Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    మనము ఇంతవరకు చదివిన కధల కాలము మానవ సంబంధముల గురించి నిరంతర పరిశోధన జరిగిన కాలముగా కనిపించును.
    శుక్రుడు దేవయానిని దేవతలకు కూర్చదలచినాడు. కుదరలేదు. యయాతికి ఇచ్చినాడు. ప్రయోగము విఫలము అయినది.
    శకుంతల దుష్యంతుని పెండ్లాడినది. ఆకాశవాణి వలన ఆ పెండ్లి సఫలము అయినట్లు కనిపించినది.
    శంతనుడు గంగను పెండ్లాడినాడు. ఆమె స్వజాతిది కాదు. దేవత. అతడు సుఖించలేదు. సత్యవతిని పెండ్లాడినాడు. ఆమెయు స్వజాతిది కాదు ఫలితము దక్కలేదు.
    అంబ, అంబాలికలు దేవర న్యాయము అవలంబించినారు. అది అనర్ధదాయకము అని తేలినది.
    ధృతరాష్ట్రునకు గాంధారిని తెచ్చి చేసినాడు. అతడు గుడ్డివాడు . అయినను ఆమె పట్టుకొని ఉన్నది. ఇంత వరకు ఎక్కువమంది భార్యలు కనిపించరు. ధృతరాష్ట్రునకు నూరుగురు భార్యలు . ఇదొక ప్రయోగము.
    పాండురాజు తానె భార్యలను తెచ్చుకున్నాడు. ఈ కాలమున దేవరన్యాయము లోపించుచున్నట్లు కనిపించుచున్నది. వ్యాసుడు, అంబ, అంబాలికలు కూడినప్పుడు ఇంత చర్చ జరగలేదు. పైగా కుంతి తో కూదినవారు దేవతలు. ఈ న్యాయము మనుషులకు వర్తించదు అని తేల్చి చెప్పినాడు.
    స్త్రీ పురుష సంబంధములను నియమ బద్దము చేసినాడు శ్వేతకేతువుగా కనిపించుచున్నాడు.
     స్త్రీలకు ఒక నియమమును ఏర్పరచినాడు దీర్ఘతముడుగా కనిపించుచున్నాడు.
    పాండురాజు మరణకాలమునకు సహగమనము ఒక ఆచారముగ ప్రవేశించినట్లు కనిపించుచున్నది. ఇది ఒక అమానుషము అయిన ఆచారము. ఇది ఎందుకు ఎట్లు ప్రవేశించినదో పరిశీలించవలసి ఉన్నది.
2. ఒకే ఒక సంఘటనతో పాండురాజు జీవన విధానము మారిపొయినది. నలుదిక్కుల రాజులను ఓడించినాడు. విధిచేత ఒడినాడు. జితేంద్రియుడు అగుటకు ప్రయత్నించినాడు. కాలేకపోయినాడు. కామమునకు ఆహుతి అయినాడు. ఇది విదిచేతి అట మాత్రమే కాదు. మానవుడు తన స్వభావమును జయించుట కష్టము. అనుటకు నిదర్శనము. "స్వభావో దురతి క్రమః"
3. కుంతీ, మద్రులు గర్బములు ధరించి సంవత్సరమునకు ప్రసవించినారని చెప్పబడినది. అప్పుడు తొమ్మిది నెలలే సంవత్సరము అయి ఉండును.
4. పుత్రుల విధములు చెప్పుట, ఋణముల వాటిని తీర్పు పద్దతులు, వేటలో జంతువుల వేటను గురించిన నియమములు ఒక వశిష్ట నాగారకతను సూచించుచున్నది.
    
                                                   కౌరవుల జననము


    కుంతి అడవిలో గర్బము దాల్చినది. హస్తినలో గాంధారి ధృతరాష్ట్రుని వీర్యము వలన గర్భము దాల్చినది. కుంతికి అడవిలో ధర్మరాజు పుట్టినాడు. గాంధారి గర్బము దాల్చి సంవత్సరము అయినది. అయినను ప్రసవించలేదు. కుంతికి ధర్మరాజు పుట్టినాడని విన్నది. తనకు పుత్రులు కలుగలేదు. గాంధారి తొందర పడినది. వ్యాకుల పడినది. ఆతుర అయినది. తన కడుపును , తన చేతులతోనే గుద్దుకున్నది. అందువలన పిండము దూసుకొని భూమిమీద పడినది. అంతటితో కధ ముగియవలసినది అట్లు కాలేదు.
    గాంధారి కధ విన్నాడు వ్యాసుడు. హస్తినకు వచ్చినాడు. కోడలిని మందలించినాడు నిందించినాడు. మాంసపిండము వృధా కాకుండ ఉపాయము చెప్పినాడు. ఆ మాంస పిందమును నూటొక్క ముక్కలు చేసినాడు. ఒక్కొక్క దానిని ఒక్కొక్క నేతికుండ యందు ఉంచినాడు. వాటిని చల్లని నీటితో తడుపుచుండ వలెనని చెప్పినాడు. కొంతకాలమునకు నూరుగురు పుత్రులు ఒక పుత్రిక కలుగుడురు అని చెప్పినాడు. వేద వ్యాసుడు వెళ్ళిపొయినాడు.
    గాంధారి వేదవ్యాసుడు చెప్పినట్లు చేసినది. కాలము గడచినది. అవి పరిపక్వము అయినవి. ఒక పెద్ద మాంస ఖండము పక్వమయినది. అందు నుండి ఒక మగ బిడ్డ పుట్టినాడు. అతడు దుర్యోధనుడు. సరిగా కుంతికీ భీముడు పుట్టిన సమయమున దుర్యోధనుడు జన్మించినాడు.
    దుర్యోధనుడు పుట్టినపుడు ప్రకృతి విపరీతములు సంభవించినవి. రాక్షసులు మిక్కుటముగా అరచినారు. నక్కలు ఊళలు పెట్టినవి. గుడ్లగూబలు అరచినవి. గాడిదలు ఒండ్ర పెట్టినవి. భూమి కంపించినది. మేఘములు రక్తము కురిసినవి. సూర్యుడు తేజస్సు కోల్పోయినాడు. ఇంకను అనేక ఉత్సాతములు కలిగినవి.
    దుర్యోధనుడు పుట్టినపుడు ఉత్సాతములు కలిగినవి. భీష్ముడు విదురుడు అది చూచినారు. దృతరాష్ట్రునితో ఇట్లన్నారు:-
    "రాజా! దుర్యోధనుడు సకలజనులు చచ్చుటకు కారణము అగునవి. తోచుచున్నది. అతడు మన కులమునకు అపాయము కలిగించును. కావున ఆ పాపాత్ముని విడువుము. కులమును రక్షింపుము."
    ధృతరాష్ట్రుడు భీష్మాదుల మాటలు వినలేదు. అతనికి పుత్ర మోహము. ప్రతి తండ్రికి పుత్ర వ్యామోహము ఉండును. ఉండి తీరవలె. ఏ తండ్రీ తన పుత్రుని వదులుకొనడు.
    దుర్యోధనుని తరువాత తొంబది తొమ్మిది మంది పుత్రులు పుట్టినారు. ఒక కూతురు పుట్టినది. ఆమె దుస్సల. ధృతరాష్ట్రునాకు ఒక వైశ్య స్త్రీ వలన యుయుత్సుడు పుట్టినాడు. ఆ విధముగా ధృతరాష్ట్రుడు నూటొక్క మంది పుత్రులు ఒక పుత్రిక కలిగినారు.
    కౌరవులు పెరుగుచున్నారు. భీష్ముడు క్రుపాచార్యుని తీసుకుని వచ్చినాడు. కౌరవులకు విద్యాభ్యాసము చేయించుటకు నియమించినాడు. కృపాచార్యుడు ఎవరు? అతని జన్మవృత్తాంతమేమి? అందుకు ఒక కధ ఉన్నది. అది ఇట్లున్నది :-
    గౌతముడు మహర్షి. అతను తన వీర్యమును రెల్లు గడ్డియందు ఉంచినాడు. దాని నుండి శరద్వంతుడు పుట్టినాడు. అతడు వేదవిద్యా సహితముగా ధనుర్విద్య సాంగోపాంగముగా అభ్యసించినాడు. దివ్యాస్త్రములను ఎరుగదలచినాడు. ఘోరమగు తపస్సు ప్రారంభించినాడు. ఇంద్రుడు భయపడినాడు. తపస్సు చెరచ దలచినాడు. "జలషద" అను దేవతను పంపినాడు. శరద్వంతుడు జంషదను చూచినాడు. అతని ధనుస్సు చేతి నుండి జారినది. ఇంద్రియ స్థలనము జరిగినది. అతడు ఆ స్థలము విడిచినాడు. మరొక చోటికి వెళ్ళినాడు.
    శరద్వంతుని ఇంద్రియమున క్రుపాచార్యుడను బాలుడు కృపి అను బాలిక జన్మించినాడు. శంతనుడు వేటకు వెళ్ళినపుడు వారిని చూచినాడు. వెంట తెచ్చినాడు. పెంచినాడు. శరద్వంతుడు ఈ విషయము ఎరిగినాడు. శంతనుని వద్దకు వచ్చినాడు. తన పిల్లలను తీసుకొని వెళ్ళినాడు. కృపునకు ఉపనయనము చేసినాడు. ధనుర్విద్యా సహితముగా వేదవిద్య నేర్పినాడు. కృపాచార్యుడు వేదవిద్యయందు అరితేరినాడు. అప్పుడు భీష్ముడు కృపాచార్యుని రప్పించినాడు. కౌరవులకు విద్యాభ్యాసమునకు నియమించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.