Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1


 

    4. అగ్ని శ్రేష్ఠుడు. ప్రాయపువాడు. సదాసంచారి. యజ్ఞమునకు ఆధార భూతుడు. యజమాని ప్రియతముడు. సమస్త వస్తుజ్ఞానము కలవాడు. సకల దేవతలను ఉషః కాలమున ప్రసన్నులను చేయవలసినదని "జాతవేద సమగ్నిమీళే" సర్వము తెలిసిన అగ్నిని ప్రార్ధించుచున్నాను.

    5. అగ్ని అమరుడు. సర్వ భక్షకుడు. హవ్య వాహనుడు. పూజార్హుడు. జగద్రక్షకుడు. అట్టి అగ్నిని స్తుతించుచున్నాను.

    6. అగ్నీ ! నీవు నిత్య యవ్వనుడవు. కీర్తనీయుడవు. హర్షదుడవు. తీపిమాటలవాడవు. నీకు అభిముఖులము అయినాము. హోమము చేయుచున్నాము. ప్రస్కణ్వునకు జీవమును, అధిక ఆయువును ప్రసాదించమని దేవతలను ప్రార్థింపుము.

    7. అగ్నీ ! నీవు హోమకర్తవు. విశ్వవేదివి. నిన్ను ప్రజలు ప్రజ్వలింపచేతురు. ఆహ్వానింతురు. నీవు దేవతలు అందరిని ఈ యజ్ఞమునకు అభిముఖులను చేయుము. వారిని రప్పింపుము.

    8. అగ్నీ ! నీవు శోభాయమానుడవు. ఆహవనీయుడవు. ఋత్విజులు హవ్యవాహనుడవు అయిన నిన్ను వెలిగించుచున్నారు. ఉషః కాలమున సవితను, ఉషస్సును, అశ్వినులను భగుని, రాత్రి దేవతలను తోడ్కొని రమ్ము.

    9. అగ్నీ ! నీవు అధ్వరపతివి. దేవదూతవు. ఉషః కాలపు సూర్యునివలె దీపించు దేవతలను సోమపానమునకు, అభిముఖముగా తీసుకొని రమ్ము.

    10. అగ్నీ ! నీవు అనంత కాంతివంతుడవు. ఉషస్సును సుందరముగా వెలిగించినావు. నీవు గ్రామరక్షకుడవు. వేదిక పూర్వభాగమున ఉండి మానవులకు శుభములు కూర్చుచున్నావు.

    11. అగ్నీ ! నీవు యజ్ఞ సాధనమవు. హోతవు. ఋత్విజుడవు. జ్ఞానివి. అమరుడవు. శత్రుసంహారకుడవు. అట్టి దేవదూతవగు నిన్ను మున్ను మనువు నిలిపినాడు. నేడు మేము వేదికపై నిలుపుచున్నాము.

    12. అగ్నీ ! నీవు మిత్రులను మన్నింతువు. వేదికి పూర్వభాగమున, యజన స్థానమునకు మధ్యన నిలుతువు. నీవు దేవతలకు దూతకార్యము నిర్వహించునపుడు, సూర్యకాంతికి వెలిగి, ధ్వనించుచున్న సముద్ర తరంగములవలె భాసింతువు.

    13. అగ్నీ ! నీవు వినగలవాడవు. మా మాటలు వినుము. నీతో సమముగా మిత్ర, అర్యమ ఇతర దేవతలు ఉషః కాల యజనములకు విచ్చేయవలెను. అచట పరచిన దర్భాసనములపై ఆసీనులు కావలెను.

    14. మరుత్తులు ఫలదాతలు. అగ్ని జిహ్వులు. నిప్పు నాలుకవారు. యజ్ఞవర్థకులు. అట్టి మరుత్తులు మా స్తవములను ఆలకించవలెను. కర్మకారణుడు అగు వరుణుడు అశ్వినులు, ఉషస్సు సహితుడయి సోమపానము చేయవలెను.

    ఆలోచనామృతము:

    ఉషః కాలమునకు ప్రాధాన్యత ఇవ్వబడినది. ఉషోదయపు అందచందములను ఆస్వాదించుట ఆనందహేతువు అని చెప్పుచున్నాడు.

    ఉషః కాల యజ్ఞమును ప్రతిపాదించినట్లును, ప్రాధాన్యత ఇచ్చినట్లును అవగతము అగుచున్నది.

    ఉషః కాలము అమృతమయమని తెలియుట నేటికిని ఎంతో ఎంతో ఆరోగ్యకరము. ఆనందకరము.

                               నలుబది అయిదవ సూక్తము

        ఋషి-కణ్వపుత్రుడు ప్రస్కణ్వుడు, దేవత-అగ్ని, ఛందస్సు-అనుష్టుప్.


    1. అగ్నీ ! నీవు వర్షకారకమవు. యజ్ఞమునందు మనువుచే ప్రతిష్ఠింపబడినవాడవు. నీవు వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అన్యదేవతలను ఈ యజనమునకు తీసికొని రమ్ము. యజింపుము.

    2. అగ్నీ ! నీ అశ్వములు రోహితములు. నీవు స్తుతిప్రియుడవు. విశేష విజ్ఞానవంతులయిన ముప్పది ముగ్గురు దేవతలను ఇచటికి తీసికొని రమ్ము.

    3. అగ్నీ ! నీవు బహువిధ కర్మలు గలవాడవు. సర్వము తెలిసినవాడవు. నీవు పూర్వము మేధుడు, అత్రి, విరూపుడు, అంగిరసుడు ఆహ్వానించగా ఆలకించినావు. అట్లే కణ్వపుత్రుని ఆహ్వానమునుకూడ ఆలకింపుము.

    4. ఋషులు ఫ్రౌఢ కర్ములు. యజ్ఞప్రియులు. వారు యజ్ఞమధ్యమున జ్వలించు అగ్నిని తమ రక్షణకుగాను ఆహ్వానించుచున్నారు.

    5. అగ్నిని ఘృతము సమర్పించి ఆహ్వానింతుము. అగ్ని సత్యఫలదాత అగును. అగ్నీ ! కణ్వపుత్రులు నిన్ను స్తుతించి ఆహ్వానించుచున్నారు. వారి ఆహ్వానములను మన్నింపుము.

    6. అగ్నీ ! నీవు అన్నవంతుడవు. బహుజన ప్రియుడవు. హవ్యవాహనుడవు. యజమానులు. ప్రకాశ కేశములుగల నిన్ను ఆహ్వానించుచున్నారు.

    7. అగ్నీ ! నీవు హోతవు. ఋత్విజుడవు. సంపదలు కలుగజేయువాడవు. విన్నపములు వినగల చెవులు ఉన్నవాడవు. ప్రఖ్యాతుడవు. నిన్ను మేధావులు యాగములందు ప్రతిష్ఠించినారు.

    8. అగ్నీ ! నీవు మహత్తు, ప్రకాశము కలవాడవు. ఋత్విజులు యజమాని యొక్క హవిస్సును, సోమమును నీకు సమర్పించుటకు వచ్చుచున్నారు.

    9. అగ్నీ ! నీవు మధించగా పుట్టినవాడవు. నివాసకారకుడవు. దేవయజనమున సోమపానమునకు గాను ప్రాతః కాలమున వచ్చు దేవతలను, ఇతర దేవతలను పిలుచుకొని రమ్ము.

    10. అగ్నీ ! ఆహ్వానించగా వచ్చు దేవతలను, ఇతర దేవతలను కూడ అభిముఖుడయి ఆహ్వానింపుము. దేవతలారా ! ఇదిగో సోమము. ఇది నిన్న అభిషవించి నేడు హోమము చేయబడిన "తిరో అహ్న్యము" స్వీకరించుడు.

                                  నలుబది ఆరవ సూక్తము

        ఋషి - కణ్వపుత్రుడు ప్రస్కణ్వుడు. దేవత - అశ్వినులు. ఛందస్సు - గాయత్రి.

    1. ఈ నాటి ఉష అపూర్వమయినది. ప్రియమయినది. కొత్తది. ద్యులోకము నుండి అవతరించినది. భూలోకపు చీకట్లను పోగొట్టినది. అశ్వినులారా ! మిమ్ము గొప్పగా స్తుతించుచున్నాము స్తుషేవామశ్వినా బృహత్

    2. అశ్వినులు దర్శనీయులు. సాగరమున ఉద్భవించినవారు. మనస్ఫూర్తిగా సంపదలు ప్రసాదించువారు. యజ్ఞకర్తలకు గృహములు ఏర్పరచువారు. అట్టి అశ్వినులను గొప్పగా స్తుతించుచున్నాము.

    3. అశ్వినులారా ! స్వర్గము సకల శాస్త్రములచే నుతింపబడినది. అశ్వములుగల మీ రథము స్వర్గమున నడిపించుడు. మేము మిమ్ము స్తుతించుచున్నాము.

    4. అశ్వినులారా ! సూర్యుడు నీటిని పీల్చువాడు. నీటిని ఇచ్చువాడు. సకల కర్మలను చూచువాడు. అతడు మా హవిస్సులతో దేవతలను తృప్తులను చేయును.

    5. అశ్వినులారా ! మీరు స్తోత్రప్రియులు. మీ బుద్ధులను వృద్ధిచేయుడు. మాదక సోమమును పానము చేయుడు.

    6. అశ్వినులారా ! చీకట్లు పోగొట్టునది. వెలుగులు ప్రసాదించునది. తృప్తి కలిగించు అన్నమును మాకు ప్రసాదించుము.

    7. అశ్వినులారా ! మేము మిమ్ము వీనులవిందుగా స్తుతించుచున్నాము. మాస్తుతులు వినుటకు సముద్రము నుండి ఓడలలోను, నేలమీద రథములమీదను రండు.

    8. అశ్వినులారా ! సముద్రతీరములందు మీకు గల నావలు ద్యులోకమునకన్న విస్తారమయినవి. నేలమీది మీ రథములును అంతటివే. విచ్చేయుడు. సోమము సిద్ధముగా ఉన్నది.

    9. సూర్యకిరణములు అంతరిక్షమున అవతరించినవి. వర్షము అంతరిక్షమున ఉద్భవించినది. మా జీవన హేతువగు ఉషస్సు అంతరిక్షముననే ప్రదీపించినది. అశ్వినులారా ! మిమ్ము ఈ మూడింట ఏ స్థానమున ప్రతిష్ఠించవలెను ?

    10. ఉషఃకాల కిరణములకు సూర్యుని కాంతి కారణము అగును. సూర్యుడు బంగారమున పుట్టినాడు. బంగారు కాంతివాడు అయినాడు. అగ్ని తనకాంతితో సూర్యుని చేరినాడు. వెలవెల పోయినాడు.

    11. ఉదయాద్రిని చేరుటకు భానుని మర్గము ప్రశస్తమయి ఉన్నది. సూర్యుడు వెలుగులు పరచుచు దర్శనము ఇచ్చుచున్నాడు.

    12. అశ్వినులు అనేక రక్షణలు కలిగించినారు. వారు సోమపానము చేయునపుడు, స్తోత్రపాఠకులు ఒక్కొక్క రక్షణకు ఒక్కొక్క తీరుగా నుతించుచున్నారు.

    13. అశ్వినులారా ! మీరు సుఖములను ఇచ్చువారు. పూర్వము మీరు మనువునందు నివసించినారు. అట్లే యజమాని యందు నివసింపుడు. మిమ్ము స్తుతించుచున్నాము. సోమము సిద్ధముగా ఉన్నది. విచ్చేయుడు.

    14. అశ్వినులారా ! మీరు సర్వంచరులు. రాత్రి హవిస్సు సిద్ధమయినది. ఉషస్సుతో కలిసిరండు. స్వీకరించుడు.

    15. అశ్వినులారా ! మీరు ఉభయులు సోమపానము చేయుడు. మాకు రక్షణలు కల్పించుడు. సుఖములు ప్రసాదించుడు.

    శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొ.అష్టకము-మొ.మండలమున మూడవ అధ్యాయము సమాప్తము.
        ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
        నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||

        నాలుగవ అధ్యాయము-తొమ్మిదవ అనువాకము-నలుబది ఏడవ సూక్తము
        ఋషి - కణ్వపుత్రుడు ప్రస్కణ్వుడు, దేవత-అశ్విమలు, ఛందస్సు-బృహతి.


    1. అశ్వినులారా ! మీరు యజ్ఞములకు అభ్యుదయము కలిగించువారు. నిన్న అభిషవించి నేడు సిద్ధము చేసిన తిరోఅహ్న్యమను సోమము సిద్ధముగా ఉన్నది. స్వీకరించుడు. యజమానికి సంపదలు ప్రసాదించుడు.

    2. అశ్వినులారా ! మీకు ముల్లోకములు తిరుగగల బంగారు రథము ఉన్నది. దానిలో మూడు ఎత్తుపల్లముల ఆసనములు ఉన్నవి. ఋత్విజులు మీ స్తుతిమంత్రములు పఠించుచున్నారు. ఆహ్వానించుచున్నారు. మీరు మా బంగారు రథమున విచ్చేయుడు.

    3. అశ్వినులారా ! మీరు యజ్ఞవర్థకులు. మిమ్ము ఆహ్వానించుచున్నాము. విచ్చేయుడు. మధురాతిమధురమగు సోమము స్వీకరించుడు. ధనము నింపిన రథముతో యజమానిని అనుగ్రహించుడు.

    4. అశ్వినులారా ! మీరు సర్వజ్ఞులు. కాంతిమంతులగు ఋత్విజులు మీ కొఱకు సోమము అభిషవించినారు. మిమ్ము పిలుచుచున్నారు. దర్భలు మూడు వరుసలుగా పరచి ఉన్నవి. అసీనులు కండు. మధుర రసమున యజ్ఞమును తడిపివేయుడు.

    5. అశ్వినులారా ! మీరు శుభములకు ప్రభువులు. కణ్వుడు మిమ్ము స్తుతించినాడు. మీరు కణ్వుని రక్షించినారు. మేము ఆ స్తుతులతోనే మిమ్ము ప్రార్థించుచున్నాము. రండి, సోమపానము చేయుడు. యజ్ఞమును వృద్ధిపరచుడు. మమ్ము రక్షింపుడు.

    6. అందముల అశ్వినులారా ! సుదాసు అనువానికి సంపన్నమగు రథము నిండుగా అన్నము తెచ్చి ఇచ్చినారు. దివినుండియో భువినుండియో తెచ్చి అనేకులకు సరిపడు ఆహారమును ప్రసాదించుడు.

    7. అశ్వినులారా ! చక్కని మీ రథములో దూరమునుండి గాని, దగ్గరినుండిగాని, సూర్యకిరణముల సహితులయి మా వద్దకు విచ్చేయుడు.

    8. అశ్వినులారా ! మేము యాగములు చేయుచున్నాము. మా మూడు సవనములకు మీరు అశ్వసహితులయి విచ్చేయుడు. దర్భలపై ఆసీనులు కండు. మా యజమానికి అన్నము అందించుడు.

    9. సత్యవంతులారా ! మీకు హవిస్సులు ఇచ్చువారికి మీ రథముల నిండుగ ధనము తెచ్చి ఇత్తురు. ఆ రథముననే సూర్యకాంతులు ప్రసరించగా రండు. మధుర సోమము స్వీకరించుడు.

    10. అశ్వినులారా ! మీరు మిక్కిలి ధనవంతులు. మిమ్ము స్తుతిమంత్రములతోను, పూజామంత్రములతోను, మాకు అభిముఖముగా ఆహ్వానించుచున్నాము. మీరు ఋత్విజులకు ప్రియమగు యజన స్థలమున ఉందురు. అచట సోమము సేవింతురు.

              నలుబది ఎనిమిదవ సూక్తము - ఋషి - ప్రస్కణ్వుడు,
                       దేవత - ఉష, ఛందస్సు - బృహతి.

    1. ఉషా ! నీవు ద్యుపుత్రికవు. ధనముతో ఉదయింపుము. అన్నముతో ఉదయింపుము. దానముతో ఉదయింపుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.