Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము
1. అన్నదమ్ముల మధ్య తోటి కోడండ్ల మధ్య స్పర్ధ ప్రారంభమయినది. పాలి పగలు అంటుకున్నవి. తనకు ముందు సంతానము కావలెనని కుంతి తనకు ముందు కావలెనని గాంధారి పోటీలు పడినారు. గాంధారి కడుపుపోగొట్టుకున్నది. ఏడ్చినది. వ్యాసుడు రక్షించినాడు. వ్యాసుడు శాస్త్రజ్ఞుడు.
వీర్యమును భద్రపరుచుట దాని ద్వారమున సంతానము కలిగించుట ఆనాటి శాస్త్రజ్ఞులకు తెలిసినట్లున్నది. ఇది మనము నమ్మము. మూడ నమ్మకము అందుము. పాశ్చాత్యులు చెప్పిన తప్పక నమ్ముదుము. పాశ్చాత్యులు కృత్రిమ గర్బోత్పత్తిని కనుగొన్నారు. కాబట్టి మనము నమ్మక తప్పదు.
ఇప్పటి వరకు జరిగిన పాశ్చాత్య పరిశోధనలో వీర్యమును స్త్రీ గర్బమున ప్రవేశపెట్టి సంతానము కలిగించుట సాధ్యము అయినది. స్త్రీ లేకనే వీర్యరేతస్సులు కలిపి సంతానము కలిగించుట అప్పటి వారికి తెలిసినట్లున్నది. కృపి, కృపుడు అట్లు కలిగినారు.
మాంస ఖందమును నూటొక్క ముక్కలు చేసి బిడ్డలుగా చేయుట అద్భుతము. ఇట్టి అద్భుతములు ఆధునిక సాహిత్యమున కోకొల్లలు. సాహిత్యము కాల్పనికము. కొంత అద్భుతము అందు అవసరము.
వ్యాసుడు ధృతరాష్ట్రుని వీర్యమును అతని నూరుగురు భార్యలందు నిక్షేపించియుండును. అట్లు ఏకకాలమున నూరుగురు పుత్రులు ఒక పుత్రిక జనించి ఉందురు.
2. శరద్వంతుడు ఒక కొత్త సంప్రదాయమును నెలకొల్పినాడు. అది బ్రాహ్మణులు క్షత్రియవిద్య నేర్చుట. అది సహించనట్లున్నాడు ఇంద్రుడు. శరద్వంతుడు తన పట్టుదల విడువలేదు. కృపునితో ధనువిద్య అబ్యాసింప చేసినాడు.
మరొక విషయము. కృపుడు ధనుర్విద్య నేర్చినది యుద్దము కొఱకు కాదు - భోదించుటకు.
నేడు సహితము అనేకమందికి శాస్త్రము బోధించుటకే పనికి వచ్చుచున్నది.
హస్తినలో పాండవులు
పాండురాజు మరణించినాడు. మాద్రి సహగమనము చేసినది. అరణ్యమున మిగిలినవారు. కుంతియు పాండవులు. అరణ్యమున గల మునులు ఆలోచించినారు. పాండవులను హస్తినకు తీసుకొని వెళ్ళుటకు నిశ్చయించినారు. కుంతితో చర్చించినారు. ఆమె సమ్మతించినది.
మునులు ముందు నడిచినారు. కుంతి దుఖమున మునిగి ఉన్నది. అయినను మునుల వెనుక నడిచినది. ఆమె శోకమూర్తి వలె ఉన్నది. శోకము నడచినట్లున్నది. ఆమె వెంట పాండవులు నడచినారు. వారు బాలురు.
హస్తినకు వార్త అందినది. కుంతి హస్తిన ప్రవేశించినది. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, సత్యవతి, అంబిక, అంబాలిక, గాంధారి నూరుగురు కౌరవులు, బ్రాహ్మణులు , పురోహితులు కుంతికి పాండవులకు ఎదురేగినారు. స్వాగతము పలికినారు. తోడ్కొని వచ్చినారు. రాజ భవనమున ప్రవేశించినారు. విదురాదులు కుంతిని ఓదార్చినారు. పాండవులను ముద్దాడినారు.
మునులు, భీష్మాదులు కూడినారు. మునులలో వృద్దుడు సభను ఉద్దేశించి అన్నాడు.
"భీష్మాదులారా! పాండురాజు సూర్యుని వంటి తేజస్సు గలవాడు. అతడు ముని వృత్తి అవలంబించినాడు. గొప్ప తపస్సు చేసినాడు. ధర్మదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, ఆశ్వీనీ దేవతల వలన అయిదుగురు పుత్రులను బడసినాడు. పాండవ కుమారులు బలపరాక్రమములు కలవారు వంశాంకురులు. పాండురాజు మరణించినాడు. మాద్రి సహగమనము చేసినది. వారి శల్యములు సంగ్రహించి తెచ్చినాము. విధి ప్రకారము పితృమేధక్రియ జరిపించుడు."
కుంతిని పాండవులను హస్తినలో విడిచినారు. మునులు వెళ్ళిపోయినారు. విదురుడు వేదవ్యాస ధృతరాష్ట్రుల అనుమతి పొందినాడు. పాండవుల చేత పితృమేధక్రియ జరిపించినాడు. బ్రాహ్మణులకు అగ్రహారములు ఇచ్చినారు. గోవులను , గుఱ్ఱములను, ఏనుగులను ఇచ్చినారు. ఆభరణములు , ఆసనములు, మంచములు, గొడుగులు దానము చేసినారు. విదురుడు సకల కార్యములను పూర్తి చేయించినాడు.
ధృతరాష్ట్రుడు పాండవులను కౌరవులను సమబుడ్డితో చూచినాడు. బేధ భావము కనబరచలేదు. పాండవులను ధృతరాష్ట్రుని తండ్రివలె ఆదరించినారు.
కౌరవ, పాండవులు కలిసి విద్యలు అభ్యసించినారు. అన్నింటి యందు కౌరవులు నూరుగురి కంటే భీముడు పరాక్రమవంతుడగు చున్నాడు. దుర్యోధనుడు అది సహించలేదు. కౌరవులు నూరుగురు భీముని పట్టి కొట్టినారు. భీముడు పది పదిహేను మందిని ఎడమ చేతితో గిరగిర తిప్పినాడు. నేలకు కొట్టినాడు. నీటి ఆటలందు భీముడు పది పదిహేను మందిని ఒక్కొక్క భుజముపై ఎత్తుకున్నాడు. నీటిలో పడవేసినాడు. వారు మునుగుచుండగా ఎత్తి బయట కొట్టినాడు. కౌరవులు పండ్ల కొఱకు చెట్లు ఎక్కినారు. భీముడు చెట్లను ఊపినాడు. వారు పండ్ల వలె నేల కూలినారు. దెబ్బలు తగిలినవి. ఎడ్చినారు.
దుర్యోధనుడు భీముని బలమును ఓర్వలేకపోయినాడు. శకుని దుశ్యాసనులను సంప్రదించినాడు. రహస్యముగా భీముని చంపదలచినాడు. తరువాత అర్జున, నకుల సహదేవులను హతమార్చవలెనను కున్నాడు. ధర్మరాజు బలహీనుని చేయడలచినాడు. తానే భూచక్రమును పాలించవలెనని కుట్ర పన్నినాడు.
ఒకసారి బాలులందరూ జలక్రీడలడినారు. భీముడు అందరిని ఓడించినాడు. అలసినాడు. ఒడ్డున పడినాడు. ఒళ్ళు తెలియలేదు. నిద్రించినాడు. దుర్యోధనుడు చూచినాడు. తీవలు తెప్పించినాడు. భీముని కాలు చేతులు కట్టించినాడు. గంగలో పడదోసినాడు. భీముడు నీటపడినాడు. మేల్కొన్నాడు. కాళ్ళు చేతులు కదలించినాడు. తీవలు పుటపుట తెగినవి. పాపములు బాసి పుణ్యగతికి పోవువాని వలె భీముడు బయటికి వచ్చినాడు. భీముడు చావలేదు. మరింత బలవంతుడు అయినాడు.
మరొకసారి భీముడు నిద్రించుచున్నాడు. దుర్యోధనుడు తన సారధిని ప్రేరేపించినాడు. నల్లనాగులను తెప్పించినాడు. కరిపించినాడు. భీమునిది వజ్రశరీరము విషము రిత్తపోయినది. భీముడు లేచినాడు. పాములను కాళ్ళతో నలిపినాడు చంపినాడు. సారధిని పట్టినాడు. ఒక్క పోటు పొడిచినాడు. సారధి రక్తము కక్కినాడు. గిలగిల తన్నుకున్నాడు. చచ్చినాడు.
ఇంకొకసారి దుర్యోధనుడు కుట్ర పన్నినాడు. విషము కలిపిన అన్నము భీమునకు పంపినాడు. యుయుత్సుడు సమబుద్ది గలవాడు. భీమునకు ఆ విషయము చెప్పినాడు. భీముడు ఆకలిగా ఉన్నది విషాన్నము తిన్నాడు. అతని జటారాగ్ని విషమును కాల్చినది. అరిగిన ఆహారము అమృతము అయినది. భీముడు మరింత తేజరిల్లినాడు.





