా ! నానావిధములయిన అన్నములు సంపాదించదగినవి. వర్షమున నీటినివలె భూమిమీద అన్నమును వృద్ధిపరచుము. నీరు అంతట ప్రవహించుచున్నది. అట్లే ఎల్లెడల అన్నము లభించునట్లు చేయుము.

    9. ఇంద్రా ! గోతమ వంశపు ఋషులు నీ స్తుతులు కూర్చినారు. హవిరూపమగు అన్నము అశ్వములతో కూడిన నీకు అభిముఖ మంత్రములు ఉచ్ఛరించుచున్నారు. తలచినంతలో ధనముగల ఇంద్రుడు ఉదయమున అరుదెంచవలెను.

          ఆరువది నాలుగవ సూక్తము ఋషి - గోతమ పుత్రుడు నోధస్సు
            దేవత - వాయువు, ఛందస్సు - 1-14 జగతి, 15 త్రిష్టుప్.

    1. వాయువులు వర్షించునవి. శుభయజ్ఞము గలవి. ఫల పుష్పాదులు సృష్టిచేయునవి. నోధర్షీ ! అట్టి వాయువులను ఆకర్షించు స్తుతిని రచింపుము.

    నోధర్షి పలికినతీరు :-

    వాయువులారా ! నేను ధీరుడను. చేతులు జోడించినవాడను. యజ్ఞమునకు మేఘుడు వర్షించునట్లు మనస్పూర్తిగా స్తుతులను రచింతును.

    2. వాతువులు దర్శనీయులు. యవ్వనులు. రుద్రపుత్రులు. శత్రుంజయులు. పాపరహితులు. పవిత్రులు. సూర్యునివంటి తేజోవంతులు. వర్షించువారు. భూత గణములవలె భయంకరులు. అట్టి మరుత్తులు అవతరించినవి.

    3. మరుత్తులు పడుచువారు. ముదిమి ఎరుగనివారు. అసుర సంహారకులు. నిర్నిరోధులు. పర్వతము వంటి దృఢగాత్రులు. స్తుతించు వారి కోరికలు తీర్చుదురు. సమస్త భువనములను, ద్యులోక, భూలోకములందలి దృఢ వస్తువులను మరుత్తులు తమ బలమున కదిలింతురు.

    4. మరుత్తులు నానావిధ భూషణములతో అలంకరించుకున్నారు. వక్షమున హారములు. వీపున ఆయుధములు ధరించినారు. మరుత్తులు అట్టి అలంకార, ఆయుధ సహితులయి, తమ బలమున అంతరిక్షమున అవతరించినారు.

    5. మరుత్తులు తమను స్తుతించువారికి ధనములు ప్రసాదింతురు. సర్వమును చలింపచేతురు. సర్వత్రా గమనింతురు. వారు తమ బలమున గాలులను, మెరుపులను కలిగించుచున్నారు. అంతరిక్షమున ఉన్న పొదుగులవంటి మేఘములను పిదికి భువికి వర్షము కలిగించుచున్నారు.

    6. మరుత్తులు ఉదారులు. ఋత్విజులు యజ్ఞమున ఘృతమునువలె, పాలవంటి రసవంతములయిన జలములను వర్షింతురు. అశ్వములనువలె వేగవంతములయిన మేఘములను లొంగదీసికొందురు. గర్జించు మేఘమును పిదుకుదురు. వర్షము కలుగచేయుదురు.

    7. మరుత్తులు మహనీయులు జ్ఞానులు. కాంతిమంతులు. పర్వతములవంటి బలము కలవారు. ఎర్రని ఆడ గుఱ్ఱములు వాహనములు గలవారు. వేగవంతుడు. వారు ఏనుగులవలె వనములను విరుచుకొని తినుచున్నారు.

    8. మరుత్తులు మంచి జ్ఞానవంతులు. సింహమువలె గర్జింతురు. మగలేడికి తెల్లని పొడలవలె వారి దేహములు కాంతులచే అలంకరించబడినవి. సర్వజ్ఞులు. స్తుతికర్తలను రక్షించువారు. ఎదిరించువారిని చంపువారు. అట్టి మరుత్తులు ఆయుధములు ధరించి, శత్రుబాధగల యజమానులను రక్షింతురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.