ఎంతైందో టైమ్ తెలియదు.
బయట ఎవరో వస్తున్న అలికిడిగి హఠాత్తుగా గుండెవేగం పెంచింది.
"హలో రూపా!" ద్వారందగ్గర రమణ.
నన్ను చూస్తూనే అతని ముఖం వెలిగిపోవడంవల్ల కాబోలు మసక చీకట్లు కొసలు అంటుకున్నట్టు సన్నటి వెలుగు కనిపించింది.
"ఇప్పుడు నాకు పరీక్ష మొదలైంది" నెమ్మదిగా అన్నాను ముఖం వాల్చేస్తూ.
అతను కలవరపడ్డాడు " ఏమైంది?"
"ఏమౌతుంది- నెలతప్పాను"
నిశ్శబ్దం ఒక్కసారిగా భళ్ళున పగిలినట్లయింది.అతని ముఖంలో భయంలాంటిది మొసలి కన్నులాగా మెదిలింది.టెన్షన్ అతన్నిసున్నాలాగాచూట్టేస్తోన్నట్టుకుదించుకుపోయాడు.పరీక్షలైపోయాక ఎంతో కోరికతో వచ్చాడు ఇప్పుడు ఈ ఊహించని పరిణామానికి హతాశుడయ్యాడు. కళ్ళలో ఆ బావం కదలాడుతోంది.
"ఇప్పుడెలా?" అప్పటికి సర్దుకుని అడిగాడు.
" ఆ ప్రశ్న నిన్ను అడగాలనే వెయిట్ చేస్తున్నాను"
"డాక్టర్ ని అడిగి ఏవైనా మందులు తెచ్చిస్తాలే" అని అతను గిర్రున వెనక్కి తిరిగాడు.
ఆసమస్య పోయేవరకు ఇక మేం మామూలుగా మాట్లాడుకోలేమని తెలిసిపోయింది.అందుకే అతను వెళుతున్నా వుండమని నేను ఆడగలేదు.
అంతవరకు నేనొక్కదాన్నే మోసిన బరువును కొంతమేరకు అతని మీద పెట్టగలిగాను అందుకే కొంతలో కొంత రీలిప్ గా ఫీలయ్యాను.
రెండోరోజు ఉదయనికల్లా ఏవో కొన్ని టాబ్లెట్లు ఇచ్చి- 'ఓ సారి ఈటాబ్లెట్లు వేసుకో. సాయంకాలానికల్లా సమస్య తీరిపోతుంది. డాక్టర్ చెప్పాడు"అన్నాడు వాటిని తీసుకుని వేసుకున్నాను.
సాయంకాలమైంది. ఆరు గంటలప్పుడు బావిలోంచి నీళ్ళు తెస్తున్నప్పుడు వీధి తిన్నెమీద రమణ కనిపించగానే " పని అయ్యిందా" అన్నట్టు చేత్తో సైగ చేశాడు.
"లేదు" అన్నట్టు నేను తల అడ్డంగా తిప్పాను.
అతని ముఖంలోని భయాన్ని చూసే గుడ్లగూబ కూడా జడుసుకుంటుందని అనిపించింది.
" ఇక మిగిలింది రేపు చెబుతాలే" అంది శతరూప.
అప్పుడు టైమ్ ఎంతైందో తెలియడంలేదు. నక్షత్రాలు చీకటిని చీల్చుకుని మరీ గాఢంగా కన్ఫిస్తున్నాయి. ఆకాశం నల్లటి పేలికలా అనిపిస్తోంది.
గాలి తిరిగి తిరిగి అలిసినట్టు మెల్లగా తగుల్తోంది. రాత్రి ఒంటరితనంలో చిక్కుకుపోయినట్టు చడీ చప్పుడులేదు.
"ఇంతకి నెలతప్పిన సమస్య ఎలా పరిష్కారమైంది?"అని అడగాలనిపించింది ఇందుమతికి. కానీ నోరు పెగల్లేదు. ఏదో ఇబ్బంది గా అనిపించింది.ఎలాగూ రేపు చెబుతుంది. కానీ రేపటి వరకు తను వుంటుందా?
ఇప్పుడు టైమ్ ఎంతైందో తెలియడంలేదు మూడు గంటల వరకు భరణి వుంటాడు, ఆతరువాత వుండడు.
తను ఇప్పుడు బయల్దేరితే?
ఓ పదినిముషాలు అలానే ఇసుకలో పడుకుని ఆపిమ్మట లేచి లోపలికి వెళ్ళింది.
శతరూపకి అప్పటికే నిద్రపట్టేసింది.
ఇక తను వెళ్ళిపోవాలి. అలా అనుకోగానే గుండె పరుగుబపెందెం మొదలు పెట్టింది. శరీరంలోవున్న నీళ్ళన్నీ ఆవిరైపోతున్న్టట్లు చెమటలు పట్టాయి. కాళ్ళు మొద్దుబారిపోయాయి.
అయినా ఇందుమతి వాటినేమీ లెక్కచేయడంలేదు. ఈ ఒంటరి జీవితాన్ని అవతలిగట్టుకగు చేర్చాలంటే ఎంతో కొంత రిస్కు భరించాలని ఆమెకి తెలుసు. అందుకే ఏవేవో అనుమానాలు, సందేహాలు, భయాలు కలుగుతున్నా వాటిని గుండెలోనే కుక్కేసి బయల్దేరింది, ఊరంతా గాఢనిద్రలో మునిగి ఉంది. భూదేవి చలికి తాళలేక దుప్పటిని కప్పుకున్నట్లు నక్షత్రాలు కిందకు వంగుతున్నాయి. పైనున్న చందమామ వెన్న చిలికిన కుండలాఉంది.
ఆమె వడివడిగా నడవడం మొదలు పెట్టింది.
ఇసుక ఏరు దగ్గరపడుతుటే నిన్న కనిపించిన ఆకారం గుర్తొచ్చింది. అదేమైనా కన్ఫిస్తునందేమోనని రెటీనాను చీల్చుకుని చూస్తున్నట్టు కళ్ళు సాగదీసింది . కానీ అక్కడ ఎవరూ లేరు.
హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది.


