Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    16. (పశ్చిమ, ఉత్తర, దక్షిణ పరిధులను జుహువుచే ఘృతమున తడుపుచు యజమాని)

    పశ్చిమ పరిధీ! వసువుల కొరకు నిన్ను ఘృతమున తడుపుదును. దక్షిణ పరిధీ! రుద్రుల కొరకు నిన్ను ఘృతమున తడుపుదును. ఉత్తర పరిధీ! ఆదిత్యుల కొరకు నిన్ను ఘృతమున తడుపుదును.

    (ప్రస్తరము -రెండు మూడు దర్భలు కలసినది - అందుకొని) ద్యావాపృథ్వులారా! మీరు నా ప్రస్తర గ్రహణమును ఆమోదించండి. ప్రస్తరము ధరించిన యజమానీ! మిత్రావరుణులు వర్షము కలిగించి నిన్ను రక్షింతురు.

    (ప్రస్తమునును నేతిలో ముంచి) ఘృతము నిండిన ప్రస్తరమును నాకి గాయత్రి మున్నగు ఛందస్సులు పక్షిరూపమున ద్యులోకమునకు చేరవలెను. ప్రస్తరమా! నీవు యాగయోగ్యగోవువు అగుము పృథ్వివి ఆగుము. ద్యులోకమునకు చేరుము. అటనుండి మాకు వర్షము కలిగించుము.

    అగ్నీ! నీవు నేత్రపాలకూడవు. నా నేత్రములను సురక్షితముగా ఉంచుము.

    చక్షుష్పాఅగ్న్కేసి చక్షుర్మేపాహి.

    17. ఆహవనీయ అగ్నీ! పక్షుల ద్వారమున దాచి నీవు పశ్చిమ పరిధిని స్థాపించినావు. ఆ పరిధిని నేను ప్రీతి పూర్వకముగ అగ్నికి సమర్పింతును. అది నీ కన్న దూరమున పడరాదు. అగ్నికి ప్రియమగు అన్నము ఆ పరిధికే లభించవలెను. (మంత్రము చదివి పశ్చిమ, దక్షిణ, ఉత్తర పరిధులను అగ్నికి అర్పించవలెను)

    (పరిధి = యజ్ఞార్హమైన మేడిచెట్టు పుల్ల. హొమాగ్నికి రక్షణగా నాలుగు వైపుల పరచబడి ఉండును)

    18. విశ్వ దేవతలారా! మీరు 'సంస్రవ' భాగము గలవారు. అయినను మీరు హవిరన్నవంతులు కావున మహామహులు. మీలో కొందరు దర్భాసమున ఆసీనులగువారు. కొందరు పరిధులందు ఉండువారు. మీరందరు నేను చేయుచున్న ఈ స్తుతిని స్వీకరించండి. మీరు ఈ దర్భాసనము మీద ఆసీనులు కండు. హవిని అందుకొనండి. ఆనందించండి. ఇదిగో ఇది విశ్వ దేవతలకు ప్రత్యక్ష ఆహుతి - ఇది పరోక్ష ఆహుతి.

    (సంస్రవము - ఆహుతులు వేయునపుడు చెదిరి పడిన హవిరన్నము)

    19.జుహు, ఉపభృతములారా! మీరిద్దరు ఘృతమును సమర్పించువారు. (వానిని హవిర్ధాన శకటమున ఉంచవలెను.) మీరు బండికి కట్టిన రెండు ఎద్దులను విపత్తుల నుండి రక్షించండి మీరు ఇద్దరు సుఖ స్వరూపిణులు. మీరు నన్ను స్వర్గాది సుఖములందు నిలుపండి.

    యజ్ఞమా! నీకు వందనము. (యజ్ఞ క్రమమున అధిక కృత్యములు జరిగియున్న మన్నించుము) యజ్ఞక్రమమున ఏవైన లోపములు జరిగిన వానిని పూరించుము. నీవు అభీష్ట యజ్ఞపు సుసమాప్తి వరకు నిలిచి ఉండుము. యజమానినగు నా శుభములందు నిలిచి ఉండుము.

    20. అగ్నీ! నీవు యజమానివి. అహింసనీయుడవు. సర్వభక్కువు. సర్వ వ్యాపకుడవు. నీవు నన్ను అశనిపాతము నుండి రక్షింపుము. మృత్యుబంధమునుండి రక్షింపుము. దుఃఖకర దృష్టి నుండి రక్షింపుము. అనుచిత ఆహ్వానములనుండి రక్షించుము. నా అన్నమును విష రహితము చేయుము. నన్ను సుఖప్రదమగు గృహమున ఉంచుము.

    ఇదిగో ఇది అగ్ని కొరకు ప్రత్యక్ష ఆహుతి. ఇది అప్రత్యక్ష ఆహుతి. సంవేధ అధిదేవతకు ఇదిగో ఆహుతి. యశోభాగిని సరస్వతికి ఆహుతి. "సరస్వత్యై యశోభోగిన్యైస్వాహా"

    (సంవథ - పతీపత్నులు పడుకొను శయ్య)

    21. (యజమాని భార్య దర్భముష్టిని పట్టుకొనును)

    దర్భముష్టే! నీవు జ్ఞాన స్వరూపవు. నీవు దేవతలను కనుగొన్న దానవు. కావున నాకు జ్ఞాన స్వరూపమవగుము.

    యజ్ఞజ్ఞాతలగు దేవతలు యజ్ఞగానము చేసి ఇట నుండి స్వర్గమునకు చేరుకొనవలెను.

    మనస్సునకు దేవతవగు చంద్రుడా! నీవు ఈ యజ్ఞమును వాయువునులీనము చేయుము. ఇది చంద్రుని ఆహుతి.

    22. ఆదిత్యులు - వసువులు - మరుత్తులు - విశ్వేదేవలతో ఏకత్వముగల వాడు ఇంద్రుడు. అతడు దర్భను, హవిని ఘృతమున ముంచవలెను. ఘృతమున మునిగిన దర్భ సూర్యుని చేరవలెను.

    23.(యజమాని ప్రణీతను వేదికకు దూరముగా కొనిపోవుచు)

    ప్రణీతా! నిన్ను కర్మ విముక్తను చేయువాడెవ్వడు? ఆ ప్రజాపతియే నీకు యజ్ఞ విముక్తి కలిగించును. అతడు ఎవరి కొరకు నిన్ను విముక్తను చేయునో వారికొరకే నిన్ను విముక్తను చేయును. నేను నిన్ను సంతానాదుల పోషణ కొరకు విముక్తను చేయుదును.

    కృష్ణాజినము మీద చెదిరిపడిన పురోడాశా కణములారా! మీరు రాక్షసుల భాగము. వారు అందుకొందురు గాత. "పోషాయ రక్షసాంభోగ్కోసి"

    (ప్రణీతము - చమసపాత్రమందలి జలము. వండిన పదార్థములు)

    24. త్వష్టా! మేము బ్రహ్మవర్చస్సు, పాడి, పుత్రాదులు, శుభములు, సుమనస్సు గలవారము కావలెను. సమృద్ధి ప్రదాత త్వష్ట మాకు ధనములను ప్రసాదించవలెను. మా దేహపు వంకలను సరిదిద్దవలెను.

    25. యజ్ఞదేవత జగతీ ఛందోరూపుడై ఒక పాదము భూమి మీద పెట్టినాడు. అప్పుడే మమ్ము ద్వేషించువారును మేము ద్వేషించువారును, నిర్భాగ్యులైనారు. త్రిష్టుప్ ఛందో రూపమున విష్ణువు అంతరిక్షమున రెండవ పాదము వేసినాడు. అప్పుడే మమ్ము ద్వేషించువారును, మేము ద్వేషించువారును అంతరిక్షమున నిర్భాగ్యులైనారు. గాయత్రీ ఛందోరూపుడగు విష్ణువు మూడవ పాదమున భూలోకమును ఆక్రమించినాడు. అప్పుడే మమ్ము ద్వేషించువారును, మేము ద్వేషించువారును భూలోకమున నిర్భాగ్యులయినారు. ఈ విధముగా వర్షము, అన్నము ప్రదానము చేయునదియు, దిశా విశేషము కలిగించునదియగు యజ్ఞ భూమి నుండి ఆ దుష్టులు దూరమైనారు.

    విష్ణువు దయ వలన స్వర్గము లభించినది. జ్యోతితో ఏకత్వము పొందినాము.

    26. సూర్యదేవా! నీవు స్వయంభువుడవు. నిన్ను మరొకరు సృష్టించలేదు. హిరణ్య గర్భనామక్ ప్రధానరశ్మివి. బ్రహ్మవర్చస్సు ప్రదాతవు. నాకు బ్రహ్మ వర్చస్సు ప్రసాదింపుము. నేను సూర్యుడు చేయు ప్రదక్షిణ వంటి ప్రదక్షిణ చేయుదును. (ప్రదక్షిణ చేయవలెను.)

    27.గార్హపత్యాగ్నీ! నీవు సమృద్ధ గృహపాలకుడవు. గృహపాలకుడవగు నీ ద్వారా నేను  యజమాని యొక్క సమృద్ధ గృహమునకు పాలకుడను అగుదును. గృహపతినగు నాతోపాటు నీవును గృహపతివగుము. మనము ఇద్దరము గృహపాలనాది కార్యములను చక్కగా నిర్వహింతుముగాక. ఒక ఎద్దులాగు బండి కన్న రెండెడ్లు లాగుబండి త్వరగా గమ్యస్థానము చేరును కదా! మన స్నేహము నూరేళ్ళ వర్థిల్లవలెను. సూర్యుని ప్రదక్షిణ వంటి ప్రదక్షిణనే నేను చేయుదును నూరేళ్లు (ప్రదక్షిణ చేయవలెను)

    28. యజ్ఞపాలక అగ్నీ! నేను ఈ యజ్ఞ రూప వ్రతమును ఆచరించ గలిగినాను. విధి పూర్వకముగ దానిని పూర్తి చేయగలిగినాను. ఆ యజ్ఞ ఫల స్వరూపమున నీవు ప్రవేశించుము. యజ్ఞ విసర్జన చేసిన నేను ఇప్పుడు పూర్వపు సాదారణుడను అయినాను. 'య ఏవాస్మిస్కోస్మి'

    29. (దర్శపూర్ణమాస ప్రక్రియ ముగిసినది)

    పితృ దేవతలకు కవ్యము వహించు అగ్నికి ఆహుతి. పితృయుక్త సోమునకు ఆహుతి వేదిపై కూర్చుండు అసుర, రాక్షసాదులు దూరమైనారు.

    ౩౦. బహురూపములు దాల్చి పితరుల 'స్వధ'ను భక్షించి జీవించువారును - స్థూల, సూక్ష్మ రూపములు ధరించు వారును  అగు అందరు అసుర, రాక్షసాదులను అగ్ని ఈ యజ్ఞ ప్రదేశము నుండి తరిమి కొట్టినాడు.

    31. పితరులారా! రండి, ఈ పిండ స్థలమున వినోదించండి. మీరందరు- ఆబోతువలె మీ మీ భాగ పిండములను భక్షించండి. పితరులు ఆనందించినారు. ఆబోతు వలె వారు స్వేచ్ఛగా తమ పిండములను ఆరగించినారు.

    32. (ఆరు బుతువులను ఆరుగురు పితరులుగా భావించబడినది. యజమాని ఆరుమారులు నమస్కరించవలెను)

    పితరులారా! రసభూత వసంతమున మీకు నమస్కరింతును. పితరులారా! శోషింపచేయు గ్రీష్మమున మీకు నమస్కరింతును. పితరులారా! జీవనదాత యగు వర్షర్తువున మీకు నమస్కరింతును. పితరులారా! అన్న పాచన శరద్రుతువున మీకు నమస్కరింతును. పితరులారా! ఘోర స్వరూపయగు హేమంతమున మీకు నమస్కరింతును. పితరులారా! దాహకారక శిశిర బుతువున మీకు నమస్కరింతును.

    పితరులారా! మీకు నమస్కారము. నమస్కారము. పితరులారా! మీరు మాకు స్త్రీ, పుత్రాదులను ప్రసాదించండి. పితరులారా! ఇంట అన్నాదులు ఉన్నకదా మీకు పిండాదులు అర్పించకలుగునది! కావున మాకు అన్నాదులు ప్రసాదించండి. పితరులారా! ఈ వస్త్రము ధరించండి. (దారము సమర్పించవలెను)

    33. పితరులారా! కమలమాలికలు ధరించిన అశ్వినుల వంటి పుత్రులను నా గృహమున పురుష సంఖ్య పూరించునట్లు నా భార్య గర్భమున ప్రవేశపెట్టండి.

    34. జలమా! అన్నము, అమృతము, ఘృతము, దుగ్ధము, రసము, సుర వహించి స్వధా స్వరూపమవగుము. మా పితరులను తరింపచేయుము. (జలదానము చేయవలెను.)


                                  దాశరథి రంగాచార్య విరచిత
                    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
                                   రెండవ అధ్యాయము సమాప్తము.
                                          సర్వేపి సుఖినస్సంతు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.