Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                         జ్ఞానానందమయం దేవం నిర్శల స్ఫటికాకృతం |
                        ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్శహే ||

                                           మూడవ అధ్యాయము


    1.సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధియతాధిమ్ |
    ఆస్మిన్హవ్యా జుహొతన |

    ఋత్విజాదులారా! సమిధ సమర్పించి అగ్నికి పరిచర్య చేయండి. అగ్ని అతిథి సముడు అతనికి ఘృతపు ఆహుతులు అర్పించండి. ప్రజ్వలితుని చేయండి. ప్రజ్వలిత అగ్నిలో చరుపురోడాశాది హవ్యములను హొమము చేయండి.

    2.ఋత్విజులారా! అగ్ని సర్వ విధ ప్రదీప్తుడు. జాతవేది. అతనికి అతి రుచికర శుద్ధ ఘృతమును సమర్పించండి.

    3. అగ్నీ! నిన్ను సమిధలు, ఘృతాదులచే ప్రవృద్ధుని చేయుదుము. నీవు నిత్య యవ్వనుడవు. కావున చక్కగా వర్ధిల్లుము. ప్రదీప్తుడవగుము.

    4. అగ్నీ! ఘృతమున తడిసిన హవిర్యుక్తమగు ఈ సమిధ నిన్ను చేరవలెను. నీవు తేజస్వివి. నేను సమర్పించిన ఈ సమిధలు నీకు ప్రీతి పూర్వకములు కావలెను. నిన్ను సేవించవలెను.

    5. అగ్నీ! భూమి, అంతరిక్షము, దేవలోకమను మూడు లోకములందు వ్యాపించినవాడవు. పృథివీ! నీవు దేవతల యజన యోగ్యమవు. శ్రేష్ఠ అన్నములు లభించుటకు గాను నీ వీపు మీద అన్నభక్షక గార్హపత్యాది అగ్నులను స్థాపింతును.

    6. ఈ అగ్ని ప్రత్యక్షముగా దర్శనమిచ్చువాడు, యజ్ఞము కొరకు గాను ఇతడు యజమాని ఇంట జ్వాలారూపము ధరించి నిలిచినాడు. స్వర ప్రకారముల ఆహవనీయ గార్హపత్య, దక్షిణాగ్ని స్ధానములందు కాలు మోపినాడు. అట్లే పూర్వదిశన పృథ్విని చేరినాడు. ఆదిత్య రూపమున పితరులను చేరినాడు.

    7. ఈ అగ్ని ప్రాణాపాన కార్యములు నిర్వహించుచు శరీరపు మధ్య భాగమున వర్తిల్లును. ఇది  జఠరాగ్నియగును. శరీరమున జీవన రూపియగును. ఆ విధముగా అగ్ని వాయు, సూర్య రూపమున సమస్త లోకములను అనుగ్రహించును. అతడు యజ్ఞానుష్ఠానము కొరకు ప్రకాశితుడగును.

    8. ముప్పది ముహూర్తరూప స్థానములందు శోభిల్లునట్టి పూజ్య వాక్కు అగ్ని కొరకు ఉచ్ఛరించవలెను. నిత్య ప్రియ స్తుతులు ఉచ్చరించయోగ్యమగు వాణియే శ్రేష్ఠకర్మములందు అగ్నిని స్తుతించును. (ఇవి అగ్న్యాధేయ మంత్రములు)

    9. అగ్నియే జ్యోతి జ్యోతియే అగ్ని. కొరకే ఈ ఆహుతి. సూర్యుడే జ్యోతి. జ్యోతియే సూర్యుడు. అతని కొరకే ఈ ఆహుతి. అగ్నియే బ్రహ్మ వర్చస్సు. బ్రహ్మ వర్చస్సే అగ్ని అతని కొరకే ఈ ఆహుతి. సూర్యుడే బ్రహ్మ వర్చస్సు. బ్రహ్మ వర్చస్సే సూర్యుడు. అతని కొరకే ఈ ఆహుతి. జ్యోతియే సూర్యుడు. సూర్యుడే జ్యోతి. అతని కొరకే ఈ ఆహుతి. "జ్యోతిః సూర్యః సూర్యోజ్యోతిః స్వాహా"

    10. సవితృ దేవుని సహితముగ సమాన ప్రీతి గలవాడు అగ్ని ఇంద్రవతి రాత్రి సహితముగ సమాన ప్రీతి గల వాడు అగ్ని. అతనికి హవి సమర్పించుచున్నాము. అతడు సేవించవలెను. అగ్ని ఈ ఆహుతిని స్వీకరించవలెను. అగ్నికి స్వాహా.


    సవితృ దేవుని సహితముగ సమాన ప్రీతి కలవాడు సూర్యుడు. ఉషా సహిత ఇంద్ర సహిత సమాన ప్రీతి గలవాడు సూర్యుడు. అతనికి హవి సమర్పించుచున్నాము. అతడు సేవించవలెను. సూర్యుడు ఈ ఆహుతిని స్వీకరించవలెను సూర్యునకు స్వాహా.


    11. యజ్ఞమునకు విచ్చేసిన వాడును- దూరమందున్నను మా విషయము ధ్యానమునందుంచు కొను వాడునగు అగ్ని కొరకు ఈ సుత్తిని ఉచ్చరించు చున్నాము. దూరమందుండియు అతడు వినును. "ఆరే అస్మేచ శృణ్వుతే"

    12. ఆహవనీయాది వేదస్థుడగు అగ్ని ద్యులోకపు శీర్షమంతటి ఉన్నతుడు. అతడు ఈ పృథ్వికి ప్రభువు. ఇతడు జలములందలి సారమునకు కర్త.

    13. ఇంద్రాగ్నులారా! మీ ఉభయులను కలిపి ఆహ్వానించుచున్నాను. ఉభయులు కలసి ప్రసన్నులు కావలెనని వరించుచున్నాను. మీరిద్దరు అన్నముల, ధనముల దాతలు. అన్నలాభము కొరకు మీ ఉభాయులను ఆహ్వనించుచున్నాము.

    14.  ఆహవనీయ అగ్నీ! ఈ ముందు కనిపించుచున్నది గార్హపత్యాగ్ని. ఇదియే నీకు ఉత్పత్తి స్థానము. ఇచట పుట్టి నీవు దేదీప్యమానుడవగుచున్నావు.

    అగ్నీ! నీ ఉత్పత్తి స్థానమును తెలియుము. గార్హపత్య వేది మీద వెలుగుము. మాకు ధనాది అభివృద్ధిని ప్రసాదించుము.

    15. బుత్విక్కులు అగ్ని మూలమున దేవతలను ఆహ్వానింతురు. అగ్ని యజనీయతముడు, సర్వ యజ్ఞములందు స్తుత్యుడు. అట్టి అగ్ని ముఖ్యునిగా స్థాపించబడినాడు. అతడు స్పృహణీయుడు. వ్యాపకుడు. యజమాని గృహమున ఆహవనీయాది రూపముల విరాజితుడు. అట్టి అగ్నిని అందుకొనుటకే భృగు గోత్రజులు సమిధలు అర్పించి అగ్నిని పూర్తిగా ప్రజ్వరిల్ల చేసినారు.

    16. అగ్ని పరిశుద్ధుడు. అతనిలో పురానిహిత దీప్తులున్నవి. గోవులు అగ్ని స్వరూపులు. అవి సహస్ర ధనములిచ్చును. దేవతలకు ప్రియములగు దుగ్ధములిచ్చును. ఆ గోవులను పాలుపితుకు ఆహీరులు పితుకుచున్నారు.

    17. అగ్నీ! నీవు దేహమును పవిత్రముచేయువాడవు. నా దేహమును పవిత్రము చేయుము. నీవు ఆయువును ఇచ్చు వాడవు. నాకు ఆయువు ప్రసాదించుము. నీవు బ్రహ్మ వర్చస్సును ఇచ్చువాడవు. నాకు బ్రహ్మ వర్చస్సును ప్రసాదించుము.

    అగ్నీ! నా శ్రీరామున లోపమున్నచో వానిని సరిచేయుము.

    "అగ్నే యన్మే తన్వా ఊనం తన్మ ఆపృణయ"

    18. అగ్నీ! నీవు ద్యుతియుక్తుడవు. అన్నప్రదాతవు. శత్రుంజయుడవు. బలప్రదాతవు. శత్రువును అణచువాడవు. అహింస్యుడవు.

    మేము హవిరన్న యుక్తులము. శత్రువును జయించువారలము. బల సంపన్నులము. సదా అహింసనీయులము.

    అగ్నీ! మేము నీకు సమిధాదులు సమర్పింతుము. సూరేళ్ళ వరకు నిన్ను ప్రజ్వరిల్ల చేయుదుము.

    స్పృహణీయరాత్రే! అవినాశ్యులమై మేము నీ యొక్క ప్రాతః కాలపు అందచందాలను దర్శింతుముకాక.

    19. అగ్నీ! నీవు సూర్యుని తేజముతోను, బుషుల స్తవములతోను వర్థిల్లుచున్నావు. నీవు నీకు ప్రియమగు తేజస్సున అవతరించినావు.

    అగ్నీ! నాకు ఆయువు, బ్రహ్మవర్చస్సు, సంతానము, ధనము, అభ్యుదయములచే సాంగత్యము కలిగించుము - విడిపోకుండునట్లు!

    సమహమాయుషా సం వర్చసా సం ప్రజయా సంరాయ స్పోషేణ గ్మిషీయ

    20. గోవులారా! మీరు దుగ్ధాది అన్నములు గలవారు. నాకు మీ యొక్క దుగ్ధాది అన్నలాభము కలుగవలెను. మీరు పాలు, పెరుగు,నేయి వంటి దశతేజోవంతులు. నాకు మీ యొక్క పాలు పెరుగు, నేయి వంటి దశతేజో లాభము కలుగవలెను. మీరు బలస్వరూపిణులు. నాకు మీ బలపు లాభము కలుగవలెను. మీరు ధనమునకు సృష్టిభూతులు. నాకు  ధనపుష్టి లాభము కలుగవలెను.

    21. గోవులారా! మీరు ధనవంతులు. ఈ యజ్ఞపు గోదూహన స్థానమున ఆనందించండి. ఇచటనే  ఉండండి. దూరము పోకండి. "ఇహైవస్త మాప గాత"

    22. (గోవును తాకి) గోవూ! నీవు యజ్ఞకార్య నిమగ్నవు. వివిధ రూపములు గలదానవు. నీవు బలము, గోపతిత్వ రూపమున నాలో ప్రవేశింపుము - నన్ను బలవంతుని గోపతిని చేయుము.

    రాత్రి పూట కాపురముండు అగ్నీ! మేము నిత్యము నిన్ను స్తుతులతోసంస్తుతింతుము. హవిరన్నము అర్పింతుము. నిన్ను మాలో చేర్చుకుందుము.

    23. యజ్ఞములందు శోభిల్లువాడు, సత్య సంరక్షకుడు, దేదీప్యమానుడు, గార్హపత్యాది యజ్ఞ గృహములందు సదా వర్థిల్లు వాడగు అగ్నిని ఆహ్వానించుచున్నాము.

    24. అగ్నీ! తండ్రి కొడుకు విషయమునందువలె, నీవు మాకు శుభములు కలుగు ఉపాయవంతుడవు అగుము. మాకు నాశము లేకుండునట్లు మాతో స్నేహము చేయుము.

    25. అగ్నీ! నీవు మాకు దగ్గరి దేవతవు, రక్షకుడవు. మాకు శుభంకరుడవగుము. మాకు గృహపతివగుము. నీవు ధనస్వరూపుడవు, ధనదాతవని విఖ్యాతుడవు. అభిముఖడవగుము. మాలో వ్యాపింపుము. మాకు అత్యంత ప్రకాషవంతమగు సువర్ణాది ధనమును ప్రసాదించుము.

    26. ప్రవృద్ధ జ్వాలావంత అగ్నీ! నీవు దేదీప్యమానుడవు. నా మిత్రుల కొరకు నిన్ను ధనము యాచించుచున్నాను. మమ్ము నీవారినిగా భావింపుము. మా ఆహ్వానమును గ్రహించుము. మమ్ము సమస్త హింసక వర్గము నుండి రక్షింపుము.

    27. ఇళా! విచ్చేయుము. దేవమాత అదితీ! విచ్చేయుము. మీరిద్దరు భజించదగినవారు. విచ్చేయండి. మా  కోరికలు తీర్చండి.

    28. బృహస్పతీ! నీవు సోమాభిషవకర్తవు. సోమయాజివి. నిన్ను స్తుతించువారికి ఉశిపుత్ర కక్షీవంత బుషి వంటి వాడవు. మమ్ము కరుణించుము.

    ("కక్షీవాన్నా మకమృషిం దీర్ఘతమః పుత్రం యథాసోమయాగయుక్తం సుత్తియుక్తంచ కృతవానసి తథా మాం కురు" అని ఉవటుని వ్యాఖ్య. కక్షీవంతుడు దీర్ధతముని పుత్రుడు. అతడు తండ్రిని సోమయాగయుక్తుని, స్తుతియుక్తుని చేసినాడు. అట్లె నన్ను చేయమని బృహస్పతిని ప్రార్థించుచున్నాడు. ఉశిక కక్షీవంతుని తల్లి)       




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.