Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    2. ఉషా ! నీవు అశ్వములను, గోవులను, ధనములను కలిగించగలదానవు. నా గృహము విశాలము చేయుము. నాకు హితము చెప్పుము. సంపదలు ప్రసాదించుము.

    3. ధనము కోరువారు సంద్రమున నావలు నడుపుదురు. అట్లే ఉదయాకాశమున ఉషోదేవి రథము నడిపించును. ఆ దేవి పూర్వము ఆ రథమును నడిపినది. ఇప్పుడు నడుపుచున్నది.

    4. ఉషా ! నీవు అవతరించినపుడు దాతల మనసులు ద్రవించును. వారు దానములు చేయుదురు. కణ్వుడు అట్టిదాతల పేర్లు ఉషఃకాలముననే ఉచ్ఛరించును.

    5. గృహిణి గృహమును పాలించునట్లు, జగములను పాలించు ఉష అవతరించినది. ఆమె ప్రాణుల ఆయువు హరించునది. ఆ దేవి కదలికగల ప్రాణులను నడిపించును. పక్షులను ఎగిరించును.

    6. అన్నవతి ఉష కదలిక కలవారిని మేల్కొల్పును. యాచకులను దాతల ఇండ్లకు పంపును. నేలను మంచుతో తడుపును. కలకాలముండదు. కదిలిపోవును.

    7. ఉష సౌభాగ్యవతి. నూరు రథములు గలది. ఆమె రవి ఉదయించు స్థానమునుండి, నూరు రథములలో మానవులకు దర్శనమిచ్చును.

    8. ఉష ద్యుదుహిత, ధనవతి. ఆమె జగములు కనిపింపచేయును. జనులను పనులకు పంపును. చీకట్లను చిమ్మివేయును. దొంగలను తరిమివేయును. అట్టి ఉషోదేవికి సకల జగములు నమస్కరించును.

    9. ద్యుదుహితా ! ఉషా ! నీవు సూర్యచంద్రులతో కూడి ప్రకాశింపుము. మాకు దినమున సౌభాగ్యము ప్రసాదించుము.

    10. ఉషా ! నీవు ప్రకాశవంతమగు ప్రభాతమును కలుగజేయుచున్నావు. సర్వప్రాణుల జీవము, చలనము నీవే అగుచున్నావు. నిన్ను మేము ఆహ్వానించుచున్నాము. నీవు రథముల మీద రమ్ము. మాకు సంపదలు ప్రసాదించుము.

    11. ఉషస్సా ! నరులు సమర్పించు అన్నమును స్వీకరింపుము. యజమానులు నిన్ను నుతింతురు. యజ్ఞములు చేతురు. వారి అధ్వరములు నిర్వహింపుము.

    12. ఉషోదేవీ ! అంతరిక్షము నుండి సకల దేవతలను సోమపానమునకు తీసికొనిరమ్ము. మాకు అశ్వములు, గోవులు, సాహసము, ఆహారము అను సంపదలను ప్రసాదించుము.

    13. ఉషోదేవి వెలుగులు పరుచుచున్నది  శత్రువులను పరిమార్చుచున్నది. కళ్యాణములు కలిగించుచున్నది. ఆమె మాకు సుందరములు, సులభములు అగు సంపదలు అందించవలెను.

    14. ఉషోదేవీ ! నీవు పూజనీయవు. నిన్ను పూర్వ ఋషులు వారి రక్షణ కొఱకును, ఆహారము కొఱకును స్తుతించినారు. నీవు అట్టి ఆహారముతోను, కాంతులతోను వెలుగొందుము. మేము చేయు స్తుతులను గ్రహింపుము.

    15. ఉషా ! నీవు నీ ఉదయకాంతులతో అంతరిక్ష ద్వారములను తెరచినావు. మాకు హింసా రహితము, విశాలము, తేజోవంతమయిన గృహమును అనుగ్రహింపుము. అనేకగోవులను, అన్నమును ప్రసాదించుము.

    16. అన్నవతీ ! ఉషా ! మమ్ము సకల సంపదలలో ముంచుము. అన్నమును, గోవులను, శత్రువును గెలిచిన కీర్తిని ప్రసాదించుము.

               నలుబది తొమ్మిదవ సూక్తము - ఋషి - ప్రస్కణ్వుడు,
                     దేవత - ఉషస్సు, ఛందస్సు - అనుష్టుప్.


    1. ఉషోదేవీ ! శుభముగా రమ్ము. శోభన మార్గముల రమ్ము. అంతరిక్షము నుండి రమ్ము. యజమానివగు ఎర్రని గోవులు నీకు స్వాగతము పలుకును. దేవయజన గృహమునకు తోడ్కొనిపోవును.

    2. ద్యుదుహితా ! ఉషా ! నీవు శోభన అవయములుగల దానవు. సుఖప్రదమగు రథముగల దానవు. నీ రథము మీద రమ్ము. శోభన హవిస్సుగలవాని ఇంటికి చేరుము.

    3. ధవళకాంతుల ఉషోదేవీ ! నేలమీది ద్విపాద చతుష్పాత్తులు, అంతరిక్షపు అంచులమీద పక్షులు నిన్ను అనుసరించి సాగుచున్నవి.

    4. ఉషోరాణీ ! నీవు చీకట్లను తరుముదువు. లోకమున వెలుగులు నింపుదువు. సంపదలు కోరు ఋత్విజులు నిన్ను ఉపాసింతురు.

           ఏబదియవ సూక్తము - ఋషి - కణ్వపుత్రుడు ప్రస్కణ్వుడు
          దేవత - సూర్యుడు, ఛందస్సు - 1-9 గాయత్రి, 10-13 అనుష్టుప్.


    1. సూర్యుని కిరణములు, అశ్వములు, జ్ఞానదాతయగు సూర్యుని వహించుచున్నవి. జగములు చూచుటకు తెచ్చుచున్నవి. దృశే విశ్వాయ సూర్యమ్

    2. సూర్యుడు విశ్వ ప్రకాశుడు. అతనిని చూచిన నక్షత్రములు, రాత్రిదొంగలవలె చూచుచున్నవి. సూర్యుని కేతనములు అనదగిన కిరణములు జ్వాలలవలె జనములను చూచుచున్నవి.

    3. సూర్యుని కేతనములు అనదగిన కిరణములు జ్వాలలవలె జనములను చూచుచున్నవి.

    4. సూర్యుడా ! నీవు తరింప చేయువాడవు. దర్శనీయుడవు. చంద్ర నక్షత్రాదులకు కాంతి ప్రసాదించువాడవు. భూమ్యాకాశములను ప్రకాశింప చేయుచున్నావు.

    5. సూర్యుడా ! మరుత్తులకు, మనుష్యులకు, స్వర్గమునకు అభిముఖముగా ఉందువు.

    6. సూర్యుడా ! నీవు సర్వమును పవిత్రము చేతువు. అనిష్టముల నివారింతువు. జగములను వెలిగింతువు. అట్టి నిన్ను నుతింతుము.

    7. సూర్యుడా ! రాత్రులను కలుగచేయుచున్నావు. పగళ్లు కలుగచేయుచున్నావు. అంతరిక్షము నుండి అన్నింటిని అవలోకించుచున్నావు.

    8. సూర్యుడా ! నీవు కాంతిమంతుడవు. కాంతులే కేశములుగా గలవాడవు. నిన్ను సప్తాశ్వములు, ఏడు కిరణములు నడిపించుచున్నవి.

    9. ఏడు ఆడు గుఱ్ఱములు సూర్య రథమును పడిపోకుండ నిలిపినవి. ఆ గుఱ్ఱములు తమంత తామే రథమును పూన్చుకొనును. నడిపించును.

    10. భానుడు తిమిరము తరువాత వచ్చు ప్రకాశము. అతడు దేవతలలో ఉత్తముడు. దానశీలుడు. మేము అతని తేజస్సును దర్శించుచున్నాము. ధరించుచున్నాము.

    11. సూర్యుడా ! నీవు అందరికి సమాన తేజస్సును ప్రసాదింతువు. ఉదయించునపుడు అంతరిక్షమున ఎక్కుదువు. నీవు హృదయ రోగమును నివారించుము. పాండు, కామెరల వంటి ఇతర వ్యాధులను హరింపుము.

    (గుండె జబ్బులు, కామెర్లు, పాండు రోగములకు సూర్యరశ్మి చికిత్స చెప్పినాడు)

    12. నా దేహమునందలి ఆకుపచ్చరోగములను చిలుకల, పసుపు పచ్చవానిని సారికలకు ఇచ్చుచున్నాను. హరిమాణము అనువ్యాధిని హరిత వృక్షములకు ఇచ్చుచున్నాను.

    13. నన్ను బాధించు వ్యాధులనుగాని, శత్రువులనుగాని నేను హింసించను. నా ఎదుట నిలిచిన భానుమూర్తి వాటిని, వారిని హింసించును.

                     (ప్రథమ మండలమున తొమ్మిదవ అనువాకము సమాప్తము.)

        పదవ అనువాకము-ఏబది ఒకటవ సూక్తము, ఋషి-అంగిరస పుత్రుడు సవ్యుడు,
        దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 1-13 జగతి, 14-15 త్రిష్టుప్. -


    1. ఇంద్రుడు శత్రుంజయుడు. ఆహోయమానుడు. స్తవనీయుడు. ధనప్రదాత. అతనిని బుక్కులతో నుతింతుము. ఋత్విజులారా ! ఇంద్రుడు సూర్యకిరణములవలె జనులకు హితకరుడు, భోగి, బుద్ధిశాలి. ఇంద్రుని యజింపుడు.

    2. ఇంద్రుడు అంతరిక్షమున ప్రకాశము కలిగించును. శక్తియుక్తులుగల శత్రువును ధ్వంసము చేయువాడు. అట్టి ఇంద్రుని, జనులకు రక్షణ, అభ్యుదయము కలిగించు మరుత్తులు సర్వదిశల, సర్వవేళల సేవించినారు. ఇది సత్యము. ఇంద్రుడే వచించినాడు.

    (వృత్రాసురునితో ఇంద్రుడు చేసిన యుద్ధమున దేవతలందరు ఇంద్రుని విడిచిపోయినారు. మరుత్తులు మాత్రము ఇంద్రుని వెంట నిలిచినారు)

    3. ఇంద్రా ! నీవు అంగిరసుల కొఱకు మేఘములను వర్షింపచేసినావు. 'అత్రి' శతద్వార యంత్రమున పడి ఉండెను. అతనికి మార్గము చూసినావు. విమద ఋషికి ఆహారము ప్రసాదించినావు. యుద్ధములందు ఉన్నవారిని వజ్రమున రక్షించినావు.

    4. ఇంద్రా ! మేఘములను కురిపించినావు. పర్వతములందు ఉన్న శత్రువుల ధనమును హరించినావు. అన్నింటిని ధ్వంసము చేసిన వృత్రుని సంహరించినావు. తరువాత సూర్యుని అంతరిక్షమున చేర్చినావు.

    5. ఇంద్రా ! హవిస్సులను మాయలతో హరించి సేవించిన దస్యులను నీవు మాయలతోనే మర్దించినావు. 'పిప్రు'ని గుహను బద్దలు కొట్టినావు. ఋజిశ్వానుని యుద్ధమున రక్షించినావు.

    6. ఇంద్రా ! 'శుష్ణు'ని యుద్ధమున 'కుత్సు'ని కాపాడినావు. 'అతిధిగ్వు'ని కొఱకు శంబరుని నిరోధించినావు. గొప్ప 'అర్బుదు'ని కాలితో తొక్కి పెట్టినావు. నీవు దస్యులను వధించుటకే అవతరించినావు.

    7. ఇంద్రా ! సర్వబలములు నీయందు ఉన్నవి. నీ బాహువులందు వజ్రము ఉన్నది. నీ మనస్సు సోమపానమునకు వ్యాకులపడుచున్నది. కావున నీవు శత్రువుల బలములను హరించినావు.

    8. ఇంద్రా ! ఆర్యులు ఎవరో తెలిసికొనుము. దస్యులు ఎవరో గ్రహించుము. యజ్ఞ కర్మలు భగ్నము చేయువారిని శాసించుము. యజమానులను ఉత్సాహపరచుము. అన్ని పనులు చేసిన ఇంద్రుని కీర్తింతుము.

    9. ఇంద్రుడు కర్మలు చేయువారి కొఱకు, చేయనివారిని లొంగదీయును. స్తుతించువారి కొఱకు, స్తుతించనివారిని బాధించును. ఇంద్రుడు వృద్ధిచెందినవాడే. అయినను అంతరిక్షమున మరింత వృద్ధిచెందుచున్నాడు. ఇంద్రుని నుతించుటకు 'వమ' ఋషి 'వల్మీకవప'ను తెచ్చినాడు.

    10. ఇంద్రా ! శుక్రుడు తన బలమున నిన్ను బాధలపాలు చేసినాడు. అప్పుడు నీ బలము అప్రతిహతమయినది. భూమి, అంతరిక్షములను బాధించినది. నీ అశ్వములు వాయువులవంటివి. అవి నిన్ను హవిస్సులకొఱకు తెచ్చును.

    11. శుక్రుడు ఇంద్రుని స్తుతించగోరినాడు. అప్పుడు రథమును వంకర నడకలతో దారి తప్పించినాడు. ఇంద్రుడు ఉరుకుచున్న మబ్బులను పట్టినాడు. మహా వర్షము కురిపించినాడు. శుష్ణాసురుని నగరములను చెదర గొట్టినాడు.

    12. ఇంద్రా ! నీవు సోమముల కొఱకు రథమును ఎక్కినావు. నీకు మిక్కిలి ఇష్టమయిన సోమమును 'శర్యాతి' సంపాదించినాడు. నీకు సోమమునందు మిక్కుటమగు ఇష్టము ఉన్నది. అంతటి స్తుతులను నీవు అంతరిక్షమున అందుకొనుచున్నావు.

    13. ఇంద్రా ! కక్షీవంతుడు నిన్ను నుతించినాడు. యజ్ఞము చేయదలచినాడు. అతనికి 'వృచ' అణు దానిని ఇచ్చినావు. 'వృషణశ్వసు'ని కూతురు 'మేన'ను నీవు కామించినావు. ఇవన్నియు యజ్ఞమున చెప్పదగినవి. తే సవనేషు ప్రవాచ్యా

    14. యజమానులు తమలేమిని దూరము చేయుటకు ఇంద్రుని ఆశ్రయింతురు. అంగిరసులు స్తోత్ర ధనముల కొఱకు ఇంద్రుని ప్రార్ధింతురు. ఇంద్రుడు సకలము ఇచ్చువాడు అగును. అయినను అశ్వములను, గోవులను కోరుచున్నాడు.

    15. ఇంద్రుడు వర్షించువాడు. స్వయం ప్రకాశకుడు. సత్యబాలుడు. వర్థమానుడు. ఇంద్రునకు నమస్కరించు మంత్రములను ఉచ్ఛరించుచున్నాము. వీరులతోను, విద్వాంసులతోగూడి, ఇంద్రుడు ప్రసాదించిన గృహమున సుఖముగా నివసించుచున్నాము.

    ఆలోచనామృతము :

    1. ఇంతకుముందు జలచికిత్స చెప్పబడింది. ఆపత్సు విశ్వ భేషజీః అన్నాడు.

    50వ సూక్తమున సూర్య చికిత్స చెప్పబడినది. గుండె జబ్బు, పాండు, కామెర్లకు సూర్యచికిత్స సూచించినాడు.

    51వ సూక్తమున కొన్ని ప్రధాన విషయములు కనిపించుచున్నవి. తొలిసారిగా 'ఆర్య' పదము కనిపించినది. ఆర్య - దస్యులకు విరోధము ఉన్నట్లు కూడ చెప్పబడినది.

    ఆర్య వైదిక జీవనమును, వైదిక కర్మలను అనుసరించువారు ఆర్యులు. సంస్కారముగలవారు, భగవంతుని నమ్మువారు, పూజించువారు ఆర్యులు.

    "ఆర్యఈశ్వరపుత్రః" అంటుంది నిరుక్తము. ఆర్యులు ఈశ్వర సంతానము.

    స్వామి దయానందుడు ఆర్యులు ధార్మికులు, విజ్ఞులు, సర్వమానవులకు ఉపకారము చేయువారు అన్నారు.

    దస్యులు ధర్మరహితులు, మూర్ఖులు, దుష్టులు అన్నారు దయానందులు. దస్యులు వైదిక ధర్మములను వ్యతిరేకించినవారు.

    2. అంగిరసుడుః బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. ప్రజాపతి. అగ్ని అలిగినపుడు దేవతలు అంగిరసుని అగ్నిని చేసినారు. అగ్ని అలకతీరి, తిరిగి వచ్చిన తరువాత అంగిరసుడు అగ్నిని ప్రథమాగ్నిగా ప్రతిష్ఠించినాడు. అంగిరసుడు అగ్నికి మానవ పుత్రుడు అయినాడు. అంగారేష్వంగిరసాః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.